close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తోటమాలి

తోటమాలి

- కోటమర్తి రాధాహిమబిందు

‘‘నువ్వు అలా మాట్లాడటం నాకేమాత్రం నచ్చలేదు గంగా’’ మొదటిసారి భర్త చేత మాట అన్పించుకుంది గంగ.
‘‘అమ్మాయి అల్లుడికి అంతా చెబుతుంది. అతను ఎలా రియాక్ట్‌ అవుతాడో?
ఈ తలనొప్పి మనం పెట్టుకోవటం ఇప్పుడు అవసరమా?
రిటైరయ్యాం... హ్యాపీగా గడపాలని ఎన్నెన్నో ఆలోచనలు చేశాం. ప్రశాంతంగా సాగే జీవితాల్లో...
వాళ్ళేదో అనటం మనం ఏదో అనటం మనమధ్య దూరాలు పెరగటం... ఏంటిదంతా?
అయినా మన కొడుకు పిల్లలంటే అదో స్వతంత్రం ఉంటుంది. ఒక అయ్య చేతిలో మన బిడ్డను పెట్టాం... వాళ్ళ పిల్ల అయింది... వాళ్ళ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకునే స్వతంత్రం మనకెలా ఉంటుంది?’’
‘‘ఎందుకుండదు... ఏంటండీ అలా మాట్లాడతారు? వేరే ఇంటికి పిల్లనిచ్చామని వాళ్ళ జీవితాల్లోకి తొంగిచూడకూడదా, వాళ్ళ బాగోగులు పట్టించుకోకూడదా? రిటైర్‌ అయిన తర్వాత ఆకాశ్‌కు పది లక్షలూ అమృతకు పది లక్షలూ ఇచ్చాం... ఇద్దరూ మనకు సమానమనుకునే కదా ఇచ్చాం.’’

‘‘అది వేరే విషయం గంగా...’’
‘‘వేరు కానే కాదు, ఒకటే. మీకు నచ్చకపోతే నేను ఏం చేయలేను.
నేను మీలా నెమ్మదిగా అలా చూసీచూడనట్లు ఉండలేను. చెడు అన్పిస్తే అడుగుతాను... అంతే.’’
‘‘ప్చ్‌, నీకెలా చెప్పాలి గంగా...’’
‘‘నాకేమీ చెప్పొద్దు, అర్థం చేసుకోవాలనిపిస్తే నన్ను అర్థం చేసుకోండి. నా మాటల్లో ఏం తప్పుందని మీకు నచ్చలేదు?’’
‘‘తప్పులేదు గంగా...’’
‘‘మరి ఎందుకు నచ్చలేదు అంటున్నారు?’’ భర్తను నిలదీసింది గంగ.
మాట్లాడలేకపోయాడు గోవర్ధన్‌.

*  *  *

గోవర్ధన్‌, గంగ అన్యోన్యమైన దంపతులు. ఇద్దరివీ మధ్యతరగతి కుటుంబాలు. కష్టసుఖాల అర్థం తెలిసినవాళ్ళు. పిల్లలు ఆకాశ్‌, అమృతలను ఎంతో పద్ధతిగా పెంచారు. క్లాసులో నాలుగు మార్కులు తక్కువ వచ్చినా ఫర్వాలేదుగానీ- విలువలు, సంప్రదాయం, పద్ధతులు అంటూ వాళ్ళను తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళూ వీళ్ళకు అనుకూలంగానే ఉన్నారు. ఏది చెబితే అది పాటించారు. ‘వాళ్ళ కుటుంబం చూడముచ్చటగా ఉంటుంది’ అని చాలామందిచేత ప్రశంసలు కూడా అందుకున్నారు. వాళ్ళ చదువులు ముగిసి, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయి వాళ్ళూ తల్లిదండ్రులు అయ్యారు. ఆ పిల్లలూ చదువులకు వచ్చారు.
