close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కార్పొరేట్‌ గ్రామం...కిళక్కంబలం!

‘కష్టపడి పనిచేసి వ్యాపారంలో పైౖకొస్తే... సంతోషంగా ఉంటుంది. మనతోపాటు మనదగ్గర పనిచేసేవారూ మనచుట్టూ ఉన్నవారూ మన ఊరూ సైతం బాగుపడితే...  సంతృప్తిగా ఉంటుంది. సంతోషం తాత్కాలికం. సంతృప్తి జీవితకాలం. రెండిట్లో నీకేం కావాలో నిర్ణయించుకో. దానికి తగ్గట్టుగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకో...’ అంటూ తండ్రి చెప్పిన మాటలు సబూ జాకబ్‌కు వేదవాక్కులయ్యాయి. సంతృప్తి విలువ తెలిసింది. అది పొందడానికి సబూ ఏం చేస్తున్నాడో తెలియాలంటే కేరళ వెళ్లాలి. అక్కడి కిళక్కంబలం గ్రామాన్ని చూడాలి!
‘నాలాంటి నిరుపేద తల్లి పిల్లలకు మూడు పూటలా కడుపు నిండా తిండి పెట్టగలుగుతోందంటే అది ఈ సూపర్‌మార్కెట్‌ చలవే. వంద రూపాయలకు వారానికి సరిపడా సరుకులు ఎవరిస్తారు...’ అంటుంది భర్తను కోల్పోయి కూలిపనులు చేస్తూ బిడ్డల్ని పోషించుకుంటున్న ఏలుకుట్టి కృతజ్ఞతగా.
‘మా ఊళ్లో మద్యం లేకుండా చేశాం. మొగుడు తాగి ఎక్కడ పడున్నాడో అన్న భయం లేకుండా ఆడవాళ్లంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు’ అంటుంది నర్సు గిరిజ.
‘కూలిపోయిన గుడిసె మీద టార్పాలిన్‌ కప్పి అందులోనే ఉండేవాళ్లం. ఓ పక్కన మంచం పట్టిన నాన్న, మరోపక్క చిన్న పిల్లలు. చాలా ఇబ్బంది పడేదాన్ని. ఓ రోజు ట్వంటీ20 ప్రతినిధులు మా ఇంటికి వచ్చారు. మా అవస్థ చూశారు. ఆ తర్వాత నాలుగు నెలలు తిరిగేసరికల్లా నాలుగు గదుల సొంతింటికి యజమానినయ్యాను’ ఆనందంగా చెప్తుంది సోఫీ.
‘పెద్ద పెద్ద కంపెనీలు. వాటిల్లో పనిచేసేవాళ్లకోసం బస్సులు రయ్యిరయ్యిన తిరిగేవి. దాంతో మా ఆటోలకు గిరాకీ ఉండేది కాదు. కడుపు మండిపోయేది. అలాంటిది ఇప్పుడు మాకందరికీ పని దొరికేలా చూశారు. ఆటో డ్రైవర్లందరికీ ఏడాదికి రెండు జతల యూనిఫారాలూ రెండు టైర్లూ ఉచితంగా ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఒకప్పుడు ఏ కంపెనీలను చూసి బాధపడ్డామో ఇప్పుడవే మా కడుపు నింపుతున్నాయి’ అంటాడు సురేష్‌.