close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రేమికుల పాలిట స్వర్గం... సీషెల్స్‌

ప్రేమికుల పాలిట స్వర్గం... సీషెల్స్‌

‘హిందూ మహాసముద్రంలోని 105 దీవుల సముదాయం... ఏడాది పొడవునా పర్యటకానికి అనుకూలమైన సుందర ప్రదేశం... రిపబ్లిక్‌ ఆఫ్‌ సీషెల్స్‌’... అంటూ అక్కడి అందచందాలను వివరిస్తున్నారు విజయవాడకు చెందిన డా. మన్నం కృష్ణమూర్తి.

మిత్రులతో కలిసి దక్షిణాఫ్రికాను సందర్శించి తిరుగుప్రయాణంలో సీషెల్స్‌ అందాల గురించి విని చూడ్డానికి వెళ్లాం. పర్యటక రంగంతోబాటు మత్స్య పరిశ్రమ, వ్యవసాయం, చమురు వెలికితీత, వస్తు తయారీ పరిశ్రమలే సీషెల్స్‌ ఆదాయ వనరులు. దేశ జనాభా లక్ష లోపే. అయితేనేం... పెద్దవాళ్లకు ఆటవిడుపు, యువజంటకు హనీమూన్‌ లొకేషన్‌... మొత్తంగా పర్యటకుల పాలిట భూతల స్వర్గమే సీషెల్స్‌. మేం జొహెనెస్‌బర్గ్‌ నుంచి ఎయిర్‌సీషెల్స్‌ విమానంలో ఐదు గంటలు ప్రయాణించి మహె దీవికి చేరుకున్నాం. దీవుల్లో చాలా వాటిల్లో జనం ఉన్నారు. కొన్నింటిలో మాత్రం అస్సలు ఉండరు. 160 చ.కి.మీ. వైశాల్యం గల మహె దీవి అన్నింటిలోకెల్లా పెద్దది. దేశ రాజధానితోబాటు అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద ఓడరేవు ఈ దీవిలోనే ఉన్నాయి. రెండో అతిపెద్ద దీవి ప్రాస్లిన్‌. విస్తీర్ణం 40 చ.కి.మీ. ఇక్కడ కూడా విమానాశ్రయం, ఓడరేవు ఉన్నాయి. అన్ని వసతులతో అనుకూలంగా ఉంటుందని అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రీప్‌ హాలీడే అపార్ట్‌మెంట్‌లో బస ఏర్పాటుచేసుకున్నాం.

పాల సముద్రం!
రెండోరోజు ఉదయాన్నే త్వరగా అల్పాహారం ముగించుకుని విమానంలో మహె నుంచి 20 నిమిషాలు ప్రయాణించి ప్రాస్లిన్‌ చేరుకున్నాం. అక్కడి నుంచి కారు మాట్లాడుకుని దేవతరా, కొలె డె ఓర్‌ తీరాల వెంట ప్రయాణించి ఆన్సే లాజియో చేరుకున్నాం. తీరంలో పాలమీగడని తలపించే తెల్లని ఇసుకా, వెండిరంగులో మెరుస్తున్న గ్రానైట్‌ రాళ్లూ, దట్టంగా అలుముకున్న పచ్చని చెట్లూ స్వచ్ఛ సముద్ర జలాలతో అలరారుతోన్న ఆ బీచ్‌ని చూడగానే కాసేపు మమ్మల్ని మేం మరిచిపోయాం. అక్కడి సాగరజలాలు పురాణాల్లోని పాలసముద్రాన్ని తలపించాయి.