ఆకాశ్‌ ఢిల్లీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నందిని- కాస్త ఉన్న ఇంటినుండి వచ్చిన పిల్లే అయినా, భర్తకు అనుకూలంగా ఉంటూ అత్తమామలు భర్తకు ఇచ్చిన ట్రైనింగ్‌ గురించి విని తమ పిల్లల్ని అలా తీర్చిదిద్దుకోవాలని మొదట్లోనే అనుకుంది, అలాగే పాటించింది కూడా.
ఆ పిల్లలంటే గంగకు ఎనలేని ప్రేమ. మనవడు, మనవరాలు అని కాదు - పద్ధతిగా ఉన్నారని - తన పిల్లల్లా వాళ్ళూ పెరుగుతున్నారని. ఇప్పుడు ఆ పిల్లలు ఎయిత్‌, ఫిఫ్త్‌కు వచ్చారు. కూతురు అమృత పిల్లలు కూడా మొదట్లో బాగానే ఉన్నారు. రానురానూ వాళ్ళల్లో తేడా గమనిస్తున్న గంగ తట్టుకోలేకపోయింది. అల్లుడితో మాట్లాడితే బాగుండదు, ఎంతయినా పరాయివాడే. అమ్మాయితో మాట్లాడితే బాగని అనుకుంది. మాట్లాడింది.
తెల్లారింది. కూతురు ముభావంగా అటూ ఇటూ తిరుగుతుంటే తనూ ముభావంగానే ఉంది గంగ. అల్లుడు విక్రమ్‌ పేపర్‌ చూస్తూ కూర్చున్నాడు. గోవర్ధన్‌ కూడా పేపర్‌ చూస్తున్నాడు. నలుగురికీ ట్రేలో కాఫీ కప్పులు పెట్టుకుని వచ్చింది గంగ. తలా ఒక కప్పు ఇచ్చి భర్త పక్కన కూర్చుంది. నలుగురూ ఏమీ మాట్లాడుకోకుండా కాఫీ తాగారు. చిరాగ్గా ఫీలయింది గంగ.
‘‘వర్షను మేం దత్తత తీసుకోవాలనుకుంటున్నాం’’ అంది.
‘‘వర్ష ఒక్కదాన్నే ఎందుకు, విహాన్‌ను కూడా దత్తత తీసుకోండి’’ నవ్వుతూ అన్నాడు విక్రమ్‌. ఆ నవ్వు వెనకాల వ్యంగ్యం కన్పించింది గంగకూ గోవర్ధన్‌కూ.
‘‘అమ్మా, అసలు ఏంటి నీ ప్రాబ్లమ్‌?’’ నిలదీసింది అమృత.
ఎప్పుడూ అలా మాట్లాడలేదు అమృత. గోవర్ధన్‌ మనసు చివుక్కుమంది. అమృత అలా మాట్లాడిన దానికంటే ఎక్కువగా గంగ మనసు నొచ్చుకుంటుంది గదా అని.
‘‘నా ప్రాబ్లమ్‌ కాదు, ముందు ముందు నీకే ప్రాబ్లమ్స్‌ రాకూడదని.’’
‘‘నాకేం ప్రాబ్లమ్స్‌ వస్తాయి, ఏవీ రావు. విక్రమ్‌, ఈరోజు ఏంటి
నీ ప్రోగ్రాం?’’
‘‘సండే కదా, ఫ్రెండ్స్‌ అంతా కలవాలనుకున్నాం... నీ ప్రోగ్రాం?’’
‘‘ఈరోజు చాలా బిగ్‌ పార్టీ...
మెగా పార్టీ... ఫార్టీఎయిట్‌ మెంబర్స్‌ గాదర్‌ అవుతున్నాం.’’
‘‘ఓకే, ఓకే’’ మళ్ళీ పేపర్‌లో తలదూర్చాడు విక్రమ్‌. గోవర్ధన్‌ లేచి బయటకు వెళ్ళిపోయాడు. గంట తర్వాత చెరో కారులో విక్రమ్‌, అమృత వెళ్ళిపోయారు.
