close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డ‌స్ట్‌బిన్‌‌

డ‌స్ట్‌బిన్‌‌
- డా।। మద్దాళి ఉషాగాయత్రి

‘‘హలో!’’
‘‘హలో, ఎవరండీ!’’
‘‘నా పేరు రామారావండీ. మా అబ్బాయి సంబంధం గురించి మాట్లాడాలి’’ ఎంతో సౌమ్యంగా అడిగాడు రామారావు.
అవతలి నుంచి వెంటనే ఏమీ సమాధానం లేదు. ఓ నిమిషం తర్వాత- ‘‘సారీ అండీ, నేను డ్రైవింగ్‌లో ఉన్నాను. ఓ అరగంటాగి ఇదే నంబర్‌కి కాల్‌ చేయండి’’ అని ఫోన్‌ కట్‌ చేసేశారు.
రామారావుకి కోపం ముంచుకొచ్చింది, అయినా తమాయించుకున్నాడు.
‘‘ఏమిటీ పరిస్థితి...మగపిల్లల తండ్రిగా మాత్రం పుట్టకూడదు’’ అనుకున్నాడు నిట్టూరుస్తూ.
చేతిలో ఉన్న నోట్‌పాడ్‌కేసి చూశాడు.
దాదాపు ఓ అరడజను సంబంధాల వివరాలు వరసగా రాసి ఉన్నాయి.
ఒక్కొక్కరికీ ఫోను చేస్తుంటే ఒక్కో రకమైన సమాధానం. ఇంకొకరికి ట్రై చేశాడు.
చాలాసేపు రింగ్‌ అయ్యాక ‘‘హలో, ఎవరండీ ఇప్పుడు ఫోను చేసింది?’’ చచ్చేంత విసుగు ధ్వనిస్తోంది ఆ కంఠంలో. రామారావుకు మొహమాటం ఎక్కువ. అందులో ఆ కంఠం ధోరణి విన్నాక ‘ఎందుకు ఫోను చేశాన్రా బాబూ’ అనిపించింది.
కానీ తప్పదుగా.
‘‘హలో, నేను మా అబ్బాయి పెళ్ళి గురించి మాట్లాడదామని ఫోను చేశాను. మీ అమ్మాయి గురించి మ్యారేజ్‌ బ్యూరో వాళ్ళు చెప్పారు, అందుకని’’ ఎలాగోలా వాక్యం పూర్తి చేశాడు.
‘‘అలాగా, మా అమ్మాయి బీటెక్‌ చదివింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ఇంతకీ మీ అబ్బాయికి ఎంటెక్‌గానీ, ఎంబీఏ క్వాలిఫికేషన్‌గానీ ఉందా?’’
‘‘లేదండీ, మా అబ్బాయి కూడా బీటెక్‌ మెకానికల్‌ చేశాడు.’’
‘‘సారీ అండీ, ఎంటెక్‌గానీ ఎంబీఏగానీ ఉంటేనే మా అమ్మాయి చూడమంది’’ అని టక్కున ఫోను పెట్టేసిన ధ్వని వినిపించింది.
ఉలిక్కిపడ్డాడు. ‘అదేమిటి మరీ బొత్తిగా... మంచీ మర్యాదా లేకుండా అలా అనేశాడు. వాళ్ళమ్మాయి కూడా బీటెక్కేగా చదివింది. అంత టెక్కు దేనికో?’
అసలు ఆడపిల్లల తల్లిదండ్రులు పెట్టే నిబంధనలు చూసి, మగపిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయని అనుమానం పెరుగుతోంది. మగపిల్లల తండ్రులు చాలామంది చాలా అవమానాలకు గురి అవుతూ, అలాగే సంబంధాల వేటలోనే కుడితిలోపడ్డ ఎలకల్లాగా ఉన్నారు. రామారావు ఎక్కడలేని సహనం తెచ్చిపెట్టుకున్నాడు.
ఈరోజు కోటా పూర్తి అయిందనుకున్నాడు. రూమ్‌లో నుండి హాల్లోకి వచ్చాడు.
వంటింట్లో రామారావు భార్య పద్మ ఉల్లిపాయ పకోడీలు వేస్తోంది. దాని తాలూకు వాసన ఘుమఘుమలాడుతూ హాల్లోదాకా వస్తోంది.