అక్కడినుంచి మరపడవలో ఐదు నిమిషాలు ప్రయాణించి క్యూరియస్‌ దీవికి చేరుకున్నాం. కేవలం చదరపు కి.మీ. విస్తీర్ణం గల ఈ దీవి, సీషెల్స్‌లోని అతి సుందర పర్యటక ప్రదేశం. అందులోకి ప్రవేశించాలంటే 200 సీషెల్స్‌ రూపాయలు(సుమారు వెయ్యి రూపాయలు) చెల్లించాలి. భూతల స్వర్గంగా పేరొందిన ఈ దీవి, సీషెల్స్‌కే ఆభరణాలుగా చెప్పుకోదగ్గ నల్లని చిలుక, అతిపెద్ద తాబేలు, కోకోడెమెర్‌ చెట్లకీ ప్రసిద్ధి.

సుమారు పది అడుగుల పొడవూ వెయ్యి కిలోల బరువూ ఉండే అల్డాబ్రా తాబేళ్లు ఇక్కడే కనిపిస్తాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. సాధారణంగా తాబేళ్లన్నీ గుడ్లు పెట్టడానికీ పొదగడానికీ మరుగు ప్రదేశాలను ఎన్నుకుంటాయి. కానీ అల్డాబ్రా జెయింట్‌ తాబేళ్లు పగటి వెలుగులో గుడ్లు పెట్టి, వాటిని సంరక్షిస్తాయి. వందల సంఖ్యలో తాబేళ్ల పిల్లలు ఒడ్డు నుంచి సముద్రంలోకీ సముద్రం నుంచి ఒడ్డుకీ తిరుగుతుంటే ఆ దృశ్యం చూసేవాళ్లకి కనులపండగే. తరవాత అక్కడి పార్కులో నల్లని ఈకలతో కనిపించాయి చిలుకలు. ఈ నల్లని చిలుక సీషెల్స్‌ జాతీయ పక్షి. ఈ పక్షి, క్యూరియస్‌ దీవిలోనే ఎక్కువగా కనిపిస్తుందట.

‘ప్రేమ’ విత్తనం!
సీషెల్స్‌లో అతి పెద్ద విశేషం కొకోడెమెర్‌ వృక్షం. దీన్నే సముద్ర కొబ్బరి అనీ అంటారు. ఈ దీవిలో ఈ చెట్లు విస్తారంగా ఉన్నాయి. వీటికి కాసే కొబ్బరికాయ సుమారు అడుగు పొడవూ, పాతిక కిలోల బరువుతో ముదురు గోధుమ రంగులో ఉంది. భూమ్మీద ఉన్న కాయ లేదా విత్తనాలన్నింటిలోకెల్లా ఇదే పెద్దది. ఈ కాయలు చెట్ల నుంచి నీళ్లలోకి రాలిపడితే ఆ బరువుకి మునిగిపోతాయి. కొన్నాళ్లకి పైనుండే పీచు కుళ్లిపోయాక లోపలి నట్‌ మాత్రం తేలుకుంటూ తీరానికి చేరుకున్నప్పటికీ మొలకెత్తదు. ఈ చెట్లలో ఆడామగా ఉండటంతోబాటు వీటికి కాసే కాయలు కూడా స్త్రీ, పురుష మర్మాంగాలను పోలి ఉండటం విశేషం. ఆడ చెట్ల గింజలు చూడ్డానికి హృదయాకారాన్ని తలపిస్తాయి. అందుకే వీటిని లవ్‌ నట్స్‌ అనీ అంటారు. ఈ నట్స్‌ అప్పుడప్పుడూ సముద్రమ్మీద తేలుకుంటూ మాల్దీవులకి చేరుకుంటాయి. అక్కడ అవి ఎవరికైనా దొరికితే వాటిని తీసుకెళ్లి రాజుగారికి ఇవ్వాల్సిందే. వీటిని దాచుకున్నా అమ్మినా కొన్నా మరణశిక్ష తప్పదు. వీటికి చాలా శక్తులు ఉన్నాయని నమ్ముతుంటారు. ఈ చెట్ల చుట్టూ మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తుపాను రాత్రుల్లో మగచెట్లు ఆడచెట్ల దగ్గరకు వస్తాయనీ, అయితే వాటికి తగని సిగ్గనీ దాంతో వాటి కలయికని చూసినవాళ్ల కళ్లుపోవడం లేదా చనిపోవడం జరుగుతుందనీ చెబుతుంటారు. ఇప్పటికీ ఈ చెట్ల ఫలదీకరణ ఎలా జరుగుతుందనేది పూర్తిగా అర్థం కాకపోవడంతో ఈ కథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పవచ్చు. ఇన్ని రకాల ప్రకృతి వింతలు ఇక్కడ కనిపించడం వల్లే క్యురియస్‌ దీవిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది యునెస్కో సంస్థ.

