close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ హాబీ ఏమిటి?

మీ హాబీ ఏమిటి?

హీరో సల్మాన్‌ఖాన్‌ చక్కగా పెయింటింగ్స్‌ వేస్తాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ గిటార్‌ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్‌ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్‌లలో పాల్గొంటాడు. రతన్‌ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్‌ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్‌ ఫోన్‌ మూగబోతుంది.
బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు.
పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు.
మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్‌ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్‌ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్‌ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబీలను సాధన చేస్తున్నది అందుకే మరి!
‘మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల’ంటాడు ‘ముత్యాలముగు’్గలో రావుగోపాలరావు. ఈ హాబీలన్నీ దానికిందికే వస్తాయి. కళలు లేని జీవితం కళేబరం లాంటిదని కవి సి.నారాయణరెడ్డి అన్నారు. కళలు జీవితాన్ని సౌందర్యమయం చేస్తాయి. అసలు కళలూ క్రీడలూ తయారైందే మనిషి మనసును ఉల్లాసభరితం చేయడానికి. ఏదో ఒక కళతోనో క్రీడతోనో పరిచయం లేని జీవితం ఉప్పులేని కూరలా చప్పగా నిస్సారంగా ఉంటుంది. కడుపు నిండా తిండీ తలదాచుకోను గూడూ దొరికాక మనిషి మనసు వినోదం మీదికి మళ్లింది. అలా కబుర్లు కథలయ్యాయి, కళలయ్యాయి, ఆటపాటలూ
తయారయ్యాయి. జీవితమంటే రెక్కలు ముక్కలు చేసుకుని తిండీ బట్టా సంపాదించుకోవడమే కాదు, ఆనందంగా దాన్ని ఆస్వాదించాలన్న కాంక్ష పెరిగింది. అరవై నాలుగు కళలూ పుట్టుకొచ్చాయి. సృజనాత్మకత, కళాత్మకత... గొప్ప విషయాలయ్యాయి. స్వయంగా అందరూ కళాకారులే కానక్కర్లేదు, కళాభిమానులుగానూ వాటి నుంచి లబ్ధి పొందవచ్చు. అలాంటి కళల్లో మనసుకు నచ్చిన ఒకదాన్ని ప్రవృత్తిగా మార్చుకుని వృత్తికి దీటుగా సాధన చేయగలిగితే ప్రతి వ్యక్తి జీవితమూ ఆనందంగా, సంతృప్తిగా సాగుతుందనీ, ఉత్పాదకత పెరుగుతుందనీ అంటున్నాయి పలు పరిశోధనలు. సాధారణ ఉద్యోగులనుంచి శాస్త్రవేత్తల వరకూ అన్ని వర్గాల వారిమీదా జరిగిన ఈ అధ్యయనాలు ఒక్క హాబీ ఉంటే చాలు- రెండు జీవితాలు జీవిస్తున్న అనుభవం సొంతం చేసుకోవచ్చని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.హాబీ అంటే...
హాబీ అంటే మనసుకు ఇష్టమైన ఓ వ్యాపకం. తీరిక సమయాల్లో చేసే కాలక్షేపం- అది పని కావచ్చు, కళ కావచ్చు, క్రీడ కావచ్చు. దానిలో మనస్ఫూర్తిగా లీనమవ్వాలి. దానిని సాధనచేయడంలో మానసిక సాంత్వన పొందడం మినహా మరెలాంటి ప్రతిఫలాన్నీ ఆశించకూడదు. సంగీతం పాడుకోవడం హాబీ. కచేరీలే చేయనక్కరలేదు. తనకోసం తాను పాడుకుంటూ మానసిక ప్రశాంతతనీ అలౌకికమైన ఆనందాన్నీ పొందవచ్చు. అలాగే కొందరికి ఆటలంటే ఇష్టం. పోటీలకు వెళ్లకపోయినా పతకాలు గెలవకపోయినా ప్రవృత్తిపరంగా వాళ్లు క్రీడాకారులే. ఆటలోని మెలకువలన్నీ వారికి తెలుసు. సమవుజ్జీ దొరికితే చాలు, రోజూ కాసేపు ఆడి ఆనందిస్తారు. కొందరికి రాతపని ఇష్టం. కవిత్వమో కథలో రాసుకుంటారు. వాటిని ప్రచురించకపోయినా తమ తృప్తికోసం ఆలోచనలను అక్షరబద్ధం చేసి ఆనందిస్తారు. చిత్రలేఖనమూ అంతే. చక్కటి చిత్రాలను గీసి ఇంటి గోడలను అలంకరించుకుంటారు. బహుమతులుగా ఇస్తారు.
