close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దండాలయ్యా... ఉండ్రాళ్లయా..!

దండాలయ్యా... ఉండ్రాళ్లయా..!

అద్వితీయుడూ ఆనంద స్వరూపుడూ అయిన వినాయకుడు జన్మించిన రోజే వినాయక చవితి. వినాయకుడంటే నాయకుడు లేనివాడనీ తనకు తానే నాయకుడనీ అర్థం. అటువంటి శక్తిసంపన్నుడూ గణాలకూ అధిపతీ ప్రథమ పూజ్యుడూ అయిన పార్వతీసుతుడిని స్మరించినంతనే విఘ్నాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. వేడుక ఏదైనా ప్రథమ పూజ గణనాథుడికే చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాంటి గణపయ్య పుట్టిన రోజంటే (13 వినాయక చవితి) ఊరూవాడా సంబరమే.వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!
మెలితిరిగిన తొండంతో మహా రూపంతో కోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో వెలుగొందే ఓ దేవదేవా, మొదలు పెట్టే ప్రతిపనిలో తోడుగా నిలిచి ఎలాంటి ఆటంకాలూ ఎదురుకాకుండా చూడు తండ్రీ... అంటూ వినాయకుడిని ప్రార్థించిన తర్వాతే ఏ పనినైనా మొదలుపెట్టడం మన సంప్రదాయం. అలాంటి విఘ్నాధిపతి పుట్టింది భాద్రపదశుద్ధ చవితి రోజునే. అందుకే వినాయకచవితిని చిన్నాపెద్దా పేదాగొప్పా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఓ వైభవోపేతమైన పండగలా జరుపుకుంటారు. గణనాథుని రూపం నుంచి వాహనం వరకూ, నివేదన నుంచి నిమజ్జనం వరకూ ఈ పండగలోని ప్రతిదీ విశేషమైందే...
ఎలా పూజించినా...
రాతి వినాయకుడిని పూజిస్తే జ్ఞానం, రాగి విగ్రహాన్ని అర్చిస్తే ఐశ్వర్యం, వెండి గణేశుడిని కొలిస్తే ఆయుష్షు, సువర్ణ మూర్తిని పెట్టుకుంటే సంకల్పసిద్ధీ లభిస్తాయట. అయితే మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను పూజిస్తే వీటన్నింటితోపాటు సకల శుభాలూ ఒనగూరుతాయని గణేశ పురాణం చెబుతోంది. వినాయకుడు బ్రహ్మచారి అన్నది ఒక వాదన. ఆయనకు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారన్నది మరో నమ్మకం. ఈ సిద్ధి, బుద్ధి ఆవిర్భావం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా వారు కేవలం విఘ్నాధిపతి అభయానికి ప్రతిరూపాలే. బుద్ధి లౌకిక జ్ఞానానికీ, సిద్ధి ఆధ్యాత్మిక జ్ఞానానికీ చిహ్నాలు. కొన్ని చోట్ల వినాయకుడి సహితంగా వృద్ధి అనే మరో భార్యనూ పూజించే సంప్రదాయం ఉంది. బాహ్యంలో ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నా వీటన్నింటి అంతరార్థం వినాయకుడి తత్వాన్ని ఆకళింపజేసుకుని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడమే.అపురూపం ఆ రూపం
చాటంత చెవులూ చిన్ని కళ్లూ పెద్ద బొజ్జా... ఇలా చూడటానికి విభిన్నంగా కనిపించే వినాయకుడి రూపంలో ఒక్కో అవయవం ఒక్కో సుగుణానికి ప్రతీక. ఏనుగు తల ఉన్నతమైన ఆలోచనలనీ, చిన్న కళ్లు విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలనీ, పెద్ద చెవులు ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలనీ, పెద్ద బొజ్జ నిశ్చింతగా జీవించమనీ... సూచిస్తాయి. జ్ఞానానికి సరస్వతీ దేవి స్త్రీరూపమైతే వినాయకుడు పురుష స్వరూపం. అందుకనే వ్యాసభగవానుడు భారతాన్ని రచించాలని అనుకున్నప్పుడు, దాన్ని రాయడానికి వినాయకుడు తప్ప మరెవ్వరూ ముందుకు రాలేకపోయారు. అర్థం చేసుకున్నాక కానీ రాయకూడదంటూ వ్యాసుడు నియమాన్ని పెట్టినా గణనాథుడు బెదరలేదు. వ్యాసుడు చెప్పే వేగానికి ఏమాత్రం తగ్గకుండా మహాభారత రచన సాగేందుకు వినాయకుడు తన దంతాన్నే కలంగా మార్చి పంచమవేదాన్ని దిగ్విజయంగా పూర్తిచేశాడు. తల్లికి ఇచ్చిన మాటకోసం తండ్రిచేతిలో హతమై గజముఖుడయ్యాడు. కుమారస్వామితో పోటీపడి తండ్రి గణాలకు అధిపతిగా మారాడు. ఇలా అనేక సందర్భాల్లో వినాయకుడు తన సూక్ష్మబుద్ధిని ఉపయోగించి విజయం సాధించాడు. గెలవాలన్న తపన ఉండాలే కానీ మనలోని లోపాలను అధిగమించడం పెద్ద సమస్యేమీ కాదని లోకానికి చాటిచెప్పాడు.
నెలంతా పండగలే
ఒక్క చవితే కాదు భాద్రపద మాసంలోని ప్రతి తిథీ ప్రత్యేకమే. వినాయక చవితి తర్వాత వచ్చే పంచమి రుషిపంచమి. ఆ రోజు సప్తర్షులను పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయంటారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథుల్లో ఆయా దేవతలను పూజిస్తారు. భాద్రపద ఏకాదశినే పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిల్లుతాడట. అందుకే ఆ రోజుకి, పరివర్తన ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు. ఆ తర్వాతి రోజు వామన జయంతి. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే!  పితృదేవతలకు ప్రీతికరంగా భావించే మహళయపక్షాలూ ఈ మాసంలోనే వస్తాయి.గౌరీపూజైనా లక్ష్మీనోమైనా శివుడి అభిషేకమైనా, మహావిష్ణువు వ్రతాలైనా గణపయ్యను ఒక్కసారి ఆవాహనం చేయందే ప్రారంభం కావు. అలాంటి ప్రథమ పూజ్యుడి పుట్టిన రోజున ఆయన్ను శరణువేడడం సర్వ శుభదాయకం!


