close
ఒక్క అవకాశం... జీవితాన్ని మార్చేస్తుంది!

జేబులో పదిహేడు రూపాయలతో దిల్లీ బస్సెక్కిన సుభాష్‌ చంద్ర జీ-టెలివిజన్‌ లాంటి సంస్థని సృష్టించాడంటే... పద్దెనిమిదేళ్ల వయసులో ఇరవై వేలు అప్పు తీసుకుని ఇంటినుంచి బయల్దేరిన సునీల్‌ మిత్తల్‌ అంత పెద్ద టెలికాం కంపెనీకి అధినేత కాగలిగాడంటే... భారతీయ మల్టీనేషనల్‌ కంపెనీగా ఎదిగిన సన్‌ఫార్మాని దిలీప్‌ షాంఘ్వి పదివేల రూపాయలతో మొదలుపెట్టాడంటే... అవకాశాలను అందిపుచ్చుకోబట్టే! వీరెవరికీ టాటాలూ బిర్లాలతో సంబంధం లేదు. అంబానీలతో బంధుత్వమూ లేదు. మామూలు మధ్య తరగతి కుటుంబాలనుంచి వచ్చి, ఈ స్థాయికి చేరగలిగారంటే, దానికి కారణం... అవకాశాలను కనిపెట్టి స్వయంకృషిని జోడించడమే. అందుకే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం అందుబాటులో లేని రోజుల్లో ప్రారంభించిన చిన్నచిన్న బిజినెస్‌లను నేడు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలుగా విస్తరించగలిగారు.

అవకాశాల్ని సృష్టించుకున్నాడు!
హర్ష్‌ మారివాలా (మారికో ఇండస్ట్రీస్‌)

భారతీయ నిత్యావసర వస్తువుల మార్కెట్‌కి బ్రాండింగ్‌ని పరిచయం చేసి, మార్కెటింగ్‌ సూత్రాల్ని తిరగరాశాడు.
నూనె వ్యాపారం చేసే ఓ కుటుంబంలో పుట్టి పెరిగిన హర్ష్‌ 23 ఏళ్ల వయసులో తండ్రితో వ్యాపార బాధ్యతలు పంచుకోవడం మొదలెట్టాడు. మార్కెట్లో నూనెలు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. అటువంటప్పుడు ఎవరైనా మనం తయారుచేసే నూనె మాత్రమే కొనుక్కోవాలంటే ఏం చేయాలి- బాధ్యతలు తీసుకున్న రెండో రోజు నుంచే ఈ ఆలోచన అతడిని వేధించింది. మార్కెట్లో ఉన్న విదేశీ కంపెనీలన్నీ తమ ఉత్పత్తులకు పేర్లు పెట్టి అమ్ముతున్నాయి. వినియోగదారులు దుకాణానికి వచ్చి ఫలానా సబ్బు కావాలనీ ఫలానా షాంపూ కావాలనీ అడుగుతున్నారు. మరి మనం అమ్మే కొబ్బరినూనెని కూడా అలా అడిగితే... ఆలోచన రావడం ఆలస్యం