close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మకు బహుమతి

అమ్మకు బహుమతి
- సింహప్రసాద్‌

నుకోకుండా వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి.
‘‘మనూరు వెళ్దామా అన్నయ్యా’’ అన్నయ్యకి ఫోన్‌లో ప్రతిపాదించాను.
‘‘ఓకే. అమ్మకి చెప్పకుండా వెళ్ళి సర్‌ప్రైజ్‌ చేద్దాం’’ అన్నాడు.
ఆ వెంటనే అక్కయ్యకి ఫోన్‌ చేసి సంగతి చెప్పాను.
‘‘నేనూ వస్తాన్రా. ఈ బాదరబందీలన్నీ వదిలేసి హాయిగా మనింట్లో ఈ మూడు రోజులూ ఎంజాయ్‌ చేద్దాం. చక్కగా రీచార్జి అయి తిరిగివద్దాం’’ అంది ఉత్సాహంగా.
మేం తలొకచోట ఉంటున్నాం. అంచేత ముగ్గురం విజయవాడలో కలుసుకుని కారులో మా ఊరెళ్ళాం.
మా ముగ్గుర్నీ ఒకేసారి చూసి పరమానంద పడిపోయింది అమ్మ. సాధారణంగా మేం ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళం వస్తూంటాం.
‘‘కోడళ్ళనీ పిల్లల్నీ కూడా తీసుకురావాల్సింది. ఏకంగా పెద్ద పండగ ముందుగానే నడిచివచ్చేది’’ చేటంత ముఖం చేసుకుని సంబరంగా అంది.
‘‘అప్పటికప్పుడు అనుకున్నాం అమ్మా. అంతా రావాలంటే రిజర్వేషన్లు ఓ పెద్ద తలనొప్పి వ్యవహారం. వాటితో పెట్టుకుంటే లాభంలేదని మేం బయల్దేరి వచ్చేశాం.’’
‘‘పోనీలే, మీరైనా వచ్చారు’’ అంటూ మాకు కాఫీలిచ్చి అందరి యోగక్షేమాలూ పేరు పేరునా ఆరా తీసింది.
‘‘నాన్న పొలం వెళ్ళారా?’’ అన్నయ్య అడిగాడు.
‘‘ఇదివరకు వరి పండించేవాళ్ళం గనుక ఏడాదికి నాలుగైదు నెలలు ఖాళీ ఉండేది. ఇప్పుడీ రొయ్యల చెరువులొచ్చిపడ్డాక ఇరవైనాలుగ్గంటలూ పనే అనుకో. చిన్నపిల్లల్ని సాకినట్లు సాకాల్సొస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా అవి తేలి, మనల్ని ముంచేస్తాయి’’ అమ్మ నవ్వింది.
అమ్మ నవ్వు ఎంతో అపురూపంగా, మురిపెంగా అన్పించింది. ‘‘నీ నవ్వు భలే బావుంటుందమ్మా. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు నువ్వీ చిరునవ్వు ఆభరణంతో పుట్టి ఉంటావు’’ అన్నాను.
‘‘మొత్తానికి నా చిన్ని కొండవి అన్పించావు’’ అంటూ నా బుగ్గ పొడిచి పెద్దగా నవ్వింది.
ఇంతలో మా నాన్న వచ్చారు. మేం ఆయనతో కబుర్లలో పడ్డాం. అమ్మ వంటపనిలో పడింది. మధ్యమధ్యల్లో పాలేర్ని ఎక్కడెక్కడికో తరుముతూ హైరాన పడుతోంది. అక్క సాయం చేస్తానని వెళ్ళినా ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనివ్వలేదు.
‘‘తెల్లారిలేచింది మొదలు పిల్లల రంధే తప్ప నీకు క్షణం తీరికుండదు పాపం. ఈ రెండ్రోజులైనా సరదాగా గడపవే, ఆటవిడుపుగా ఉంటుంది’’ అక్కతో అంది అమ్మ.
‘‘అమ్మ ఎప్పుడూ ఇంతే. పెళ్ళి కాకముందు అది చెయ్యి, ఇది నేర్చుకో అని వెంటపడేది. ఇప్పుడేమో రెస్టు తీసుకో అంటూ వంటింట్లోకే రానివ్వటం లేదు చూడు’’ వెనక్కొచ్చి నవ్వుతూ చెప్పింది అక్కయ్య.
