close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ ఆడపిల్లే అదృష్టం..!

అక్కడ ఆడపిల్లే అదృష్టం..!

‘యత్ర నార్యస్తు పూజ్యంతే... రమంతే తత్ర దేవతాః’ అన్నదానికి ఆ ప్రాంతం నిలువెత్తు నిదర్శనం. ఔను, అక్కడ అమ్మాయి పుడితే గొప్ప అదృష్టంగా భావిస్తారు. అపురూపంగా చూసుకుంటారు. ఇంటికి ఆడపిల్లే వారసురాలు. అంతేకాదు, పచ్చని ప్రకృతి అందాల తోడుగా ధవళవర్ణ హిమగిరి సొగసుల సాక్షిగా బౌద్ధమత సారాన్ని ఆసాంతం ఒంటపట్టించుకున్న ఆ ప్రాంతం, మనదేశంలో ఆనందానికి చిరునామాగానూ పేరొందింది. దివి నుంచి భువికి జారిపడినట్లుండే ఆ సౌందర్యసీమే... తవాంగ్‌ లోయ’ అంటున్నారు కోదాడ వాస్తవ్యులు వి.సోమిరెడ్డి.సంతోషాల సూచిక ప్రకారం మనదేశంలో ఆనందంగా నివసించే ప్రజల్లో తవాంగ్‌లోని మోంపాలదే ప్రథమస్థానం. అందుకే వాళ్లనీ ఆ ప్రాంతాన్నీ చూడాలని బయలుదేరాం. మనదేశమే అయినా అరుణాచల్‌ప్రదేశ్‌కి వెళ్లాలంటే ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ తప్పనిసరి. మనం ఎన్ని రోజులు అక్కడ ఉంటామో అన్ని రోజులకి మాత్రమే ఇస్తారు. ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఈ పర్మిట్‌ను చెక్‌పోస్టు దగ్గర చూపించాలి. మనదేశంలో అతిపెద్ద బౌద్ధ మొనాస్టరీ ఉన్న ప్రాంతం అదే. అక్కడ నివసించే మోంపా తెగ ప్రజలు టిబెటన్‌ బౌద్ధ ఆరాధకులు.ఎలా వెళ్లాలంటే...
ముందుగా మేం హైదరాబాద్‌ నుంచి గౌహతి గోపినాథ్‌ బార్డోలాయ్‌ విమానాశ్రయానికి చేరుకున్నాం. తవాంగ్‌కి రెండే రెండు మార్గాలు. ఒకటి గౌహతి హెలీకాప్టర్‌ సర్వీస్‌. ఇది బుధ, ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో ఉంటుంది. అదీ వాతావరణం అనుకూలంగా ఉంటేనే. అందుకే దీనికి రిజర్వేషన్‌ ఉండదు. అక్కడికి వెళ్లి ఉదయం 9 గంటల్లోపు తీసుకోవాల్సిందే. అదీ ఒకే ఒక్క హెలీకాప్టర్‌ ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది. 18 సీట్లు మాత్రమే ఉంటాయి. ధర 3,500. రెండోది గౌహతి- తేజ్‌పూర్‌-బొమిడిల్ల-సేలాపాస్‌-తవాంగ్‌ రోడ్డు రహదారిలో 440 కి.మీ.దూరం... సుమారు 13 గంటలు ప్రయాణించాలి. అందుకే విమానాశ్రయంలో దిగగానే అరుణాచల్‌ప్రదేశ్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి హెలీకాప్టర్‌ టిక్కెట్లు తీసుకున్నాం.
హెలీకాప్టర్‌ హిమాలయాలమీద నుంచి వెళుతుంటే ఆనందంగా అనిపించింది. ఎత్తైన పర్వతాలూ లోతైన లోయలూ; కొండల్లోంచి లోయల్లోకి దూకుతున్న జలపాతాలూ, అవి ఏరులై సెలయేరులై ప్రవహిస్తూ నదిలో కలిసే సంగమ దృశ్యాలూ... ఓహ్‌... అంతెత్తునుంచి ఆ ప్రకృతి అందాలను చూడటం మరచిపోలేని మధురానుభూతి.తొలి ఉషోదయ కిరణాలు..!
