close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హలో... నాక్కొంచెం హెల్ప్‌ చేయరూ!

హలో... నాక్కొంచెం హెల్ప్‌ చేయరూ!


‘ఇంట్లో అమ్మానాన్నా పోట్లాడుకుంటున్నారు. నన్నూ కొట్టారు... నాకు భయమేస్తోంది’ వెక్కిళ్లు పెడుతూ ఓ పదేళ్ల పిల్లవాడి ఫిర్యాదు.
‘పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే నాన్న కొడతారు. నాకు ఇంటికి వెళ్లాలనిలేదు’ పదో తరగతి కుర్రాడి కంప్లయింటు.
‘పక్కింటి అబ్బాయి ప్రేమిస్తున్నానన్నాడు. సినిమాకని చెప్పి ఎవరింటికో తీసుకెళ్లాడు. అక్కడేం బాగోలేదు. నాకు భయం వేసి పారిపోయి వచ్చాను. వాళ్లు వచ్చేస్తారేమో, నాకు హెల్ప్‌ చేయరూ’ పదహారేళ్ల అమ్మాయి అభ్యర్థన.
‘ఎంత చదివినా పరీక్ష రాయబోతే మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. చదివింది గుర్తుండడానికి ఏమన్నా మందులుంటాయా?’ మరో అమ్మాయి ఆరా.
‘అక్కా... రైల్వేస్టేషన్‌కి పోలీసులొచ్చారు. నా దోస్తు రామూని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వాడిని విడిపించరూ’ ప్లాట్‌ఫారమ్మీద నీళ్ల సీసాలమ్ముతూ బతికే ఓ పిల్లవాడి రిక్వెస్టు.
పిల్లల కోసం పనిచేస్తున్న ఓ హెల్ప్‌లైన్‌కి నిత్యం వచ్చే సవాలక్ష ఫోన్‌ కాల్స్‌లో మచ్చుకు కొన్ని.
ఒక వర్గం కాదు, ఒక ప్రాంతం కాదు... దేశవ్యాప్తంగా అన్ని నగరాలనుంచీ ఇలాంటి ఫోన్లు చైల్డ్‌లైన్‌కి ఏడాదికి కోటికి పైగా వెళ్తున్నాయి. 1098 చైల్డ్‌లైన్‌తో పాటు సీబీఎస్‌ఈ వారి టోల్‌ఫ్రీ నంబరు- ఇవి రెండూ మన దేశంలో 18 ఏళ్లలోపు పిల్లలకోసం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్లు. వీటికి వస్తున్న కాల్స్‌ని విశ్లేషిస్తే పిల్లలు ఎంత ఒంటరితనంతో బాధపడుతున్నారో అర్థమవుతుంది.
ఆలోచనలు పంచుకునేవారు లేకా, సమస్య వస్తే దారి చూపేవారు లేకా, తల్లిదండ్రులతో మనసు విప్పి చెప్పుకునే చనువు లేకా... పిల్లలు హెల్ప్‌లైన్‌ని ఆశ్రయిస్తున్నారు.
పిల్లల్ని పెంచడమంటే వారికి సౌకర్యాలన్నీ సమకూర్చడమే కాదనీ, మానసిక, భావోద్వేగపరమైన అవసరాలనూ తీర్చాల్సి ఉంటుందనీ పెద్దలు అర్థంచేసుకోవాల్సిన అవసరాన్ని ఈ హెల్ప్‌లైన్లకు వస్తున్న స్పందన తెలియజేస్తోంది. ఒకప్పటిలా ఉమ్మడి కుటుంబాలూ, కజిన్స్‌తో కలిసిమెలిసి ఉండడాలూ ఇప్పుడులేవు. అమ్మానాన్నా ఒకరో ఇద్దరో పిల్లలు... ఇప్పుడిదే కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతే సాయంత్రం బడినుంచి ఇంటికి వచ్చిన పిల్లలు రాత్రి వరకూ ఒంటరిగానే ఉంటున్నారు. అమ్మానాన్నా వచ్చినా ఎవరి పని వారిదే. ఒకరు వంటపనులతో బిజీ. మరొకరు ఆఫీసు పనితోనో ఫోనుతోనో బిజీ. అందుకే పిల్లలు తమ మాట వినేవారి కోసం మొహం వాచిపోతున్నారు. ఎవరు పలకరిస్తారా నోరారా కబుర్లు చెబుదామని ఎదురుచూస్తున్నారు. వారి ఆ అవసరాన్ని తీరుస్తున్నాయి హెల్ప్‌లైన్లు.ఎందుకు పెట్టారంటే...