సరికొత్త సీసాల్లో ప్యారాచూట్‌ సిద్ధమైంది. దాని కోసం ప్రకటనలు కూడా చేయించాడు. కొబ్బరినూనెకు ఒక బ్రాండ్‌ సృష్టించాడు. అప్పట్లో బ్రాండింగ్‌ అనేది దేశీయ వ్యాపారరంగానికి కొత్త. అనవసరంగా డబ్బు వృథా చేస్తున్నాడని విమర్శించిన పెద్దలే ఆశ్చర్యంతో అతడిని మెచ్చుకోడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు హర్ష్‌. తల నూనెలు, వంటనూనెలు, చర్మ సంరక్షణ, దుస్తుల సంరక్షణ... ఇలా వేర్వేరు రంగాల్లో కొత్త కొత్త ఉత్పత్తులతో వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి భారతీయ వ్యాపారవేత్తల సత్తా చాటాడు. తన ప్రస్థానం గురించి మాట్లాడుతూ ‘పోటీ పెద్దగా లేని రంగాన్ని ఎంచుకోవాలి. సరైన పోటీ లేదంటే అక్కడ ఉన్నవారు మార్కెట్‌ని సరిగా అంచనా వేయలేకపోతున్నారనే అర్థం. అదే మనకు కలిసివస్తుంది. మా సంస్థల్ని పరిశీలిస్తే ఆ సంగతి తెలుస్తుంది. ఒకదానితో మరొకదానికి సంబంధమే ఉండదు. అలాగని బ్రాండ్‌ పేరుతో ఏదైనా అమ్మొచ్చనుకుంటే పొరపాటే. వినియోగదారులకు కావలసింది మనం అమ్మే బ్రాండ్‌లో దొరకాలి. అది తెలియాలంటే వినియోగదారు దృష్టినుంచి ఉత్పత్తిని చూసి, లోపాలను సరిచేసుకోవాలి. మరొకరికి అవకాశం ఇవ్వకుండా మనకు మనమే పోటీ కావాలి. ఒక్కోసారి ఓడిపోయినా ఫర్వాలేదు. గెలవడానికి మరో కొత్త ఛాన్స్‌ తీసుకోవచ్చు. అవకాశాన్ని ఉపయోగించుకోడానికి డబ్బు లేదనీ సిబ్బంది లేరనీ సమయం లేదనీ- సాకులు చెప్పేవాళ్లకి నిజంగా దానికి అర్థం తెలియనట్లే. ‘ఏవేవో చేయాలన్న ఆశలుండి డబ్బు లేనప్పుడే సరికొత్త ఆవిష్కరణకి రంగం సిద్ధమవుతుంది’ అంటారు మేనేజ్‌మెంట్‌ గురు సీకే ప్రహ్లాద్‌. డబ్బు అక్కర్లేదు కాబట్టే కొత్తగా ఆలోచించగలిగేవాళ్లు అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. ప్రతి దాన్నీ ప్రయత్నించి చూడాలి. సఫలమైతే గెలుస్తాం, లేకపోతే నేర్చుకుంటాం... అంతే కదా!’ అంటాడు హర్ష్‌.