తవాంగ్‌లో దిగిన వెంటనే అక్కడ తిరగడానికి వాహనాలు మాట్లాడుకున్నాం. అక్కడ మే నెలలో మాత్రమే 15 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఉంటుంది. మిగిలిన నెలల్లో జీరో డిగ్రీలు సర్వసాధారణం. తవాంగ్‌ చుట్టూ ఉన్న పర్యటక ప్రాంతాలు 4000 నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఆక్సిజన్‌ తక్కువ. సాయంత్రం 4.30 గంటలకే చీకటిపడిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది.... మనదేశంలో తొలి సూర్యకిరణాలు పడేదీ ముందుగా చీకటిపడేదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోనేనని. మబ్బులు పడితే మూడు గంటలకే చీకటి పడుతుంది. రాత్రివేళ గదిలో హీటర్లు తప్పనిసరి. దుప్పట్లకు బదులు పరుపుల్లాంటి బొంతలు ఉన్నాయి. ఉదయం నాలుగున్నర గంటలకే పక్షుల కిలకిలరావాలు వినిపించడంతో బయటికి వచ్చాం. ఆకాశాన్ని చీల్చుకుంటూ వస్తోన్న ఉషోదయ కిరణాలను చూడగానే కలిగిన ఆనందం వర్ణనాతీతం.మాధురీ సరస్సు!
ఆ రోజు చైనా సరిహద్దుల్లో ఉన్న షంగెత్సర్‌ సరస్సును చూడ్డానికి బయలుదేరాం. రెండున్నర గంటలపాటు ఘాట్‌రోడ్డు ప్రయాణం. నాలుగువేల మీటర్ల ఎత్తైన కొండల్లో దట్టమైన మంచుమేఘాల మధ్యలో ప్రయాణం ఉత్కంఠగా అనిపించింది. దారిపొడవునా ప్రతి మూడు కి.మీ. దూరంలో ఆర్మీ క్యాంపు కనిపించింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం తరవాత అరుణాచల్‌ప్రదేశ్‌ గురించి ఇరు దేశాల మధ్యా నిరంతరం వివాదం చెలరేగుతూనే ఉంది. టిబెట్‌లో భాగంగా అరుణాచల్‌ను తన భూభాగంగా చైనా పరిగణిస్తుంది. కానీ మెక్‌మోహన్‌ రేఖ ప్రకారం అది భారత్‌ది అన్నది మన వాదన. అక్కడి ప్రజలు కూడా భారత్‌లో ఉండటానికే ఇష్టం చూపడంతోనూ ఐక్యరాజ్యసమితి జోక్యంతోనూ చైనా వెనక్కి వెళ్లింది.దారిలో కాసేపు కారు దిగి మంచులో ఆడుకుని మళ్లీ బయలుదేరాం. కొంతదూరం వెళ్లాక సిక్కు రెజిమెంట్‌ వాళ్లు ఆపి, ప్రయాణికులకు ఉచితంగా టీ, ఫలహారాలు కొసరి కొసరి పెట్టారు. వాళ్లు అంత చలిలో ఎంతో నిబద్ధతతో పెట్టడం గొప్ప విషయంగా తోచింది. అక్కడినుంచి ఓ గంట ప్రయాణించాక సముద్రమట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న షంగెత్సర్‌ సరస్సుకి చేరుకున్నాం. కోయ్లా సినిమాలో ఓ పాటను ఇక్కడ మాధురీ దీక్షిత్‌పై తీయడంతో దీన్ని మాధురీ లేక్‌ అనీ అంటారు. సరస్సుకి రెండు వైపులా ఉన్న పర్వతాలు దాని అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఈ సరస్సు భారత సైన్యం పర్యవేక్షణలో ఉంటుంది. పర్యటకులకోసం సరస్సుకి దగ్గరలోనే టాయిలెట్లూ ఉన్నాయి. వాటిని పరిశుభ్రంగా నిర్వహిస్తోన్న వాళ్లను ఎంత ప్రశంసించినా తక్కువే. ఇక్కడినుంచి చైనా సరిహద్దుల్లోని బూమ్లాపాస్‌కు వెళ్లేదారి ఉంటుంది. 1959లో దలైలామా టిబెట్‌ నుంచి తప్పించుకుని ఆ దారిలోనే భారత్‌కి వచ్చారట.వాళ్లకి భారత్‌ అంటేనే ఇష్టం!
