close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మ మనసు

అమ్మ మనసు
- నూతలకంటి సురేఖ

మంగళవారం కావటంతో భక్తి టీవీలో లలితా సహస్రనామం వస్తోంది. మనసులో సహస్రనామం వల్లెవేస్తున్నా, శారద మనసు రోజూ అయిదవగానే ఇంటికి వచ్చే భర్త- ఇవాళ ఆరవుతున్నా రాలేదేమిటా అని ఆలోచిస్తోంది. శారదకాక శ్రీనివాసు కోసం ఇంకా ఇద్దరు ఎదురుచూస్తున్నారు. ఒకరు అతని కన్నతల్లి సుగుణమ్మ అయితే... మరొకరు అతని కన్నకొడుకు విరించి.
వాళ్ళ నిరీక్షణ ఫలించి అరగంట తరవాత గుమ్మం బయట చెప్పులు విడిచి లోపలికొచ్చి అలసటగా పడక్కుర్చీలో కూర్చున్నాడు శ్రీనివాసు. మంచినీళ్ళు తెచ్చిచ్చింది శారద.
కొడుకు రావటం గదిలో నుండి చూసిన సుగుణమ్మ చిన్నగా వచ్చి కొడుకు పక్కన కుర్చీలో కూర్చుంటూ ‘‘ఏంట్రా శ్రీనూ, ఇంత ఆలస్యం అయిందీ’’ అంది. ‘‘శారదా, ముందు వాడికి వేడిగా కాఫీ పట్రా, ఆ చేత్తోనే నాకూనూ’’ అంటూ కోడలికి ఆర్డరేసింది.
అత్తగారి మాటతో వంటగదిలోకి వెళ్ళింది శారద కాఫీ కోసం.
‘‘ఏం లేదమ్మా, సైదయ్య వచ్చాడు. ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి వెళితే క్యాన్సర్‌ అని తెలిసిందట. డబ్బులు కావాలని అడగటానికి వచ్చాడు’’ అన్నాడు.
‘‘అయ్యో, ఇదేం చోద్యంరా! రెణ్ణెల్లక్రితం ఇచ్చేటప్పుడు సంవత్సరందాకా ఆగుతానన్నాడుగా’’ అంది.
‘‘అవునమ్మా, అన్నమాట నిజమే. కానీ ప్రాణం మీదకు వస్తే అతను మాత్రం ఏం చేస్తాడు’’ అన్నాడు.
‘‘మరి, వాడు కావాలంటే నీ కొడుక్కేమిస్తావురా. వాడికి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టాలన్నాడుగా. అసలే బ్యాంకు ఉద్యోగమాయె. ఎలా వదులుకుంటాం’’ అంది.
‘‘చూద్దాంలేమ్మా, ఏదో ఒకటి చెయ్యాలిగా’’ అని, ‘‘ఇదిగోమ్మా నీ పెన్షన్‌ డబ్బులు’’ అంటూ జేబులో నుండి తీసి ఇచ్చాడు.
కోడలిచ్చిన కాఫీ తాగి డబ్బులు తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది సుగుణమ్మ.
‘‘కాబూలీవాడైనా ఒకరోజు ఆగుతాడేమోగానీ, మీ అమ్మ మాత్రం ఒక్క గంట కూడా ఆగరు డబ్బులకి. ఏం చేసుకుంటారండీ ఆవిడ... ఎవ్వరికీ ఇవ్వరు. మనకెన్నిసార్లు అవసరమైనా బయటవాళ్ళిచ్చారు తప్ప, ఆవిడ పైసా ఇవ్వలేదు’’ కొంచెం కోపంగా అంది శారద.
‘‘పోన్లే శారదా, అమ్మను మాత్రం ఏమనకు. తన డబ్బూ తనిష్టం. అయినా ఏవో కొంటూనే ఉంటుందిగా నీకూ పిల్లలకీ’’ అన్నాడు.
‘‘మీరిలాగే వెనకేసుకురండి. మధ్యలో నాకెందుకు’’ అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది శారద.
రెండ్రోజుల తర్వాత సుగుణమ్మకి పక్షవాతం వచ్చి తలలో నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇరవైనాలుగు గంటల వరకూ ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు. ఆ మర్నాడు కోమాలోనే ప్రాణాలు వదిలింది సుగుణమ్మ.