నిజానికి చైల్డ్‌లైన్‌ను ఏర్పాటు చేసిన ప్రయోజనం వేరు. ప్రస్తుతం అది చేస్తున్న పని వేరు. తప్పిపోయో, అమ్మానాన్నల మీద కోపంతోనో వీధినపడిన బాలల్ని తిరిగి సురక్షితంగా ఇళ్లకు చేర్చడం లేదా పునరావాసం కల్పించడం అప్పటి ఆశయం. బాలకార్మికులూ, దారితప్పిన చిన్నారులూ, అనాథలూ... ఇలా ఏటా ఎందరో చిన్నారులు రకరకాల కారణాలతో వీధిపాలవుతుంటారు. వారికి రైల్వేస్టేషన్లూ, బస్టాండ్లే తాత్కాలిక చిరునామాలవుతాయి. అక్కడ సంఘవిద్రోహశక్తుల చేతిలో ఆ పిల్లలు ఎదుర్కొనే సమస్యలు ఇన్నీ అన్నీ కావు. అలాగని వాళ్లని బలవంతాన తీసుకెళ్లి ఏ ఆశ్రమంలోనో పెట్టినా చాలామంది ఇష్టపడరు. తమ స్వేచ్ఛకి సంకెళ్లు వేసినట్లు భావిస్తారు. అలాకాకుండా వారంతట వారే జీవితం పట్ల సానుకూలవైఖరి తెచ్చుకునేలా దారిచూపడమే చైల్డ్‌లైన్‌ ఉద్దేశం. చైల్డ్‌లైన్‌ వలంటీర్లు తరచూ ఇలాంటి పిల్లల్ని కలిసి మాట్లాడుతుంటారు. వారి అవసరాలు తెలుసుకుని సాయంచేస్తారు. అలా నెమ్మదిగా నమ్మకం సంపాదించి వారికి పునరావాసం కల్పించి సాధారణ జీవితం గడిపేలా ప్రోత్సహించడమే సంస్థ ఆశయం. చైల్డ్‌లైన్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 24 గంటలూ నిర్విరామంగా పనిచేసే ఈ చైల్డ్‌లైన్‌ తప్పిపోయిన చిన్నారులనెందరినో తిరిగి అమ్మ ఒడికి చేర్చింది. వెట్టిచాకిరీ నుంచి విముక్తుల్ని చేసింది. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న చిన్నారుల చెర వదిలించింది. దీనికి పిల్లలే కాదు, సమస్యల్లో ఉన్న పిల్లల గురించి సమాచారం ఇవ్వడానికి పెద్దలూ ఫోన్‌ చేస్తారు. అలాంటి ఫోన్లే ఎందరో పిల్లల్ని కాపాడుతుంటాయి.
అయితే, గతంతో పోలిస్తే ఈమధ్య చైల్డ్‌లైన్‌ ముందుకు వస్తున్న సమస్యలు మారుతున్న సమాజానికీ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకీ అద్దం పడుతున్నాయి. తొలినాళ్లలో వేలల్లో ఉన్న ఫోన్లు క్రమేణా లక్షల్లోకి పెరగగా ఇప్పుడు కోట్లకు చేరాయి. ఒక్క చైల్డ్‌లైన్‌కే నెలకు పదిలక్షల కాల్‌్్స వస్తున్నాయనీ, పిల్లలకు మొబైల్‌ ఫోన్లు అందుబాటులోకి రావడం కూడా అందుకు కారణం కావచ్చనీ అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన, చదువుకుంటున్న పిల్లలు- పలురకాల సందేహాలతో చైల్డ్‌లైన్‌ని ఆశ్రయిస్తున్నారు. తామెవరో చెప్పనవసరం లేదు కాబట్టి కౌన్సెలర్ల ముందు నిస్సంకోచంగా మనసు విప్పుతున్నారు.