ఆ ఊరి వాళ్లను పలకరిస్తే ఓ వ్యాపార సంస్థ తమ జీవితాలను మార్చేసిన తీరు గురించి ఇలా లెక్కలేనన్ని కథలు చెబుతారు. ఆ మార్పుకు బీజమూ ఆ కథలకు కేంద్రమూ సబూ జాకబ్‌. ఊరి సౌభాగ్యంలోనే తన సంతృప్తి దాగి ఉందన్న నమ్మకంతో ఊరి బాగు కోసం ఆయన చేసిన ప్రయత్నమూ దాని ఫలితమే... ఈ మార్పు కథలన్నీ. కిళక్కంబలం 30వేల జనాభా ఉన్న ఓ గ్రామపంచాయతీ. నాలుగేళ్ల క్రితం వరకూ దేశంలోని లక్షలాది గ్రామాల్లో అదీ ఒకటి. ఇప్పుడు మాత్రం ఆ లక్షల గ్రామాల్లో ఇలాంటి పల్లె అదొక్కటే. ఆ ఊరి పంచాయతీ ఏ రాజకీయ పార్టీకీ చెందకపోవడం ఒక విశేషమైతే, ఓ వ్యాపారసంస్థ తమ సామాజిక బాధ్యత కింద గ్రామాన్ని పాలిస్తూ అభివృద్ధి చేయడం మరో విశేషం. ఆ విశేషాలను విడమరిచి చెప్పాలంటే అన్నా-కిటెక్స్‌ గ్రూపు కంపెనీల గురించీ, కిళకంబలం ఊరి గురించీ, ఆ రెంటినీ ఒక్క తాటిమీదికి తెచ్చి అభివృద్ధికి కొత్త అర్థం చెబుతున్న ట్వంటీ20 సంస్థ గురించీ, వీటన్నిటినీ సమన్వయం చేస్తున్న సబూ జాకబ్‌ గురించీ చెప్పుకోవాలి. ఆయనకు నిత్యప్రేరణగా నిలిచిన ఆయన తండ్రి గురించీ తెలుసుకోవాలి.అల్యూమినియంతో మొదలు!
సరిగ్గా యాభై ఏళ్ల క్రితం కేరళలో అన్నా అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రారంభమైంది. సీఎం జాకబ్‌ మొదట పాత సామాను అమ్మే వ్యాపారం చేసేవాడు. తర్వాత అల్యూమినియం పాత్రల్ని స్వయంగా తయారుచేయసాగాడు. సౌకర్యంగా ఉండే ఆ పాత్రలకు మంచి ఆదరణ లభించడంతో అన్నా అల్యూమినియం ఫ్యాక్టరీని పెట్టాడు. కొద్ది నెలల్లోనే ఫ్యాక్టరీ ఇంతింతై... అన్నట్లుగా విస్తరించింది. ప్రెషర్‌కుక్కర్లతో సహా పలురకాల వంటసామగ్రిని నాణ్యంగా తయారుచేస్తూ ఆ రంగంలో తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఆ ఆదాయంతో వ్యాపారాన్ని ఇతర రంగాల్లోకీ విస్తరించాడు. చేపట్టిన ప్రతి వ్యాపారంలోనూ విజయం సాధిస్తున్న జాకబ్‌ నైపుణ్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిమిత్తం 400 పవర్‌లూమ్స్‌తో వస్త్ర ఉత్పత్తి యూనిట్‌ పెట్టమని కోరింది. అదే 1975లో ప్రారంభమైన ‘కిటెక్స్‌’ (కిళక్కంబలం టెక్స్‌టైల్స్‌). లుంగీలూ పంచెలూ తువ్వాళ్లూ లాంటివి తయారుచేస్తూ అది ఎంతగా ఆదరణ పొందిందంటే అప్పటివరకూ ఆ రంగంలో రారాజుగా ఉన్న తమిళనాడుని మించిపోయింది. మరోపక్క ‘రెడీ టు ఈట్‌’ ఆహార పదార్థాల తయారీ ఎగుమతులు ప్రారంభించి విదేశాల్లోని భారతీయులకు దేశీయ ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇలా రోజురోజుకీ విస్తరిస్తున్న జాకబ్‌ వ్యాపార కుటుంబంలోకి ఇద్దరు కొడుకులూ వచ్చారు. చిన్న కొడుకు సబూ మహా చురుకు. బడినుంచి రావడం ఆలస్యం తండ్రి వెంటే తిరుగుతూ అన్నీ నేర్చుకునేవాడు.సొంత ఫ్యాక్టరీలో...