‘‘ఏవోయ్‌ పద్మావతీ, ఆ పకోడీలు కాసిని ఇలా పట్రా, కసిదీరా నములుతా’’ అన్నాడు.
‘‘అదేంటండోయ్‌... మామూలుగా నమలొచ్చుగా - కసిదీరా ఎందుకూ?’’ పకోడీల ప్లేటు చేతికందిస్తూ అంది.
మంచినీళ్ళ గ్లాసు అక్కడే టీపాయ్‌ మీద పెట్టింది.
‘‘ఇంకా నీకర్థం కాలేదా? నేను మగపిల్లాడి తండ్రిని. ఇంతసేపు సంబంధాల వాళ్ళతో మాట్లాడి గొంతు అరిగిపోయింది. ఇదివరకు ఆడపిల్లల తండ్రులు చెప్పులరిగేలాగా తిరిగితేగానీ సంబంధాలు కుదరవనేవారు. ఆ కాలంలో అలాగా, ఇప్పుడేమో కాలం మారిందయ్యే. సెల్లులు చిల్లులుపడేలా మొరబెట్టుకుంటేగానీ పని జరిగేట్టు లేదు.’’
‘‘అంతమాత్రానికే అలా ఫీలవుతారేంటి?
ఈ కలియుగంలో ఇంకా ఎన్ని మార్పులు చూడాలో! ఇంతకీ ఏదైనా కొద్దిగానైనా ముందుకు జరిగిందా?’’
‘‘ఏంటి జరిగేది? అవతలవాళ్ళు మనకి అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వొద్దూ’’ వెక్కిరింపుగా అన్నాడు.
‘‘సరేలెండి, వాడికి టైమ్‌ వచ్చినప్పుడే సంబంధం కుదురుతుంది. అంతా పైవాడి దయ’’ ప్లేట్లో మరిన్ని పకోడీలు వేస్తూ అంది పద్మావతి.

*  *  *

అలా సంబంధాలు వెతగ్గా వెతగ్గా ఓ సంబంధం చూపులదాకా వచ్చింది.
ముందుగా మంచి టైమ్‌ అదీ మాట్లాడుకుని రామారావూ పద్మావతీ వాళ్ళబ్బాయి శంకర్‌తో కలిసి పెళ్ళిచూపులకెళ్ళారు.
దారిలో పూలూ పండ్లూ స్వీట్లూ అవీ కొనుక్కుని పెళ్ళివాళ్ళింటికి బయల్దేరారు.
హైదరాబాదులో గాంధీనగర్‌లో మంచి సెంటర్‌లో ఉంది వాళ్ళిల్లు.
చాలా మర్యాదగా లోపలకు తీసుకెళ్ళారు. కాఫీలూ స్నాక్స్‌ అల్పాహారాలూ అయ్యాయి.
‘‘అమ్మాయిని పిలిపించండి’’ అన్నాడు రామారావు.
పెళ్ళికూతురి తండ్రి ఆశ్చర్యపోతూ చూశాడు.
‘‘అదేంటండీ ఇందాకట్నుంచీ ఇక్కడ తిరుగుతున్న అమ్మాయి మా అమ్మాయే. తనే పెళ్ళికూతురు.’’
రామారావూ పద్మావతీ మొహాలు చూసుకున్నారు. మామూలు క్యాజువల్‌వేర్‌ అనబడే దుస్తులతో కిటికీ దగ్గర నిలబడి సెల్‌ మాట్లాడుతున్న అమ్మాయివైపు చూశారు.
ఫర్వాలేదు, బానే ఉంది. అయినా, ఈ కాలపు పిల్లలకి పెళ్ళిచూపులంటేనే గిట్టదు, ఫార్మాలిటీస్‌ అస్సలు నచ్చవు అని సరిపుచ్చుకున్నారు. అమ్మాయివైపు చూసి పలకరింపుగా నవ్వారు. ఆ అమ్మాయి కూడా హాయ్‌ అన్నట్టు చిన్నగా చేయి ఊపింది సమాధానంగా. అంతేగానీ, ఆ సెల్‌కి ఆ చెవి దగ్గర్నుంచి మోక్షం లేదు.