వినడమే కాదు...
విదేశాల్లోని చైల్డ్‌లైన్లు కౌన్సెలింగ్‌కే పరిమితమైతే మనదేశంలో చైల్డ్‌లైన్‌ మాత్రం విస్తృతమైన సేవలందిస్తోంది. పోలీసులు, న్యాయ, వైద్య, విద్య, సంక్షేమ శాఖల సమన్వయంతో; ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థల సహకారంతో- పిల్లలకు తక్షణసాయం అందించడానికి వారధిగా మారుతోంది. 1098కి వచ్చే ప్రతి ఫోనుకీ శిక్షణపొందిన కౌన్సెలర్లు సమాధానం చెబుతారు. ఫోను ఏ ప్రాంతం నుంచీ వస్తే ఆటోమేటిగ్గా ఆ ప్రాంతానికి చెందిన కౌన్సెలర్‌కి ఆ ఫోను కనెక్ట్‌ అవుతుంది. సలహాలూ సూచనలతోనో, సాంత్వన వచనాలతోనో సమస్య పరిష్కారం కాదనుకున్నప్పుడు,
ఎమర్జెన్సీ కేసుల్లో వెంటనే ఆ ప్రాంత స్వచ్ఛంద సంస్థని అప్రమత్తం చేస్తారు. ప్రతి నగరంలోనూ ఒక స్వచ్ఛంద సంస్థ చైల్డ్‌లైన్‌కి అనుసంధానంగా పనిచేస్తుంది. దీన్ని ‘కొలాబ్‌’గా వ్యవహరిస్తారు. ఉదాహరణకు హైదరాబాదులో ‘దివ్యదిశ’ అనే సంస్థ ఆ పని చేస్తుంది. ఇది కాక ప్రాంతాలవారీగా సబ్‌సెంటర్లు ఉంటాయి. ఫోను ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ప్రాంతం సబ్‌సెంటర్‌ కార్యకర్తల వరకూ ఒక గొలుసులాగా సమాచారం నిమిషాల్లో వెళ్లిపోతుంది. అక్కడి కార్యకర్తల ద్వారా పిల్లలకు ప్రత్యక్ష సహాయం అందుతుంది. ఎమర్జన్సీ కేసుల్లో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యులు వీరికి సహకరిస్తారు. కౌన్సెలింగ్‌ లాంటి ఫాలో అప్‌ సేవలూ ఉంటాయి. మహిళా శిశుసంక్షేమ శాఖకు అనుబంధంగా నియమితులయ్యే వీరంతా గౌరవవేతనంతో పనిచేస్తారు.
ఎన్ని సమస్యలో...
అమ్మానాన్నల నీడలో ఆనందంగా గడవాల్సిన బాల్యం ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటోందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. చైల్‌్్డలైన్‌కీ, సీబీఎస్‌ఈ హెల్ప్‌లైన్‌కీ వస్తున్న ఫోన్లను విశ్లేషిస్తే...
హింస, వేధింపులు: తల్లిదండ్రుల చేతిలో హింసకు గురవుతున్న పిల్లలూ అయినవారి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలూ చేస్తున్న ఫోన్లు నానాటికీ ఎక్కువవుతున్నాయి. కుటుంబహింసా, తండ్రుల మద్యపాన వ్యసనమూ, ఇంటి ఆర్థిక పరిస్థితులూ, పసివయసులోనే పనిచేయాల్సిరావడమూ పిల్లల్ని హింసాత్మక వాతావరణంలోకి నెడుతున్నాయి. లైంగిక హింసకూ గురిచేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో వారు హెల్ప్‌లైన్‌ని ఆశ్రయిస్తున్నారు.
