close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ అమ్మాయిలకి 50 శాతం రిజర్వేషన్‌!

అక్కడ అమ్మాయిలకి 50 శాతం రిజర్వేషన్‌!

ఆ బడిలో బోధన డిజిటల్‌ పద్ధతిలోనే ఉంటుంది. 23 మంది విద్యార్థులకి ఒక టీచర్‌ చొప్పున ఉంటారు. వీటన్నింటితో పదోతరగతిలో వందశాతం ఫలితాలు సాధిస్తున్నారు. పిల్లలు సరళంగా ఆంగ్లం నేర్చుకునేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగిస్తున్నారు. ఇన్నున్నా ఇక్కడ నెలవారి ఫీజు మొత్తం కలిపి నూటయాభై రూపాయలు దాటదు. కాకపోతే నిరుపేద పిల్లల్నే చేర్చుకుంటారు. అమ్మాయిలకి 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న ఆ బడి పేరు ఉద్భవ్‌!

దేళ్లకిందటిమాట. రసూల్‌పురా మురికివాడకి చెందిన చిన్నారుల కోసం ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ సంస్థ రిపబ్లిక్‌ స్కూల్‌ని ప్రారంభించింది. నెలకి కేవలం పాతిక రూపాయల ఫీజుతో మొదలైన ఆ బడి కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులకి వరంగా మారింది. ఐదేళ్లపాటు బాగానే నడిచింది. ఆ విద్యాసంస్థ 2012లో ఓ పెద్ద కుదుపుకి లోనైంది. ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ఎన్‌జే యశస్వి మరణంతో బడికి నిధుల రాక నిలిచిపోయింది. ఓ రోజు ఈ స్కూల్‌ ముందు నుంచి వాకింగుకు వెళుతూ ఇన్ఫోసిస్‌ మాజీ ఛైర్మన్‌ జి.కె.జయరామ్‌ బడి మూతబడి ఉండటం గమనించారు. ఇక్ఫాయ్‌ సంస్థని విషయమేంటని ఆరాతీస్తే వాళ్లు ఆ పాఠశాలని నడపలేమంటూ నిస్సహాయత వ్యక్తంచేశారు. దాంతో జయరామ్‌ తాను నడుపుతున్న కస్తూరి ట్రస్టు ద్వారా ఆ బడి బాధ్యతని తీసుకున్నారు. దీనికి ‘ఏకలవ్య’ అని పేరుపెట్టారు. కానీ బడి నడపడానికి ఏ ఒక్క వ్యక్తి పరపతో కాకుండా సమష్టిబలం అవసరమని జయరామ్‌ భావించారు. ఆయన పిలుపుమేరకు ఐఐఎం-అహ్మదాబాద్‌ పూర్వ విద్యార్థుల సంఘానికి చెందిన చారిటబుల్‌ ట్రస్టు (ఐఐఎంఏఏసీహెచ్‌) ఈ బడి బాధ్యతలు తీసుకుంది. ‘ఉద్భవ్‌’ అని పేరుపెట్టింది. ఈ సంఘంలోని ఎక్కువమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే. ఐపీఎస్‌ అధికారి ఎస్వీ రమణమూర్తి దీని ప్రస్తుత అధ్యక్షుడు!

కొత్తగా చేస్తున్నారిలా..
‘ఐఐఎంఏఏసీహెచ్‌ బాధ్యతలు తీసుకున్నవెంటనే ఇక్కడ ప్రాథమిక స్థాయిలో ట్రాన్స్‌ఫర్మేటివ్‌ లెర్నింగ్‌ అప్రోచ్‌(టీఎల్‌ఏ)విధానంలో బోధన మొదలుపెట్టింది. పిల్లలకి బొమ్మలూ, ఆటపాటల ద్వారా విద్య బోధించే పద్ధతిది. దాంతోపాటూ విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్‌ నేర్చుకునేలా ‘కరడి పాత్‌’ వంటి సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించడం ప్రారంభించారు. డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లకీ శ్రీకారం చుట్టారు. సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లూ, లైబ్రరీలని విస్తరించారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠ్యగ్రంథాలే కాకుండా వారానికి రెండుసార్లు మిగతా పుస్తకాలూ చదివేలా ప్రోత్సహిస్తున్నారు. ఓ కార్పొరేట్‌ బడి స్థాయిలో టీచర్‌కి 23 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా 2014 నుంచి మూడేళ్లపాటు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటూ ఇక్కడి విద్యార్థులు క్రీడల్లోనూ అదరగొడుతున్నారు. ఈ బడిలో ఏడో తరగతి చదువుతున్న లీలాసాగర్‌ ఇటీవల ముంబయిలో జరిగిన సెయిలింగ్‌ పోటీల్లో రజతం అందుకున్నాడు. పాతికేళ్ల విరామం తర్వాత అండర్‌-16 ఆప్టిమస్‌ విభాగంలో హైదరాబాద్‌కి వచ్చిన తొలి పతకం ఇది! దిల్లీలో ఆ మధ్య జరిగిన ఆల్‌ ఇండియా నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొన్న భార్గవి కాంస్య పతకాన్ని సాధించింది.

ఇలా తీసుకుంటారు..
తల్లిదండ్రుల ఆదాయం నెలకి ఏడువేల మించని కుటుంబాలకి చెందినవాళ్లనే ఇక్కడ చేర్చుకుంటున్నారు. అరుదైన సందర్భాల్లో పదివేల వరకూ అనుమతిస్తున్నారు. స్థిరాదాయం లేని కూలీపనులు చేసేవారూ, ఒంటరి తల్లులున్న పిల్లలకి ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాదు.. ఆడపిల్లలకి ఈ బడిలో 50 శాతం రిజర్వేషన్‌ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 641 మంది విద్యార్థులుంటే.. వారిలో 56 శాతం అమ్మాయిలే! ఉచితంగా నేర్పించడంకంటేఎంతోకొంత ఫీజు ఉంటే తల్లిదండ్రుల్లో ఓ బాధ్యతంటూ ఉంటుందనే ఆలోచనతో ఫీజు వంద నుంచీ 150 వరకూ తీసుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఇంతే ఉంటోంది. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల మధ్య ఈ ఫీజెంత నామమాత్రమో చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యపుస్తకాల్ని ప్రభుత్వ సంస్థలే రెండొందల యాభైరూపాయలకీ, ప్రైవేటు సంస్థలు వెయ్యిరూపాయలకి పైగా అమ్ముతున్న నేపథ్యంలో ఇక్కడ పదో తరగతి పుస్తకాల సెట్‌ని 120 రూపాయలకే అందిస్తున్నారు.

వాళ్ల విరాళాలతోనే..
ఈ విద్యార్థుల ఫీజులతో సంబంధంలేకుండా బడి నిర్వహణ ఖర్చుల కోసం ఏడాదికి 90 లక్షల రూపాయలు అవుతున్నాయని అంచనా. ఇందులో ఎక్కువశాతం ఐఐఎంఎంసీహెచ్‌ సభ్యులే విరాళాలుగా అందిస్తున్నారు. ఈ స్కూలు నుంచి బయటకొచ్చి ఇప్పుడెంతో మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదివి జీవితంలో నిలదొక్కుకున్నారు. కానీ ‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే. 2025కల్లా మా బడి నుంచి 10 వేల మంది విద్యార్థుల కుటుంబాలని ఉన్నతస్థాయికి చేర్చడమే మా లక్ష్యం!’ అని చెబుతున్నారు ఐఐఎంఏఏసీహెచ్‌ సభ్యులు.

- సునీల్‌, ఈనాడు, హైదరాబాద్‌
ఫొటోలు : రఘు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.