‘‘అప్పుడు నేర్చుకున్నావు గనుకే బావగారు నీ వంటని లొట్టలేస్తూ తింటున్నారు’’ అన్నాడు అన్నయ్య.
‘‘ఆయనకి హోటల్‌ భోజనం బొత్తిగా నచ్చదన్నయ్యా.’’
అక్క మాటలకు ‘‘నువ్వన్నీ కమ్మగా చేసి పెడుతోంటే ఇంకెలా నచ్చుతుందక్కా!’’ నవ్వాను.
అందరం భోజనానికి పీటలు వాల్చుకుని వరుసగా కూర్చున్నాం.
సున్నుండలు పెట్టింది. తీపి లేకుండా అమ్మ ఎప్పుడూ భోజనం వడ్డించదు.
బాగా కాచిన నెయ్యి పోసి చేసిందేమో సున్నుండలు కమ్మగా ఉన్నాయి. అన్నయ్యకి ఇంకోటి వేసి ‘‘నీకు బాగా ఇష్టం, తినరా’’ అంది. మేం ముందే చేతులు అడ్డు పెట్టేశాం.
‘‘చిన్నోడా, పెదతాతగారింటి నుంచి జున్నుపాలు తెప్పించాన్రా... సాయంత్రానికల్లా జున్ను వండేస్తాను’’ అంది.
ఎగిరి గంతేశాను. ‘‘నేనొచ్చినప్పుడల్లా ఎలాగోలా జున్ను తినిపించక మానదు అమ్మ’’ అభిమానంగా చూస్తూ అన్నాను.
‘‘చిన్నప్పుడు జున్ను వండితే చాలు అంతా నీకే కావాలని కూర్చునేవాడివి. ఎవరికీ పెట్టనిచ్చేవాడివే కాదు’’ మురిపెంగా అంది అమ్మ.
పీతల పులుసు మా కంచాల్లో వడ్డించింది. ‘‘వావ్‌’’ అన్నాడు అన్నయ్య. ఆ కూర అన్నయ్యకి చాలా ఇష్టం.
‘‘ఈ సీజన్లో కూడా పీతలు దొరుకుతున్నాయా!’’ ఆశ్చర్యపోయి అన్నాడు.
‘‘దొరక్కపోతే మీ అమ్మ ఊరుకుంటుందా... చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి మరీ తెప్పించదూ’’ అన్నారు నాన్న.
‘‘పాతపాడు సంత నుంచి తెప్పించాన్రా. అక్కడి పీతలు గుడ్డుతో రుచిగా ఉంటాయి’’ అంది అమ్మ.
‘‘అన్నయ్యకీ తమ్ముడికీ ఇష్టమైనవన్నీ వండావు. నీకెలాగైనా వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం’’ బుంగమూతి పెట్టింది అక్క.
‘‘నీకోసం గడ్డ పెరుగూ, దాలి మీద కాగిన పాలమీది మీగడా విడిగా తీసి పెట్టానే.’’
ఆనందంతో ‘‘మా అమ్మ గ్రేట్‌’’ అంది వెంటనే అక్క.
‘‘చిన్నప్పుడు దాలి మీద పాలు మరుగుతుండగానే మీగడ చేత్తో తీసుకుని తినేసేదానివి, ఎలా మర్చిపోతాను చెప్పు.’’
‘‘అందరి ఇష్టాలూ అభిరుచులూ అన్నీ అమ్మకు తెలుసు’’ అన్నాను.
‘‘అమ్మ అంటేనే అన్నీ తెలిసినది అని అర్థంరా. మా పిల్లల ఇష్టాయిష్టాలూ,
మీ బావగారి ఇష్టాలూ నాకు తెలీవూ’’ గొప్పగా అంది అక్క.
‘‘మీ అమ్మలందరికీ సాష్టాంగ నమస్కారంగానీ ముందు మమ్మల్ని తిననీవే అక్కా’’ పీత కాలు కొరకడానికి నానా తంటాలూ పడుతూ అన్నాడు అన్నయ్య.
చానాళ్ళ తర్వాత కడుపు ఎరువు తెచ్చుకుని మరీ తినేశాం.
‘‘ఈ మూడ్రోజులకీ మూడు కిలోల బరువు పెరగటం ఖాయం. తిరిగెళ్ళాక రోజుకో గంట చొప్పున నెల రోజులపాటు జిమ్‌కెళ్తేగానీ ఈ కొవ్వు కరగదు’’ నవ్వాను.
