close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ రెండువేల దీవులున్నాయి..!

అక్కడ రెండువేల దీవులున్నాయి..!

‘సుమారు రెండు దశాబ్దాలపాటు అమెరికాతో జరిగిన పోరులో ఇరవై లక్షలమంది ప్రాణాలు కోల్పోయి, ముప్ఫై లక్షలమంది గాయాలపాలై,  అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా ఎంతో నష్టపోయిన ఒకప్పటి నిరుపేద దేశం, తరవాతికాలంలో వేగంగా వృద్ధి చెందుతూ తలసరి ఆదాయంలో మనకంటే ముందుంటూ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది... అదే వియత్నాం. అందుకే ఆ దేశాన్ని చూడాలని అక్కడ పర్యటించా’మంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు గుంటూరుకు చెందిన డాక్టర్‌ కోనూరి జయకుమార్‌.మేము బ్యాంకాక్‌ మీదుగా వియత్నాంలోని అతిపెద్ద నగరం హోచిమిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాం. ముందుగా చెప్పుకోవలసింది అక్కడి పరిశుభ్రత. పరిసరాలన్నీ ఎంతో అందంగా తీర్దిదిద్దినట్లుగా ఉన్నాయి. రెండోది అక్కడి ప్రజల మర్యాద. అన్ని పనుల్లోనూ ప్రధాన భాగస్వామ్యం స్త్రీలదే కావడం మూడో విశేషం.హోచిమిన్‌ నగర పాత పేరు సైగాన్‌. ఇది దక్షిణ వియత్నాంలో ఉంటే, రాజధాని నగరం హనోయి ఉత్తర దిశగా చైనా భూభాగానికి దగ్గరగా ఉంటుంది. వియత్నాం కరెన్సీని డాంగ్‌ అంటారు. మన రూపాయికి సుమారు 320 డాంగ్‌లు వస్తాయి. హోచిమిన్‌ నుంచి కంబోడియాకీ హనోయి నుంచి లావోస్‌కీ నిరంతరం బస్సులు నడుస్తుంటాయి. వియత్నాం, కంబోడియా, లావోస్‌లను కలిపి ఇండో చైనా అంటారు.
నగరంలో చాలాచోట్ల అందమైన పార్కులూ ఫౌంటెయిన్లూ ఉన్నాయి. ముందుగా ఇండిపెండెన్స్‌ ప్యాలెస్‌కు వెళ్లాం. దీన్ని వియత్నాం సివిల్‌వార్‌కు ముందు సమైక్య వియత్నాం ప్యాలెస్‌గానూ తరవాత ఇండిపెండెన్స్‌ ప్యాలెస్‌గానూ పిలుస్తున్నారు. పచ్చికబయళ్లూ మహావృక్షాల మధ్య ఉన్న ఈ ప్యాలెస్‌, ఎంతో విశాలంగా ఉంది. తరవాత వార్‌ మ్యూజియానికి వెళ్లాం. అమెరికాని ఓడించిన ఏకైక దేశం వియత్నాం. యుద్ధానంతరం ఈ వార్‌ మెమోరియల్‌ను నిర్మించుకుంది. ఆ యుద్ధంలో వాడిన ఫిరంగులూ తుపాకులూ బాంబులూ అన్నింటినీ ప్రదర్శిస్తున్నారక్కడ.ముత్యాల పెంపకం..!
తరవాతిరోజు హోచిమిన్‌ నుంచి రెండు గంటలు విమానంలో ప్రయాణించి హనోయి చేరుకున్నాం. ముందే బుక్‌ చేసుకున్న టూర్‌ ఆపరేటర్‌ ద్వారా ఏసీ బస్సెక్కి ఉదయాన్నే హాలాంగ్‌బే దగ్గరకు వెళ్లాం. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు కళ్లకు ఆహ్లాదాన్ని పంచి ఇచ్చాయి. వెళ్లేటప్పుడూ వచ్చేటప్పుడూ మూడుచోట్ల ఆపి అక్కడివాళ్లు చెక్కిన పాలరాతి విగ్రహాలను చూపించారు. అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. తరవాత హాలాంగ్‌ బే దగ్గరే ఉన్న ముత్యాల తయారీ కేంద్రానికి వెళ్లాం. అక్కడ జీవించి ఉన్న ముత్యపు చిప్పల్నీ వాటి పెంపకాన్నీ ప్రత్యక్షంగా చూశాం. ఒక్కో ముత్యపు చిప్పనీ తీసుకుని అందులోని జీవి గాయపడకుండా ఆ చిప్ప తెరిచి అందులోకి చిన్న చిన్న పలుకుల్ని ప్రవేశపెట్టడం, తయారు అయిన ముత్యాలను అంతే ఒడుపుగా వెలికి తీయడం అద్భుతంగా అనిపించింది. ఆ ప్రాంతమంతా ముత్యపు పరిశ్రమలతోనే నిండి ఉంది.