ఇంతలో వాళ్ళ నాన్న సెల్‌ మోగింది. ఆయన ‘‘అలాగే అలాగే, నేను చెప్తాను’’ అని సెల్‌ కట్‌ చేశాడు.
రామారావుకి మొదట అర్థంకాలేదు.
కానీ కిటికీ దగ్గర ఆ అమ్మాయి చూపు వాళ్ళ నాన్నపై ఉండటంతో ఆ కాల్‌ చేసింది ఆ అమ్మాయేనని అర్థం అయింది.
‘‘చూడండి రామారావుగారూ, అమ్మాయి అబ్బాయితో పర్సనల్‌గా మాట్లాడాలట’’ అన్నాడు సదరు పెళ్ళికూతురి తండ్రి.
రామారావు, పద్మావతికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఇద్దరూ కలిసి కొడుకుకేసి చూశారు. ఆ అబ్బాయికేమీ అభ్యంతరం ఉన్నట్టుగా తోచలేదు. సరేనని తల ఊపారు.
ఆ అమ్మాయి నేరుగా రూమ్‌లోకి వెళ్ళిపోయింది.
‘నువ్వూ వెళ్ళు’ అన్నట్టుగా సైగ చేశారు రామారావు, పద్మావతి.
శంకర్‌ కూడా కర్టెన్‌ తీసుకుని రూమ్‌లోకి వెళ్ళాడు.
రూమ్‌లో ఆ అమ్మాయి ఓ కుర్చీలో కూర్చోనుంది. అక్కడే ఇంకో కుర్చీ ఉంది.
‘‘హలో, నా పేరు ప్రశాంతి, కూర్చోండి’’ అని కుర్చీ చూపించింది.
‘‘థాంక్యూ, ఐయామ్‌ శంకర్‌’’ అంటూ కూర్చున్నాడు.
‘‘మీరు జాబ్‌లో చేరి ఎన్నేళ్ళయింది. వాటీజ్‌ యువర్‌ పొజిషన్‌ ఇన్‌ యువర్‌ కంపెనీ?’’
సమాధానం చెప్పాడు శంకర్‌.
‘‘మీరు చేరినప్పటికీ ఇప్పటికీ మీ జీతం ఎంత పెరిగింది?’’
అది కూడా చెప్పాడు.
‘‘మీకు ఇదే కంపెనీలో ఉండే ఉద్దేశం ఉందా లేక ఇంకోదానికి మారే ఆలోచనుందా?’’
కచ్చితంగా మారేదిలేదని చెప్పాడు.
‘‘ఓకే ఫైన్‌! ఇంకో క్వశ్చన్‌. మీరు ఇండియాలోనే ఉంటారా లేక విదేశాలకి వెళ్ళే ప్లాన్స్‌ ఏవన్నా ఉన్నాయా?’’
అది కూడా లేదనే చెప్పాడు.
శంకర్‌కి సహనం చచ్చిపోతోంది.
ఆ అమ్మాయివేసే ప్రశ్నలు ఒక కార్పొరేట్‌ ఆఫీసులో ఉద్యోగానికి ఇంటర్వ్యూ తీసుకునేలాగా అనిపించింది.
తనవంకే తేరిపార చూస్తున్న శంకర్‌ చూపులకు కొద్దిగా ఇబ్బందిగా కదిలి ‘‘ఓకే, ఇక మన గురించి మాట్లాడుకుందాం’’ అంది ప్రశాంతి.
‘అమ్మయ్యా’ అనుకున్నాడు శంకర్‌.
‘‘మీరు మీ అమ్మానాన్నలకి ఒక్కరేనా?’’
‘‘ఔను’’ అన్నాడు మళ్ళీ ప్రశ్నలు మొదలు అనుకుంటూ.
‘‘మీరంతా కలిసే ఉంటారా?’’
ఈ ప్రశ్నతో శంకర్‌కి తిక్కరేగింది.
‘‘ఉన్న ముగ్గురు కలిసికాక ఎలా ఉంటారు?’’
‘‘ఓకే ఓకే... కూల్‌. ఒకవేళ మనకి పెళ్ళి అయితే వాళ్ళెక్కడుంటారు?’’
‘‘వాళ్ళెవరు?’’
‘‘అదే డస్ట్‌బిన్స్‌’’ నోరుజారి వచ్చేసింది మాట.