‘‘ఛా, అవేం మాటల్రా. నా దిష్టే తగుల్తుంది.’’
‘‘బిడ్డలకి తల్లి దిష్టి ఉండదులేవే’’ నాన్న నవ్వారు.
ఓ కునుకు తీసి లేచేసరికి పకోడీల వాసన గుప్పుమని తగిలింది.
అన్నయ్యకి పళ్ళ బాధ ఉంది. అందుకని వాడికి మెత్తని పకోడీలూ నాకూ అక్కకీ కరకర పకోడీలు ఇష్టమని అవీ చేసింది.
వాటినో పట్టుపట్టి టీ తాగాం.
‘‘ఈమధ్య మావయ్యకి ఒంట్లో బావోటం లేదురా. ఒకడుగువేసి రండి, సంతోషిస్తాడు’’ అంది అమ్మ.
మావయ్యావాళ్ళదీ మా ఊరే. చెరువు అవతలి వీధిలో ఉంటారు.
ముగ్గురం బయల్దేరాం. మావయ్యకి ఇష్టమని ఇన్ని రొయ్యలు ఆగిలేసి ఇచ్చింది. సున్నుండలూ పకోడీలూ పొట్లం కట్టి ఇచ్చింది.
‘‘అన్నగారు చెల్లెలికి పండక్కైనా జానెడు రవికెలగుడ్డ పెట్టడు. చెల్లెలు మాత్రం అన్నగారికి అదిష్టం ఇదిష్టం అని సారెలు పంపుతుంది’’ నవ్వుతూ చురకవేశారు నాన్న.
‘‘మీకు అక్కో చెల్లెలో ఉంటే మీకు ఈనాములు పంపేది కాదూ’’ నవ్వుతూ జవాబిచ్చింది తప్ప, కోపం తెచ్చుకోలేదు అమ్మ.
మమ్మల్ని చూసి మావయ్య, అత్తయ్య తెగ సంబరపడ్డారు.
‘‘మా తాయారు వట్టిచేతుల్తో పంపదు. ఏం పంపిందో చూడవే’’ అన్నాడు మావయ్య అత్తతో.
‘‘టైగర్‌ రొయ్యలు పంపింది.’’
మావయ్య పొంగిపోయాడు. ‘‘మసాలా ఎక్కువేసి ఇగురు వండు. నూనె కొంచెం ఎక్కువే వేయి. కూర ఊటూటలాడుతూ తాయారు వండినట్లు ఉండాలి...’’ అంటూ ఎన్నో సూచనలిచ్చాడు.
వద్దు వద్దంటున్నా వినకుండా టీ ఇచ్చింది అత్త.
‘‘మీ ముగ్గురూ కట్టకట్టుకుని వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే ఉండి ఉంటుంది.’’
మావయ్య మాటలకు మధ్యలో అడ్డొచ్చింది అత్త ‘‘రేపు తొలి ఏకాదశి అండీ, తాయారు పుట్టినరోజు.’’
ఉలిక్కిపడి ముఖాముఖాలు చూసుకున్నాం.
‘‘అమ్మ తొలి ఏకాదశి రోజున పుట్టిందా, మాకు తెలీదే’’ అన్నాను.
‘‘ఎలా తెలుస్తుందిలేరా. ఇప్పుడంటే పుట్టిన తేదీలు రాసి పెట్టుకుంటున్నారుగానీ ఇదివరకన్నీ తిథుల లెక్కలే. లేకపోతే ఫలానా పండక్కి ఇన్ని రోజులు ముందో వెనుకో అని కొండ గుర్తులు పెట్టుకునేవారు’’ అన్నాడు మావయ్య.
తిరిగి వస్తుండగా ‘‘రేపు అమ్మ బర్త్‌డే సెలబ్రేట్‌ చేద్దాం’’ అన్నాను.
‘‘గుడ్‌ ఐడియా, రేపు భీమవరం వెళ్ళి కేకు కొని తెద్దాం’’ అన్నాడు అన్నయ్య.
‘‘అమ్మకి చెప్పొద్దు, చెబితే వెళ్ళనివ్వదు’’ అంది అక్క.
ఓకే అంటే ఓకే అనుకున్నాం.