హాలాంగ్‌లోని బస్టాండుకి చేరుకున్నాక అక్కడి టూర్‌ ఆపరేటర్లు మమ్మల్ని వాళ్ల టూర్‌ పడవల్లోకి ఎక్కించి తీసుకువెళ్లారు. అక్కడ ఇలాంటి పడవలు ఓ వందకి పైగా ఉన్నాయి. ఒక్కోదాంట్లో సుమారు ముప్ఫై నుంచి నలభై మంది పడతారు. ఆ పడవ మినీ రెస్టరెంట్‌లాగా ఉంది. టూర్‌ ప్యాకేజీలో భాగంగానే మధ్యాహ్నం భోజనమూ డ్రింక్సూ ఇచ్చారు. చేపలూ రొయ్యలూ పీతలూ... వంటి సముద్ర జీవులతో చేసిన వంటకాలూ పండ్లూ మిఠాయిలూ అన్నమూ నూడుల్సూ... ఇలా పలు రకాలతో బఫే పెట్టారు. మెల్లగా మా పడవ తీరం నుంచి సముద్రం మధ్యలోకి చేరింది.చుట్టూ చూస్తే దూరానికి అన్నీ నిలువెత్తు పచ్చని కొండరాళ్లలా ఉన్నాయి. దగ్గరకు వెళ్లాకగానీ అవన్నీ బుల్లి దీవులు అని తెలియలేదు. అలాంటివి అక్కడ దాదాపు 2000 దీవులు ఉన్నాయి. అవన్నీ సున్నపురాతితో కూడిన దీవులు. వాటిల్లో కొన్ని గుహల మాదిరిగా ఉన్నాయి. వాటి లోపలికికూడా వెళ్లొచ్చు. సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆ ప్రకృతి అద్భుతాన్ని యునెస్కో ఆధునిక ఏడు వింతల్లో ఒకటిగా చేర్చింది. మా పడవ సముద్రం మధ్యలో ఓ చిన్న ద్వీపం దగ్గర ఆగింది. పడవలన్నీ ఆగే స్థలం అదేనట. అక్కడినుంచే అంతా కయాకింగ్‌కి వెళతారు. మేం కూడా ఓ పడవలో బయల్దేరాం. గుహల మధ్యలోంచి సముద్రంలోకీ అక్కడి నుంచి మరో గుహలోకీ తెడ్లు వేసుకుంటూ వెళ్లడం ఆనందంగా అనిపించింది.స్వర్గ ద్వారం!
తరవాత ప్రకృతి చెక్కినట్లున్న సుందర హాంగ్‌ డో గో అనే గుహకి వెళ్లాం. అందులోకి వెళ్లాలంటే వంద మెట్లు ఎక్కాలి. ఆ గుహ ఓ ద్వీపంలోని కొండ లోపల ఉంది. విశాలంగా ఉన్న ఆ గుహ పై కప్పులో సుమారు పది అడుగుల రంధ్రం ఉంది. వాళ్ల భాషలో దాన్ని స్వర్గద్వారం అని పిలుస్తారు. పై నుంచి జాలువారే నీటి తుంపర్లలోని లవణాలు ఏళ్ల సంవత్సరాలుగా పోగుబడి ఘనీభవించి పై నుంచి వేలాడుతున్న స్తంభాల్లానూ మరెన్నో వింత ఆకృతుల్లోనూ కనిపించాయి. వియత్నాం ప్రజలందరికీ తల్లిదండ్రులు ఒక్కరేననీ ఆ జంటకి 54 మంది పిల్లలనీ వాళ్లు ఆ పిల్లలను తీసుకుని వేల సంవత్సరాల క్రితం ఈ గుహలోకి వచ్చారనీ తరవాత వాళ్లను వేర్వేరు ప్రాంతాల్లో వదిలిపెట్టారనీ అలా వియత్నాంలో 54 తెగలు ఆవిర్భవించాయనీ అందుకే వాళ్లందరిదీ సోదర బంధం అనేది ఓ పౌరాణిక కథనం. ఆ కథెలా ఉన్నా అది వాళ్ల ఐకమత్యాన్నీ దేశభక్తినీ పెంపొందించేందుకు తోడ్పడుతుంది.ఇక్కడి దీవుల పేర్లన్నీ వాటి ఆకారాన్ని బట్టి ఉంటాయి. ఉదాహరణకు ఓయ్‌ దీవినే తీసుకుంటే ఏనుగు అని అర్థం. ఆ దీవి అచ్చంగా ఏనుగు ఆకారంలోనే ఉంటుంది.  ఇక్కడి నీళ్లలో దాదాపు వెయ్యికి పైగా సముద్రజీవులు ఉన్నాయట. వాటి వేటే ఆధారంగా జీవించే కుటుంబాలు వెయ్యికి పైగానే ఉన్నాయక్కడ. వీళ్లంతా కలిసి అక్కడి పడవల్లోనే నివసిస్తుంటారు. వీళ్లు నివసించే ఆ పడవలు ఉండే ప్రాంతాలనే తేలియాడే గ్రామాలుగా పిలుస్తారు.  