జపాన్‌ వినాయకుడు

పాన్‌ బౌద్ధమతంలో కొందరు హిందూదేవతలు వేర్వేరు పేర్లతో కనిపిస్తుంటారు. వారిలో వినాయకుడు ఒకడు. ఆయన్నిక్కడ విఘ్నాలు కలిగించి, తొలగించేవాడిగా చూస్తారు. అతి శక్తిమంతుడు కాబట్టి... తీవ్ర ఉద్వేగాలున్నవాడిగానూ భావించి భయపడుతుంటారు. మనదేశంలోలా వినాయక విగ్రహాలని ఎక్కడా బహిరంగంగా ఉంచరు. ఆలయ అర్చకులు కూడా దగ్గరకు వెళ్లి చూడటానికి సాహసించరు. అర్చకులు మనలాగా స్వామివారికి దగ్గరగా వెళ్ళకుండా విగ్రహానికి దూరంగా ఉండి వజ్రయాన బౌద్ధపద్ధతిలో పూజలు చేస్తారు. వినాయకుణ్ణి ఇక్కడ కాంగిటెన్‌ అని పిలుస్తారు. జపాన్‌ బౌద్ధ పురాణం ప్రకారం... వినాయకుడి తల్లి ఉమ మూడువేలమంది పిల్లలకి జన్మనిచ్చిందట. తన ఎడమవైపు 1500 మంది. వాళ్లలో ప్రథముడు వినాయకుడు. కుడివైపు 1500 మంది. వాళ్లలో ప్రథముడు ఇదాటెన్‌(సుబ్రహ్మణ్యస్వామి). కానీ వినాయకుడు ప్రతికూలతల దేవుడు. విఘ్నాలు కలిగిస్తాడు. కుమారస్వామి మంచిచేతల వేల్పు. వినాయకుణ్ణి మంచిదారిలో నడిపించాలని కుమారస్వామి వినాయకుడి స్త్రీరూపంగా అవతరిస్తాడు! ఆ వినాయకి వినాయకుడిని చేపట్టి అతణ్ణి మంచివాడిగా, విఘ్నాలు దూరం చేసేవాడిగా మారుస్తుంది. అందుకే... వినాయకుడికి (కాంగిటెన్‌)కి సంబంధించిన విగ్రహాలన్నీ ఆడ, మగ వినాయకుల(భిన్న ధ్రువాల) ఆలింగన భంగిమలోనే కనిపిస్తాయి! అన్నట్టు, మన వినాయకుడికి మోదకాలంటే ఇష్టం కదా... అక్కడి గణపయ్యకేమో ముల్లంగి దుంపలంటే ప్రీతి. వాటిని సమర్పించే ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.