close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనసా వాచా

మనసా వాచా
- అప్పరాజు నాగజ్యోతి

ర్జంటు కేసొచ్చిందని హాస్పిటల్‌ నుంచి ఫోన్‌ రావడంతో హుటాహుటిన బయల్దేరాను. లోపల బిడ్డ అడ్డం తిరగడంతో సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి అతికష్టంమీద తల్లీబిడ్డల్ని కాపాడగలిగాను.
తల్లికి స్పృహ వచ్చాక వార్డుకి షిఫ్ట్‌ చేయమని నైట్‌డ్యూటీలో ఉన్న హౌస్‌సర్జన్లకీ సిస్టర్స్‌కీ చెప్పి వెళ్ళబోయేంతలోగా మరో ఎమర్జెన్సీ కేసు రావడంతో ఆ రాత్రికి నేనక్కడే ఉండిపోవలసి వచ్చింది.
ఇరవైరెండూ లేదా ఇరవైమూడేళ్ళ వయసున్న అమ్మాయిని స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొచ్చారు.
ఒక యాభైఏళ్ళ వ్యక్తి తన చేతులమీద ఆ అమ్మాయిని మోసుకుని వచ్చినట్లున్నాడు. బహుశా ఆ అమ్మాయి తండ్రేమో! ఒళ్ళంతా చెమటలు కారిపోతుండగా, వగరుస్తూ అమ్మాయితోపాటే వార్డులోకి రాబోతుంటే బయటే ఆపేశారు హాస్పిటల్‌ స్టాఫ్‌.
చూస్తూనే అర్థమయింది అది రేప్‌ కేసని.
బాగా పెనుగులాడిందేమో, పాపం, ఆ అమ్మాయి ఒళ్ళంతా ఒకటే గాట్లు, తీవ్రమైన రక్తస్రావం.
వెంటనే ప్రథమ చికిత్స చేసి ఆపైన సెడిటివ్‌ ఇంజెక్షనిచ్చి పడుకోబెట్టిన తరవాత గానీ అతనితో మాట్లాడటం కుదరలేదు నాకు.
‘‘ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇదంతా ఎలా జరిగిందసలు?’’ షాక్‌ నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్నట్లున్నాడేమో, నూతిలో నుంచి వస్తున్నట్లుగా ఉందతని గొంతు.
‘‘డాక్టర్‌గారూ, నా పేరు రాజగోపాల్‌. గవర్నమెంటు కాలేజీలో ప్రొఫెసర్ని. తను నా ఒక్కగానొక్క కూతురు. పేరు అవంతి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. వారానికి ఒకటి రెండుసార్లు తనకి నైట్‌షిఫ్ట్‌లు ఉంటాయి. ఈరోజు కూడా అలా నైట్‌షిఫ్ట్‌ పూర్తిచేసుకున్నాక క్యాబ్‌లో ఇంటికి బయలుదేరింది. దురదృష్టవశాత్తూ, దారి మధ్యలో క్యాబ్‌ చెడిపోవడంతో నాకు ఫోన్‌ చేసి చెప్పింది. అమ్మాయిని పికప్‌ చేసుకోవడానికని వెంటనే కారు తీసుకుని బయలుదేరాను.’’
ఉన్నట్టుండి పెద్ద దగ్గుతెర గొంతుకి అడ్డం రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
వెంటనే నా టేబుల్‌ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాసుని అతని చేతికందించాను.
నావైపు కృతజ్ఞతగా చూసి గ్లాసులోని నీళ్ళని గడగడా తాగి తిరిగి చెప్పసాగాడు.
‘‘నేనలా రోడ్డెక్కానో లేదో నా కారుని ర్యాష్‌గా ఓవర్‌టేక్‌ చేసిన సుమో నా ముందరి బైక్‌ని గుద్దేసి ఆగనైనా ఆగకుండా స్పీడ్‌గా వెళ్ళిపోయింది. సుమో ధాటికి ఆ బైక్‌ మీదున్న కుర్రాడు ఎగిరి అల్లంత దూరానపడ్డాడు. ఆ కుర్రాడికి ఇరవైనాలుగు, ఇరవైఅయిదేళ్ళు ఉంటాయేమో! అతని ఒళ్ళంతా రక్తం. రోడ్డంతా నిర్మానుష్యం. క్షణంపాటు ఏం చేయాలో తోచలేదు నాకు. కళ్ళముందే ఒక నిండుప్రాణం గాల్లో కలిసిపోబోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఒక్కడినే ఎలాగో కష్టపడి ఆ కుర్రాడిని లేవనెత్తి నా కారులో పడుకోబెట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చేర్పించాను.’’
దుఃఖంతో గొంతు పూడుకుపోవడంతో రెండు క్షణాలు ఆగాడు.
ఆపైన జరిగినదాన్ని ఊహించుకోగలిగాను.
‘‘ఇదంతా పూర్తి చేసుకుని నా కూతురి దగ్గరకి నేను వెళ్ళేటప్పటికే అంతా అయిపోయింది. రోడ్డు పక్కన తుప్పల్లో మూలుగుతూ పడివున్న అవంతిని ఇక్కడిదాకా ఎలా తీసుకురాగలిగానో నాకే తెలీదు డాక్టర్‌’’ రెండు చేతులతో ముఖాన్ని కప్పేసుకుని భోరుమన్నాడు.
వింటున్న నాకు చాలా బాధేసింది.
ముక్కూ మొహం తెలీని ఒక కుర్రాడి ప్రాణాల్ని మానవత్వంతో కాపాడిన అతని మంచితనమే అతని సొంత కూతురి పాలిట శాపమయింది.
ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గులని తలచుకుంటుంటే నా ఒంట్లో రక్తం సలసలా మరిగిపోయింది.
‘‘ఆ వెధవలని ఊరికే వదిలిపెట్టకూడదు రాజగోపాల్‌గారూ. పోలీసులకి ఇన్‌ఫాం చేస్తే వాళ్ళే చూసుకుంటారు.’’
ఆవేశంగా నేను నా సెల్‌ఫోన్‌ తీసుకుని పోలీసులకి డయల్‌ చేయబోతుంటే రెండు చేతులూ జోడించి నన్ను వారించాడతను.
‘‘దయచేసి ఆ పని మాత్రం చేయకండి డాక్టర్‌గారూ, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పటికే జరిగినదానికి నేనూ నా కూతురూ కూడా కుమిలిపోతున్నాం. అది చాలదన్నట్లు ఇంకిప్పుడు పోలీసులూ కోర్టులూ కూడానా. ఆ గొడవలేవీ వద్దండీ.’’
‘‘చదువుకున్నవాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలాగండీ? ఇది పోలీస్‌ కేసు. దోషులకు శిక్ష పడేటట్లుగా చూడటం మనందరి బాధ్యతా...’’
మధ్యలోనే నన్ను వారించాడు.
‘‘మీరు చెప్పినదంతా నిజమేనండీ. కానీ, ఈ విషయాన్ని మీరు పోలీసులకి చెప్పిన మరుక్షణమే మీడియాకి తెలిసిపోతుంది. ఆ తర్వాత టీవీ ఛానళ్ళన్నీ కూడా ‘సెన్సేషనల్‌ న్యూస్‌’ అంటూ నా కూతురిని క్లోజప్‌లో మళ్ళీమళ్ళీ చూపిస్తూ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆ నరకాన్ని భరించేకంటే, నేనూ నా కూతురూ ఇంత విషం తిని చావడం మేలు డాక్టర్‌గారూ. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, ప్లీజ్‌.’’
ఇంకేమీ మాట్లాడలేకపోయాను.

