close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మెరిసే చర్మంకోసం...

మెరిసే చర్మంకోసం...

ర్మసౌందర్యంకోసం పైపై పూతలు పూసేకన్నా ఆహారం ద్వారా తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అంటున్నారు అందాల నిపుణులు. అవేమంటే...
* కమలాల్లో పుష్కలంగా ఉండే విటమిన్‌-సి చర్మ మృదుత్వాన్నీ సాగేగుణాన్నీ పెంచే కొలాజన్‌ కణాల ఉత్పత్తిని పెంచడంతోబాటు చర్మకణాల పునరుత్పత్తిని పెంచి, పిగ్మెంటేషన్‌నీ తగ్గిస్తుంది.
* టొమాటోల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ముడుతలు పడకుండా చేస్తాయి.
* వెల్లుల్లిలోని ఎలిసిన్‌, చర్మంలోని హానికర బ్యాక్టీరియా, వైరస్‌లను నియంత్రించడం ద్వారా మొటిమలు రాకుండా కాపాడుతుంది.
* బాదం, జీడిపప్పు, వేరుసెనగ వంటి నట్స్‌లోని జింక్‌, సెలీనియం... వంటి ఖనిజాలూ; చేపల్లోని ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలూ మొటిమల్ని నిరోధిస్తాయి. ప్రొబయోటిక్‌ పదార్థమైన పెరుగు పొట్టలో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. అందులోని లాక్టిక్‌ ఆమ్లం చర్మంలోని మృతకణాలు
తొలగిపోయేందుకూ దోహదపడుతుంది.
* బ్రకోలీలో పుష్కలంగా ఉండే విటమిన్‌-సి, విటమిన్‌-ఇ కూడా చర్మం బిగుతుకి కారణమైన కొలాజన్‌ కణాల ఉత్పత్తిని పెంచడంతోబాటు అతినీలలోహిత కిరణాల నుంచీ చర్మాన్ని కాపాడతాయి. క్యారెట్లలోని విటమిన్‌-ఎ దెబ్బతిన్న చర్మకణాలను ఫ్రీ-రాడికల్స్‌ నుంచి రక్షిస్తుంది. కాబట్టి
ఆరోగ్యంగా తినండి... అందంగా మెరవండి..!


అమ్మో... క్యాన్సరే..!

క్యాన్సర్‌... పేరు వింటేనే రోగి బెదిరిపోతాడు ఆ భయంతోనే అది మరింతగా దాడి చేస్తుంది. అయితే శరీరంలోని ఏ భాగానికి అయినా క్యాన్సర్‌ రావచ్చు. ఆయా భాగాన్ని బట్టి కూడా క్యాన్సర్‌ రోగుల ఆయుష్షు ఆధారపడి ఉంటుంది అంటున్నారు నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన నిపుణులు. ఉదాహరణకు రొమ్ము, ప్రొస్టేట్‌, టెస్టిక్యులర్‌, థైరాయిడ్‌, మెలనోమా, సెర్వైకల్‌... వంటి క్యాన్సర్లలో మొదటి రెండో దశల్లోనే ఆ వ్యాధిని గుర్తించి, చికిత్స అందిస్తే సదరు రోగి కనీసం ఐదేళ్లపాటు జీవిస్తాడని వారు చెబుతున్నారు. ఆయా కంతుల సైజుని బట్టీ రోగి స్థితిని బట్టీ కొందరిలో అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి క్యాన్సర్‌ అనగానే ముందే భయపడకుండా అది మిగిలిన భాగాలకు వ్యాపించకుండా వెంటనే సరైన చికిత్సను తీసుకోవాలి అంటున్నారు వైద్య నిపుణులు.


పొట్లాడుకుంటున్నారా?

పిల్లలముందు తల్లిదండ్రులు తరచూ పోట్లాడుకుంటే దాని ప్రభావం ఆయా పిల్లల మీద అంతో ఇంతో తప్పక ఉంటుంది. ఆ గొడవలు వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లల నుంచి టీనేజర్ల వరకూ మానసిక ఆరోగ్యంమీద ప్రభావం చూపిస్తాయి అంటున్నారు ససెక్స్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ముఖ్యంగా వాళ్లు తోటిపిల్లలతో కలవలేరు. ఆనందంగా ఉండరు. అదే ఆలోచిస్తూ చదువులోనూ వెనకబడతారు. కొన్నిసార్లు పిల్లలు నిద్రపోతున్నారులే అని పెద్దవాళ్లు గట్టిగా అరుచుకుంటుంటారు. కానీ నిద్రపోతున్న స్థితిలో కూడా ఆ అరుపుల్ని పిల్లలు వింటారనీ దానివల్ల వాళ్లలో ఒత్తిడి పెరుగుతుందనీ వివరిస్తున్నారు. నిజానికి విడాకులు తీసుకున్న కేసుల్లోకన్నా తరచూ పోట్లాడుకునే వాతావరణంలో పెరిగే పిల్లల్లోనే మానసిక ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లల్లో రోగనిరోధకశక్తి తగ్గి పెద్దయ్యాక మధుమేహం, హృద్రోగాలు, ఆస్తమా... వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ చెబుతున్నారు. పైగా వాళ్లు ఎక్కువసమయం ఇంటిబయట గడిపేందుకే ఇష్టపడతారనీ దురుసుగా కఠినంగా వ్యవహరిస్తారనీ చెబుతున్నారు. కొందరు పిల్లల్లో అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, చెడు అలవాట్లకి బానిస కావడం... వంటి నేరపూరిత లక్షణాలన్నీ చోటుచేసుకుంటాయనీ హెచ్చరిస్తున్నారు.


ఒత్తిడితోసతమతమవుతున్నారా?

ధునిక జీవనశైలిలో ఒత్తిడి ఓ భాగమైపోయింది. కార్టిసాల్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా విడుదల కావడమే దీనికి కారణం అన్నది తెలిసిందే. అయితే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని, చికిత్స చేయాలంటే అటు రోగులూ ఇటు వైద్యులూ కూడా లాబొరేటరీల్లో రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకే కేవలం స్వేదం ద్వారానే కార్టిసాల్‌ శాతాన్ని లెక్కించే బయోసెన్సర్‌ ప్యాచ్‌తో కూడిన పరికరాన్ని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం రూపొందించింది. దీన్ని చర్మానికి అతికించుకోవడం ద్వారా స్వేదంలోని పొటాషియం, సోడియం అయాన్ల ప్రవాహం ఆధారంగా కార్టిసాల్‌ స్రావాన్ని లెక్కిస్తుంది. ఈ కార్టిసాల్‌ శాతాన్ని బట్టి వైద్యులు రోగుల్లోని పిట్యూటరీ, అడ్రినల్‌ గ్రంథుల పనితీరుని కచ్చితంగా లెక్కించి సరైన చికిత్సను అందించడానికి వీలవుతుంది. అదేసమయంలో దీని ద్వారా ఎవరికి వాళ్లు కూడా కార్టిసాల్‌ శాతాన్ని తెలుసుకుని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు అంటున్నారు. ఓ ఇరవై నిమిషాలపాటు నడిచేటప్పుడూ పరిగెత్తేటప్పుడూ ఈ ప్యాచ్‌ని చేతికి పెట్టుకుని తరవాత తీసేస్తే చాలు, దానికి అనుసంధానమై ఉండే పరికరంలో రీడింగ్‌ వస్తుంది అని వివరిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.