సమస్యల్లోనే అవకాశాల్ని చూశాడు!
డాక్టర్‌ యూసుఫ్‌ హమీద్‌ (సిప్లా ఛైర్మన్‌):

ఆయన వేసిన ప్రతి అడుగూ భారతీయ మందుల పరిశ్రమ ప్రగతికి ఓ అద్భుత అవకాశంగా మారింది.
సిప్లా... మనదేశంలోని పెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటి. అంత పెద్ద కంపెనీ యజమాని 30 ఏళ్ల పాటు కేవలం 15వేల రూపాయల జీతం తీసుకుని కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఇప్పటికీ ఎంతో నిరాడంబరంగా జీవిస్తాడు. సిప్లా కంపెనీని హమీద్‌ తండ్రి ప్రారంభించాడు. అప్పుడది చాలా చిన్న కంపెనీ. కొడుకుని బాగా చదివించాలని కేంబ్రిడ్జికి పంపాడా తండ్రి. 23 ఏళ్లకే రసాయనశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసి వచ్చిన హమీద్‌ రాగానే తండ్రి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అన్ని పనులూ నేర్చుకున్నాడు. ఫార్మారంగంపైన పూర్తి అవగాహన వచ్చాక పరికించి చూస్తే అన్నీ సమస్యలే. మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులన్నీ దిగుమతి చేసుకోవాలి. పేటెంట్ల చట్టాలు సరిగా లేవు. అసలు తయారీదారులకు ఒక సంఘమంటూ లేదు. తయారైన మందులు ఎగుమతి చేసే అవకాశమూ లేదు.
ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేనేం చేస్తానని విదేశాలకు వెళ్లిపోలేదాయన. ప్రతి సమస్యనీ ఒక అవకాశంగా భావించాడు. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న మందుల తయారీదార్లనందరినీ ఒక్కతాటిమీదికి తెచ్చి ఇండియన్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ను ప్రారంభించాడు. పన్నెండేళ్లు ప్రభుత్వంతో పోరాడి ప్రొడక్ట్‌ పేటెంట్‌ చట్టాన్ని తొలగించేలా చేశాడు. దాంతో భారతీయ కంపెనీలు ఏ మందులైనా తయారుచేసుకుని అమ్ముకునే స్వేచ్ఛని పొందాయి. మందుల తయారీకి అవసరమైన ముడిసరకులనూ స్వయంగా తయారుచేసుకోవడం మొదలెట్టాయి. ఫలితంగా 1970వ దశకంలో 80 శాతం మార్కెట్‌ వాటా విదేశీ మందులదైతే 2000కల్లా దాన్ని 20 శాతానికి తగ్గించి 80 శాతం వాటాని భారతీయ సంస్థలు చేజిక్కించుకున్నాయి. ఇక ఎగుమతుల అవకాశం కోసం ఎఫ్‌డీఏ అనుమతి పొందడానికి హమీద్‌ 11 సార్లు అమెరికా వెళ్లాడు. చివరికి ఒక చిన్న సంస్థ సహకారంతో ఎగుమతులకు అనుమతి లభించింది. అలా భారతీయ ఫార్మా పరిశ్రమకు మైలురాళ్లనదగ్గ మార్పులన్నీ సిప్లా ద్వారానే జరిగాయి.
భారతీయ ఫార్మారంగానికి ఇన్ని అవకాశాలను తీసుకొచ్చిన హమీద్‌ మాత్రం వ్యాపారానికన్నా ముందు మానవీయతకు విలువిస్తాడు. అందుకే ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో అమ్ముడయ్యే ఎయిడ్స్‌ మందుల్లో మూడింట రెండొంతులు సిప్లావే. అవి కూడా విదేశీ మందుల ధరతో పోలిస్తే కొన్ని వందల రెట్లు తక్కువ ధరకే లభిస్తాయి. హమీద్‌ దృష్టిలో సంపద అంటే డబ్బు కాదు- ‘స్వల్పకాలిక లాభాలను త్యాగం చేయగలిగితే, అవిశ్రాంతంగా పనిచేస్తే- అప్పుడూ మనం వ్యాపారంలో విజయం సాధించవచ్చు. ధనవంతులం కావచ్చు. దాంతోపాటూ సమాజానికి శాశ్వతంగా మేలు చేసే పనులెన్నో చేయొచ్చు. ఇష్టమైన రంగంలో ఉన్నత చదువులూ తోటివారిని కలుపుకుని ముందుకు సాగడమూ... సమస్యలను అవకాశాలుగా మార్చుకోగల శక్తినిస్తాయి’ అంటాడు అనుభవంతో హమీద్‌.

