close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ అందాల ఓడలో ఓ ఫ్లాట్‌ కొంటారా?

ఈ అందాల ఓడలో ఓ ఫ్లాట్‌ కొంటారా?

ఇంట్లో నుంచి కాలు కదపకుండానే హాయిగా బాల్కనీలో కూర్చునో బెడ్‌రూమ్‌లో పడుకునో... కనుచూపుమేరపరచుకున్న అనంత జలరాశినీ, ఆకాశాన్ని అందుకోవాలని ఆశపడే అలల పొంగుల్నీ చూస్తూ ప్రపంచమంతా పర్యటిస్తూ జీవించగలిగితే- అబ్బ, ఊహించడానికే ఎంత అద్భుతంగా ఉందో కదా! ఆ ఊహ నిజం కావాలంటే విలాసవంతమైన ఆ ప్రపంచంలో ఓ ఫ్లాట్‌ కొనుక్కుంటే చాలు, కడలి కెరటాల సాక్షిగా... ఖండాలన్నీ చూడొచ్చు. అదెలానో తెలుసుకోవాలంటే ఒకసారి ‘ద వరల్డ్‌’ను సందర్శించి తీరాల్సిందే.కొందరికి ప్రపంచమంతా చూడాలని కోరిక. కోట్ల రూపాయల సంపదా ఉంటుంది. కానీ ఇల్లు కదలడం ఇష్టం ఉండదు. బయటకు వెళితే ఇంటిని మిస్సవుతామన్న ఫీలింగో ఏమో ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగొచ్చేద్దామా అనుకుంటారు. అలాగని వెళ్లిన ప్రతి ప్రదేశంలోనూ ఓ ఇల్లు కొనుక్కోలేరుగా... అందుకే ప్రపంచాన్ని చూడాలని ఉన్నా ఓ పట్టాన బయటకు కదలరు. అలాగే మరికొందరికి నీలాల నింగి అన్నా, నీలి కడలి అన్నా తరగని ప్రేమ. నిత్యం ఆ నీళ్ల మధ్యలో పడుకుని నింగిని చూడాలన్న ఆశ. కానీ అది సాధ్యం కాదు కదా. అలాంటి ఇంటి పక్షులూ ఇలాంటి కడలి ప్రేమికుల కోసం రూపొందించినదే ‘ద వరల్డ్‌... రెసిడెన్సెస్‌ ఎట్‌ సీ’... విలాసవంతమైన ఓడ భవంతి.కోట్ల రూపాయల ఫ్లాట్లు!
పన్నెండు అంతస్తుల ఆ ఓడలో 165 అపార్టుమెంట్లు ఉంటాయి. వాటిలో 130 ఫ్లాట్లని శాశ్వత నివాసంకోసం కొనుక్కున్నవాళ్లే. మిగిలిన వాటిని అద్దెకు తీసుకుంటుంటారు. కొన్నింటిని కొందరు కొని, మళ్లీ అమ్ముతుంటారు. అంటే ఇదీ ఓ స్థిరాస్తిలాంటిదే. ప్రస్తుతం ఒక్కో ఫ్లాట్‌ కనీస ధర 7 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల వరకూ పలుకుతోంది. ఫ్లాట్‌కి తగ్గట్లే ఏటా మెయింట్‌నెన్సు కూడా లక్షల రూపాయల్లోనే ఉంటుంది.
ఈ ఓడ భవంతిలో 40 స్టూడియోలూ, 19 స్టూడియో అపార్టుమెంట్లూ, 106 విశాలమైన డబుల్‌, త్రిబుల్‌, సింగిల్‌ బెడ్‌రూము ఫ్లాట్లు సహా ఆరు బెడ్‌రూముల పెంట్‌హౌస్‌ ఒకటి ఉంది. ఇవన్నీ 337 నుంచి 4,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో రకరకాల సైజుల్లో ఉంటాయి. అన్నింటికీ ప్రత్యేక వరండా, లివింగ్‌రూమ్‌, హాలు, కిచెన్‌, బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌ అన్నీ కూడా ఖరీదైన ఫర్నిచర్‌తో ఉంటాయి. సొంతిళ్లవాళ్లు తమకి కావలసినట్లుగా ఫర్నిచర్‌ను ఎప్పటికప్పుడు రీ డిజైన్‌ చేసుకోవచ్చు.సముద్రం ఒడ్డున కట్టిన విల్లాల్ని తలపించే ఈ ఫ్లాట్స్‌లో నివసించేవాళ్లకి మెట్రో నగరాల్లో మాదిరిగానే అన్ని రకాల సేవలూ అందుతాయి. ఓడ సిబ్బంది 280మందికి పైనే. అనేక దేశాల నుంచి వచ్చిన వీళ్లంతా ‘సదా మీ సేవలో’ అన్నట్లు హౌస్‌కీపింగ్‌, కేటరింగ్‌, లాండ్రీ... ఇలా అన్ని రకాల పనులూ చేస్తారు. వైద్య సేవలూ నిరంతరం అందుబాటులో ఉంటాయి. వంట చేసుకోవాలనిపించకపోతే కోరుకున్న వంటకాలను మన ఇంట్లో కళ్లముందే షెప్‌ తయారుచేసి ఇచ్చే ‘కాల్‌ ఎ షెఫ్‌’ సౌలభ్యమూ ఉంది. స్టార్‌హోటళ్లకి ఏమాత్రం తీసిపోని రెస్టరెంట్లూ, టీరూమ్‌లూ గ్రాసరీ దుకాణాలూ ఉంటాయి. ఇతర లగ్జరీ షిప్పుల్లో మాదిరిగానే క్లబ్‌హౌస్‌లూ, స్పా, ఫిట్‌నెస్‌ సెంటర్లూ, బిలియర్డ్స్‌ రూమ్‌, గోల్ఫ్‌, నైట్‌ క్లబ్బులూ, వైన్‌ కారిడార్‌, లైబ్రరీ, థియేటర్లూ, షోరూమ్‌లూ, స్విమ్మింగ్‌పూల్స్‌, వాటర్‌స్పోర్ట్స్‌... వంటివి సరేసరి.పయనించే నావ..!