‘‘మీ సంగతేంటే..?’’ మనవరాల్ని అడిగింది గంగ.
‘‘మా ఫ్రెండ్స్‌ వస్తామన్నారు. ఈరోజు పిక్చర్‌ ప్రోగ్రాం వేసుకున్నాం.’’
‘‘అంతా పిల్లలేనా? ఎంతమంది వెళ్తున్నారు?’’
‘‘సిక్స్‌ మెంబర్స్‌. తమ్ముడు, నేను, డానీ, ప్రియతమ్‌, పింకీ, వాళ్ళ అక్క... ఆ అక్క ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. అందరం క్యాబ్‌లో వెళ్తాం. మా గురించి మీరు భయపడకండి, బెంగపడకండి. ఓకే. మా భోజనం హోటల్లోనే. మమ్మీ డబ్బులు ఇచ్చింది’’ వర్ష మాటల్లో ఎక్స్‌ప్రెషన్స్‌లో అమృతే కన్పించింది గంగకు.

*  *  *

‘‘సాయంత్రం మేం వెళ్తున్నాం అమృతా.’’
‘‘అప్పుడేనా... ఇంకో నాలుగు
రోజులు ఉండండమ్మా, నాన్న రిటైరయ్యారు కదా. ఇప్పుడేం బిజీ మీకు... అంతా లీజరే కదా.’’
‘‘లేదు. లైఫ్‌ని బిజీ చేసుకోవాలనుకుంటున్నాం.’’
‘‘ఎలా?’’
‘‘ఎలాగో అలా. మీ ప్లాన్స్‌ మీకు ఉన్నట్లు మా ప్లాన్స్‌ మాకు ఉంటాయి కదా...’’
‘‘ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు.’’
‘‘నాకు ఇక్కడ ఉండాలన్పించటం లేదు. మీ నలుగురూ ఎటువాళ్ళు అటు వెళ్తారు. ఇక్కడా ఇద్దరమే ఉంటున్నాం. అక్కడా ఇక్కడా ఒకేలాగా ఉంది మాకు. అందుకే వెళ్ళాలనుకుంటున్నాం. మీ నలుగురే అంతగా కలవరు. మీ నలుగురితో మేం కలిసి ఉండాలన్నది ఎలా కుదురుతుంది?’’
‘‘ఏంటమ్మా, నీ కోపం.’’
‘‘కోపంగాదే... బాధ... చాలా బాధ... ఆవేదన... ఏదో చెప్పాలి అని తపన. చెప్పినా వినే పరిస్థితిలేనప్పుడు ఎందుకు చెప్పటం అనే చెప్పలేని ఓ ఫీలింగ్‌.’’
‘‘వర్షను దత్తతకు అడిగావు- నేను బాగా పెంచటంలేదనేగా నీ ఫీలింగ్‌. నువ్వు మమ్మల్ని పెంచినంత ఈజీగాదు, ఇప్పటి పిల్లల్ని పెంచటం. నువ్వు తట్టుకోలేవు. నేనూ తట్టుకోలేకే వాళ్ళని అలాంటి స్కూల్లో వేశాను. ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే సాయంత్రం అయిదు గంటలకు వస్తారు. నిజంగా మా ప్రాణాలకు హాయిగా ఉంది. యూనిఫాం వేసి పంపితే చాలు- టిఫిన్‌, భోజనం, స్నాక్స్‌... హోమ్‌వర్క్‌తో సహా వాళ్ళే చేయిస్తున్నారు. ఫీజు కట్టే శక్తి మనకుంది... ఇంకేం కావాలి. మీ అల్లుడు కష్టపడ్డన్నాళ్ళూ కష్టపడ్డారు, ఇప్పుడు తనకిందే పదిమంది ఉన్నారు, సుఖపడుతున్నారు.’’