కొడుకు ఆసక్తి చూసిన తండ్రి పదమూడో ఏట అతడికి ఫ్యాక్టరీలో వాష్‌రూమ్స్‌ శుభ్రం చేయించే బాధ్యత అప్పజెప్పాడు. ఒకవేళ పనివాళ్లు రాకపోతే అతడే శుభ్రం చేయాలి. సబూ అలాగే చేశాడు. ఏడాది తర్వాత ప్రమోషన్‌ వచ్చింది. ఈసారి అల్యూమినియం ఫ్యాక్టరీ మొత్తాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత. అలా ఫ్యాక్టరీల్లోని అణువణువునూ చూస్తూ పెద్దయ్యాడు సబూ. కిందిస్థాయి నుంచి పనులన్నీ చేసుకుంటూ పైకి రావడంతో అతడికి నేలవిడిచి సాము చేయడం తెలియదు. ఇప్పటికీ తమ కంపెనీల్లో జీతాలు పెంచాలంటే ముందుగా పెంచేది పారిశుద్ధ్యపనివారి జీతాలేనంటాడు సబూ. డిగ్రీ చదువుతూండగా టెక్స్‌టైల్‌ కంపెనీ అభివృద్ధికి ఏం చేయాలో ఆలోచించమన్నాడు తండ్రి. అలా డిగ్రీ పూర్తికాగానే వ్యాపారబాధ్యతల్ని స్వీకరించాడు సబూ. కిటెక్స్‌ నిర్వహణ చూసుకుంటూనే తండ్రి ఇచ్చిన 15 ఎకరాల భూమిని చూపించి బ్యాంకులో రుణం తీసుకుని కిటెక్స్‌ గార్మెంట్స్‌(రెడీమేడ్‌ దుస్తుల తయారీ యూనిట్‌) ప్రారంభించాడు సబూ. పిల్లల దుస్తులు కుట్టించి ఎగుమతి చేయాలన్నది ప్లాను. వివిధ ప్రాంతాల్లో ఉన్న వస్త్ర పరిశ్రమల్ని సందర్శించి మేలైన నిర్వహణ పద్ధతుల్ని తెలుసుకుని 1995లో ఉత్పత్తి ప్రారంభించాడు. తొలి ఐదేళ్లూ పోరాటం తప్పలేదు. కోచికి విమానయాన సౌకర్యం అంతగా ఉండేది కాదు. దాంతో విదేశీ కొనుగోలుదారులు రాలేకపోయేవారు. పెద్ద మొత్తం కమిషన్‌ ఇచ్చి మధ్యవర్తులమీద ఆధారపడడంతో నష్టాలొచ్చేవి. ఒక దశలో జీతాలు ఇవ్వడానికీ డబ్బుల్లేవు. దాంతో మధ్యవర్తుల మీద ఆధారపడడం మాని స్వయంగా రంగంలోకి దిగాడు సబూ. వివిధ కంపెనీలకు ఉత్తరాలు రాశాడు. 2000లో జెర్బర్‌లాంటి పెద్ద కంపెనీ ఆర్డర్లు రావడంతో ఆశలు చిగురించాయి. క్రమంగా కంపెనీ గాడిలో పడింది.ప్రపంచంలో మూడోది!
ఇప్పుడు కిటెక్స్‌ రెండేళ్లలోపు పిల్లల రెడీమేడ్‌ దుస్తుల తయారీలో ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో మూడోది. అక్కడ తయారయ్యే దుస్తుల్ని నూరుశాతం అమెరికా, యూరోపు మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. అత్యంత ఆధునిక యంత్ర సామగ్రితో పూర్తి ఎయిర్‌కండిషన్డ్‌ భవనంలో ఉన్న ఫ్యాక్టరీలో 10 వేల మంది కార్మికులు రోజుకు ఐదున్నర లక్షల దుస్తుల్ని తయారుచేస్తారు. ఏరోజు తయారైనవి ఆరోజే ఎగుమతికి వెళ్లిపోతాయి.