ఆన్‌లైన్‌ వేధింపులు: పదహారేళ్ల ఓ బాలిక చైల్డ్‌లైన్‌కి ఫోన్‌ చేసింది. ఓ వ్యక్తి తన పేరుమీద ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచి అసభ్యరాతలు రాస్తున్నాడనీ అమ్మానాన్నలకు తెలిస్తే తనని చంపేస్తారనీ ఈలోపే తాను ఆత్మహత్య చేసుకుంటాననీ చెప్పింది. కౌన్సెలర్లు ఆమెను సముదాయించి వివరాలు సేకరించి కేసును సైబర్‌ పోలీసులకు అప్పజెప్పారు. కొద్ది గంటల్లోనే అతడి ఆట కట్టించారు పోలీసులు. అది తెలిసి ఆ అమ్మాయి సంతోషానికి అవధుల్లేవు. ఆన్‌లైన్‌ వేధింపుల గురించి ఫోన్లు 2016 నుంచీ 2018 నాటికి ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. 16-18 ఏళ్ల మధ్య వయసు పిల్లల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వేధించినవారిలో అపరిచితులు ఎక్కువగా ఉండగా ఆ తర్వాత స్థానం స్నేహితులూ పొరుగువారిదీ. చైల్డ్‌లైన్‌ ఇలాంటి కేసుల్ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పజెబుతుంది. ఒకవేళ ఫిర్యాదు చేసిన పిల్లలు ఆఫ్‌లైన్‌ వేధింపులకూ గురవుతున్నట్లైతే తమ కార్యకర్తల ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తోంది. మరో రెండు మూడేళ్లలో స్మార్ట్‌ ఫోను వాడే పద్దెనిమిదేళ్ల లోపు పిల్లల సంఖ్య ఏడున్నర కోట్లకు చేరుతుందనీ ఇలాంటి సమస్యలు ఇంకా పెరుగుతాయనీ చైల్డ్‌లైన్‌కి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారంటే ఇది పరోక్షంగా తల్లిదండ్రులకు హెచ్చరికే.
పరీక్షల ఒత్తిడి: స్నేహితుడి కొడుక్కి 99శాతం మార్కులొచ్చి తన కొడుక్కి 92 శాతమే రావడం చాలా నామోషీ అన్పించింది ఓ తండ్రికి. అబ్బాయిని పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టేశాడు. దాంతో ఇల్లు విడిచి రోడ్డున పడ్డ ఆ అబ్బాయి ఎక్కడికెళ్లాలో తెలియక రైల్వేస్టేషన్లో బెంచీ మీద కూర్చుని ఏడవడం చైల్డ్‌లైన్‌ కార్యకర్త చూశాడు. మెల్లగా మాట కలిపి విషయం తెలుసుకున్నాడు. తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సెలింగ్‌ చేసి ఇంటికి పంపించారు. నేటి విద్యావిధానమే పిల్లల్ని ఒత్తిడికి గురిచేస్తోంది. అది తగ్గించాల్సింది పోయి తల్లిదండ్రులూ మరికాస్త ఒత్తిడి పెట్టడంతో హెల్ప్‌లైన్లను ఆశ్రయిస్తున్న పిల్లల సంఖ్య ఏటికేడాదీ రెట్టింపవుతోంది. ఏకాగ్రత పెంచుకోవడానికి ఏంచేయాలీ, పరీక్షల్లో 99శాతం మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా చదవాలీ, చదివింది గుర్తుండడానికి ఏమన్నా మందులుంటాయా, అమ్మానాన్నలకు ఇష్టమైనది కాకుండా నాకిష్టమైనది ఎందుకు చదువుకోకూడదూ... ఇలా ఉంటున్నాయి పిల్లల ప్రశ్నలు. కొందరైతే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామనీ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందనీ చెబుతున్నారు.