‘‘అది కూడా ఎవరి సుఖం వారిది - ఎవరి సరదా వారిది.’’
‘‘నువ్వు ఎలాగైనా అనుకోమ్మా, మేం హ్యాపీగా ఉన్నాం. పిల్లలు చదువులో చాలా బాగున్నారు. అమ్మా, మీ రోజులకీ మా రోజులకీ ఇప్పటి రోజులకీ అస్సలు పోలిక పెట్టకు.’’‘‘పోలిక ఎందుకు పెట్టొద్దు, ఏం తేడా ఉంది? మా అమ్మా నాన్న చెప్పినట్లు మేం విన్నాం. మేం చెప్పినట్లు మీరు విన్నారు. మీరు చెప్పినట్లు మీ పిల్లలు వినటంలేదని నేననను. మీరు ఎందుకు చెప్పటంలేదని అడుగుతున్నాను.’’
‘‘అమ్మా, మీరు మమ్మల్ని పిల్లల్లా పెంచారు. మేం మా పిల్లల్ని ఫ్రెండ్స్‌లా పెంచుతున్నాం. అయినా, నా పిల్లలకు ఎందులో లోటు... సోషల్‌ నెట్‌వర్క్‌ క్షుణ్ణంగా తెలుసు, చదువులో ఫస్ట్‌,
ఆటల్లో ఫస్ట్‌...’’
‘‘అది చాలా?’’ అడ్డుపడింది గంగ.
‘‘మరింకేం కావాలి?’’
‘‘సంస్కారం, విలువలు కూడా కావాలి. చదువులు కచ్చితంగా వస్తాయి. కాస్త అటూ ఇటూ అయినా ఫర్వాలేదు. కానీ...’’
‘‘ఊఁ... కానీ...’’
‘‘పిల్లలు మంచి మార్గంలో నడవాలి,
ఆ మార్గం మీరే సృష్టించాలి. జాగ్రత్తగా వెళ్తున్నారా లేదా అని మీరు గమనించుకోవాలి. మా ఇష్టమైన మార్గంలో మేం వెళ్తాం అన్నా... వాళ్ళని అనుక్షణం పట్టించుకోవాలి. మీరే ఈ మార్గంలో వెళ్ళు అంటూ అధ్వాన్నమార్గం సృష్టించినా దిద్దుకోలేని తప్పే అవుతుంది.’’
‘‘ప్చ్‌... నాకేం అర్థంకావట్లేదమ్మా!’’
‘‘నేను మాట్లాడుతోంది తెలుగే. నువ్వు నడిచివచ్చిన బాటలో నీ పిల్లల్ని నడిపించమంటున్నాను. నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు అని తెగ మురిసిపోతున్నావు నువ్వు. కానీ నీ పిల్లల గురించి నేను ఎంతగానో ఆలోచిస్తున్నాను. నాలుగైదు సంవత్సరాలుగా వాళ్ళల్లో ఎంతో మార్పు వచ్చింది. అది మీ పెంపకంవల్లే వచ్చింది.’’
‘‘అమ్మా...’’
‘‘పిల్లలు దగ్గరికొస్తే చాలు ‘నన్ను చిరాకు పెట్టకండి, సెల్‌ చూసుకోండి’ అనేదానివి. అప్పటినుండే నీ పద్ధతి మాకు నచ్చలేదు. పిల్లకి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు, వాడికి తొమ్మిది సంవత్సరాలు. వాళ్ళ మాటలు ఎలా ఉంటున్నాయో, వాళ్ళ లెవల్‌ ఎలా ఉంటోందో గమనిస్తున్నావా? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం అన్నావు. ఫ్రెండ్లీగా ఉండటం అంటే ఏంటి? వాళ్ళు చిన్నపిల్లలు, నీ పిల్లలు. నీ వయసు వేరు, వాళ్ళ వయసు వేరు. నీ క్లబ్బులోని ఎవరెవరి గురించో మీ పిల్లల ఎదురుగా మీరు చర్చించుకోవటం ఏంటి? ఇంట్లో వంట అన్నది పూర్తిగా మర్చిపోయారు. అల్లుడు ఎక్కడో తింటాడు, పిల్లలు స్కూల్లో తింటారు, నువ్వూ అంతే. విపరీతంగా ఫ్రెండ్స్‌ నీకు. ఎంతసేపూ సెల్‌లో మాట్లాడుకోవడం, బయట తిరగడం.