చెరకురసంతో రమ్‌!
మూడోరోజు అల్పాహారం ముగించుకుని కారు మాట్లాడుకుని మహె దీవి తూర్పుతీరంలో ప్రయాణించాం. మా డ్రైవర్‌కి ఇంగ్లిష్‌ రావడంతో ఇబ్బంది కలగలేదు. సీషెల్స్‌ గోల్ఫ్‌ క్లబ్‌ పక్కగా ఉన్న కాసురినా బీచ్‌నీ చూశాక డొమైన్‌ దేవాల్‌ అనే చేతివృత్తుల గ్రామానికి చేరుకున్నాం. అక్కడే విక్టోరియా కళామందిరం, చెక్క పడవలు, చిన్నపిల్లల ఆటవస్తువులు, అలంకరణ సామగ్రి, పండ్ల దుకాణాలూ ఉన్నాయి. అవన్నీ చూసి టకమాక డిస్టిలరీ చూడ్డానికి వెళ్లాం. అక్కడ చెరకు రసాన్ని పులియబెట్టి, రమ్‌ తయారుచేస్తున్నారు. తరవాత సీషెల్స్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణానికి వెళ్లాం. దేశంలో ఇదొక్కటే విశ్వవిద్యాలయం. అక్కడ ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ చదువు ఉచితం. యూనివర్సిటీ చూశాక మహె దక్షిణ తీరంలోని ఆన్సే ఇంటెన్‌డన్స్‌కి చేరుకున్నాం. అక్కడా తెల్లని ఇసుక తీరమే. బీచ్‌ మధ్యలో కొండరాళ్లూ ఉన్నాయి. అక్కడక్కడా పచ్చనిచెట్లూ ఆ చెట్లకొమ్మలకి ఉయ్యాలలూ కనిపించాయి. ఆకాశపు నీలిరంగూ చెట్ల పచ్చదనమూ కలగలిసి సాగరంలోని నీళ్లు నీలిఆకుపచ్చ వర్ణంలో మెరుస్తున్నాయి

 

జాతీయ ఉద్యానవనం!
మహె పడమటి తీరంలో కొద్దిసేపు ప్రయాణించి మారియా రాక్‌ కెఫెటేరియా చేరి మధ్యాహ్న భోజనం చేశాం. తరవాత గ్రాండ్‌ అన్సే పల్లెకు చేరుకున్నాం. అక్కడి రిసార్ట్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మార్నె అనే జాతీయ వనానికి చేరుకున్నాం. మహె దీవి భూభాగంలో ఇది 20 శాతం ఉంటుంది. అక్కడ రకరకాల చెట్లు కనువిందు చేస్తాయి. పైగా అక్కడ అన్నీ ఎత్తుపల్లాలే. ఎత్తైన కొండా, అక్కడి నుంచి కిందకు నిటారైన లోయా, లోయ అంచునే సముద్రమూ... ఎంతో ఆహ్లాదంగా అనిపించిందా ప్రాంతం. ఇక్కడే తేయాకు తోట ఉండటం విశేషం.