ప్రేమలూ విడిపోవడాలూ: ‘నా క్లాస్‌మేట్‌ని ప్రేమిస్తున్నాను. ఆమె నా ప్రేమను అంగీకరించాలంటే నేనేం చేయాలి’ ఓ పదహారేళ్ల కుర్రాడి ఫోన్‌. ‘అమ్మానాన్నా లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. నేను చేసుకుంటానంటే తిడతారేంటి’ మరో అమ్మాయి బాధ. నగరాల్లోని టీనేజీ పిల్లలనుంచి వస్తున్న ఫోన్లలో సగం దాకా ప్రేమలూ బ్రేకప్‌ల గురించి ఉంటున్నాయి. అదే గ్రామీణ ప్రాంతాలనుంచీ అయితే పై చదువులకు సలహాలూ సూచనలూ అడుగుతున్నారట.బాల్యవివాహాలు: హైదరాబాద్‌లోని పాతబస్తీలో బాల్యవివాహం జరుగుతున్నట్లు ఈ మధ్యే చైల్డ్‌లైన్‌కి ఫోన్‌ వచ్చింది. కార్యకర్తలు వెంటనే పోలీసులను వెంటపెట్టుకుని వెళ్లి ఆ పెళ్లిని ఆపారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఎన్నో నేరాలు బయటపడ్డాయి. పద్నాలుగేళ్ల అమ్మాయి పెద్దగా కన్పించాలని హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు. నిజానికి ఆమెను దుబాయ్‌లోని ఓ పెద్దవయసు వ్యక్తికి అమ్మేశారు. అతడితో పెళ్లి చేస్తే గొడవవుతుందని ఇక్కడ వేరొకరితో పెళ్లి తలపెట్టారు. ఇద్దరినీ దుబాయ్‌ పంపించి ఆమెను అక్కడ అప్పజెప్పి అబ్బాయి తిరిగివచ్చేటట్లు ప్లాను సిద్ధం చేశారు. చైల్డ్‌లైన్‌ కార్యకర్తలు ఆ ప్రమాదం నుంచి అమ్మాయిని రక్షించి ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించారు. బాల్యవివాహాలను అడ్డుకోవడం కార్యకర్తలకు శక్తికి మించిన పనే. ఎంతో రిస్క్‌ తీసుకుని వారు అర్థరాత్రీ అపరాత్రీ అని చూడకుండా ఆ పనిలో లీనమవుతారు. పిల్లల్ని సురక్షితమైన చోటికి చేర్చికానీ ఇళ్లకు వెళ్లరు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలనుంచీ బాల్యవివాహాల గురించి చైల్డ్‌లైన్‌కి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి.  

* * * * * * * * * *  

కుటుంబంలో అనుబంధాలు బలహీనమైనప్పుడు, మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు కరవైనప్పుడు... బాధను పంచుకునే బయటి వ్యక్తుల కోసం చూడాల్సివస్తుంది.
ఆ అవసరం అమ్మానాన్నలున్న చిన్నపిల్లల దాకా రావడమే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఎదిగే వయసులో ఎన్నెన్నో సందేహాలూ సమస్యలూ ఆ చిన్ని మెదళ్లను తొలిచేస్తుంటాయి. ఆ ఉద్వేగాలను ఓపిగ్గా విని మంచీ చెడూ విడమరచగలిగితే చాలు... హెల్ప్‌లైన్‌ దాకా అక్కర్లేదు, చిన్నారి జీవితాలకు అమ్మానాన్నలే లైఫ్‌లైన్‌ అవుతారు!

ఆమె చలవే!