అవకాశాల్ని గుర్తించాడు!
రఫీక్‌ మలిక్‌ (మెట్రో, మోచి, ఎంఎస్‌ఎల్‌ రీటైల్‌ బ్రాండ్ల సృష్టికర్త):

చెప్పుల షాపుని గొలుసు దుకాణాలుగా అభివృద్ధి చేసి బ్రాండ్‌గా మార్చిన ఘనత అతని సొంతం.
ఫీక్‌ తండ్రికి ముంబయిలో ఒక చెప్పుల దుకాణం ఉండేది. చదువవగానే తండ్రికి సాయంగా దుకాణానికి వెళ్లేవాడు కానీ ఆయన అజమాయిషీ ధోరణి రఫీక్‌కి నచ్చేది కాదు. అందుకని సొంతంగా మరోషాపు పెట్టాలనుకున్నాడు. అది 1969... రెండోషాపు పెడితే మొత్తం వ్యాపారం దివాలా తీస్తుందన్నది వ్యాపారవర్గాల్లో పాతుకుపోయిన సెంటిమెంటు. తండ్రి కూడా భయపడ్డాడు. కానీ అదే పేరుతో కొత్త ప్రాంతంలో షాపు పెడితే వినియోగదారులూ కొత్తవాళ్లు వచ్చారు. వ్యాపారం పెరిగింది. తండ్రి సంతోషించాడు. మనుషుల నమ్మకాలు మార్పును ఆపలేవు. మార్పుకి చోటు దొరికితే అవకాశం తలుపు తెరుచుకున్నట్లేనని రుజువుచేశాడు రఫీక్‌. అది మొదలు... వినియోగదారుల మనస్తత్వాల్ని కాచి వడపోసిన రఫీక్‌ వ్యాపారంలో ఎన్నో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టాడు. కొత్త కొత్త అవకాశాలను సృష్టిస్తూనే వెళ్లాడు. గొలుసు దుకాణాలన్నీ ఎక్కడికక్కడ పూర్తిగా స్థానిక అభిరుచులను ప్రతిబింబించేలా చూశాడు. అంతా బాగానే ఉంది కానీ లాభాలతో సంబంధం లేనప్పుడు ఉద్యోగికి అమ్మకాలను పెంచాలన్న ఆసక్తి ఎందుకుంటుంది- అందుకని మేనేజర్లకీ లాభాల్లో వాటా ఇచ్చాడు. దాంతో అందరూ బాగా పనిచేసేవారు. ఒక్కోచోట చెప్పుల దుకాణానికి భవనం అద్దెకిచ్చేవారు కాదు. అలాంటిచోట భవన యజమానులకూ వ్యాపారంలో వాటా ఇచ్చాడు. ఇలా ఎక్కడి సమస్యను అక్కడే పరిష్కరిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని వందల స్టోర్లతో విజయపథంలో సాగుతున్నాడు రఫీక్‌. మెట్రోకన్నా ముందు చెప్పుల దుకాణాలున్నాయి కానీ ఎవరూ ఇలా బ్రాండు స్థాయిలో పేరు తెచ్చుకోలేదు. మనదేశంలో వందకిలోమీటర్లు దాటితే ఆహారపుటలవాట్లు మారిపోయినట్లే ఫ్యాషన్లూ మారిపోతాయంటాడు రఫీక్‌. అందుకే ఎక్కడ దుకాణం పెడితే అక్కడి వినియోగదారుల అభిరుచులను కనిపెట్టగలగాలనీ అదే మెట్రో విజయరహస్యమనీ చెబుతాడు.
రఫీక్‌ దృష్టిలో అవకాశం అంటే నెమ్మదిగా వచ్చే మార్పు. ‘ఆ మార్పుని చూసి భయపడితే వెనకపడిపోతాం. కొత్త అవకాశంగా భావిస్తే ముందుకెళతాం. అవకాశం ఓ పర్వతం కాదు ఎదురుగా కనపడడానికి. గులకరాళ్లలాగా మన చుట్టూ పడుంటాయి లెక్కలేనన్ని అవకాశాలు. మనం చదివినదాంట్లోనో, విన్నదాంట్లోనో, ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడో... అది మన ముందుకు వస్తుంది. పిల్లలు తమకు తెలియని మాట విన్పిస్తే దాని అర్థం తెలుసుకునేదాకా నిద్రపోరు. అంత ఉత్సాహం మనలోనూ ఉంటేనే అవకాశాలను గుర్తించగలుగుతాం. కొత్తవి నేర్చుకోవడానికీ చేయడానికీ ఆసక్తి లేనివారికి కొత్త దారులూ కన్పించవు. ప్రతిసారీ కొత్తపనే కానక్కర్లేదు. ఒక్కోసారి పాత పనినే కొత్తగా కూడా చేయొచ్చు’ అంటాడు రఫీక్‌. అక్వేరియంలో ఉన్న చేపకి ఎంతసేపు ఈదినా ఆ కొంచెం నీరే. అయినా అది ఎన్ని కోణాల్లో ఈదుతుంటుందో... కాసేపు వేగంగా, కాసేపు మెల్లగా.. అలా చూస్తూ ఉంటే చేప గురించి మనకు తెలియని ఎన్నో కోణాలు కన్పిస్తుంటాయనే రఫీక్‌కి ఆ చేపే ఆదర్శమట. అవకాశాలు కూడా చేపలాగానే చూసే కొద్దీ కొత్తకొత్తగా కన్పిస్తాయట.

అవకాశాన్ని వెదికి పట్టుకున్నాడు!
విఠల్‌ కామత్‌ (ఆసియాలో తొలి ఎకోటెల్‌ ‘ద ఆర్కిడ్‌’ యజమాని):