మర్నాడు మేం లేచేసరికి అమ్మ పూజ అయిపోయింది. ‘‘ఇవాళ తొలి ఏకాదశిరా’’ అంటూ క్షీరాన్నం, బొబ్బర్ల వడలూ చేసి పెట్టింది.
‘‘మేం టౌన్‌కెళ్ళి ఓ గంటలో వచ్చేస్తాం అమ్మా’’ అన్నయ్య చెప్పాడు.
‘‘మావుళ్ళమ్మ గుడికెళ్ళి దణ్ణం పెట్టుకురండి’’ అంది. తలలూపాం.
నాన్నని అడిగి అయిదువేలు తెచ్చి అన్నయ్య చేతికిస్తూ అంది ‘‘మూడు చీరలు కొనుక్కురండి, కోడళ్ళకీ అమ్మాయికీ. వరలక్ష్మీ వ్రతానికి కట్టుకుంటారు.’’
అంతటితో ఆగలేదు. ఏ రకం చీరలు కొనాలో, ఎవరికేయే రంగుల చీరలున్నాయో ఏకరువు పెట్టింది. ఎవరికే రంగు చీర కొనాలో కూడా తనే చెప్పింది.
‘‘నాకేయే రంగుల చీరలున్నాయో నాకే గుర్తులేవు, నీకెలా గుర్తుందమ్మా’’ బోలెడు ఆశ్చర్యపోతూ అడిగింది అక్క.
గుంభనంగా నవ్వింది అమ్మ.
‘‘ఈ చీర ఎప్పుడు కొన్నానో చెప్పు చూద్దాం’’ కట్టుకున్న చీర చూపిస్తూ చిలిపిగా అడిగింది.
‘‘నువ్వు కొనుక్కోలేదు. చిన్నోడు గృహప్రవేశానికి నీకు పెట్టాడు.’’
అంతా మిడిగుడ్లేసుకుని చూశాం. అది అయిదేళ్ళనాటి ముచ్చట!
భీమవరం వెళ్తూ దారిలో అన్నాను
‘‘బర్త్‌డే సందర్భంగా అమ్మకి ఏదైనా
బహుమతి కొనిద్దాం అన్నయ్యా.’’
‘‘గుడ్‌ ఐడియా, ఏం కొందాం? అమ్మకేం ఇష్టం?’’
గంటసేపు గుంపు చింపులు పడ్డాంగానీ అమ్మకేం ఇష్టమో తెలుసుకోలేకపోయాం.
‘‘చిత్రంగా లేదూ. మనందరికీ ఏమేం ఇష్టమో అమ్మకు తెలుసు. అమ్మకేం ఇష్టమో మనకి తెలీదు’’ వ్యాఖ్యానించాను.అవునన్నట్లు తలలాడించారు అన్నయ్యా అక్కయ్యా.
ఎందుకైనా మంచిదని నాన్నకి ఫోన్‌ చేసి అడిగాం.
‘‘అదీ ఇదీ అని లేదురా. ఏది తెచ్చినా ఇష్టమే అని సంబరపడిపోతుంది. ఫలానాది కావాలని ఎప్పుడూ అడగలేదు’’ అన్నారు నాన్న.
మావయ్యని అడిగాం.
‘‘మీ అమ్మకి ఏ కూర, ఏ తీపి ఇష్టమో కూడా చెప్పలేన్రా. చిన్నప్పుడు మాత్రం ఎక్కడెక్కడ్నుంచో రకరకాలు పూలు కోసుకొచ్చి ఎంతో ఇష్టంగా పూజలు చేసేది.’’
‘‘కనీసం చీర ఇష్టమో, నగ ఇష్టమో, లేక ఇంకేదైనా ఇష్టమో చెప్పలేవా మావయ్యా?’’
‘‘ఊహు. నాకేం గుర్తు రావట్లేదురా.’’
నిట్టూర్చాం. ‘‘మరేం బహుమతి ఇద్దాం?’’తర్జనభర్జనపడ్డాం.
కడకి మధ్యేమార్గంగా చీర కొందామని డిసైడయ్యాం. బట్టల షాపుకెళ్ళి ముగ్గురాడవాళ్ళకీ అమ్మచెప్పిన రంగుల్లో చీరలు కొన్నాం.
‘‘అమ్మకి ఏ రంగు చీర కొందాం... ఏ రంగు ఇష్టం... అసలు అమ్మకు లేని రంగు ఏది?’’