మర్నాడు తవాంగ్‌లోని ప్రసిద్ధ బౌద్ధ మొనాస్టరీకి బయలుదేరాం. దారి పొడవునా చిన్న చిన్న చెక్క ఇళ్లు కనిపించాయి. ఈశాన్య భారతంలో టెర్రరిస్టులూ ప్రాంతీయ ఉద్యమాలూ లేని ప్రాంతం తవాంగ్‌ అనే చెప్పాలి. స్థానిక మోంపాలు సచ్ఛీలురు. శాంతిప్రియులు. ప్రకృతిప్రేమికులు. కష్టజీవులు. సాయం చేయడానికి ముందువరసలో ఉంటారు. వాళ్లకి భారత్‌ అంటే ఎంతో ఇష్టం. బౌద్ధగురువైన దలైలామాను చైనా ప్రభుత్వం లాసాలోని పొటాలా ఆశ్రమంలో బంధించినప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని దక్షిణ టిబెట్‌ గుండా తవాంగ్‌లోకి ప్రవేశించాడు. భారత శరణార్థిగా వచ్చిన ఆయన్ని అస్సాం రైఫిల్స్‌ క్షేమంగా ముస్సోరీ చేర్చింది. తరవాత  ప్రభుత్వం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాస స్థలం ఏర్పాటుచేసింది. అందుకే వాళ్లకి భారత్‌ అంటే అభిమానం.
తవాంగ్‌లోని ప్రాచీన ఆశ్రమాన్ని 1681లో మెరిక్‌ లామా లోడ్రే గ్యాట్సో స్థాపించాడట. ఆ తరవాత 5వ దలైలామా స్థానికుడు కావడంతో దీన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ ఆశ్రమానికి వెళ్లడానికి మెట్లదారి, వాహనదారి ఉన్నాయి. అంతెత్తుకి కాలినడకన వెళ్లడం కష్టం అని వాహనంలో వెళ్లాం. లోపల 18 అడుగుల ఎత్తులో బంగారు వర్ణంలో బుద్ధ విగ్రహం కనిపించింది. ఆయన పాదాల వద్ద ప్రస్తుత గురువు 14వ దలైలామా చిత్రపటం ఉంది. బుద్ధుని విగ్రహం ముందు ప్రశాంతంగా కూర్చోవడానికి మెత్తటి పరుపులు ఉన్నాయి. మెట్లమీదుగా మొదటి అంతస్తులోకి వెళ్లాం. బుద్ధుడు అక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాడు. మరో అంతస్తు ఎక్కితే బుద్ధభగవానుడి శిరస్సుకి సమాంతరంగా మనం నిల్చుని ఉంటాం. ఆయన మన కళ్లలోకి చూస్తున్నట్లే ఉంటుంది.
