close
జిలేబీ.. ఈ రుచికి సాటేది!

జిలేబీ.. ఈ రుచికి సాటేది!

అటు పాతతరం బామ్మలూ ఇటు కొత్తతరం పిల్లలూ బాగా ఇష్టపడే స్వీటు ఏదయినా ఉందీ అంటే అది కచ్చితంగా జిలేబీనే. అందుకేనేమో... ఈమధ్య పెళ్లిళ్లలో ఏకంగా లైవ్‌ జిలేబీ స్టాల్‌తో అతిథుల్ని ఆకట్టుకుంటున్నారు. అంత ఘనం అందులో ఏముందీ అంటే... ఓసారి రుచి చూస్తే సరి, అప్పుడిక ఆ ప్రశ్న అడగరు మరి..!

జిలేబీ అన్న మాట వింటే చాలు... ఆ రూపమూ ఆ వెంటే దాని రుచీ గుర్తొచ్చి నోట్లో నీళ్లూరే జిలేబీ ప్రియులు కోకొల్లలు. మరికొందర యితే కాలచక్రాన్ని గిర్రున వెనక్కి తిప్పేసి... మా ఊళ్లో గంగన్న జిలేబీ ఉంటుంది కదా... నిమిషంలో బేసిన్‌ మొత్తం ఖాళీనే అంటూ పాత విషయాలూ చెప్పుకొస్తారు. ‘వేడివేడిగా కరకరలాడే జిలేబీ అంటే నాకిష్టం’ అని కొందరంటే, ‘బెల్లంపాకంలో నానిన మెత్తని జిలేబీ అంటే నాకెంతో ఇష్టం’ అంటారు మరికొందరు. రంగూరుచీరూపంలో చిన్నపాటి తేడాలున్నప్పటికీ జిలేబీ అంటే మనసు పారేసుకోని వాళ్లు మాత్రం చాలా అరుదు. అందుకేనేమో 13వ శతాబ్దంలో తుర్కులతోపాటుగా మనదేశంలోకి వచ్చిన ఈ జలాబియా, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. కుండాలిక, కుండలినీ... వంటి సంస్కృత పేర్లతో భావప్రకాశ అనే వైద్య గ్రంథమూ జిలేబీని పేర్కొంది. జాలవల్లిక అనే సంస్కృత పదం నుంచి జలాబీ, జిలేబీ అనేది పుట్టుకొచ్చిందని కొందరంటే, అరబిక్‌ జలాబియా లేదా పర్షియన్‌ జూల్బియా అనే పదాల నుంచే ఈ జిలేబీ లేదా జలేబీ పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు.
ఎక్కడెక్కడ?
జిలేబీనే జిలిబి, జిలిపి, జిలాపి, జెలాపి, జిలాపిర్‌, జలేబీ, జ్లాబియా... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఓ టీకొట్టూ, ఓ బజ్జీల బండిలానే జిలేబీ బండి ఉండని ఊళ్లు ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ స్వీటు, తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాలతోబాటు కొన్ని ఐరోపా దేశాల్లోనూ కనిపిస్తుంది.