అక్క వంక ఆశగా చూశాం. పెదవి విరిచింది.
అమ్మ తెల్లగా ఉంటుంది కనుక డార్క్‌బ్రౌన్‌ చీర బావుంటుందని కొన్నాం.
దారిలో కేకు కొని ఇంటికి తిరిగి వచ్చాం.
‘‘ఇంతసేపూ ఎక్కడ తిరుగుతున్నార్రా.
ఆకలేయటం లేదూ, త్వరగా కాళ్ళు కడుక్కురండి, అన్నాలు వడ్డించేస్తాను’’ తొందరపెట్టింది అమ్మ.
‘‘దానికన్నా ముందు చిన్నపని ఉందిగానీ, నువ్విలా రా అమ్మా...’’
అమ్మనీ నాన్ననీ పిలిచి టేబుల్‌ మీద కేక్‌ అమర్చాం.
‘‘కేక్‌ కట్‌ చెయ్యమ్మా’’ ప్లాస్టిక్‌ చాకు అందిస్తూ అన్నాం.
‘‘ఇవన్నీ ఇప్పుడెందుకురా... నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి?’’
‘‘ఇప్పుడే పుట్టావు కదమ్మా’’ అంటూ బలవంతాన కేక్‌ కట్‌ చేయించి, ‘‘హ్యాపీ బర్త్‌డే’’ అన్నాం కోరస్‌గా.
అమ్మ ముఖం సిగ్గుతో ఎర్రబడింది.
అమ్మ పేరున మావూళ్ళమ్మకు కుంకుమార్చన చేశామని చెప్పి కుంకుమ, పూలు, గాజులు, ప్రసాదం అందిచ్చాం.
అమ్మ కళ్ళల్లో ఆనందబాష్పాలు మెరిశాయి. మావంక అభిమానంగాచూస్తూ దగ్గరికి తీసుకుంది.
ముగ్గురం కలిసి చీర బహూకరించాం.
‘‘ఇప్పుడిది ఎందుకురా, ఖరీదెక్కువే ఉంటుంది కూడానూ. ఇప్పుడింత డబ్బు పోసి కొనాల్సిన అవసరం ఏముందీ’’ సాగదీసింది అమ్మ.
‘‘ఎప్పుడూ నువ్వు మాకు పెట్టడమేగానీ మేం ఎప్పుడూ నీకు పెట్టలేదుకదమ్మా’’ అంది అక్క.
‘‘చీరలు పెట్టే సందర్భాలు ముందు ముందెన్ని లేవూ!’’
‘‘మనవలూ మనవరాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఎప్పటిమాట. అప్పటికెలా ఉంటామో ఏమో, ఇప్పుడిది తీసుకో’’ నాన్న చెప్పడంతో మరి కాదనలేకపోయింది అమ్మ.
‘‘చీర నీకు నచ్చిందా అమ్మా? నీకేం ఇష్టమో మేమెప్పుడూ తెలుసుకోలేదు. నీకే బహుమతి ఇవ్వాలో తెలీక తల్లకిందులయ్యామంటే నమ్ము. నీకేం ఇష్టం అమ్మా’’ అడిగాను.
‘‘ప్రతిరోజూ ఏదో వేళన ఫోన్‌ చేసి ‘ఎలా ఉన్నావు అమ్మా’ అని నోరారా అడుగుతున్నారు. ఇంతకంటే ఈ వయసులో ఏ అమ్మ అయినా పిల్లల నుంచి ఏం కోరుకుంటుందిరా’’ అంటూ మా నోళ్ళల్లో పెద్దపెద్ద కేకు ముక్కలు కుక్కింది.
మేం తింటూ పెద్దగా నవ్వుతోంటే ‘‘మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఆనందంగా ఉంటే ఇష్టం. మీ ముగ్గురూ ఇలా కలిసికట్టుగా ఉంటే ఇష్టం. మీ సుఖసంతోషాలకన్నా నాకింకేం బహుమతి కావాల్రా’’ అంది అమ్మ.
మాకు నోటమాట లేదు.
అమ్మంటే ఏమిటో బోధపడినట్టూ అమ్మ ప్రేమ తాలూకు విశ్వరూపాన్ని దర్శించినట్టూ... ఓ అద్భుత అనుభూతికి లోనయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.