అక్కడినుంచి తవాంగ్‌ బౌద్ధ మ్యూజియంలోకి వెళ్లాం. అందులో 19ఏళ్ల వయసులోని దలైలామా చిత్రంతోబాటు మోంపాల జీవనశైలిని తెలిపే చిత్రాలు ఉన్నాయి. మోంపాలది మాతృస్వామ్య వ్యవస్థ. స్త్రీకి అత్యంత గౌరవం ఇస్తారు. ఆడపిల్ల జన్మిస్తే పండగ చేసుకుంటారు. తదనంతరం ఆస్తి ఆడపిల్లలకే చెందుతుంది.పెళ్లయ్యాక అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సిందే. ఆడపిల్లలను ఏడిపించినా వారి పట్ల తప్పుగా ప్రవర్తించినా అతిపెద్ద నేరంగా భావిస్తారు. తవాంగ్‌లో నేరప్రవృత్తి తక్కువ. అమ్మాయిలకి స్వేచ్ఛ ఎక్కువ. ఒంటరిగా ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్లగలరని గైడ్‌ చెప్పాడు. పర్వతప్రాంత జీవనశైలి కారణంగా అందరూ బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చలిప్రాంతం కావడంతో మద్యం వాళ్ల జీవనశైలిలో ఓ భాగం. అలాగని అది వ్యసనం కాదు, అవసరార్థం మాత్రమే తాగుతారట. మోంపా తెగలో ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారు. తరవాత బౌద్ధమత స్టడీ సెంటర్‌ని కూడా సందర్శించి, వార్‌ మెమోరియల్‌కి వెళ్లాం. భారత్‌-చైనా యుద్ధంలో మరణించిన 2,420మంది భారత సైనికుల స్మృత్యర్థం దీన్ని నిర్మించారు. సాయంత్రం అక్కడ యుద్ధం తాలూకు దృశ్యాలను ప్రదర్శించే లేజర్‌ షో ఉంటుంది.జంగ్‌ జలపాతం!
మర్నాడు ఉదయం రోడ్డు మార్గంలో గౌహతికి బయలుదేరాం. ఆ దారిలో అందాల జంగ్‌ జలపాతం కనువిందు చేసింది. తేజ్‌పూర్‌ ఇంకా 88 కి.మీ. ఉందనగా నాగ్‌మందిర్‌ అనే చోటుకి చేరాం. అక్కడినుంచి కొండచరియలు విరిగిపడే దారి ప్రారంభమవుతుంది అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే కాస్త దూరం వెళ్లగానే కొండచరియలు విరిగిపడి ఉన్నాయి. ఆర్మీవాళ్లు మా ముందుండటం వల్ల వాళ్లు ఎక్కడికక్కడ దిగి రాళ్లు తొలగించుకుంటూ వెళుతున్నారు. మరికాస్త దూరం వెళ్లాక ముందుకు కదల్లేని పరిస్థితి. వాహనాల ఫ్లడ్‌లైట్లలో రోడ్డుమీద అడ్డంగా పడ్డ పెద్దపెద్ద బండరాళ్లను చూసి భయం ఆవహించింది. కటిక చీకటిలో రెండు గంటలు గడిపాం. ఇక లాభం లేదని వెనక్కి వచ్చి, ఆ రాత్రికి దుర్గాదేవి ఆలయంలో తలదాచుకున్నాం. ఉదయం పక్షుల సవ్వడికి లేచి చూసేసరికి మేం ఉన్న ప్రాంతం ‘ఈగల్‌ బర్డ్‌ నెస్ట్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీ’ అని తెలిసింది. పక్షుల అధ్యయనానికి అది స్వర్గధామం. రోడ్డు బాగయ్యాక బయలుదేరి తేజ్‌పూర్‌ చేరుకున్నాం.
తేజ్‌పూర్‌ అస్సాం వ్యాపార కేంద్రం.టీ తోటలకు ప్రసిద్ధి. సాయంత్రం శ్రీమహాకాలభైరవ ఆలయానికి వెళ్లాం. ఇక్కడ శివలింగం నిత్యం పెరుగుతూ ఉంటుందని నమ్మకం. ఆ రాత్రికి తేజ్‌పూర్‌లో బస చేసి, ఉదయాన్నే కజిరంగా వన్యమృగ సంరక్షణ కేంద్రంలో సఫారీకి వెళ్లి రైనోలని చూసి, బయటికొచ్చాక తేయాకు తోటల్నీ చూసి గౌహతికి చేరుకుని కామాఖ్యదేవి ఆలయం చూసి వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.