కూతురి పెళ్ళిచేసి ఇంకా రెండోనెలే. మొన్నమొన్నటి వరకూ సందడిగా ఉన్న ఇల్లు నిశ్శబ్దంగా అయిపోయింది. సుగుణమ్మ పోయిన అయిదోరోజు సాయంత్రం, అప్పుడే ఆఫీసు నుండి వచ్చి కుర్చీలో చేరగిలబడి, నుదుటిపైన చేయి పెట్టుకుని పడుకున్న భర్త దగ్గరకి కాఫీతో వచ్చింది శారద.
‘‘ఏమండీ, కాఫీ’’ అంది.
రోజూ తను వచ్చేలోపే నాలుగుసార్లు పిలిచే భర్త ఉలుకూ పలుకూ లేకుండా కూర్చోవటంతో అర్థంకాక, ‘‘ఏవండీ’’ అంది గట్టిగా.
ఉలిక్కిపడి కళ్ళమీద నుండి చేయి తీసి కాఫీ అందుకున్నాడు శ్రీనివాసు.
ఆమె పక్కనే కూర్చుని ‘‘ఏంటండీ, ఏం ఆలోచిస్తున్నారు?’’ అంది.
‘‘అదే శారదా, సైదయ్యకు డబ్బు ఇవ్వాలి, విరించికీ ఇవ్వాలి కదా... అదే ఆలోచిస్తున్నాను’’ అన్నాడు.
‘‘మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. నాల్రోజుల్లో మీ అమ్మగారి కార్యక్రమం ఉందాయె. దాని తరవాత మాట్లాడదాం ఇద్దరితో’’ అంది.
‘‘లేదు శారదా, ఇవి రెండూ ముఖ్యమైనవే. మన అబ్బాయి భవిష్యత్తుని పాడుచేస్తామా లేక మన అమ్మాయి పెళ్ళికి అడగ్గానే నామమాత్రపు వడ్డీతో డబ్బులిచ్చిన సైదయ్య, ఇప్పుడు ప్రమాదకర పరిస్థితిలో ఉండి అడిగితే అతనికి ఆపుతామా? అది న్యాయంకాదు కదా’’ అన్నాడు.
ఆమెకేం చెప్పాలో అర్థంకాక ఓ నిట్టూర్పు విడిచి ‘‘మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్టు ఈవిడగారిది ఇప్పుడే అయింది. ఇదొక యాభై వేలు అదనపు భారం’’ అంది.
‘‘అదేంటి శారదా, మా అమ్మ దినకర్మ నీకు భారంగా అనిపిస్తుందా?’’ బాధగా అన్నాడు.
‘‘అయ్యో, నేనలా అనలేదండీ... అసలే పరిస్థితులు బాగాలేవని మీరు బాధపడుతుంటే చూడలేక అన్నానే తప్ప, అత్తయ్యగారి గురించి వేరేగా భావించను’’ అంది.
‘‘ఏదేమైనా నేనొక నిర్ణయానికొచ్చాను శారదా... ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నాను’’ అన్నాడు.
ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిన శారద ఓ నిమిషమాగి తేరుకుని ‘‘ఏంటీ, మీరు ఇల్లు అమ్ముతానంటున్నారా... ఇవి మీ మాటలేనా? ఎన్నిసార్లు అవసరమొచ్చినా తాకట్టు పెట్టడానికి కూడా ఒప్పుకోని మీరు, ఇప్పుడు అమ్ముతానంటున్నారా?’’ మరోసారి ఆశ్చర్యపోయింది శారద.
‘‘అవును. విరించికీ, సైదయ్యకూ ఇద్దరికీ న్యాయం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి తప్పదు’’ అంటూ దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ కళ్ళుమూసుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు.
అతన్నలా వదిలి శారద మెల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయింది.  