హోటళ్ల రంగంలో ‘కామత్‌’ అన్న పేరుని బ్రాండ్‌గా మార్చిన వ్యాపారవేత్త.
ఇంజినీరింగ్‌ చదివిన విఠల్‌ అనుకోకుండా తండ్రి నడుపుతున్న హోటల్‌లో పనిచేయాల్సివచ్చింది. ఎంతో పరిశుభ్రంగా ఉండడమే కాక వేగంగా సప్లై చేయడంతో ఆ హోటల్‌కి మంచి పేరొచ్చింది. ఆ పేరును ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్నాడు విఠల్‌. చక్కని ప్రణాళిక సిద్ధంచేసుకుని కామత్‌ హోటళ్ల చెయిన్‌కి శ్రీకారం చుట్టాడు. రోజుకు 20 గంటలు పనిచేస్తూ నెలకో కొత్త రెస్టరెంట్‌ చొప్పున 50 చోట్ల రెస్టరెంట్లను ప్రారంభించాడు. ఎలా అని- ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నవారికి అర్థం అవడానికి కొన్నాళ్లు పట్టింది. ఆ రోజుల్లో పలు నగరాల్లో ఒకటీ రెండు పెద్ద హోటళ్లు మినహాయిస్తే మిగిలినవన్నీ చిన్న ఇరానీ చాయ్‌ దుకాణాలే. అవి వరసగా మూతబడుతున్న విషయాన్ని గుర్తించిన విఠల్‌ పరిస్థితిని తనకు అనువుగా మార్చుకున్నాడు. కామత్‌ హోటళ్ల విస్తరణ అయిపోయింది. తర్వాతేమిటి? చిన్న హోటళ్లున్నాయి, ఐదు నక్షత్రాల పెద్ద హోటళ్లున్నాయి. మధ్యలో ఏమీ లేవు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌ దగ్గర అమ్మకానికున్న నాలుగు నక్షత్రాల హోటల్‌ని కొని కామత్‌ ప్లాజాగా మార్చి ఆ ఖాళీనీ తనే భర్తీచేశాడు. తర్వాత దాని స్థానంలో ఆసియాలోనే తొలి ఫైవ్‌స్టార్‌ ఎకోటెల్‌ని కట్టాలనుకున్నాడు విఠల్‌. ‘ఎకో ఫ్రెండ్లీ హోటలా... విఠల్‌కి విజయం తాలూకు పొగరు బాగా తలకెక్కింది’ అనుకున్నారు జనాలు. విఠల్‌ పట్టించుకోలేదు. వందకోట్లు అప్పు చేశాడు. ఇంతలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పునాదులు సరిగాలేక కామత్‌ ప్లాజా కూలిపోయింది. సోదరులు ఆస్తులు పంచుకుని విడిపోయారు. దాంతో అప్పూ ఆర్కిడ్‌ ప్లానూ మాత్రం విఠల్‌కి మిగిలాయి. మరో పక్క తండ్రికి క్యాన్సర్‌. అందరూ అతడి పని అయిపోయిందనే అనుకున్నారు. ఆ స్థలాన్ని అమ్మేసి అప్పులు తీర్చి ఉద్యోగం చేసుకోమని సలహాలిచ్చారు. కానీ విఠల్‌ పట్టుదల ముందు సమస్యలే తలవంచాయి. ఒకప్పుడు ఆయన హోటళ్లలో కస్టమర్లుగా సేవలందుకున్నవారు బ్యాంకుల్లో పెద్ద హోదాల్లో ఉన్నారు. విఠల్‌ మీద నమ్మకంతో వారు చేతనైన సాయం చేసి ఆదుకున్నారు. దాంతో మళ్లీ శక్తులన్నీ కూడదీసుకుని ఆర్కిడ్‌ని పూర్తి చేశాడు విఠల్‌. ఇప్పుడు ప్రపంచంలోని బెస్ట్‌ హోటల్స్‌లో ఆర్కిడ్‌ ఒకటి. అదే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో హెరిటేజ్‌, ప్యాలస్‌ హోటళ్లు; రిసార్టులు, లగ్జరీ బిజినెస్‌ హోటళ్లూ కట్టడంతోపాటు తన జయాపజయాల గురించి ఆత్మకథ కూడా రాసుకున్న వ్యాపారవేత్త విఠల్‌ కామత్‌.
‘వ్యాపారరంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునేవారికి నేను చెప్పే ఫార్ములా- ‘మ్యాప్‌, గ్యాప్‌, ట్యాప్‌’. మార్కెట్‌ని పరిశీలించాలి. అక్కడ ఉన్నదేంటో, వినియోగదారుడు కోరుకుంటున్నదేమిటో తెలుసుకోవాలి. ఆ రెంటి మధ్య ఉన్న ఖాళీనే మనకు లభించే అవకాశం. దాన్ని ఉపయోగించుకునేందుకు మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని నమ్మకమైన సిబ్బందిని తయారుచేసుకుంటే డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ- ఈ మూడిటికీ ప్లానింగ్‌ తోడైతే విజయం మన వెంటే ఉంటుంది‘ అంటాడు విఠల్‌.