నీకు సంబంధించినవన్నీ వదిలేసుకుంటూ సంబంధంలేనివన్నీ ఇష్టం చేసుకుంటున్నావు. నేను వేడిగా ఉన్న అన్నంలో పచ్చడి కలిపి పెడితే పిల్లలు అవురావురుమంటూ తింటున్నారు. పప్పూ పచ్చడీ నెయ్యీ పెరుగూ... అలా ఒక పద్ధతి అంటూ పోయింది కదా... ఎంతసేపూ బర్గర్లూ పిజ్జాలూ జంక్‌ఫుడ్‌ ఇవే. మళ్ళీ లావైపోయామని రాత్రి చపాతీలు... అవీ బయటవే. ఈ వయసు నుండే పిల్లలకు డైటింగా. పిల్లకి బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వాలంటే మంచి బుక్స్‌ ఇవ్వాలి కానీ మేకప్‌ కిట్‌ ఇస్తావా? నీ ఫ్యాషన్‌ పిచ్చి అంత చిన్నపిల్లకు ఎందుకు ఎక్కిస్తున్నావు? అది ఎక్కడికి వెళ్ళినా పావుగంటసేపు మేకప్‌ అవుతుంది. స్కూలుకు కూడా లిప్‌స్టిక్‌ వేసుకుంటుంది. ఎన్ని నెలలయింది... దాని జుట్టుకు కాస్త కొబ్బరినూనె రాయక, పూర్తిగా చింపిరిజుట్టు అయింది... ఇదేం ఫ్యాషన్‌? ఆ చిరిగిన బట్టలు ఏంటి? ఎంత చిరుగులు ఎక్కువగా ఉంటే ధర అంత ఎక్కువటగా... నాకు తెలియదు, ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఆమధ్య దానికి మేం డబ్బులు ఇచ్చి డ్రెస్‌ కొనుక్కోమన్నప్పుడు ప్యాంట్‌, షర్ట్‌ కొన్నావట నువ్వు. మొన్న అది తీరిగ్గా కత్తెరతో కొత్త బట్టలను ఫ్యాషన్‌ పద్ధతిలో కట్‌ చేస్తోంది. నేను కోప్పడ్డాను. అది నిర్లక్ష్యంగా ఓ చూపు చూసి, దాని పని అది చేసింది. మా మమ్మీ, డాడీయే మమ్మల్ని ఏమీ అనరు, మీరెవరు మమ్మల్ని అనటానికి అన్నట్టుగా అన్పించింది నాకు.’’
‘‘ఏమో, కట్‌ చేసిన విషయం నాకు తెలియదు. మోడ్రన్‌గా ఉంటే తప్పనుకుంటే నేనేం చెప్పలేను. పాత చింతకాయ పచ్చడిలా ఉండాలంటే ఇప్పుడు కుదరదు.’’