దక్షిణాదిన ఓ స్నాక్‌గా మాత్రమే తెలిసిన జిలేబీని ఉత్తర భారతీయులు అల్పాహారంగానూ తింటుంటారు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌... వంటి రాష్ట్రాల్లో కచోరీ, కూరలతో కలిపి దీన్ని తింటే, బెంగాలీలు రబ్డీతోనూ గుజరాతీలూ ఫఫ్డాలతోనూ కలిపి తింటారు. ఒడిశావాసులకయితే పెరుగుతో జిలేబీ తినడం అంటే మహా ఇష్టం. దీన్ని గోరువెచ్చని పాలల్లో ముంచి, చలికాలంలో తింటే జలుబు చేయదనీ, తలనొప్పికీ మందులా పనిచేస్తుందన్న కారణంతోనూ జిలేబీని ఎక్కువగా తింటుంటారక్కడ. గులాబ్‌జామ్‌, రసగుల్లా, మోతీచూర్‌... ఇలా ఎన్ని రకాల స్వీట్లున్నా వాళ్లకి జిలేబీ అంటేనే అత్యంత ప్రీతి. అందుకే బాలీవుడ్‌ పాటలూ కవితల్లో జిలేబీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. త్వరలో జిలేబీ పేరుతో ఏకంగా ఓ హిందీ సినిమానే రానుంది. ఆమధ్య మల్లికా శెరావత్‌ డబల్‌ ధమాల్‌ మూవీలో ‘జిలేబీ భాయ్‌...’ అంటూ చిందులేస్తూ జిలేబీతో కుర్రకారుని కిర్రెక్కించింది. ఆ విధంగా ఉత్తరాది ఆహారంలో భాగమైన జిలేబీ, ఇప్పుడు దక్షిణాది వారినీ చవులూరిస్తోంది. ఒకప్పుడు బెల్లం జిలేబీని మాత్రమే ఇష్టపడే మనవాళ్లు కూడా కరకరలాడే వేడివేడి జిలేబీమీద మనసు పారేసుకుంటున్నారు. దాంతో ఇటీవలి విందుభోజనాల్లో చాట్‌భండార్‌లతో బాటు జిలేబీ స్టాల్‌ తప్పనిసరిగా ఉంటోంది. ‘భోజనాంతే మధురసం’ అన్న ఆయుర్వేద సూత్రాన్ని పాటిస్తూ ఒకప్పుడు విందుభోజనంలో పెరుగన్నానికి ముందు జిలేబీని వడ్డించేవారు. దాన్నే కాస్త మార్చి స్టాల్‌ రూపంలో ఏర్పాటుచేస్తుండటంతో భోజనానికి ముందూ తరవాతా ఎవరి ఇష్టానుసారం వాళ్లు తింటున్నారు. మొత్తమ్మీద వేడుక ఏదయినా ఏ వేళలోనయినా తినగలిగే తియ్యని స్నాక్‌ జిలేబీ. అందుకే అది ఎక్కడ కనిపించినా బెల్లం చుట్టూ చీమల్లా దాని చుట్టూ జనం చేరతారు.
ఆయుర్వేదంలో జిలేబీ!
జిలేబీ (కుండలినీ)లోని ఔషధగుణాలను భావప్రకాశ గ్రంథం చక్కగా విశదీకరించింది. ఇది శరీరానికి కాంతినీ బలాన్నీ పుష్టినీ ఇస్తుంది. ధాతు వృద్ధిని కలిగిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. రుచిగా ఉంటుంది. కొంచెం తినగానే చాలు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ తీపి కారణంగా త్వరగా సంతృప్తి కలుగుతుంది. ఆ విధంగానూ ఇది మంచిదే. చుట్టలు చుట్టుతూ వండుతారు కాబట్టే దీన్ని కుండలినీ అనే పేరుతో పిలిచేవారు. జిలేబీని వండే విధానాన్నీ ఆ గ్రంథం వివరంగా చెప్పింది. కొత్తకుండలో పుల్లపెరుగు వేసి అందులో గోధుమపిండిని నానబెట్టి, కాసేపు ఎండలో ఉంచి, చిక్కబడ్డ ఆ పిండిని చిల్లు కుండ లేదా చిల్లు పెట్టిన కొబ్బరిచిప్పలో వేసి, దాన్ని కాగిన నూనె లేదా నెయ్యిలో చుట్టలుగా వేసి, పాకంలో ముంచి తీయాలని చెబుతోంది. పూర్వం జిలేబీల తయారీకి పుల్ల పెరుగునే వాడేవారు. అందుకే ఇది ప్రొబయోటిక్‌. జిలేబీలను తిని వేణ్ణీళ్లు తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. పెరుగు ఎక్కువ వేసి చేసే జిలేబీలు జిగట విరేచనాల్నీ, మూలశంక వ్యాధుల్నీ తగ్గిస్తాయి. అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నది జిలేబీకీ వర్తిస్తుంది. ఎక్కువగా తింటే పొట్టలో నొప్పి వచ్చినట్లే మితంగా తింటే మాత్రం ఒంటికి సరిపడా శక్తిని అందిస్తుంది అంటోంది ఆయుర్వేదం.