* * * * * * * * * *

శ్రీనివాసు చిన్నతనంలో ఆస్తులు బాగానే ఉన్నాయి. తండ్రి డిప్యూటీ తహసిల్దారుగా పనిచేసేవాడు. స్నేహితులు వ్యాపారంలో మోసం చేయటంతో చాలా ఆస్తి పోయింది. స్నేహితుల్ని నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన శ్రీనివాసు తండ్రి, వాళ్ళే మోసం చేయటంతో చాలా కుంగిపోయాడు. మిగిలిన ఆస్తులతో, ఉద్యోగంతో, శ్రీనివాస్‌కంటే పెద్దవాళ్ళయిన ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. ‘ఇల్లు తప్పశ్రీనివాసుకి ఇంకేమీ ఇవ్వలేకపోయానే’ అని బాధపడేవాడు. శ్రీనివాసుకు తాను పుట్టిపెరిగిన ఆ ఇల్లంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఎన్నిసార్లు అవసరమొచ్చినా ఆ ఇంటిని తాకట్టు పెట్టటానికి కూడా ఇష్టపడలేదు. ఉద్యోగరీత్యా ఎక్కడికైనా బదిలీ అయినా, తాను వెళ్ళివచ్చేవాడే తప్ప, కుటుంబాన్ని ఎప్పుడూ మార్చలేదు. అలాంటి ఇంటిని అమ్మాలన్న ఆలోచనే అతను భరించలేకపోతున్నాడు. కానీ, అవసరం రెండు రూపాల్లో దాడిచేయటంతో ఏం చేయాలో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ‘ఇలాంటి సమయంలో అమ్మ ఉంటే బాగుండేది. ఏదో ఒక సలహా ఇచ్చి ఉండేది’ అనుకున్నాడు. తల్లి గుర్తుకురావటంతో అతని హృదయం వేదనకు గురైంది.
శ్రీనివాసుది అంత పెద్ద ఉద్యోగం కాదు, అలా అని చిన్నదీ కాదు. లంచాలు బాగానే వస్తాయి. కానీ, అది అతని స్వభావానికే విరుద్ధం. ఒకళ్ళను బాధపెట్టి తీసుకున్న డబ్బుతో మనం ఏది చేసినా అది ఫలించదని తల్లి ఎప్పుడూ అనే మాటలే అతనికి వేదవాక్కు. ఇప్పుడు అయిదారు లక్షలు కావాలి. స్నేహితులైనా ఒకటి రెండు లక్షలైతే సర్దగలరు కానీ, అంత మొత్తం దొరకదు. ఎంతైనా ఇవ్వగలిగినవాడు సైదయ్య ఒక్కడే. ఇప్పుడు అతనికే అవసరం పడింది. అందువల్లే ఇల్లు అమ్మాలన్న నిర్ణయానికి వచ్చాడు. కానీ, తనకు దేవాలయంతో సమానమైన ఈ ఇంటిని అమ్మి తను ప్రశాంతంగా జీవించగలడా... తను మరో ఆరేళ్ళలో రిటైర్‌ అవుతున్నాడు. కానీ అవసరాలు అప్పటిదాకా ఆగవాయె... ఈ ఇల్లు కాక మరొక ఇంట్లో తను మనగలడా... ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది. తలనొప్పితో తల పగిలిపోతుందేమో అన్నట్టుగా ఉంది.
‘‘శారదా, మరోసారి కాఫీ ఇవ్వు. ఆ చేత్తోనే తలనొప్పి మాత్ర కూడా ఇవ్వు’’ అంటూ భార్యను కేకేశాడు శ్రీనివాసు.
అయిదు నిమిషాల్లో కాఫీతో వచ్చింది. ఎన్నిసార్లు ఎంత అవసరాలొచ్చినా భయపడని భర్త, ఈసారి ఇంత దిగాలుపడటంతో చాలా బాధగా ఉందామెకి.
‘‘పోనీ, మీ అక్కయ్యవాళ్ళని అడగండీ. వాళ్ళు ముగ్గురూ స్థితిమంతులే కదా. మీరు అడిగితే కాదనరేమో అడిగి చూడచ్చుగా’’ అంది.
‘‘అక్కలు నా వాళ్ళైనంత మాత్రాన బావలు నావారు అవుతారా శారదా! వాళ్ళను అడిగి విలువ పోగొట్టుకోవటం నాకిష్టం లేదు. ఏదో ఒకటి ఆలోచిస్తాన్లే’’ అని అప్పుడే స్ఫురించినట్లుగా... ‘‘ఇల్లు అమ్మకూడదంటే ఇక ఒకటేదారి... నేను వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవటమే’’ అన్నాడు.