సహనంతో అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు!
నిర్మల్‌ జైన్‌ (ఐఐఎఫ్‌ఎల్‌):

 రెండు దశాబ్దాలు, లెక్కలేనన్ని ఒడుదొడుకులు... ఓపిగ్గా పోరాడాడు. ఇప్పుడు దేశవిదేశాల్లోని వేలాది సంపన్న కుటుంబాలకూ, సంస్థలకూ తమ సంపదని ఎలా పెంచుకోవాలో సలహాలిస్తున్నాడు.
నిర్మల్‌ ఎంబీయే, సీఏ చదివి హిందూస్థాన్‌ లీవర్‌లో ఉద్యోగంలో చేరాడు. వ్యాపారానికి సంబంధించి మంచి అవగాహన సంపాదించాడు. ఆరేళ్లలో సంస్థకి అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. ఇంతలో దేశంలో మొదలైన సంస్కరణలు అతడిలోని ఆర్థికవేత్తను తట్టిలేపాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ చేసే సంస్థను పెట్టాడు. ఆ పరిశోధనా నివేదికలను వ్యాపారసంస్థలకు అమ్మేవాడు. తొలిరోజుల్లోనే ఏకంగా కోట్లలో ఆదాయం వచ్చింది. కానీ కొన్నాళ్లకే స్టాక్‌ మార్కెట్‌ కుదేలవడంతో సమాచారాన్ని కొనేవాళ్లు తగ్గిపోయారు. మరో పక్క ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో ఒక్కరు సాఫ్ట్‌కాపీ కొనుక్కుని వందమంది పంచుకునేవారు. దాంతో విసిగిపోయిన నిర్మల్‌ డేటాను వృథా చేయడమెందుకని అందరికీ అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్‌లో పెట్టాలనుకున్నాడు. అది తెలివితక్కువ పనంటూ భాగస్వాములు వదిలి వెళ్లిపోయారు. నిర్మల్‌ బెదిరిపోలేదు. మరొకరితో కలిసి అప్పు చేసి ఇండియాఇన్ఫోలైన్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ పెట్టాడు. ఒక్క ఈమెయిల్‌ ఇస్తే చాలు సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చంటూ పేపర్లో ప్రకటించాడు. మూడులక్షల మెయిల్స్‌ వచ్చాయి. ఆ స్పందన ఆధారంగా ఆన్‌లైన్‌లోనే ఏమన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. నిధులు సేకరించి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ పెట్టాడు. అదే సమయంలో డాట్‌కామ్‌ బబుల్‌ సమస్య వచ్చింది. పువ్వు పక్కనే ముల్లులా ప్రతి అవకాశానికీ పక్కనే ఓ అవరోధం ఎదురయ్యేది. అలాంటి పరిస్థితుల్లోనుంచి ఇప్పుడు బిలియనీర్‌ బిజినెస్‌మ్యాన్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నిర్మల్‌ ఆ ప్రయాణాన్ని వివరిస్తూ... ‘మేం నిలదొక్కుకోవడానికి పదేళ్లు పట్టింది. ఈలోపల ఎన్నోసార్లు పూర్తిగా మునిగిపోయాం. అన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి మర్యాదగా బయటపడదామనుకున్నాం. ఓసారి అమ్మకానికి రెడీ అయ్యాం కూడా. కానీ చివరినిమిషంలో బేరం చెడింది. దాంతో మళ్లీ సీరియస్‌గా పనిచేసి ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ సేవల్ని బాగా పెంచాం. ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దాం. అప్పుడే స్టాక్‌ మార్కెట్‌ కూడా ఊపందుకోవడంతో మా దశ తిరిగింది. సహనమే మమ్మల్ని గెలిపించింది. అవకాశమూ తెలివీ ఉన్నా సమయం సరైనది కాకపోతే అన్నీ వృథానే అని అనుభవంతో తెలుసుకున్నా’నంటాడు నిర్మల్‌.

‘ఆయనకేం... నోట్లో వెండి చెంచాతో పుట్టాడు‘,
‘ఈయన పట్టిందల్లా బంగారమైంది’ అంటుంటారు వ్యాపారంలో పైకి వచ్చిన వారిని చూసి.
కానీ, ఇక్కడ మనం చెప్పుకున్న వాళ్లెవరూ నోట్లో వెండి చెంచాతో పుట్టలేదు,
పట్టిందల్లా బంగారమూ కాలేదు. మనందరిలాగే అతి సామాన్యులు. కాకపోతే వీళ్ళందరూ తమ చుట్టూ ఉన్న అవకాశాలను శోధించారు... పరిస్థితులతో పోరాడారు. స్వయంకృషితో విజయాన్ని సాధించారు!
ఆ క్రమంలో వారు పడ్డ కష్టాలే యువతకు స్ఫూర్తి పాఠాలవుతున్నాయి. పట్టుదల సడలకుండా వారు చేసిన ప్రయత్నాలే సత్తా చాటమంటూ రేపటి తరానికి ప్రేరణ ఇస్తున్నాయి. అంతకన్నా ఏం కావాలి... నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.