* * * * * * * * * *

ఉదయం తొమ్మిదిగంటలకి రౌండ్స్‌కి వచ్చాను.
నిన్నరాత్రి హడావుడిలో ఆ అమ్మాయిని నేనంతగా గమనించలేదు.
పచ్చటి మేనిఛాయా, చక్కటి కనుముక్కు తీరూ, ముఖ్యంగా ఆమె పైపెదవికి కొద్దిగా పైన ఉన్న తేనెరంగు పుట్టుమచ్చ అలనాటి జయప్రదనీ మొన్నటి సిమ్రాన్‌నీ స్ఫురణకి తెచ్చింది.
ఇంజెక్షన్‌ మత్తు వలన ఇంకా నిద్రలోనే ఉన్న ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది.
అపరంజి బొమ్మలాంటి ఆ పిల్ల పైన రాక్షసమూక దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోయిన ఆ భగవంతుడి మీద పీకలదాకా కోపం వచ్చింది.
ప్రళయం వచ్చి పృథ్వి మునిగిపోకూడదా!
ఎన్ననుకున్నా ఏం లాభంలెద్దూ... రాతని తప్పించడం ఎవరి తరమూ కాదు.
మనసు చిట్టచివరకి వేదాంతాన్నాశ్రయించింది.
నాలుగు రోజుల తర్వాత అవంతి కొద్దిగా కోలుకుంది. ఆమెపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ రాజగోపాల్‌గారికి వివరంగా చెప్పి, ఆపైన నాకు తెలిసిన మంచి కౌన్సెలర్‌ని రిఫర్‌ చేసిన మీదట వార్డు నుండి డిశ్చార్జ్‌ చేశాను.