‘‘పాత చింతకాయ పచ్చడి చాలా మంచిది శరీరానికి. అది రోగాన్ని తిరగబెట్టకుండా చేస్తుంది. ఇక మోడ్రన్‌గా ఉంటే తప్పేంటి అని నువ్వడగటం చోద్యంగా ఉంది. నీ పిల్ల మోడల్‌ కాదు. అది వెళ్ళేది స్కూలుకు, నీలాగా క్లబ్బులకూ పార్టీలకూ కాదు. డబ్బు విలువ అస్సలు తెలియదు. నిన్న విహాన్‌ గొడవ చేశాడుగా... ‘ఆఫ్ట్‌రాల్‌ థౌజండ్‌కు ఎందుకు మమ్మీ అలా మాట్లాడతావు’ అని- వాడు అలా అనటం కరెక్టేనా? వాడి గోల భరించలేక అడిగినంతా ఇచ్చావు. అది ముందు ముందు ఎలాంటి పరిణామాలు తెచ్చిపెడుతుందో మనం చెప్పలేం. డబ్బు ఎట్లా వచ్చిందో వాళ్ళకు తెలియాలి. ఎంత కష్టపడితే ఆ సంపాదన వస్తుందో దాని విలువ తెలియాలి. విలువలేని దానికి యూసేజ్‌ ఎలా ఉంటుందో తెలియదు. పాకెట్‌మనీ అంటూ పిల్లలకు అంతంత డబ్బు ఇస్తారా? మీ పనులకూ మీ సరదాలకూ అడ్డంగా ఉన్నారని వాళ్ళ దారి వాళ్ళు చూసుకునేలా స్వేచ్ఛనిస్తారా?
నీ కూతురు వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతోంది ఫోనులో- ‘నా హెయిర్‌స్టైల్‌ సమంతలా, ఫేస్‌ రకుల్‌లా ఉందని పింకీ వాళ్ళ
అక్క అంది. నువ్వు సేమ్‌ టు సేమ్‌ దీపికా పడుకొనే. ఇలా తయారవకుండా అలా తయారవు అంటూ ఏంటేంటో చెప్పింది. వాళ్ళు స్టడీస్‌ గురించీ బుక్స్‌ గురించీ మాట్లాడుకోవటానికి ఇంట్రెస్ట్‌ చూపించటం లేదు. సినిమాలూ సినిమా యాక్టర్సూ మేకప్‌లూ... ఇలాంటివే అన్నీ. లేదా సెల్‌ఫోన్లూ మెసేజ్‌లూ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వగైరాలు. అమృతా, పిల్లల్లో చెడ్డ పిల్లలు అంటూ ఉండరు, పెంపకం చెడు అయితేనే పిల్లలు చెడిపోవటం జరుగుతుంది.
మా నాన్నగారు టీచర్‌. మా నాన్నగారు ఒక మాట చెప్పారు- ఆర్థిక ఇబ్బందులూ కష్టాలూ ఏవి ఉన్నా సరే... అవి పక్కనపెట్టి పిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేయాలని. నేను అది పూర్తిగా పాటించాను. కానీ నీలాగే చాలామంది పిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేయటం లేదు. ఆర్థిక ఇబ్బందులూ కష్టాలతో తీరికలేకనో ఇంకొకటో గాదు... అన్నివిధాలా అన్నీ ఉండి... అదేగదా బాధ కలిగించే విషయం. చేత్తో అన్నం తినిపించటాలు లేవు, పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవటాలు లేవు, కథలు చెప్పటాలు ఎప్పుడో ఎగిరిపోయాయి. పిల్లలు అడిగితే సెల్‌లో చూసుకో, టీవీలో చూసుకో అంటున్నారు. అసలు మీరిద్దరే ఒకరితో ఒకరు కలిసి కాలం గడపకపోతే ఇక పిల్లలతో ఏం గడుపుతారు?
కుటుంబ బంధాలూ అనుబంధాల విలువ వాళ్ళకెలా తెలుస్తుంది? మీ ప్రభావం మీ పిల్లల మీద బాగానే పడింది. అది గమనించుకోండి. నీ అదృష్టం... పిల్లలు బాగా చదువుతున్నారు- అదొక్కటే సంతోషించదగ్గ విషయం. 
ఇంట్లో పెద్దవాళ్ళు వద్దనుకున్నారు.