వాల్‌మార్ట్‌, టార్గెట్‌, టాయ్స్‌ ఆర్‌ అజ్‌, జెర్బర్‌, ద చిల్డ్రన్స్‌ ప్లేస్‌, మదర్‌ కేర్‌ లాంటి బ్రాండ్లు అమ్మేది ఇక్కడ తయారైన దుస్తుల్నే. పిల్లల దుస్తుల్ని ఎంచుకోవడంలోనే సబూలోని అసలు సిసలు వ్యాపారవేత్త కన్పిస్తాడు. ఏ వ్యాపారంలోనైనా ఒడుదొడుకులు ఉంటాయి కానీ పిల్లలకు సంబంధించిన వాటిల్లో మాంద్యం ఉండదు. ఎంత పేదలైనా తిండి మానుకుని అయినా పిల్లలకు మంచి బట్టలు కొనాలనుకుంటారు. అందుకే పెద్దల రెడీమేడ్‌ దుస్తులకోసం వచ్చిన ఆర్డర్లను తిరస్కరించి పిల్లల దుస్తుల తయారీలోనే కొనసాగాడు. పైగా ఈ విభాగంలో పోటీ తక్కువ. జడ్‌ కేటగిరీగా పరిగణించే పిల్లల దుస్తుల తయారీలో హానికరమైన రసాయనాల్ని వాడకూడదు. డిజైన్‌ నుంచీ గుండీలు పెట్టే రంధ్రం దాకా ప్రతిదీ మిల్లీమీటరు తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ కేటగిరీలో బిజినెస్‌ చేయడం కష్టం. కిటెక్స్‌లో ఆధునిక యంత్ర సామగ్రి వాడతారు. ఉత్పత్తులన్నీ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉంటాయి. ఫలితంగా వ్యాపారంలో తిరుగులేని విజయం సొంతమైంది.కార్మికుల సంక్షేమం
కేరళలో అందరూ గ్రాడ్యుయేట్లే కావడంతో కార్మికులుగా పనిచేయడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారెందరినో విధుల్లోకి తీసుకున్నారు. వారందరి కోసం 68 ఎకరాల్లో నివాస ప్రాంగణాన్ని నిర్మించారు. అందరికీ వసతీ భోజనం పూర్తిగా ఉచితం. కాంట్రాక్టు కార్మికులు ఉండరు. అందరూ పర్మనెంటే. దుస్తులు కుట్టీ కుట్టీ పనివాళ్ల కళ్లు ఒత్తిడికి గురికాకుండా కుట్టుమిషన్లలో ప్రత్యేకంగా ఎల్‌ఈడీ లైట్లను అమర్చే ఏర్పాటు చేశాడు సబూ. కార్మికుల సంక్షేమం కోసం అతిగా ఖర్చు పెడుతున్నాడని తోటి వ్యాపారవేత్తలు అతడిని విమర్శించేవారు. ‘వ్యాపారం బాగుండాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. కార్మికుల సంక్షేమం ఒక్కటి పట్టించుకుంటే ఆటోమేటిక్‌గా వ్యాపారమూ బాగుంటుందన్నది నేను నమ్మిన సిద్ధాంతం’ అంటాడు సబూ.కిటెక్స్‌లో పనివేళల్ని కచ్చితంగా పాటిస్తారు. లేటు షిఫ్టులుండవు. సాయంత్రం ఐదు కాగానే మెషీన్లన్నీ ఆటోమేటిగ్గా ఆగిపోతాయి. 5.10 కల్లా కార్మికులను తీసుకుని బస్సులు బయల్దేరతాయి. ఇళ్లకు వెళ్లేవాళ్లు ఇళ్లకు వెళ్తారు. పక్కనే ఉన్న హాస్టల్లో ఉండేవారి కాలక్షేపం కోసం క్రీడాప్రాంగణమూ  సాంస్కృతిక కేంద్రమూ ఉన్నాయి. ఐదుంపావుకి కంపెనీ సీఎండీ సబూతో సహా అందరూ బయటకు వచ్చేస్తారు. గేటుకి తాళం వేసేస్తారు. ఉద్యోగుల సంక్షేమం తర్వాత చూడాల్సింది... ఊరి గురించి. ఆఫీసు నుంచి నేరుగా సోదరుడు బాబీతో కలిసి ట్వంటీ20 సూపర్‌బజార్‌కి వెళ్తాడు సబూ. ఈ ట్వంటీ20 ఏమిటంటే...ఊరికోసం...