* * * * * * * * * *

ఇప్పుడు పెళ్ళిచూపుల్లో నా ఎదురుగా తలొంచుకుని ఒద్దిగ్గా కూర్చున్న పెళ్ళికూతురి పెదవి పైన తేనెరంగు పుట్టుమచ్చని చూస్తూనే చటుక్కున అదంతా గుర్తుకొచ్చేసింది.
‘నలుగురు మగవాళ్ళ చేతుల్లో దారుణంగా అత్యాచారానికి గురైన ఈ అమ్మాయినా నా ఒక్కగానొక్క కొడుక్కీ నేను చూడటానికి వచ్చింది!’
నా మొహం అప్రసన్నంగా మారింది.
తలతిప్పి పక్కకి చూద్దును కదా... మావాడి కళ్ళల్లో కోటి మెరుపులు చెప్పకనే చెబుతున్నాయి- అమ్మాయి వాడికి బాగా నచ్చిందని.
ఇంతకాలమూ వాడికి నచ్చినపిల్ల దొరికితే చాలు... మరే ఆలోచనా పెట్టుకోకుండా పెళ్ళికి ఒప్పుకుందామనే అనుకుంటూ వచ్చాం నేనూ మావారూ కూడా.
కానీ, చూస్తూ చూస్తూ చివరికిలాంటి సంబంధమా చేసుకునేది?
మనసంతా చేదు తిన్నట్లుగా అనిపించింది.
ఏ విషయమూ త్వరలో తెలియజేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం.

* * * * * * * * * *

అవుట్‌ పేషెంట్స్‌ని చూస్తుండగా నర్సు వచ్చి నాకోసం ఎవరో వచ్చారని చెబితే నా గదిలో కూర్చోబెట్టమని చెప్పాను.
రౌండ్స్‌ని పూర్తి చేసుకుని గదికి వెళ్ళాను.
అక్కడ నా రాకకోసం ఎదురుచూస్తున్న వ్యక్తి మరెవరో కాదు, రాజగోపాల్‌గారే.
పెద్ద మనసు చేసుకుని వాళ్ళ అమ్మాయిని నా కోడలుగా చేసుకోమని బతిమలాడేందుకుగానూ ఇవ్వాళో రేపో నా దగ్గరికి వస్తాడనే అనుకున్నాను కాబట్టి, అతని రాక నాకేమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు... కానీ ఇబ్బందిగా మాత్రం అనిపించింది. నా మొహంలోని భావాలని గమనించాడేమో మరి, నమ్రతగా అడిగాడు.
‘‘నేనిలా రావడం మీ పనికేమీ ఇబ్బందికాదు కదా?’’
‘‘లేదులెండి’’ ముక్తసరిగా సమాధానమిచ్చాను.
కొన్ని క్షణాలపాటు చేతుల్ని నలుపుకున్నాక అసలు విషయంలోకి వచ్చాడు.
‘‘డాక్టరుగారూ, పెళ్ళిచూపుల్లో మా అవంతిని మీరు గుర్తుపట్టే ఉంటారు. విషయమంతా తెలిసిన మిమ్మల్నే అవంతిని మీ ఇంటి కోడలిగా అంగీకరించమని అడిగేటంత ధైర్యం చేయలేను. ఆ రోజున అవంతిపైన జరిగిన అత్యాచారం గురించి మాత్రం ఎవ్వరివద్దా అనొద్దని రిక్వెస్ట్‌ చేసేందుకు మాత్రమే వచ్చాను నేను. మా సంబంధం వద్దనుకోవడానికి కారణంగా ఆనాడు జరిగిన దారుణాన్ని గురించి కాకుండా, జాతకాలు కలవలేదనో మరేదైనా కారణమో కల్పించి చెప్పండి డాక్టర్‌గారూ. దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకోండి. అవంతిని మీ కూతురిలా భావించి ఈ ఒక్క సాయం చేయండమ్మా. ఒక ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.’’
మ్రాన్పడిపోయాను.
మొట్టమొదటిసారిగా మనుషుల పట్ల నా అంచనా తప్పయింది.
నా మనోభావాలతో సంబంధం లేకుండా రాజగోపాల్‌గారు చెప్పుకుపోసాగారు.‘‘ఎన్నోవిధాల నచ్చచెబితేగానీ అమ్మాయి పెళ్ళిచూపులకి ఒప్పుకోలేదు. జరిగిన దారుణాన్ని గుట్టుగా దాచేసి పెళ్ళిచూపులని ఏర్పాటు చేయడం తప్పేననుకోండి. ఏదైనా చెప్పడం సులభమే, కానీ ఎంత చదువుకున్న వాళ్ళమైనా కొన్నికొన్ని విషయాలలో త్వరగా మారలేము కదండీ! జరిగిన దారుణాన్ని గురించి కనుక ముందే చెప్పేస్తే నా కూతురిని పెళ్ళి చేసుకునేందుకు ఎవరు ముందుకొస్తారు చెప్పండి? మన సమాజం ఇంకా అంత ఎత్తుకి ఎదగలేదుగా...’’
అతనింకా ఏవో చెబుతున్నాడు. కానీ ఆ మాటలేవీ నా చెవులని చేరడం లేదు.
‘చెప్పడం సులభమే’ అన్న మాట దగ్గరే నా చెవులు రెండూ పనిచేయడం మానేశాయి.
మనసు వాయువేగంతో వారంరోజుల కిందటి జ్ఞాపకాలని తట్టి లేపింది.

