close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘టెక్‌’తో ఆటకట్టిస్తున్నారు...!

‘టెక్‌’తో ఆటకట్టిస్తున్నారు...!

ఏదైనా నేరం జరగగానే పోలీసులతోపాటూ ఫోరెన్సిక్‌ నిపుణులూ రంగంలోకి దిగుతారు... ఇది కొత్త కాదు. ఈ నిపుణులు సంఘటనా స్థలంలో దొరికినవాటన్నింటినీ దేశంలోని వేర్వేరు ల్యాబ్‌లకి పంపిస్తారు... అందులోనూ విశేషమేమీ లేదు. ఆ ఫలితాలు వచ్చేదాకా వేచి చూసి ఆ విశ్లేషణలు చూశాకే పోలీసులు ఓ నిర్ణయానికి వస్తారు... ఇదీ అన్నిచోట్లా జరిగేదే! కానీ అన్నిచోట్లా జరగని, దేశంలోని మిగతా పోలీసులెవ్వరూ చేయని, ఆసియాలో మరే దేశాలూ వాడనిసరికొత్త సాంకేతిక పరికరాలతో అద్భుతాలే చేస్తోంది హైదరాబాద్‌ పోలీసు విభాగానికి చెందిన క్లూస్‌ టీమ్‌!ది హైదరాబాద్‌ ఉప్పల్‌లోని చిలకా నగర్‌. అక్కడో డాబా ఇల్లు. జనవరి 31 ఉదయం... డాబాపైకి వచ్చి ఆరేసిన బట్టల్ని చేతికి తీసుకోబోయారు బాలాలక్ష్మి. వాటిలో చుట్టి ఉన్న వస్తువేదో బరువుగా కిందపడింది. దాన్ని చూసి... కరెంటు షాక్‌ కొట్టినట్టు పెద్దగా అరిచిందామె. ఆ ఊడిపడింది ఓ చిన్నిపాప తల! రంగంలోకి దిగిన పోలీసులు బాలాలక్ష్మి అల్లుడు క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్ని ప్రశ్నిస్తే... తన ఎదురింటివారే క్షుద్రపూజ చేసి నెపం తనపై వేసుంటారన్నాడు. పోలీసులు వాళ్లని తీసుకొచ్చి విచారిస్తే వాళ్లు లబోదిబోమన్నారు తప్ప నిజం బయటకి రాలేదు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి డ్రైవర్‌ శివ ఇంటిని అణువణువూ శోధించింది. ఏమీ దొరకలేదు. ఎందుకైనా చూద్దామని... అతని ఇంట్లో రిఫ్లెక్టెడ్‌ అల్ట్రావయొలెట్‌ ఇమేజింగ్‌ లైట్‌ పరికరాన్ని ఉపయోగించారు. నేలమీద దాని కాంతి ప్రసరించగానే అంతవరకూ కళ్లకి కన్పించకుండా ఉన్న ఎండిన రక్తపుచుక్కా, దాన్ని గుడ్డతో తుడిచిన గుర్తులూ కనిపించాయి. ఆ చుక్కలోని డీఎన్‌ఏని తీసి, ముందురోజు దొరికిన చిన్నారి తలకి సంబంధించిన డీఎన్‌ఏతో పోల్చి చూస్తే... రెండూ ఒక్కటేనని తేలింది. అప్పటికప్పుడే క్యాబ్‌ డ్రైవర్‌ని కటకటాల వెనక్కి పంపిస్తే... ఆ చిన్నారిని తానే నరబలి ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు!అణువంతున్నా చాలు...!
రిఫ్లెక్టెడ్‌ అల్ట్రావయొలెట్‌ ఇమేజింగ్‌ సిస్టమ్‌(దీన్నే సూపర్‌లైట్‌ అంటారు) పరికరమే లేకుంటే... ఈ కేసులో క్యాబ్‌ డ్రైవర్‌ దొరికే అవకాశమే లేదు. హంతకులు తుడిచేసిన, కడిగేసిన ఆధారాలే కాదు... శవాన్ని ఈడ్చుకెళ్లినప్పుడు నేలపై పడి ఆరిపోయిన చెమట చుక్కలూ, పెనుగులాటలో రాలిన వెంట్రుకలు... వంటివి ఉన్నా చాలు ఇది చూపించగలదట.