జాకబ్‌ సోదరుల సొంత ఊరు కిళక్కంబలం. అన్నా-కిటెక్స్‌ గ్రూపు ఫ్యాక్టరీలు అన్నీ అక్కడే ఉన్నాయి. గ్రామంలో సగానికి పైగా కుటుంబాల్లో ఇంటికి ఒక్కరైనా ఆ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నవారుంటారు. తమ దగ్గర పనిచేసేవారంతా బాగుండాలంటే గ్రామం బాగుండాలని భావించి అందుకోసం ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థే ట్వంటీ20. క్రికెట్‌ ఆడినంత ఉత్సాహంగా పనిచేయాలనీ, అంత వేగంగా అభివృద్ధీ కన్పించాలనీ ఆ పేరు పెట్టారట. అంతకు రెండేళ్ల ముందు 2011లో అన్నా గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు జాకబ్‌ మరణించడంతో ఆయన పేరు మీద పెద్ద ఎత్తున వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కొడుకులిద్దరూ. ఆ శిబిరానికి వచ్చినవారిని చూస్తే గ్రామంలో వైద్య వసతుల లేమి ఎంత తీవ్రంగా ఉందో వారికి అర్థమైంది. అప్పుడు నిపుణుల సహాయంతో గ్రామంలో ఒక సర్వే నిర్వహించి ప్రజల స్థితిగతులూ అవసరాలూ తెలుసుకున్నారు. ఆ వివరాల ఆధారంగా గ్రామంలోని కుటుంబాలను నాలుగు వర్గాలుగా విభజించారు. సగానికి పైగా ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండడం వారిని ఆలోచింపజేసింది. ఆ ఆలోచనలకు ఒక రూపం వచ్చాక 2013లో ట్వంటీ20ని ప్రారంభించారు. గ్రూపు కంపెనీల సీఎస్‌ఆర్‌ నిధులను ఆ సంస్థకు మళ్లించి తొలి రెండేళ్లలోనే దాదాపు 34 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. 47 రోజులు ఉద్యమించి మద్యం అమ్మకాల్ని మాన్పించారు. మద్యానికి అలవాటుపడిన వారికి చికిత్స చేయించి పునరావాసం కల్పించారు. గ్రామంలో కంపెనీ చేస్తున్న ఈ మంచి పనులేవీ స్థానిక రాజకీయ నాయకులకు నచ్చలేదు. దాంతో అనుమతుల పేరిట అడ్డంకులు సృష్టించడం మొదలెట్టారు. ఎన్నికల బరిలో దిగడమే సమస్యకి పరిష్కారమని భావించి 2015లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ సంస్థ ప్రతినిధులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దించారు సబూ సోదరులు. 19 వార్డు స్థానాలకు గాను 17 గెల్చుకున్నారు. అందులో 11 మంది మహిళలే. 67శాతం ఓట్లు సాధించి తొలిసారి రాజకీయాలకు అతీతంగా ఒక కార్పొరేట్‌ సంస్థ గ్రామపంచాయతీని కైవసం చేసుకుంది. అలా కిళక్కంబలం దేశంలోనే ప్రత్యేక గ్రామం అయింది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే కేరళలో ఒక కార్పొరేట్‌ సంస్థ ఇలా గ్రామాన్ని కైవసం చేసుకోవడం దేశ రాజకీయరంగాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని నాయకులు అభిప్రాయపడితే దశాబ్దాల తరబడి వారు ఏమీ చేయనందువల్లే మేం ట్వంటీ20లో ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నామన్నారు ప్రజలు. 2020 కల్లా ఆ గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నది ట్వంటీ20 ఆశయం. ఇప్పుడది రాజకీయ పార్టీగా గుర్తింపూ పొందింది.ప్రతివారూ బాధ్యులే!
ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడకుండా గ్రామంలోని ప్రతివారూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకునేలా చూస్తోంది ట్వంటీ20. పలు కమిటీల ద్వారా దాదాపు రెండువేల మంది దాకా గ్రామాభివృద్ధిలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నారు. ఇప్పుడీ వ్యవసాయాధారిత గ్రామంలో ఆధునిక పట్టణంలోని సౌకర్యాలన్నీ ఉంటాయి. ‘నా ఇల్లు’ పథకం కింద ఇళ్లు లేని పేదలకు మూడేళ్లలో 300 ఇళ్లు కట్టించి ఇచ్చారు.