పాతికేళ్ల క్రితం సంగతి. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో చదివిన జెరూ బిల్లిమోరియాకి వీధిబాలలే నేస్తాలు. ముంబయి రైల్వేస్టేషన్లలో, నైట్‌ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారిని పలకరించడం, తనకు చేతనైన రీతిలో వారికి సహాయంచేయడం- అలవాటు. వారికి తన ఇంటి ఫోన్‌ నంబర్‌ ఇవ్వడంతో ఎవరికి ఎప్పుడే అవసరమొచ్చినా ఆమెకు ఫోన్‌ చేసేవారు. కొద్దికాలంలోనే ఆ ఫోను నిర్విరామంగా మోగడం మొదలెట్టింది. సహాయం కోరుతూ ఫోను రాగానే ఆమె వెళ్లిపోయేది. పోలీసులతో మాట్లాడడం, అవసరమైతే పిల్లల్ని ఆస్పత్రిలో చేర్చడం, వారికి సురక్షితమైన ఆశ్రయం కల్పించడం లాంటివన్నీ చేసి కానీ ఇంటికి చేరేది కాదు. దొంగలూ, మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవారూ, లైంగిక అకృత్యాలకు పాల్పడేవారూ... ఇలా రకరకాల సంఘవిద్రోహ శక్తుల చేతిలో అమాయకమైన బాల్యం నలిగిపోవడం ఆమెను ఆలోచింపజేసింది. ఇక్కడే తన అవసరం ఉన్న పిల్లలు ఇంతమంది ఉంటే అన్ని నగరాల్లో ఇంకెంత మంది ఉంటారోనన్న ఆలోచన ఆమెను నిలువనీయలేదు. ఇలాంటి పిల్లలంతా ఒక్క ఫోన్‌కాల్‌తో సహాయం పొందగల దేశవ్యాప్త వ్యవస్థ ఒక్కటి ఉంటే బాగుంటుందనుకుంది. అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మొత్తానికి వివిధ శాఖలతో సంప్రదించి, పిల్లలతో కలిసి ఉద్యమించి, మూడేళ్లు పోరాడి, 1996లో చైల్డ్‌లైన్‌ ప్రారంభమయ్యేలా చేసింది జెరూ బిల్లిమోరియా. పదీ తొమ్మిదీ ఎనిమిదీ అని పిల్లలు పిలుచుకునే ఈ నంబరు(1098) ఇప్పుడు దేశంలోని 370 దాకా నగరాలూ పట్టణాలకు సేవలందిస్తోంది.

అమ్మానాన్నలు మారాలి!

హెల్ప్‌లైన్లపై పిల్లలు ఇంతగా ఆధారపడాల్సి రావడానికి తల్లిదండ్రుల ప్రవర్తనే కారణమంటున్నారు నిపుణులు. వారిలో రావాల్సిన మార్పుల గురించి చైల్డ్‌లైన్‌ కార్యకర్తలుగా పనిచేస్తున్నవారు వెల్లడించిన అభిప్రాయాలు ఇవి!
* తల్లిదండ్రులు తాము ఎదుర్కొంటున్న ఒత్తిళ్లూ సంక్షోభాల ప్రభావాన్ని పిల్లల మీద చూపుతున్నారు. తమ సమస్యల్ని తాము పరిష్కరించుకోకుండా భాగస్వామి మీద కోపాన్ని పిల్లల మీద ప్రదర్శిస్తున్నారు. తీవ్రంగా కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. పసిమనసులమీద దాని ప్రభావం శాశ్వతంగా ఉంటుందని వారు గుర్తించడం లేదు.
* లైంగిక హింస ఎప్పుడూ లేనంతగా ఎక్కువయింది. బాధితులే కాదు, చాలా కేసుల్లో నిందితులూ పిల్లలే అవుతున్నారు. పిల్లల్ని ఒంటరిగా వదలడం, ఇరుగుపొరుగును నమ్మడం అన్ని వేళలా సరికాదు. అవసరమై ఎవరి దగ్గరైనా పిల్లల్ని వదిలితే తరచూ పర్యవేక్షించాలి.