ఎలా చేస్తారు?
జిలేబీని ఒక్కోచోట ఒక్కోరకంగా వండుతారు. మనదగ్గర మినప్పిండితో చేస్తే ఉత్తరాదిన ఎక్కువగా మైదాతోనే చేస్తారు. మైదా/గోధుమ/సెనగపిండి,/బియ్యప్పిండి/మినప్పిండిలో కాస్త పెరుగూ లేదా నిమ్మరసం వేసి నానబెడతారు. తరవాత ఆ పిండిని రంధ్రం చేసిన బట్టలో వేసి, కాగిన నూనెలో చుట్టలుగా వత్తి, వేయించి తీసి ఇలాచీ వేసిన పంచదార లేదా బెల్లంపాకంలో ముంచి తీస్తారు. కొన్నిచోట్ల వీటిని అచ్చంగా నేతిలో వేయించి రోజ్‌వాటర్‌ లేదా కెవ్రా ఎసెన్స్‌తో కూడిన పంచదార పాకంలో ముంచడంతో అవి సుమధుర పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. ఈ వంటకం మనదేశంలో పంజాబ్‌లో ప్రారంభమైందని అంటారు. అందుకే అక్కడ దీన్ని కాస్త పెద్దసైజులో ప్రత్యేక తరహాలో చేస్తే, బర్మా, బంగ్లాదేశ్‌, టర్కీల్లో ఈ స్వీటుని భారీ పరిమాణంలో చక్రాల్లా తయారుచేస్తారు. వీటికి భిన్నంగా ఇటీవల మనదగ్గర మినీ జిలేబీలూ వండేస్తున్నారు.
ఒకప్పుడు పిండితో మాత్రమే జిలేబీని చేసేవారు. ఇప్పుడు పన్నీర్‌, కోవా, చిలగడదుంప, బ్రెడ్‌, రవ్వ, ఆపిల్‌, అరటిపండు... వంటి వాటితోనూ చుట్టేస్తుండటంతో విభిన్న రుచుల్లో అలరిస్తోంది జిలేబీ. గత దశాబ్దం నుంచీ ప్రాచుర్యం పొందిన పన్నీర్‌ జిలేబీ అన్ని ప్రముఖ స్వీటు షాపుల్లోనూ లభ్యమవుతోంది. కోవా జిలేబీలకి మాత్రం మధ్యప్రదేశ్‌లోని బరంపూర్‌ పెట్టింది పేరు. దీన్ని అక్కడ మావా జిలేబీ అంటారు. అది క్రమంగా ఇండోర్‌, జబల్‌పూర్‌ల నుంచి దిల్లీ, ముంబయిలతోబాటు హైదరాబాద్‌కీ తరలివచ్చింది. చూడ్డానికి నల్లగా ఉండే దీన్ని ఒకసారి రుచిచూ సినవాళ్లు మళ్లీమళ్లీ తినడానికి వెళుతుంటారట. అందుకే ‘దేఖ్‌నే మే కాలా, లేకిన్‌ బడా దిల్‌వాలా’ అంటూ దీనికో వినసొంపైన నానుడినీ సృష్టించేశారు దాన్ని రుచి చూసినవాళ్లు. రైల్లో ప్రయాణిస్తూ జిలేబీ తినాలనిపిస్తే- ట్రావెల్‌ఖానా సర్వీసు ద్వారా టిక్కెట్టుతోపాటే దాన్నీ బుక్‌చేసుకునే సౌకర్యాన్నీ అందిస్తోంది భారతీయ రైల్వే.
అదండీ సంగతి. అన్నట్టు- మీకు షుగర్‌గానీ ఉంటే ఎందుకైనా మంచిది జిలేబీ జోలికి పోకండి. వద్దొద్దు అంటూనే ఇదే లాస్ట్‌ అని చెబుతూనే ఓ అరడజను దాకా అవలీలగా లాగించేస్తారు... ఆగలేరండీ బాబూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.