‘‘డస్ట్‌బిన్స్‌... వాట్‌ డు యు మీన్‌...’’
ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు కుర్చీ వెనక్కి తోసి.
ప్రశాంతి ‘అరెరె నోరు జారానే’ అనుకుంటూ నాలుక్కరుచుకుంది. ఆఫీసులో తన కొలీగ్స్‌ అందరూ అత్తగారికీ మామగారికీ పెట్టుకున్న నిక్‌నేమ్‌ అది.
అప్పటికే రూమ్‌ బయటికి వచ్చేశాడు శంకర్‌. ఉద్రేకాన్ని అణుచుకోలేకపోతున్నాడు.
వేగంగా వచ్చి ‘‘పదండి నాన్నా, వెళ్ళిపోదాం’’ అన్నాడు.
‘‘అదేంటి బాబూ, ఒక్క నిమిషం కూర్చో... ఏమైందో చెప్పు’’ పద్మావతి కొడుకు చేయిపట్టుకు అడిగింది.
ఈ లోపల అతని వెనకే వచ్చిన ప్రశాంతి తనను తాను సమర్థించుకుంటూ ‘‘హలో, నేను ఏమన్నాను? చూడండి ఆంటీ, పెళ్ళి తర్వాత మీరూ అంకుల్‌ ఎక్కడుంటారని అడిగాను తప్పా’’ డాంబికంగా అంది.
పద్మావతీ రామారావూ ఆ అమ్మాయి
ప్రశ్నించిన తీరుకు అవాక్కయ్యారు.
కొడుకుకేసి చూశారు. మొహం అయిష్టంగా ఉంది. పద్మావతి ఇక ఆగలేదు.
‘‘ఎక్కడుంటామమ్మా, ఒక్కడే కొడుకు కదా... చచ్చేదాకా వాడితోనే ఉంటాం’’ స్వరం స్థాయి పెంచి అంది.
రామారావుకు చాలా ఇబ్బందిగా ఉంది.
వాతావరణం వేడెక్కుతున్నట్టనిపించింది. అలా మాట్లాడుతున్న కూతురిని తల్లీ తండ్రీ ఏమీ వారించట్లేదు.
అది చాలా మామూలు విషయంగా అనిపిస్తోంది వాళ్ళకు. ఈ కాలంలో పిల్లలు చాలా ఫ్రీగా మాట్లాడతారనీ చాలా క్లారిటీగా ఆలోచిస్తారనీ వారి భావన.
‘‘కూతురి కాపురం అంటే- కూతురూ అల్లుడూ- అంతే కదా! మిగతా ఎవరైనా చుట్టపుచూపుగా వచ్చిపోవాల్సిందేగా.’’
కూతురి మాటలు పెద్ద తప్పుగా తోచలేదు.
కాపురం అంటే కాపురమే - కుటుంబం కాదు కదా... అదీ వాళ్ళ ఉద్దేశం.
రామారావుకి పరిస్థితి బాగా అర్థం అయింది.
‘‘మరి మేం వెళ్ళి వస్తాం’’ చేతులు జోడించి నమస్కారం చేస్తూ ‘‘ఇక సెలవ్‌’’ అన్నాడు.
శంకర్‌ అప్పటికే గేటు దగ్గరకెళ్ళిపోయాడు. కొడుకుని అనుసరిస్తూ పద్మావతి మర్యాద పూర్వకంగా నవ్వి బయటికి వెళ్ళింది.
తను అడిగిన ప్రశ్న ఇంత సీరియస్‌ టర్నింగ్‌ అవ్వడం చూసి ఆశ్చర్యపోయింది ప్రశాంతి.
‘‘వ్వాట్‌ డాడ్‌, మోస్ట్‌ కన్జర్వేటివ్‌ పీపుల్‌’’ భుజాలెగరేస్తూ అంది.

‘థ్యాంక్‌ గాడ్‌, ఇంకా పెళ్ళి కుదర్లేదు. ముందే అడిగి మంచిపని చేశా’ అనుకుంది. ప్రశాంతి డాడీ మమ్మీ కూడా కూతురికే వత్తాసు పలుకుతూ మెచ్చుకోలుగా చూశారు-‘నా కూతురు చాలా ఫ్రాంక్‌’ అనుకుంటూ.
