close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంచి నిద్రకోసం...

మంచి నిద్రకోసం...

రాత్రిపూట సరిగా ఆహారం తీసుకోకపోవడంవల్ల చాలామందికి సరిగా నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే సరి!
‘గోరువెచ్చని పాలు తాగి పడుకోమ్మా... బాగా నిద్రపడుతుంది’ అంటూ బామ్మలు బుజ్జగించి చెప్పడం తెలిసిందే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. పాలల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోని ట్రిప్టోఫాన్‌ అనే అమైనోఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. ఆ సెరటోనినే మెలటోనిన్‌గా మారి, మంచి నిద్రపట్టేలా చేస్తుంది.
* బాదంలోని పోషకాలూ నిద్ర పట్టడానికి కారణమయ్యే మెలటోనిన్‌ హార్మోన్‌ శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి.
* అరటిపండ్లలో ట్రిప్టోఫాన్‌, మెగ్నీషియం... వంటి పోషకాల శాతం ఎక్కువ. ఈ రెండూ కూడా నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ స్రావాన్ని పెంచుతాయి. పైగా అరటిపండులో అధికశాతం పిండిపదార్థాలే కాబట్టి ఇది తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది.
* తేనెలోనూ ట్రిప్టోఫాన్‌ శాతం ఎక్కువ. అందుకే నిద్రపోయేటప్పుడు టేబుల్‌స్పూను తేనె తాగినా మేలే.


శిరోజాలు మెరవాలంటే...

ల్లగా మెరిసే ఒత్తయిన జుట్టుని సొంతం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించి తీరాల్సిందే. అవేమంటే... ముందుగా ఆహారంలో ప్రొటీన్లూ కొవ్వులూ పిండిపదార్థాలూ విటమిన్లూ... ఇలా అన్ని రకాలూ ఉండేలా చూసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. వీటితోబాటు ఎస్‌.ఎల్‌.ఎస్‌, సల్ఫేట్స్‌ వంటి రసాయనాలు ఉండే షాంపూలూ కండిషనర్లూ వాడకూడదు. అవి శిరోజాల్లోని సహజ నూనెల్ని తొలగించి పొడిబారేలా చేస్తాయి. వారానికి రెండుమూడుసార్లకన్నా ఎక్కువగా తలస్నానం చేయకూడదు. రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు కళావిహీనంగా మారుతుంది. అలా చేసేటప్పుడు కూడా వారానికి ఒక్కసారయినా నూనెతో మర్దన చేసుకోవాలి. చిన్న పళ్లది కాకుండా వెడల్పాటి పళ్లతో కూడిన దువ్వెన వాడటం మేలు. తలస్నానానికి మరీ వేడి నీరు కాకుండా గోరువెచ్చని నీరు వాడాలి. ప్రతి రెండు నెలలకోసారి జుట్టు చివర్లను ట్రిమ్‌ చేయించుకోవాలి. హెయిర్‌డ్రైయర్లూ స్ట్రెయిటనర్లు వాడకపోవడమే మేలు. అవి దీర్ఘకాలంలో జుట్టుని దెబ్బతినేలా చేస్తాయి.


మెనోపాజ్‌ సమస్యలకి సోయా?!

మెనోపాజ్‌ తరవాత మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఆస్టియోపొరోసిస్‌. అందుకే ఆ సమస్య తలెత్తకుండా ఉండాలంటే సోయాలోని ప్రొటీన్లను ముందునుంచీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరికి చెందిన పరిశోధకులు. ఎందుకంటే మెనోపాజ్‌ మహిళల్లో కొందరికి ఆస్టియోపొరోసిస్‌ కారణంగా శారీరక శ్రమ ఉండదు. వ్యాయామం చేయలేరు. ఫలితంగా బరువు పెరుగుతారు. జీవక్రియా దెబ్బ తింటుంది... ఇంకా మరెన్నో సమస్యలు. అందుకే ఆ దశకు చేరుకునే ముందు నుంచీ సోయాను ఆహారంలో భాగంగా చేసుకుంటే జీవక్రియావేగం పెరగడంతోబాటు ఎముక ఆరోగ్యమూ బాగున్నట్లు ఎలుకల్లో చేసిన పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా హార్మోన్లతో సంబంధం లేకుండా కాలి ఎముకలు బలంగా మారినట్లు గుర్తించారు. దీన్నిబట్టి మెనోపాజ్‌కు దగ్గరలో ఉన్న మహిళలు సోయాను ఆహారంలో భాగం
చేసుకోవడం ఉత్తమం.


కడుపు మండిపోగలదు!

కొందరు దంపతులు చీటికీ మాటికీ పోట్లాడుకుంటుంటారు. అందువల్ల మానసికంగానే కాదు, శరీరమూ కుంగిపోతుంది అంటున్నారు పరిశోధకులు. తరచూ పోట్లాటల వల్ల డిప్రెషన్‌తోబాటు హృద్రోగాలూ మధుమేహం వంటి వ్యాధులూ తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాదు, పొట్టలోని బ్యాక్టీరియా రక్తంలోకి చేరి ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య కూడా వస్తుంది అంటున్నారు ఒహాయో స్టేట్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. దీనికోసం వీళ్లు ఆరోగ్యంగా ఉండే 43 మంది జంటల్ని ఎంపికచేశారు. వాళ్ల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల్ని క్షుణ్ణంగా పరిశీలించారట. తరవాత వాళ్లలో కొంతమంది మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను మరింత రెచ్చగొట్టి, వాళ్ల పోట్లాటని వాళ్లకి తెలియకుండా వీడియో తీశారట.
పోట్లాటకు ముందూ తరవాతా కూడా వాళ్ల రక్తాన్ని సేకరించి పరీక్షించగా- తీవ్రంగా పోట్లాడుకున్న జంటల రక్తంలో పూర్తిగా జీర్ణం కాని ఆహారంతోబాటు బ్యాక్టీరియా జాడలు కనిపించాయట. అంటే పేగు గోడలు బాగా పలుచబారడంతో అవి రక్తంలోకి చేరాయనీ దీన్నిబట్టి గట్టిగా పోట్లాడుకోవడం అనేది పొట్ట లీకేజీకీ తద్వారా ఇన్‌ఫ్లమేషన్‌కీ కారణమవుతుందని వివరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త.


అబ్బే, తాగలే

భార్య: రాత్రి మళ్ళీ తాగొచ్చారు కదా?
భర్త: ఛఛ, నేను మందు మానేశాను కదా.
భార్య: మరి రాత్రంతా టీవీ చూస్తూ అంత పడీపడీ నవ్వుతున్నారు?
భర్త: ఇది మరీ బాగుంది... టీవీ చూస్తూ నవ్వితే తాగినట్లా?
భార్య: అంటే... కరెంటుపోయి టీవీ ఆగిపోయినా తమరు టీవీనే చూస్తూ నవ్వుతున్నారు మరి..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.