close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌

నా లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌

ఆసియా క్రీడల్లో కచ్చితంగా పతకం తెస్తాడనుకున్న కుస్తీ యోధుడు సుశీల్‌ కుమార్‌ వట్టి చేతులతోనే తిరిగొచ్చేశాడన్న వార్త విన్న క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కానీ తర్వాత కొన్ని గంటలకే యువ కెరటం బజరంగ్‌ స్వర్ణం గెలిచి అందరిలో ఉత్సాహం నింపాడు. ఈసారి ఏసియాడ్‌లో భారత్‌కు మొదటి స్వర్ణం అందించిన బజరంగ్‌ పూనియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

నాన్న అడుగుజాడల్లో...
బజరంగ్‌ది హరియాణాకు చెందిన వ్యవసాయ కుటుంబం. తండ్రి బల్వాన్‌ సింగ్‌... పహిల్వాన్‌. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న 24 ఏళ్ల బజరంగ్‌... ఏడేళ్లనుంచే కుస్తీలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. అతడి ఆసక్తిని గమనించి పదమూడేళ్లపుడు ప్రఖ్యాత ‘మహాబలి సత్పాల్‌ అఖాడా’లో చేర్పించారు.

యోగేశ్వర్‌ శిష్యుడు...
ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌దత్‌ను గురువుగా భావిస్తాడు. సత్పాల్‌ అఖాడాలో యోగేశ్వర్‌తో కలిసి ప్రాక్టీసు చేస్తూ కుస్తీకోసం ఎన్ని త్యాగాలు చేయాలో, ఎంత కష్టపడాలో చూస్తూ వాటన్నింటికీ మానసికంగా సిద్ధమయ్యాడు. 19 ఏళ్లకే 60 కిలోల విభాగంలో ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని కాంస్య పతకం గెలిచి మొదటిసారి తన ఉనికిని చాటాడు బజరంగ్‌. 2014లో ఆసియా క్రీడలూ, కామన్వెల్త్‌ పోటీల్లో 61 కిలోల విభాగంలో రజతాలు గెలిచిన బజరంగ్‌కు కేంద్ర ప్రభుత్వం 2015లో అర్జున అవార్డు అందించింది. 2016 నుంచి 65 కిలోల విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

సొంతూరు విడిచి...
సొంతూరు హరియాణా, జజ్జర్‌ జిల్లాలోని ఖుద్దన్‌ను విడిచి బజరంగ్‌ కుటుంబం 2015లో సోనేపట్‌కి వచ్చింది. శాయ్‌ అకాడమీలో దొరికే మెరుగైన శిక్షణ కోసమే బజరంగ్‌ ఇక్కడికి మారాడు. ఇప్పటికీ బజరంగ్‌ గెలిచినపుడల్లా ఖుద్దన్‌లో మిఠాయిలు పంచుతూ, మతాబులు కాల్చుతూ సంబరాలు చేసుకుంటారు గ్రామస్థులు.

ఆట మారింది...
ఓడిపోతాననే ఆలోచన వస్తే కచ్చితంగా ఓడిపోతాను, కాబట్టి పోటీలో ఏ దశలోనూ అలాంటి ఆలోచన రానివ్వనంటాడు. ‘ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌’ దేశంలో రెజ్లింగ్‌ స్థాయిని మార్చేసిందంటాడు బజరంగ్‌. విదేశీ ఆటగాళ్ల ఆటతీరుని తెలుసుకునే అవకాశం ఇచ్చిందనీ, ఆర్థికంగా చూస్తే కొత్తవాళ్లకు ఉపయోగపడుతోందనీ చెబుతాడు. కొత్త కోచ్‌ షాకో బెన్‌టినిడిస్‌కు తన విజయాల్లో ముఖ్య పాత్ర ఉందంటూ... ‘ఆయన దగ్గర శిక్షణ మొదలుపెట్టాక నా ఆటలో టెక్నిక్‌, వేగం పెరిగాయి. ఈ ఏడాది నాలుగు స్వర్ణాలు గెలిచాను’ అని గుర్తుచేస్తాడు.

ఆలూ పరాఠా తయార్‌...
బజరంగ్‌ ఆలూ పరాఠాని పెరుగూ, నెయ్యితో ఇష్టంగా తింటాడని చెబుతుంది... తల్లి రామ్‌ప్యారీ. ఎప్పుడు పోటీలకు వెళ్లి తిరిగొచ్చినా కొడుకు కోసం ఆలూ పరాఠా సిద్ధంచేసి పెడుతుందామె. ‘బజరంగ్‌‌, మా కుటుంబానికే కాదు, రాష్ట్రానికీ, దేశానికీ పేరు తెస్తున్నాడు’ అని గర్వంగా చెబుతారామె.

ఉద్యోగం కావాలి...
కెరీర్‌ ప్రారంభంలో రైల్వేలో టీటీఈగా పనిచేసిన బజరంగ్‌ తర్వాత ఆటకోసం ఆ ఉద్యోగం వదులుకున్నాడు. ‘పతకం తీసుకురండి, ఉద్యోగం పొందండి’ అని పిలుపు ఇచ్చిన హరియాణా ప్రభుత్వం ఎన్ని పతకాలు తెచ్చినా తాను కోరుతున్న డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడంలేద’ని అసంతృప్తితో ఉన్నాడు. కానీ అలాంటి విషయాలు తన ఆటమీద ప్రభావం చూపవంటాడు.

లక్ష్యం... టోక్యో 2020
2018 ఏషియన్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జపాన్‌ ఆటగాడు దైచీ టకటానీ చేతిలో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్న బజరంగ్‌... ఆసియా క్రీడల్లో అదే ఆటగాణ్ని ఓడించి స్వర్ణం గెలిచాడు. ‘నా కెరీర్‌లో ఇదే అత్యుత్తమ స్వర్ణం. ఇదే విభాగంలో 2014లో యోగీ భాయ్‌ స్వర్ణం తెచ్చాడు. ఈసారి ఆ బాధ్యత నాపైన ఉందని పోటీలకు ముందు చెప్పాడు. తప్పక తెస్తానని మాటిచ్చాను’ అని చెబుతాడు. త్వరలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం ప్రాక్టీసు చేస్తున్న బజరంగ్‌... ‘టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే తన తదుపరి లక్ష్యం’ అంటాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.