దారిలో రామారావూ పద్మావతీ శంకర్‌ ముగ్గురూ ఏమీ మాట్లాడుకోలేదు.
ఇంటికొచ్చాక ‘‘బాబూ, నీకు అంత కోపం ఎందుకొచ్చింది? ఏదో చిన్నపిల్ల, గారాబంగా పెంచుంటారు. తెలిసీ తెలియక మాట్లాడుంటుంది. అంతమాత్రాన అలా వచ్చేయడం మర్యాద అనిపించుకోదు’’ పద్మావతి శంకర్‌ని పక్కన కూర్చోపెట్టుకుని అడిగింది.
శంకర్‌కి ప్రశాంతి అన్న మాటను వాళ్ళతో చెప్పడానికి ససేమిరా నోరు రావడం లేదు.
‘‘నిజంగా నీకా అమ్మాయి బాగా నచ్చితే చెప్పు. మాదేముందిరా, ఊర్లో మన ఇల్లు ఉందిగా, హాయిగా అక్కడికెళ్ళిపోతాం. నాన్న పెన్షన్‌ మాకు బాగానే సరిపోతుంది.’’
‘‘అమ్మా ప్లీజ్‌, మీరింకేం మాట్లాడకండి. అమ్మాయి ఎంత నచ్చినా తనకోసం మిమ్మల్ని దూరం చేసుకునేంత దరిద్రపు పని మాత్రం నేను చచ్చినా చేయను. అయినా ఆ అమ్మాయి మిమ్మల్నిద్దరినీ ఏమందో తెలుసా... తెలిస్తే మీరు ఇలా మాట్లాడనే మాట్లాడరు.’’
‘‘అంత అనరాని మాట ఏమందిరా?’’
‘‘మిమ్మల్ని... మిమ్మల్ని...’’ వాక్యం పూర్తిచేయలేక పోతున్నాడు.
‘‘ఆఁ మమ్మల్ని?’’ కొడుకు ఎందుకంత ఇబ్బందిపడుతున్నాడో అర్థంకావడంలేదు ఇద్దరికీ.
‘‘డస్ట్‌బిన్స్‌ అంది’’ అతి కష్టం మీద పూర్తిచేశాడు.
రామారావూ పద్మావతీ ఉలిక్కిపడ్డారు.
‘‘అదేంటిరా బాబూ...మరీ అలా అనేసింది?’’
‘‘మరి అదే, మా పర్సనల్‌ ఇంటర్వ్యూలో ఆవిడగారి స్టేట్‌మెంట్‌. మీరు డస్ట్‌బిన్స్‌ అట. అందుకే మా కూడా ఉండటానికి తగరు అని ఇన్‌డైరెక్టుగా చెప్పింది.’’
‘‘మరి నువ్వేం అన్నావు?’’
‘‘ఏం అనాలో తెలీక బయటికి వచ్చేశాను.’’
‘‘అయితే ఇప్పుడేమంటావు?’’
‘‘అదేంటమ్మా అలా అడుగుతావు? ఇవాళ మీరిద్దరూ డస్ట్‌బిన్స్‌ అయితే భవిష్యత్తులో నేను వేస్ట్‌పేపరు అవనని నమ్మకమేంటి?’’ అన్నాడు ఆవేదనగా.
రామారావు కొడుకు భుజం తడుతూ ‘‘వదిలేయ్‌ నాన్నా, మనం ఇంకా అదృష్టవంతులం. ఆ అమ్మాయి ముందుగా అడిగి మంచిపనే చేసింది. తీరా పెళ్ళయ్యాక ఈ ప్రశ్న వేస్తే ఏం చెయ్యగలం.’’
అదీ నిజమేననిపించింది పద్మావతికి.

*  *  *

‘‘హాయ్‌ అన్నయ్యా’’ లోపలకు దూసుకొచ్చింది ప్రియ.
‘‘రా రా, సడెన్‌గా వచ్చేశావు... ఫోన్‌ చెయ్యొద్దా?’’ అన్నాడు శంకర్‌.
‘‘ఎందుకమ్మా ఫోను, ఇది మా పెద్దమ్మ ఇల్లు అంటే నా ఇల్లే. ఏం పెద్దమ్మా అవునా కాదా?’’ పద్మావతిని చుట్టేస్తూ అడిగింది.