* * * * * * * * * *

ఆవేళ కమలాబాయి మహిళా ఆశ్రమానికి చీఫ్‌గెస్ట్‌గా వెళ్ళాను.
అక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్ళందరూ దుర్మార్గుల చేతుల్లో అత్యాచారానికి గురైన అభాగ్య యువతులే.
జరిగిన దుస్సంఘటన కారణంగా మానసికంగా కుంగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోకుండా, త్వరగా కోలుకునేందుకుగానూ అక్కడి స్త్రీలందరికీ తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ఒక డాక్టర్‌గా వివరించిన మీదట ముగింపులో వాళ్ళకి నేను చెప్పిన మాటలివి.
‘‘చూడండీ, రేప్‌ లేదా అత్యాచారం అనేదాన్ని మీరంతా ఒక చిన్న యాక్సిడెంట్‌గా భావించి దులిపేసుకోవాలే తప్ప, దాని గురించే ఆలోచిస్తూ మనసుని పాడుచేసుకుని సమస్యని మరింత జటిలం చేసుకోకూడదు. జరిగిన ఒక్క సంఘటన వలన మీ జీవితం మొత్తం నాశనమైపోయినట్లుగానూ మగవాళ్ళందరూ దుర్మార్గులే అన్నట్లుగానూ మీరెంత మాత్రమూ భావించకూడదు.
మీ చుట్టూ ఉన్న సమాజంలో చెడ్డవాళ్ళు మాత్రమే కాదు, మంచివాళ్ళూ ఉంటారు. మీమీద జరిగిన అత్యాచారాన్ని లెక్కచేయకుండా మీ వ్యక్తిత్వాన్ని గుర్తించీ మిమ్మల్ని ఆరాధించీ మీ చేయి అందుకునే ఆదర్శ యువకులు తప్పకుండా మీకు తారసపడతారు. మన సమాజంలోని యువకుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ అటువంటి మార్పు తప్పకుండా వస్తుందన్నది నా ప్రగాఢ నమ్మకం. కాబట్టి మీ ప్రమేయం లేకుండా జరిగిన దుస్సంఘటనకి మీరెంత మాత్రమూ బాధ్యులుకారన్న విషయాన్ని గ్రహించుకుని మీ మనసుల్ని స్థిరం చేసుకుని నార్మల్‌ రొటీన్‌లోకి ఎంత త్వరగా రాగలిగితే అంత మంచిది.’’

* * * * * * * * * *

ఆ రోజున నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు నా మనస్సులో గిర్రున తిరిగాయి.
‘నిజమే, ఏదైనా చెప్పడం సులభమే, ఆచరించడం మాత్రం చాలా కష్టం. ఏదైనా మాట్లాడినా చేసినా- మనసా వాచా కర్మణా ఒకటే అయితేనే కదా... ఏ మనిషికైనా ఆత్మసంతృప్తి కలిగేది, మనశ్శాంతి దక్కేది.’
అందాకా ఊగిసలాడుతున్న మనసుని దృఢపరచుకుని క్షణాల్లో నిర్ణయానికొచ్చాను.
‘‘చూడండి రాజగోపాల్‌గారూ, మాకు ఒక్కడే కొడుకు. వాడి సంతోషంకన్నా మాకు మరేదీ ముఖ్యం కాదు. మాకు కోడలైనా కూతురైనా కూడా వాడికి కాబోయే భార్యే. అందుకే, కట్నకానుకలూ కులమతాలూ వంటి వాటితో నిమిత్తం లేకుండా, వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్ళి జరిపించాలన్నది మా కోరిక. అవంతి వాడికి బాగా నచ్చింది. ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాం.’’
నా మాటలకి ఆనందంతో అతని గొంతు మూగబోయింది. కళ్ళనిండా నీళ్ళతో రెండు చేతులూ జోడించాడు.
సమాజంలో నేనాశించిన మంచి మార్పుకి అంకురార్పణ నేనే చేశానన్న సంతృప్తి నాకు కలిగింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.