మీ అత్తామామల్ని ఇంటికి రానీయకుండా చాలా ప్రయత్నాలే చేశావు. మేం మెయింటెయిన్‌ చేసుకోగలం అన్నారు.
ప్రతీ విషయంలో మంచీ చెడూ ఉంటుంది. టీనేజీలో పిల్లలు చెడుకు తొందరగా ఎట్రాక్ట్‌ అవుతుంటారు. ఆ ఆకర్షణ అయస్కాంతంలా లాగేస్తుంది. ఎంతో జాగ్రత్తతో కాపాడుకోవాలి వాళ్ళని. అన్నయ్య పిల్లల్ని గమనించు... పిల్లలకు మంచి నడవడిక నేర్పు. నేను నిజంగానే అంటున్నాను అమృతా- మీరు ఇంకోసారి ఆలోచించండి. వర్షను మాకు దత్తతకు ఇవ్వండి. వాడిని హాస్టల్లో వేయండి. వాళ్ళను చూసుకునే తీరికలు మీకెలాగూ లేవు. పిల్లలు వికసించబోతున్న కుసుమాలు. నీ కుటుంబం
ఓ అందమైన తోటలా ఉండాలి.
ఆ తోటకు తోటమాలులు ఇద్దరుండాలి- ఒక్కరుగాదు. ఇద్దరూ కలసి తోటను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే ఆ తోట ఎంతో అందంగా ఎదుగుతుంది.
ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం మనకెంతో మానసిక బలాన్ని ఇస్తుంది’’ అంటూ ముగించింది గంగ.

*  *  *

మొబైల్‌ మోగింది.
‘‘గంగా... అమృత ఫోన్‌’’ అంటూ గంగకు మొబైల్‌ను ఇచ్చాడు గోవర్ధన్‌.
‘‘అమృతా... చెప్పు’’ అంది గంగ.
‘‘అత్తయ్యగారూ, నేను విక్రమ్‌ని.’’
‘‘ఆఁ... చెప్పండి అల్లుడుగారూ’’ కంగారుపడింది గంగ.
‘‘పిల్లలకు దసరా హాలీడేస్‌ వస్తున్నాయి కదా... ఆకాశ్‌నూ నందితనూ పిల్లల్ని తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను. అమృత కూడా వాళ్ళతో మాట్లాడింది. వస్తామన్నారు. మా రెండు ఫ్యామిలీస్‌ కలవక టూ ఇయర్స్‌ అయింది.
ఆ విషయమే మీకు చెబుదామని ఫోన్‌ చేశాను. మీరూ రావటానికి ప్లాన్‌ చేసుకోండి. అమ్మా నాన్నగారికి కూడా చెప్పాను. వాళ్ళూ వస్తామన్నారు. అమ్మా నాన్నగారు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు.’’
‘‘చాలా సంతోషం. వర్షను దత్తత తీసుకునే ఆలోచన ఇక నాకు లేదు.’’
‘‘థ్యాంక్యూ. ఆరోజు అమృతతో మీరు మాట్లాడింది ఆ సమయంలో అనుకోకుండా వచ్చిన నేనూ విన్నాను.’’
‘‘అవునా’’ నవ్వింది గంగ. ‘నేనూ మీరు వినటం గమనించాను’ అని గంగ అల్లుడితో చెప్పదల్చుకోలేదు.
‘‘అత్తయ్యగారూ, మామయ్యగారికోసారి ఫోన్‌ ఇవ్వండి.’’
‘‘ఆఁ ఇస్తున్నాను’’ అంటూ చిరునవ్వుతో భర్తకు ఫోన్‌ అందించింది గంగ.


ఇట్లు... నీ మామగారు

ప్రియమైన అల్లుడూ...