ఈ ప్రాంతం గురించిన ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. పూర్వం దేవతలు వియత్నామీయుల్ని కాపాడమని డ్రాగన్లను ఈ ప్రాంతానికి పంపించారనీ, అయితే అవి ధరించిన రత్నాలు సముద్రంలో పడి దీవులుగా ఏర్పడ్డాయనీ బయటివాళ్లెవరూ ఆ దేశంలోకి చొరబడకుండా ఆ డ్రాగన్లు కాపాడుతున్నాయనీ చెబుతారు. పైగా డ్రాగన్లకి ఆ ప్రాంతం నచ్చడంతో అవి తిరిగి స్వర్గానికి వెళ్లకుండా ఈ నీళ్లలోపలే విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయాయని విశ్వసిస్తారక్కడి ప్రజలు. వాటి సంగతెలా ఉన్నా ఐదు లక్షల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో మనిషి ఉనికిని కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు.  తరవాతిరోజు హానోయీ నగరాన్ని ఆనుకుని ప్రవహించే రెడ్‌ రివర్‌ ఆవలి తీరానికి వెళ్లాం. అక్కడ పట్టు ఉత్పత్తి కేంద్రాలు చాలానే ఉన్నాయి. అక్కడే సిల్క్‌ మ్యూజియం, మార్కెట్లూ ఉన్నాయి. వాటిల్లో సంప్రదాయ వియత్నామీ దుస్తులతోబాటు రకరకాల అలంకరణ వస్తువులూ అమ్ముతారు.హానోయి నగరం!
వియత్నాం రాజధాని నగరమైన హానోయి ఎంతో విశాలంగానూ ప్రశాంతంగానూ ఉంది. వియత్నాంకి జాతిపిత అనదగ్గ హోచిమిన్‌ ఇక్కడి నుంచే తన కార్యకలాపాలను సాగించాడు. అమెరికాతో జరిగిన యుద్ధంలో ఆ దేశాన్ని ఓడించి, ఉత్తర, దక్షిణ వియత్నాంలను పునరేకీకరించి అభివృద్ధి దిశగా వియత్నాంను నడిపించిన మహోన్నత నాయకుడాయన. మరణానంతరం ఆయన పార్థివ దేహాన్ని ఎంబామింగ్‌ చేసి ఓ అందమైన భవంతి లాంటి సమాధిలో ఉంచారు. ఆ సమాధికి ఎదురుగా వియత్నాం జాతీయ అసెంబ్లీ ఉంది. దాని పక్కనే హోచిమిన్‌ మ్యూజియమూ అందులో ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహమూ ఆయన వాడిన వస్తువులూ ఫొటోలూ బొమ్మలూ ఉన్నాయి. కమ్యూనిస్టు దేశం కావడంతో మార్క్స్‌, లెనిన్‌... వంటి నాయకుల చిత్రపటాలు కూడా అక్కడ చాలానే ఉన్నాయి.అక్కడినుంచి హానోయిలో పేరొందిన వన్‌ పిల్లర్‌ పగోడా, టెంపుల్‌ ఆఫ్‌ ద జేడ్‌ మౌంటెయిన్‌, ట్రాన్‌ క్యుయెక్‌ పగోడా, టెంపుల్‌ ఆఫ్‌ లిటరేచర్‌... వంటి ఆలయాలకు వెళ్లాం. అవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. తరవాత చిరు వ్యాపారుల నుంచి బహుళజాతి కంపెనీల వరకూ ఉండే ఓల్డ్‌ క్వార్టర్‌ అనే ప్రాంతానికి వెళ్లాం. ఇది ప్రధాన వ్యాపార కూడలి. తరవాత సూది నుంచి కంప్యూటర్ల వరకూ ఏ వస్తువులైనా దొరికే చో డాంగ్‌ క్సువాన్‌ మార్కెట్టుకి వెళ్లాం. అయితే అక్కడ సాయంత్రం మూడు గంటలకల్లా షాపులన్నీ మూతబడతాయి. తరవాతి గంటలో జిగేల్మనే కాంతులతో స్ట్రీట్‌ మార్కెట్టు కనిపిస్తుంది. యువతీయువకుల కేరింతలతో అర్ధరాత్రి వరకూ సాగే ఈ మార్కెట్టు చాలా రద్దీగా ఉంటుందట. ఏమైనా నాలుగు దశాబ్దాలనాటి వియత్నాంకీ నేటి వియత్నాంకీ అస్సలు పోలికే లేదు అనిపించింది. ఒకప్పటి నిరుపేద దేశం, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ పర్యటకుల్ని ఆకర్షించడం ఎంతైనా ప్రశంసనీయం కదా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.