close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేనున్నాగా... మీరు చదువుకోండి

నేనున్నాగా... మీరు చదువుకోండి

పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయనకు ఆకలి అనుభవమే. అరకొర సదుపాయాలుండే ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకున్న ఆయనకు విద్యార్థుల ఇబ్బందులూ పరిచయమే. కష్టాలకు ఎదురునిల్చి ఇంజినీరింగ్‌ పూర్తిచేసి వ్యాపారవేత్తగా స్థిరపడిన ఆయనకు చదువు గొప్పతనమూ తెలుసు... అందుకే పేద కుటుంబాలకు చెందిన సరస్వతీ పుత్రులకు అండగా ఉంటూ తమ లక్ష్యాల్ని చేరుకునేలా సాయపడుతున్నారు అందె ప్రతాప్‌ రెడ్డి.మంచి ప్రతిభ, కష్టపడే స్వభావం ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థులెందరో ఉన్నారు. అలాంటివారికి చదువుకునే అవకాశం ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ‘బాలాజీ అమైన్స్‌’ సంస్థ వ్యవస్థాపకుడు అందె ప్రతాప్‌ రెడ్డి. ఆయన పుట్టి పెరిగింది మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని మారుమూల గ్రామం ఖాసింపూర్‌లో. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ప్రతాప్‌రెడ్డి ప్రాథమిక విద్యకోసం అయిదు కిలోమీటర్లు కాలినడకన వెళ్లేవారు. ప్రభుత్వ వసతిగృహంలో ఉండి రామాయంపేట హైస్కూల్లో పదో తరగతి వరకూ చదువుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెనక్కిలాగుతున్నా ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఆపైన ఓ ప్రైవేటు సంస్థలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అయితే సొంత కంపెనీ పెట్టాలన్న ఆలోచనతో ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో 1976లో చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటుచేశారు. దాన్ని హైదరాబాద్‌కూ, మహారాష్ట్రలోని షోలాపూర్‌కూ విస్తరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే బాలాజీ అమైన్స్‌లో ప్రస్తుతం రెండువేల మంది పనిచేస్తున్నారు. సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.600 కోట్లకు పైనే.తిరిగి ఇవ్వాలని...
సమాజంవల్లనే తాను ప్రస్తుత స్థాయికి ఎదగగలిగాననీ, సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాల్సిన బాధ్యత తనమీద ఉందనీ భావించిన ప్రతాప్‌రెడ్డి 2008లో ఏపీఆర్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశారు. కన్నతల్లినీ, పుట్టిన గడ్డనూ మరవరాదనే ఉద్దేశంతో తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచే సేవా కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. తమ గ్రామ సమీపంలోని కల్వకుంట, రజాక్‌పల్లి, చల్మెడ, తిప్పనగుల్ల, రాయిలాపూర్‌ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తిచేసిన నిరుపేద విద్యార్థులను గుర్తించి వాళ్లు ఉద్యోగాలు సాధించే వరకూ సాయం అందిస్తున్నారు. ఏటా ఆరేడుమంది విద్యార్థుల్ని ఇంటర్మీడియెట్‌ చదివిస్తుంటారు. వారికి కావాల్సిన ఫీజులూ, పుస్తకాలూ, వసతితోపాటు వ్యక్తిగత అవసరాలకు పాకెట్‌ మనీ కూడా అందిస్తారు. గత పదేళ్లలో ఏపీఆర్‌ ఫౌండేషన్‌ద్వారా 50 మంది సాయాన్ని పొందారు. వీరిలో సగం మంది ఆడపిల్లలే. ఖాసింపూర్‌ తండాకు చెందిన అరుణ ఇటీవల ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ప్రస్తుతం గైనకాలజీలో పీజీ చేస్తోంది. ‘టెన్త్‌లో మంచి మార్కులు రావడంతో ఓ కార్పొరేట్‌ కాలేజీవాళ్లు  ఇంటర్మీడియెట్‌ ఉచితంగా చదివించారు. మెడిసిన్‌లో 3400 ర్యాంకు వచ్చింది. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. చదివించే స్థోమత లేదు.
ఆ సమయంలో ప్రతాప్‌రెడ్డి సర్‌ ఇచ్చిన ఆర్థిక తోడ్పాటుతో మెడిసిన్‌ పూర్తిచేసి ప్రస్తుతం పీజీ చేస్తున్నాను. సర్‌ మాకు ఒక మార్గదర్శి కూడా. ఆయన జీవితం మా అందరికీ స్ఫూర్తి’ అంటారు డాక్టర్‌ అరుణ. కల్వకుంటకు చెందిన మౌనిక ఈ ఫౌండేషన్‌ సహకారంతోనే ఇంటర్మీడియెట్‌, డిగ్రీ చదువుకుంది. ఆపైన పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికైంది. భవిష్యత్తులో ఎస్సై అవుతానంటారామె. వీళ్లే కాకుండా మరో నలుగురు కూడా ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సంస్థ తోడ్పాటుతో ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, పీజీ చదువుతున్నవాళ్లు ఇరవై మందికి పైగా ఉన్నారు. మరో 20 మంది చదువు పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్ల ఫీజుల్నీ ఫౌండేషన్‌ చెల్లిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు సొంత కాళ్లమీద నిలబడేంత వరకూ అన్ని రకాలా సాయం చేస్తుంది. విద్యార్థులకోసం ఏడాదికి రూ.15లక్షల వరకూ ఖర్చుచేస్తున్న ప్రతాప్‌రెడ్డి... ఫౌండేషన్‌ సాయంతో చదువుకుంటున్న విద్యార్థులతో తరచూ మాట్లాడుతూ వారిలో స్ఫూర్తినింపుతుంటారు.ఇక్కడితో ఆగిపోదు...
సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని 11 ఉన్నత పాఠశాలలకు రూ.13.60 లక్షలతో డ్యూయల్‌ డెస్కులు అందజేశారు ప్రతాప్‌రెడ్డి. కల్వకుంట ఉన్నత పాఠశాలలో నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. తెలంగాణ, మహారాష్ట్రల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఇవి కాకుండా సొంతంగా గ్రామంలో హనుమాన్‌ ఆలయాన్ని నిర్మించారు. పేద కుటుంబాల్లో జరిగే వివాహాలకు మంగళసూత్రాలూ, మెట్టెలతోపాటు వారు కోరిన ఆర్థిక సాయం చేస్తుంటారు. ఇలాంటివి ఎన్నిచేసినా విద్యార్థులకు సాయం చేయడంలోనే తనకు సంతృప్తి ఉంటుందంటారు. ‘కనీసం వందమందికి మా ఫౌండేషన్‌ద్వారా ఉన్నత చదువులకు అవకాశమిచ్చి, వారి కుటుంబాల్ని పేదరికంనుంచి బయటకు తీసుకురావాలనేది నా కోరిక’ అంటారు ప్రతాప్‌రెడ్డి. ఫౌండేషన్‌ద్వారా సాయం పొంది ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా భవిష్యత్తులోనూ ఈ సేవల్ని కొనసాగించేలా వారినుంచి మాట తీసుకుంటున్నారు ప్రతాప్‌రెడ్డి. తద్వారా ఆ సంప్రదాయం తరతరాలు నిలవాలనేది ఆయన ఆకాంక్ష.

- రంగ రాజకిషన్‌, న్యూస్‌టుడే, రామాయంపేట

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.