ప్రియ పద్మావతి చెల్లెలి కూతురు. తను కూడా ఇంజినీరింగ్‌ చదివి గచ్చిబౌలిలో ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శని, ఆదివారాలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సెలవు. అందుకే చెప్పాపెట్టకుండా ఇలా వచ్చేసింది.
‘‘కాదని ఎవరన్నారు? ఈ రెండ్రోజులు ఇక్కడే ఉండు హాయిగా. నీక్కావల్సినవన్నీ చేసిపెడతా’’ ప్రియను మురిపెంగా చూస్తూ అంది.
‘‘అవునుగానీ మొన్నటి ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ వచ్చాయా?’’ శంకర్‌ని అడిగింది.
ఆ ప్రశ్న అక్కడున్న వాళ్ళెవరికీ అర్థంకాలేదు.
‘‘ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ ఏంటి?’’
‘‘అదే, అన్నయ్య పెళ్ళిచూపుల తాలూకు ఇంటర్వ్యూ రిజల్ట్స్‌.’’
ప్రియ అడిగిన తీరుకు రామారావూ పద్మావతీ నవ్వు ఆపుకోలేకపోయారు.
శంకర్‌ మాత్రం మొహం గంటుపెట్టుకున్నాడు.
‘‘అదేమిట్రా అన్నయ్యా అలా అయిపోయావు, కొంపదీసి వదినమ్మ అంతగా నచ్చేసిందా?’’ ప్రియ మాటలకు శంకర్‌ ఏం సమాధానం చెప్తాడోనని పద్మావతీ రామారావూ ఆతృతగా ఎదురుచూశారు.
ప్రియ నోటికి తన చేయి అడ్డుపెట్టి
రూమ్‌లోకి లాక్కుపొయ్యాడు శంకర్‌ ‘‘నీతో మాట్లాడాలి పద’’ అంటూ.
ఓ పావుగంట తర్వాత అన్నాచెల్లెళ్ళిద్దరూ సీరియస్‌గా బయటికొచ్చారు.
‘‘పెద్దమ్మా, త్వరగా అన్నం వడ్డించు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ముఖ్యమైన పని ఉంది’’ అంటూ వెళ్ళి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుంది ప్రియ.
‘‘దీంతో ఏదొచ్చినా కష్టమే! రండి అందరం భోంచేద్దాం’’ కొంగు దోపుకుంటూ పద్మావతి వంటింట్లోకి వెళ్ళింది.
అన్నాచెల్లెళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమిటో... ఏమీ అంతుపట్టలేదు పద్మావతికి.

*  *  *

‘‘మమ్మీ, అన్నయ్యేదో అంటున్నాడు,
నువ్వూ డాడీ ఇలా రండి’’ ప్రశాంతి రూమ్‌లోంచి అరుస్తోంది.
ఏమైందోనని రూమ్‌లోకి వచ్చారు ప్రశాంతి అమ్మా నాన్నా.
రమేష్‌ కిటికీ వైపు నిలబడి బయటకు చూస్తున్నాడు.
‘‘ఏమిట్రా, అంతలా కేకలేస్తున్నారు?’’ అంది ప్రమీల- ప్రశాంతి వాళ్ళ అమ్మ.
‘‘అన్నయ్యా, నువ్వు చెప్తావా లేక నేను చెప్పనా?’’
‘‘నువ్వెందుకు, నేనే చెప్తాను.’’
‘‘ఏమిట్రా, ఏమిటి విషయం?’’
‘‘మమ్మీ నేనొక అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను’’ తేల్చి చెప్పేశాడు.
‘‘ఓస్‌ ఇంతేనా?’’
‘‘ఇంతకీ అమ్మాయి వివరాలు ఏమిటి?’’ చాలా కూల్‌గా అడిగాడు ప్రశాంతి తండ్రి వెంకట్రావ్‌.
‘‘అమ్మాయి మా ఆఫీసే! ఓ సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నాం.’’
‘‘మరి ఇన్నాళ్ళూ చెప్పలేదేం?’’
‘‘మేము ఒకర్నొకరం అర్థంచేసుకోవాలి కదా!’’
‘‘ఓకే ఫైన్‌! అర్థం చేసుకోవడం అయిందా?’’ కళ్ళెగరేస్తూ సరదాగా నవ్వాడు వెంకట్రావ్‌.