ఇంకో 200 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో 800 ఇళ్లను మరమ్మతు చేసుకోడానికి ఇంటికి రూ.4 లక్షల చొప్పున ఇచ్చారు. మరుగుదొడ్లూ, కరెంటూ, నల్లా కనెక్షన్లూ లేని ఇళ్లకు అవన్నీ ఏర్పాటు చేశారు. 2020నాటికి గ్రామంలో అందరికీ ఇల్లు ఉండాలనేది సంస్థ ఆశయం. భూగర్భ జల సంరక్షణ చర్యలు చేపట్టి బావులూ, కాలవల్లో పూడిక తీయించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరకి అందజేసి, వృత్తి పనివారందరికీ వారి వారి వృత్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఆపరేషన్లకీ పెళ్లిళ్లకీ ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. గ్రామంలో సగానికి ఉచిత వైఫై సౌకర్యం కల్పించారు. ఏడాదిలో మొత్తం గ్రామాన్ని ఆన్‌లైన్‌ చేయాలన్నది ప్రయత్నం. ఇప్పుడు గ్రామంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా అందరి నోటా ఒకటే మాట ‘దిగుల్లేదు... ట్వంటీ20 ఉందిగా’ అన్నదే!ఆహారభద్రతకు పెద్దపీట
సంస్థ నిర్వహించిన ఆర్థిక సర్వేలో గ్రామంలో దాదాపు నాలుగున్నర వేల కుటుంబాలు కడు పేదరికంలో ఉన్నట్లు తెలిసింది. దాంతో అందరికీ ఆహారభద్రత కల్పించే నిమిత్తం సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం విశాలమైన భవనాన్ని నిర్మించి ఫుడ్‌ సెక్యూరిటీ బజార్‌ని ప్రారంభించారు. ఇక్కడ ఏడున్నర వేల కుటుంబాలు స్మార్టు కార్డుల సాయంతో మార్కెట్‌ ధరలో సగం ధరకే సరుకులను తీసుకుంటున్నాయి. వారానికి ఐదు రోజుల పాటు సాయంత్రం నుంచీ రాత్రి వరకూ ఇది తెరిచి ఉంటుంది. సాయంత్రం ఫ్యాక్టరీ అయిపోగానే సబూ సోదరుడు బాబీతో కలిసి ఈ సూపర్‌బజార్‌కి వస్తారు. అక్కడే గ్రామస్థులను కలిసి వారి సాధకబాధకాలు తెలుసుకుంటారు. జరుగుతున్న, జరగాల్సిన పనుల గురించి చర్చిస్తారు. వ్యాపార సంస్థలు లాభాల్లో 2శాతాన్ని సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టాలన్నది మనదేశంలో నియమం. కానీ కిటెక్స్‌ గ్రూపు మాత్రం 6 శాతం కన్నా ఎక్కువే ఖర్చుపెడుతోంది. సబ్సిడీ మీద సరుకులు ఇవ్వడానికే నెలకు కోటి రూపాయలపైన ఖర్చవుతోంది.

*  *  *  

ట్వంటీ20 పంచాయతీ పాలన చేపట్టగానే ‘కార్పొరేట్‌ సంస్థకేం తెలుసు గ్రామాన్ని పాలించడం... డకౌట్‌ తథ్యం’ అనుకున్నారు రాజకీయ పార్టీలవాళ్లు. ట్వంటీ20 మాత్రం రకరకాల సంక్షేమ పనులతో సిక్సర్లూ బౌండరీలూ సాధిస్తూ స్కోరు పెంచేసుకుంటోంది. 2020 ఎన్నికల ముందు తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసేనాటికి మరెన్నో పనులు చేసి రికార్డు స్థాయి స్కోరుతో ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోగలమన్న నమ్మకం- సంస్థదీ దాని సమన్వయకర్తలదీ.
నమ్మకానికి కృషి తోడైతే కల నిజం కావడం ఎంతసేపు..!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.