నిరంతరం ప్రపంచమంతా పర్యటించాలనుకునేవాళ్లకోసం నార్వేకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నట్‌ యు క్లోస్టర్‌కి వచ్చిన ఆలోచనా రూపమే ద వరల్డ్‌. ఫ్లోరిడాకి చెందిన రో మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ దీని నిర్వహణ బాధ్యతల్ని భుజాన వేసుకుంది. సొంతిళ్లు కలిగిన అతిపెద్ద ఓడగానే కాదు, ప్రారంభించినప్పటినుంచీ- అంటే పదిహేనేళ్ల నుంచీ నిరంతరం ప్రయాణించే నౌకగానూ ఇది రికార్డును సృష్టించింది. మహాఅయితే ఓడరేవులో రెండున్నర రోజులు నిలిచి ఉంటుంది. అదీ ఆ ప్రదేశంలో చూడాల్సినవి ఎక్కువగా ఉంటేనే సుమా. లేదంటే నిత్యం కదులుతూనే ఉంటుంది. ఇప్పటికే 900 ఓడరేవుల మీదుగా 150 దేశాలకు పైగానే చుట్టేసిందీ ప్రపంచ నావ. ఏటా కనీసం నలభైకి పైగా దేశాలమీదుగా విహరిస్తుందట.నౌకా జీవనంలో...
విభిన్న దేశాల ప్రజల్నీ భిన్న సంస్కృతుల్నీ తెలుసుకోవాలనుకునేవాళ్లకి ఈ ఓడ ప్రపంచాన్ని మించిన ప్రదేశం లేదేమో. పర్యటించడం ఇష్టమున్నవాళ్లే అందులే నివాసితులు కాబట్టి పక్కింటి వాళ్లంతా మంచి స్నేహితులవుతారు. బోలెడు అనుభవాలనీ పంచుకుంటుంటారు. ఓడ నిర్వహణ కోసం ఫ్లాట్స్‌ ఓనర్లు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వాళ్ల ఆధ్వర్యంలోనే ఈ నౌకా ప్రపంచానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలూ జరుగుతుంటాయి. రెండుమూడేళ్లకోసారి నివాసితుల ఇష్టాన్ని బట్టి ఏ మార్గంలో ప్రయాణించాలనేది ఎంపిక చేసుకుంటుంటారు. ఆ దారిలో ఆయా దేశాల్లో ప్రధానమైన వేడుకలు జరుగుతుంటే ఆగి, వాటిని చూసి మళ్లీ బయలుదేరతారు. ఓడ ప్రపంచంలో అత్యధికులు ఉత్తర అమెరికన్లే. మిగిలినవాళ్లలో ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందినవాళ్లు ఉన్నారు. ఫ్లాట్‌లు కొన్నవాళ్లలో కొందరు ఏడాదికి కనీసం ఓ నాలుగైదు నెలలు ఓడలో గడిపితే, మరికొందరు మాత్రం ఏడాది పొడవునా ఓడలోనే ఉంటుంటారు. ఎప్పుడో తప్ప బయటకు వెళ్లరు. నివాసితుల్లో 35 శాతం యాభై సంవత్సరాల్లోపు వాళ్లూ ఉండటం విశేషం.ఏడాదికోసారి ఓడ సభ్యులంతా సమావేశమై అంతకుముందెన్నడూ చూడని మారుమూల ప్రదేశాన్ని ఎంపికచేసుకుని సాహసయాత్రకు వెళ్తారు. ఈ రకమైన యాత్రలకి బయలుదేరేముందు ఆ ప్రాంతానికి చెందిన అన్ని విషయాలనూ సంస్కృతీసంప్రదాయల్నీ వన్యప్రాణుల సమాచారాన్నీ చరిత్రనూ క్షుణ్ణంగా తెలుసుకుంటారు. సాహసయాత్రల్లో భాగంగా అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌, సాలొమన్‌ దీవులు, పపువా న్యూగినియా... వంటివన్నీ ఇప్పటికే సందర్శించారు ద వరల్డ్‌ పౌరులు. ఈ ఏడాది పర్యటనలో భాగంగా కరీబియన్‌ సాగర జలాల్లో పర్యటిస్తూ దక్షిణ అమెరికా దేశాలని చుట్టుకుంటూ, మధ్యధరా సాగరజలాల్లో విహరిస్తూ డిసెంబరు చివరికి అట్లాంటిక్‌ సముద్రం మధ్యకి అంటే ఆఫ్రికా దక్షిణకొనకి చేరుకుంటుందట. గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే aboardtheworld.com లోకి వెళ్లొచ్చు.‘ఇల్లు కదలకుండానే రోజూ ఓ కొత్త దేశంలో అదీ సముద్రుడి ఒడిలో నిద్రలేవడం... మంచుకొండల్నీ పగడాల దీవుల్నీ రంగురంగుల ఇసుకతీరాల్నీ నిరంతరం ఆస్వాదించడం ఎంత బాగుంటుంది... ఆ అనుభూతే వేరు’ అంటుంటారు ‘ద వరల్డ్‌’ పౌరులు. అది మీకూ సొంతం కావాలంటే ఓ సూట్‌ అద్దెకు తీసుకుంటే సరి!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.