టీచరు ఉద్యోగం చేసే అల్లుడు దొరికినందుకు నేను గర్వపడుతుంటాను. వేసవి సెలవులొస్తే చాలు నా మనసుకు నువ్వే గుర్తొస్తుంటావు. ఈసారి కూడా మన తోటలో కాసిన మామిడికాయలు ఒక బస్తా, పెరట్లో కాసిన చింతకాయలు ఒక బస్తా, కొండ ఉసిరికాయలు అరబస్తా మన ఊరివాళ్ళ చేత మీ ఇంటికి పంపిస్తున్నాను. మీ అత్తయ్యకు ఆవకాయ అంటే ఆరోప్రాణమని నీకు తెలుసు. చింతకాయ పేరు వింటేనే నా ఒక్కగానొక్క కూతురు... అదే నీ భార్య ఆనందంతో ఎంతగా గంతులేస్తుందో నాకు తెలుసు. ఇకపోతే నీకూ నాకూ... ఈ వేసవిలో ఎండదెబ్బ తగలకుండా ఉండాలంటే ఉసిరికాయ ఎంతో అవసరం అని ఎంతమందికి తెలుసు? ఓ ముప్పావు బస్తా మామిడికాయలు శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టి పెద్దపెద్ద ముక్కలు తరిగి జిబజిబలాడే నూనెలో తేలియాడేటట్లుగా ఆవకాయ పెట్టు. మిగిలిన పావు బస్తా కాయలతో ముక్కల పచ్చడి పెడతావో తొక్కుపచ్చడి పెడతావో నీ ఇష్టం. అలాగే చింతకాయల్ని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకో. ఆరిన తర్వాత చెక్క రోకలితో నాలుగు దెబ్బలేసి చెదురుమొదురుగా దంచి ఉప్పూ పసుపూ వేసి ఊరబెట్టు. ఇక మిగిలింది ఉసిరికాయలు. సగం ఉసిరికాయల్ని సన్నగా కత్తిగాటువేసి తొక్కిపెట్టు. తేనెలో ఊరిన ఉసిరికాయల్ని ప్రతిరోజూ ఉదయాన్నే నీ భార్యా నా భార్యా నీ పిల్లలూ ఎంతో ఇష్టంగా తింటారు. తొక్కుపచ్చడిని నువ్వూ నేనూ ప్రతిరోజూ చద్దన్నంలో అద్దుకుని తిందాం. కాబట్టి సెలవుల్లో నువ్వు మరే ఇతర పనులూ పెట్టుకోకుండా ఈ మూడు పనులకే నీ విలువైన సమయాన్ని కేటాయించు. ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మాయినీ పిల్లల్నీ తీసుకుని పచ్చడి జాడీలను భద్రంగా మోసుకుని మన ఊరికి బయలుదేరు. ప్రతిసారీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పట్నుంచీ ఏం తోచట్లేదు అంటుంటావు కదా... ఈసారి నీకు ఆ బెంగ అక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులూ సగ్గుబియ్యం వడియాలూ గుమ్మడి వడియాలూ అప్పడాలూ ఎలా పెట్టాలో నేను నీకు నేర్పిస్తాను. ఆ... అన్నట్టు చెప్పడం మరిచాను- వచ్చేటప్పుడు పెద్ద ప్లాస్టిక్‌ షీట్లు నాలుగు తెచ్చుకో. వడియాలను ప్లాస్టిక్‌ షీట్ల మీద పెట్టినట్లయితే త్వరగా ఎండిపోయి నీళ్ళు చల్లకుండానే చటుక్కున ఊడి చేతికొస్తాయి. అలా అలవోకగా వడియాలు వొలవడం ఎంత సరదాగా ఉంటుందో నువ్వే చూద్దువుగాని. నీ రాకకోసం మీ అత్తయ్య వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంది. ఈమధ్య ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా నువ్వెప్పుడొస్తావని అడుగుతున్నారట. ఊరు కాని ఊర్లో నువ్వు ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక ఉంటాను.

ఇట్లు
ఎల్లప్పుడూ నీ అభివృద్ధిని కోరుకునే నీ మామగారు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.