‘‘యా, నిన్ననే ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. వాళ్ళింట్లోవాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఒక విషయంలోనే ఏదీ తేల్చుకోలేకపోతున్నాం.’’
‘‘ఏమిటి మై సన్‌, చెప్పు.’’
‘‘ఆ అమ్మాయికి ఒకటే సందేహం?మా పెళ్ళి తర్వాత మీరెక్కడుంటారని?’’
కంగుతిన్నాడు వెంకట్రావ్‌.
‘‘అదేంట్రా, అదేం సందేహం... మనం అంతా కలిసే ఉంటాం కదా?’’
‘‘అలా తనకు ఇష్టంలేదు డాడీ. తనూ నేనూ మాత్రమే ఉండాలంట.’’
‘‘మరి, చెల్లి మాటేమిట్రా... తనకు పెళ్ళి కుదరాలి కదా! అంతవరకన్నా అందరం కలిసే కదా ఉండాలి.’’
అయోమయంగా ఉంది ప్రమీల పరిస్థితి.
‘‘చెల్లి పెళ్ళి మొన్ననే కుదిరేది...
అనవసరంగా ఏదో వాగి చెడగొట్టింది.’’
‘‘ఏంట్రా ఆ మాటలు? చెల్లి అన్నదాంట్లో తప్పేముంది?’’ ప్రశ్నించాడు వెంకట్రావ్‌.
‘‘చెల్లి అడిగింది తప్పు కానప్పుడు, నేనన్నదాంట్లో మాత్రం తప్పుపడతారెందుకు?’’ రమేష్‌ ఎదురు ప్రశ్న వేశాడు.
ఈ దెబ్బతో ప్రమీలకీ వెంకట్రావుకీ ప్రశాంతికీ ముగ్గురికీ పెళ్ళిచూపులు సంఘటన గిర్రున రీలులా తిరిగింది.

‘‘డాడీ, పెళ్ళి తర్వాత మాకూ వేరే జీవితం ఏర్పడుతుంది. మా ఖర్చులు మాకుంటాయి. మాకూ బాధ్యతలు పెరుగుతాయి. మీ ఇద్దరి బాధ్యత తీసుకోవడం కుదరదు. అభిప్రాయభేదాలతో ఒకే చూరుకింద హ్యాపీగా ఉండలేం. అందుకే తను అలా ఫ్రాంక్‌గా ఉన్నదున్నట్లు నాతో చెప్పింది.’’
ఇలాంటి మాటలే తామూ ఇంతకుముందు మాట్లాడినట్టు అనిపిస్తోంది వెంకట్రావుకి... ఏ విషయమైనా ఓ కోణం నుండి చూస్తే ఒకలా ఉంటుంది. ఇంకో కోణం నుండి చూస్తే మరోలా ఉంటుంది.
అప్పుడు తమవైపు నుండి మాట్లాడారు, ఇప్పుడు అదే పరిస్థితి తమకు ఎదురు తిరిగింది. ఎక్కడో ఏదో అర్థం అయీ అవనట్టుంది.
‘‘చెల్లి పెళ్ళిచూపులు జరిగినప్పుడు నువ్వు ఇంట్లో లేవుగా, నైట్‌ డ్యూటీ అని ఆఫీసుకు వెళ్ళావుగా. మరి అదేం మాట్లాడిందో నీకెలా తెలుసు?’’ అనుమానంగా అడిగింది ప్రమీల.
సమాధానం చెప్పలేదు రమేష్‌.
‘‘నిన్నేరా, నీదాకా ఎలా వచ్చింది?’’ రెట్టించింది.