‘‘రామ రామ, వాడి ఉద్యోగం కోసం మీరు రిటైర్‌ అవటమా! ఈ గండం గట్టెక్కే మార్గమే లేదా? ఇన్ని పూజలు చేస్తున్నా ఆ దేవుడికి కూడా మనపైన కరుణ లేదు. ఇలా పరీక్షిస్తున్నాడు’’ అంది కళ్ళొత్తుకుంటూ.
‘‘నువ్వేం బెంగపడకు, ఇంకా వారం సమయముందిగా చూద్దాం... ఏం చేయాలో’’ అన్నాడు.
ఆ తెల్లారి ఆదివారం కావటంతో శ్రీనివాసు ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం ఎనిమిది గంటలప్పుడు ఆదరాబాదరా వచ్చింది పక్కింటి వసంత.
‘‘ఏంటి శారదా, పిన్నిగారు చనిపోయారా... మేము వారమైంది ఊరెళ్ళి. కనీసం ఒక్క ఫోన్‌ చేసినా వచ్చేదాన్ని కదా. పిన్నిగారిని చివరిసారిగా చూసేదాన్ని’’ అంటూ కన్నీరు పెట్టుకుంది.
పక్కపక్క ఇళ్ళవటంతో శారదావాళ్ళూ వసంతావాళ్ళూ మంచి స్నేహంగా ఉంటారు. సుగుణమ్మ చనిపోయే రెండు రోజులముందే వాళ్ళు వసంత అన్నకూతురి పెళ్ళికి వెళ్ళారు. సుగుణమ్మ రోజులో ఒకటి రెండుసార్లయినా వసంత దగ్గర గంటో రెండుగంటలో ఉండి వస్తుంది. అందువల్లే ఆమె మరణం వసంతకు అంత బాధను కలిగిస్తోంది.
పది నిమిషాలు మాట్లాడి, తరవాత శ్రీనివాసుతో ‘‘అన్నయ్యా, మీతో మాట్లాడాలి... ఇప్పుడే అయిదే నిమిషాల్లో వస్తాను ఉండండి’’ అంటూ సమాధానం వినకుండానే హడావుడిగా తమ ఇంటికి వెళ్ళిపోయింది వసంత. కాసేపటి తరవాత ఒక చిన్న చేతిసంచితో వచ్చింది. ‘‘అన్నయ్యా, ఇది పిన్నిగారి సంచి. దీనిలో ఏమున్నాయో నాకు తెలియదు. నేను ఊరెళ్ళే ముందురోజు పిన్నిగారు ఎక్కడినుండో వచ్చి నాకిచ్చారు. రెండ్రోజుల తర్వాత తీసుకుంటానన్నారు. నేను తెల్లారి ఊరెళ్తూ పిన్నిగారికి ఇవ్వటం మర్చిపోయాను. నేనొచ్చేసరికి పిన్నిగారు లేకుండా పోయారు, సారీ’’ అంది కళ్ళలో నీళ్ళూరుతుండగా. ‘‘నేను వెళ్ళొస్తా శారదా’’ అంటూ వెళ్ళిపోయింది.
సంచిని అందుకున్న శ్రీనివాసు ‘తన తల్లి వసంతకు ఎందుకిచ్చిందా’ అని ఆలోచిస్తూ సంచిలోనివి బయటకు తీశాడు. దాన్లో రెండే ఉన్నాయి... ఒకటి ఉత్తరం, రెండోది బ్యాంక్‌ పాస్‌బుక్‌. ‘అమ్మ నాకు ఉత్తరం రాయటమేమిటా’ అని ఆశ్చర్యపోతూ తెరిచి చదవటం ప్రారంభించాడు. అతనితోపాటు శారద కూడా.