తరవాతిరోజు మహె ద్వీప ఉత్తర భాగానికి వెళ్లాం. ముందుగా ప్లెయూరి అనే చిన్న పర్వతం పైకి చేరుకున్నాం. ఇక్కడి నుంచి విక్టోరియా హార్బర్‌, పడవలూ కనిపిస్తుంటాయి. దగ్గరలోనే విక్టోరియా ఉద్యానవనం కూడా ఉంది. పర్యావరణ స్నేహ పర్యటకంగా పిలిచే ఈ వనంలో మొక్కల పరిరక్షణ, లాండ్‌స్కేపింగ్‌ పెంపకం గురించి వివరిస్తారు. సీషెల్స్‌ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ వనాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తోంది. విదేశీయులు ఈ వనంలోకి వెళ్లాలంటే ప్రవేశ రుసుము పది సీషెల్స్‌ రూపాయలు. అది చూశాక కెన్విన్‌ హౌస్‌ అనే పురాతన లైబ్రరీకి వెళ్లాం. అక్కడ శతాబ్దాల నాటి పుస్తకాలను భద్రపరిచారు. అక్కడినుంచి టూర్‌ డె హార్‌లోగ్‌ అనే చారిత్రక ప్రదేశానికి చేరుకుని గడియార స్తంభం, పాంటినే జూబ్లీ డైమండ్‌ కట్టడం, వియాయగర్‌ అనే హిందూ దేవాలయాన్నీ చూశాం.

కృత్రిమ దీవి!
తరవాత బెయు వలోన్‌కి చేరుకుని కాసేపు అక్కడి బీచ్‌లో గడిపి, సీషెల్స్‌ రాజధాని ప్రాంతమైన విక్టోరియాకి వెళ్లాం. దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశం ఇది. ఆ దేశ రాజు నివాసం ఇక్కడే ఉంది. అది చాలా సాధారణంగా ఉంది. దానిముందు కేవలం ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉండటం చూసి విస్తుబోయాం. తరవాత విక్టోరియాలోని జార్డిన్‌డెస్‌ ఎన్పాంట్‌ అనే హరితవనాన్ని చూసి, అక్కణ్నుంచి జిగ్‌జాగ్‌ వార్డ్‌ అనే ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడి సముద్రంలో ఎడెన్‌ అనే కృత్రిమ ద్వీపాన్ని దుబాయ్‌ పామ్‌ జువేరా తరహాలో నిర్మించారు. దీన్ని వంతెనతో మహె దీవికి అనుసంధానించారు.

సీషెల్స్‌లో చూడదగ్గ మరో విశేషం ప్రెగేట్‌ దీవి. అది ప్రపంచ సంపన్నుల స్వర్గం. అక్కడి రిసార్టులో ఒక్కరోజుకి సుమారు మూడు లక్షల రూపాయల పైనే రుసుము. మహె విమానాశ్రయం నుంచి హోటల్‌ వారే వచ్చి హెలీకాప్టర్‌లో తీసుకెళ్తారట. దాంతో మేం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయకుండా మహె దీవి నుంచే వెనుతిరిగాం.

ఎలా వెళ్లాలి?
మనదేశంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ 2 నుంచి వారంలో ఐదు రోజులపాటు మహె ద్వీపానికి నేరుగా విమాన సౌకర్యం ఉంది. స్థానికులు ఇంగ్లిష్‌ మాట్లాడతారు. యూరో లేదా డాలర్లు ఎక్కడైనా మార్చుకోవచ్చు. అయితే మనతో పోలిస్తే అక్కడ ఆహారపదార్థాల ధర నాలుగింతల పైనే. హోటల్‌ రిజర్వేషన్‌, తిరుగుప్రయాణ టిక్కెట్లు, ఆరునెలల కాలం ఉన్న పాస్‌పోర్టు, రోజుకి 150 చొప్పున డాలర్లు చూపించగలిగితే ఆన్‌ఎరైవల్‌ ఉచిత వీసా లభిస్తుంది. ఆ దేశంలో 30 రోజుల వరకూ హాయిగా పర్యటించవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.