ఉగ్రవాదుల పనేనా?
డీఆర్‌డీఓ ఇబ్రహీంపట్నం కేంద్రం పక్కన రెండేళ్లకిందట ఓ సాయంత్రం పేలుడు జరిగి వ్యక్తి మరణించాడు. ఆ పేలుడు వ్యర్థాల నుంచే తర్వాతి రోజు మరో రెండు విస్ఫోటనాలు జరిగాయి. ఇది తీవ్రవాద చర్య అనుకుని దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థలన్నీ ఇక్కడికొచ్చాయి! ఎవ్వరికీ ఏ ఆధారమూ దొరకని పరిస్థితుల్లో హైదరాబాద్‌ క్లూస్‌ బృందం... ఆ పేలుడికి కారణం ఉగ్రవాదులు కాదని తేల్చింది. అక్కడి చిరుతిళ్ల వ్యాపారి నీటి కోసం ఉపయోగించిన క్యాన్‌లో కొద్దిగా మిగిలిపోయిన ఎమ్‌ఈకేపీ(మిథైల్‌ ఇథనాల్‌ కీటోన్‌ పెరాక్సైడ్‌) అనే రసాయన అవశేషమే ఇందుక్కారణమని ఐదు నిమిషాల్లో చెప్పగలిగింది. ఈ విషయాన్ని ఇంతటి పక్కా విశ్లేషణతో చెప్పడానికి వాళ్లకి ఎక్స్‌-క్యాట్‌ అనే పరికరం ఉపయోగపడింది.ల్యాబ్‌ అక్కర్లేదు...
ఎక్స్‌-క్యాట్‌ ఓ మొబైల్‌ ల్యాబ్‌లాంటిది. నేరస్థులు వాడే ఎలాంటి రసాయనానికి సంబంధించిన ఆనుపానుల్నైనా పట్టించేస్తుంది. ముఖ్యంగా మాదకద్రవ్యాల రవాణా కేసుల్లో కొన్ని నిమిషాల్లోనే నేరస్థులు పట్టుబడేలా సహకరిస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మాత్రమే దీన్ని వాడుతున్నారు. సూపర్‌లైట్‌, ఎక్స్‌-క్యాట్‌... ఇవి రెండూ హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌ అమ్ములపొదిలో కొత్తగా వచ్చిచేరిన రెండు కీలకమైన అస్త్రాలు. ఇవేకాకుండా పోలీసులు కోర్టులో నేరం జరిగిన తీరుని నివేదించడానికి ఉపయోగించేందుకు త్రీడీ స్కానర్‌ పరికరాలూ, విజో డ్రాయింగ్‌ సాఫ్ట్‌వేర్‌లూ, ఆయిల్‌ డిటెక్టర్‌లూ... ఇలా ఎన్నో వాళ్ల చేతిలో ఉన్నాయి.ఒకప్పుడు ఏదీ లేదు...
2013లో హైదరాబాద్‌ దిల్‌షుఖ్‌నగర్‌ బాంబు కేసు దేశం మొత్తాన్ని కుదిపేసింది. పేలుడులో దొరికిన ఆధారాలని విశ్లేషించే కనీస వసతులూ, పరికరాలూ అప్పట్లో ఇక్కడి పోలీసులకి లేకపోవడం తీవ్రవిమర్శలకి తావిచ్చింది. దాన్నుంచి పాఠాలు నేర్చుకునే ‘క్లూస్‌ టీం’ ఏర్పాటైంది. అలా జీరో నుంచి మొదలైన ఈ బృందం ప్రపంచంలోని వివిధ దర్యాప్తు విధానాలని పరిశీలిస్తూ గత మూడేళ్లలో 40 కోట్ల బడ్జెట్‌తో అత్యాధునిక పరికరాలని తన సొంతం చేసుకుంది. ఇందుకోసం 60 మంది మెరికల్లాంటి యువపోలీసులనీ నియమించింది. ప్రస్తుతం ఇంత అత్యాధునిక వసతులూ, ఇంతమంది సిబ్బంది ఉన్న క్లూస్‌ టీమ్‌ ఆసియాలో ఇదొక్కటేననే గుర్తింపూ సొంతం చేసుకుంది!

- బోరెల్లి సునీల్‌కుమార్‌, ఈనాడు, హైదరాబాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.