నాయనా శీనూ, ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే- నేను ప్రాణాలతో లేనన్నమాటే. నీకొచ్చిన సమస్య నిన్నెంత నలిబిలి చేస్తోందో నాకు తెలుసు. నేను ఇన్నేళ్ళుగా మీ నాన్నగారి పెన్షన్‌ డబ్బులు తీసుకుంటున్నాననీ, నీకు ఇవ్వటంలేదనీ శారదకూ పిల్లలకూ నామీద కోపం. అవన్నీ నీకోసమే దాచి ఉంచానురా! ఇన్నాళ్ళూ ఎన్ని అవసరాలొచ్చినా ఇవ్వలేదు ఎందుకని అనుకుంటావేమో... అవి అంత పెద్ద అవసరాలు కాదు కాబట్టి. పైగా నీకు డబ్బు ఎలాగోలా సర్దుబాటు అయింది కనుక ఇవ్వలేదురా! పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చే అవసరాలకంటే వాళ్ళు పెద్దయ్యాక వచ్చే అవసరాలే పెద్దవి. కల్యాణి పెళ్ళికి కూడా ఇవ్వలేదనుకుంటావేమో. ఈ డబ్బు డిపాజిట్‌ చేస్తున్న స్కీము గడువు ఈనెలతోనే పూర్తవుతుంది. సైదయ్య డబ్బులు ఇవ్వకపోతే ఇవే ఇద్దామనుకున్నాను. కానీ అతను ఇవ్వటంతో ‘ఈ నెల వడ్డీయేగదా, సైదయ్యకు ఇవ్వచ్చులే’ అని ఆగాను. మొన్నొకసారి బాగా తలనొప్పి వచ్చింది. చచ్చిపోతాననే భయం పట్టుకుంది. బ్యాంకులో నెలనెలా దాచిన మొత్తం ఏడు లక్షలదాకా ఉంది. అదంతా ఒకేసారి నీ చేతికిచ్చి నీ మొహంలో ఆనందం, ఆశ్చర్యం చూడాలనే చిన్న కోరిక ఉన్న పిచ్చితల్లినే తప్ప, చెడ్డతల్లిని కాదురా నాన్నా! అందుకే వసంత దగ్గరపెట్టి నువ్వు క్యాంపునుంచి రాగానే స్వయంగా నీకివ్వాలని అనుకున్నాను.
కానీ, ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎందుకైనా మంచిదని ఈ ఉత్తరం కూడా రాసి సంచిలో పెట్టి వసంతకి ఇస్తున్నాను. ఇన్నాళ్ళూ నామీద కోపం ఉన్న శారద, విరించి, కల్యాణీలకు ఇది చదివాకైనా నామీద కోపం పోతే చాలు... అంతకన్నా నాకేమీ అక్కరలేదురా! ఏ తల్లికైనా బిడ్డలకంటే ఎవరూ ఎక్కువ కారు. నాకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు మాత్రం తెలియదా! కాకపోతే సంసార సాగరంలో పడి, కాసింత మరుపుకు గురై ఉంటావు, లేదూ పెన్షన్‌లో పైసా కూడా నీకు ఇవ్వకపోవడం చూసి అమ్మకు నామీద ప్రేమ తగ్గింది అనుకుని ఉంటావు. బిడ్డలు బాధలు పడుతుంటే చూడగలిగే తల్లి ప్రపంచంలో ఎక్కడా ఉండదు నాయనా! మీరందరూ సంతోషంగా ఉండటాన్ని- పక్కన లేకపోతే పైనుండి చూసైనా సంతోషిస్తాను. ఉంటాను నాన్నా.
ప్రేమతో అమ్మ
ఉత్తరం చదవటం పూర్తయిన శ్రీనివాసు, శారదల కళ్ళలో నీళ్ళు. అత్తగారిని చెడుగా ఊహించుకున్నందుకు సిగ్గుపడింది శారద.
‘అమ్మా, నీ గురించి అంతా తెలిసి కూడా ఒక్కోసారి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను,  ఇక శారదా పిల్లలూ ఎంత! నీ పెంపకంలో పెరిగి కూడా నీ ప్రేమనీ ఆలోచనలనీ అర్థం చేసుకోలేకపోయిన నన్ను క్షమించమ్మా’ అంటూ శ్రీనివాసు మనసు పరితపిస్తోంది. ఇప్పుడు ఇదంతా తెలిపి తమ కళ్ళు తెరుచుకునేలా చేసిన తల్లికి- ఆమె ఫొటో చూస్తూ కన్నీళ్ళతో నమస్కరించాడు ‘మాతృదేవోభవ’ అనుకుంటూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.