‘‘ఎలాగో తెలిసిందిలే. చెల్లి నోరుజారి చాలా తప్పు చేసింది మమ్మీ. మీ అమ్మానాన్నలు ఎక్కడుంటారని ఆ అబ్బాయిని అడగొచ్చా! ఏ అమ్మానాన్నలైనా కొడుకు దగ్గరకాక ఎక్కడుంటారు? పైగా, కాబోయే అత్తగారినీ మామగారినీ పట్టుకుని ‘డస్ట్‌బిన్స్‌’ అంటుందా! రేపు నేను పెళ్ళి చేసుకునే అమ్మాయి మిమ్మల్నీ అలా అంటే మీరు బాధపడరా? పోనీ, ప్రశాంతి చిన్నపిల్ల... తెలియకో తొందరపాటుతోనో అలా మాట్లాడిందనుకుందాం... మరి పెద్దవాళ్ళు మీరు చేసిందేమిటి? తప్పు దిద్దాల్సిందిపోయి దాన్ని సమర్థిస్తారా? వాళ్ళ కుటుంబం చాలా మంచిది. వాళ్ళు కూడా ఎంతో మర్యాదస్తులు. ఆ అబ్బాయి చాలా ఓర్పు కలవాడు. తల్లిదండ్రులకు అంత విలువ ఇచ్చే కొడుకు... భార్యపట్లా కుటుంబంపట్లా బాధ్యతగా ఉండడా? ఇప్పటికైనా మించిపోయిందిలేదు, నేనే వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడతాను. సంస్కారంగల కుటుంబం, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అబ్బాయి కూడా వాళ్ళ అమ్మానాన్న మాట కాదనడని నాకు గట్టి నమ్మకం. ఏమంటావు ప్రశాంతీ?’’ చెల్లిని సూటిగా ప్రశ్నించాడు.
ప్రశాంతికి రమేష్‌ మాట్లాడిన మాటలు పూర్తిగా అర్థం అయ్యాయి. తను చాలా పొరపాటుగా ప్రవర్తించానని గ్రహించి సిగ్గుపడింది.
అయినా ఏదో సందేహం!
‘‘ఈ విషయం నీకెలా తెలిసిందంటే చెప్పవేం... అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు?’’
‘‘ఆ అమ్మాయి పేరు ప్రియ. నీ కాబోయే శ్రీవారికి పిన్ని కూతురు. చాలా మంచిది. ఈ ఇంటికి కోడలిగా రాకముందే- పక్కదారి పడుతున్న వ్యవహారాన్ని చక్కదిద్దుదామని తాపత్రయపడింది. జీవితం చాలా చిన్నది ప్రశాంతీ, దాన్ని వీలైనంత ఆనందంగా గడపాలి కానీ కోరి సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఎప్పుడైనా, మన మంచితనమూ సంస్కారమే మనకు గౌరవ మర్యాదల్ని తెచ్చిపెడతాయి.’’
ప్రశాంతి ఒక్కపరుగున వచ్చి అన్నని పట్టుకుంది. ‘‘థాంక్స్‌ అన్నయ్యా, నా కళ్ళు తెరిపించావు. నిజంగానే ఆ అబ్బాయి నాకు చాలా నచ్చాడు. నా తొందరపాటువల్ల ఇలా జరిగింది. మరెప్పుడూ ఇలా ప్రవర్తించను. వాళ్ళకి నేనే సారీ చెబుతాను.’’
విషయం దూదిపింజలాగా తేలిపోయి అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
‘‘నువ్వూ కోడలూ ఇంత బాధ్యత తీసుకున్నాక మా పని తేలికైపోయింది. ఇక మాకు మా గురించిగానీ చెల్లి గురించిగానీ ఎలాంటి దిగులూ బెంగా లేవు. పద, నీతోపాటు నేనూ అమ్మాయీ కూడా వాళ్ళింటికి వస్తాం. క్షమాపణ అడిగి, అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే ఇంత సంస్కారంగా తమ కూతుర్ని పెంచిన మీ అత్తమామల్ని కూడా వెళ్ళి కలుద్దాం. రెండు పెళ్ళిళ్ళూ ఒకే పందిట్లో చేద్దాం. బాధ్యత తెలిసిన మీ ఇద్దరూ ఇంటి బాధ్యత తీసుకుంటే, మీ నీడలో మాకు ఏ లోటూ ఉండదు. చెల్లికీ పుట్టింటి ఆదరణకు కొరత ఉండదు, వెళ్దాం పద’’ అంటున్న తండ్రిని చూసి చాలా ఆనందం వేసింది రమేష్‌కి.
ప్రియ వేసిన ఎత్తు పారినందుకుసంతోషిస్తూ ‘‘అలాగే వెళ్దాం, పదండి డాడీ’’ అంటూ బయల్దేరాడు రమేష్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.