* పిల్లల ఇష్టాలూ సామర్థ్యాలతో సంబంధంలేకుండా చదువు విషయంలో తల్లిదండ్రుల ఇష్టాలను పిల్లల మీద రుద్దడం వల్ల రాజీ పడలేని పిల్లలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. చదువు విషయంలో పిల్లల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు పిల్లలతో గడిపే కాస్త సమయమూ పనుల హడావుడితోనే సరిపోతోంది. పిల్లలు తమ మనసు విప్పి మాట్లాడేందుకు ప్రోత్సహించే అనురాగపూరిత వాతావరణం ఇళ్లల్లో కనుమరుగవుతోంది. ఎవరి గదుల్లో వాళ్లుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో క్వాలిటీ సమయం గడపాలి. రోజూ కాసేపు తప్పనిసరిగా మాట్లాడడమే కాదు, వివిధ అంశాల మీద పిల్లలు తమ అభిప్రాయాలను చెప్పే అవకాశమివ్వాలి. అప్పుడే వాళ్ల ఆలోచనలు తెలుస్తాయి. వారిని సరైన మార్గంలో పెట్టడానికి వీలవుతుంది.
* పిల్లలు తోటి వారి ప్రభావానికీ సోషల్‌ మీడియా ప్రభావానికీ లోనై ప్రయోగాలు చేస్తున్నారు. మాదకద్రవ్యాల వాడకం పాఠశాల విద్యార్థుల్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒంటరితనమూ, మితిమీరిన స్వేచ్ఛా, సెల్‌ఫోన్లూ... వారికి ఆ అవకాశాన్ని ఇస్తున్నాయి. పెరిగే పిల్లలకు ఎంత స్వేచ్ఛ ఇస్తారో అంత పర్యవేక్షణా ఉండాలని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. పిల్లల ప్రవర్తనని నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి.
* తల్లిదండ్రులు ఇవ్వకపోతే డబ్బు కోసం పిల్లలు దొంగతనమైనా చేయడానికి తెగిస్తున్నారంటే- నైతిక విలువల గురించి చిన్నవయసులోనే వారి మనసులో నాటుకునేలా చెప్పకపోవడమే కారణం. ప్రేమ, అనుబంధాల విలువ తెలిసేలా పెంచకపోవడమే ప్రేమ పేరుతో లైంగికదాడులకు కారణమవుతోంది.

ఫోన్‌ చేసి... మౌనంగా...

త మూడేళ్లలో చైల్డ్‌లైన్‌కి దాదాపు మూడున్నర కోట్ల కాల్స్‌ వచ్చాయి. అందులో మూడోవంతు కాల్స్‌లో ఫోన్‌ చేసినవారు ఏమీ మాట్లాడకుండా కాసేపు విని ఫోను పెట్టేశారు. ఇంత ఎక్కువ సంఖ్యలో ఇలాంటి కాల్స్‌ రావడం నిపుణుల్ని ఆలోచింపజేస్తోంది. ఫిర్యాదు చేయడానికి ధైర్యం చాలకో, లేక చెబితే ఏమవుతుందోనన్న సంకోచంతోనో వాళ్లు మాట్లాడడం లేదని అర్థం చేసుకున్న కౌన్సెలర్లు ఆ కాల్స్‌ని పెట్టేయకుండా మాట్లాడమని ధైర్యం చెబుతున్నారు. అప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాతైనా వారు మళ్లీ ఫోను చేసి మనసు విప్పుతారని భావిస్తున్నారు. ఇక అధికారులు జోక్యం చేసుకుని క్రియాశీలంగా వ్యవహరించాల్సిన ఫోన్లు- 6 లక్షలు వస్తే అందులో హింస, లైంగిక వేధింపులకు సంబంధించినవి 2 లక్షలకు పైగానే ఉండడం తల్లిదండ్రులకు హెచ్చరికే. ఆ తర్వాతి స్థానం మానసికస్థైర్యమూ మార్గదర్శకత్వమూ కోరుతూ చేసిన ఫోన్లది. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.