కొందరికి ఫొటోగ్రఫీ హాబీ. మరికొందరికి సాహసయాత్రలు ఇష్టం. ఇక ఇల్లాళ్లైతే ఒకప్పుడు రకరకాల ఎంబ్రాయిడరీలు చేస్తూ, వైరు బుట్టలో ఊలు దుస్తులో అల్లుతూ కాలక్షేపం చేసేవారు.
ఈ మధ్యకాలంలో ఇలాంటి హాబీలన్నీ మసకేసిపోతున్నాయి. జీవితంలో వేగం ఎక్కువైంది. తెల్లారి లేచిందగ్గర్నుంచీ ప్రతి ఒక్కరూ ఉరుకులూ పరుగులే! ఎవరిని పలకరించినా ‘బిజీగా ఉన్నా... అస్సలు టైం సరిపోవడం లేదు...’ అంటూ నిట్టూర్పులే. ఆఖరికి పిల్లలు కూడా చదువులూ ట్యూషన్లూ పోటీపరీక్షలకు ప్రిపరేషన్లతో గడిపేస్తున్నారు. చిన్నప్పుడు మోజు పడి తల్లిదండ్రులు ఏ ఆటో పాటో  నేర్పించే ప్రయత్నంచేసినా ఏడెనిమిది తరగతుల్లోకి వచ్చేసరికి మళ్లీ ఆ తల్లిదండ్రులే చదువు దెబ్బతింటుందంటూ మాన్పించేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏది నేర్చుకున్నా కెరీర్‌ కోసమే. ప్యాషన్‌ కన్నా ప్రయోజనానికే ప్రాధాన్యం పెరుగుతోంది.
ఆ దృష్టి మార్చుకుని ఒక్క హాబీని అలవాటుచేసుకోమంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ‘హాబీ అనగానే అందరూ చెప్పేది టైమ్‌ లేదనే. రోజుకు 24 గంటలుంటాయి. అందులో ఎనిమిది గంటల నిద్ర తీసేసినా ఇంకా 16 గంటలుంటాయి. అందులో ఒక్క గంట మన కోసం కేటాయించుకుని చక్కగా ఉపయోగించుకోగలిగితే జీవితాన్ని సఫలీకృతం చేసుకున్నట్లే’నంటారు యూనివర్శిటీ ఆఫ్‌ అల్బర్టాకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్వాలిటేటివ్‌ మెథడాలజీ డైరెక్టర్‌ బెయిలీ సౌసా.ఎలాంటి హాబీ!
హాబీ అంటేనే మనకు ఇష్టమైన వ్యాపకం. అది మనస్ఫూర్తిగా చేసే ఏ పనైనా కావచ్చు. ఎవరైనా ‘అదేం హాబీ అర్థం లేకుండా...’
అన్నారంటే వారికి ‘హాబీ’కి అర్థం తెలియదన్నమాటే. ఆ పని చేయాలనిపించడమే చాలు, అంతకన్నా వేరే కారణం ఏమీ అక్కర్లేదు. అలాంటి హాబీ ఏదీ లేదు, కొత్తగా ఎంచుకోవాలనుకుంటే ఇవి గుర్తుంచుకుంటే చాలు...
* నూటికి నూరుశాతం అందులో లీనమైపోయేంత ఇష్టం ఉండాలి. చాలావరకూ చిన్ననాటి కలలూ, తీరని కోరికలూ పెద్దయ్యాక మంచి హాబీలవుతాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంకి కర్ణాటక సంగీతం అంటే ఇష్టం. రాష్ట్రపతి అవడానికి ముందు హైదరాబాదులోని డీఆర్‌డీఎల్‌లో క్షిపణి ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు ఆయన వీణ నేర్చుకున్నారు.
* హాబీ వల్ల మనకు డబ్బు, వస్తురూపంలో ఎలాంటి ప్రతిఫలం లభించకూడదు. అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చూడకూడదు. ప్రతిఫలం ఆశిస్తే వ్యాపారం అవుతుంది కానీ హాబీ అవదు. అందుకని మనసుకు సాంత్వననీ తృప్తినీ కలిగించే విషయాన్నే హాబీగా ఎంచుకోవాలి.
* ఎంచుకునే హాబీకి మన వృత్తితో అసలేమాత్రం సంబంధం ఉండకూడదు. వృత్తి ఉద్యోగాలకు హాబీ ఎంత భిన్నంగా ఉంటే అంత ఎక్కువ ఫలితాలను సాధించవచ్చని శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఏ వృత్తి అయినా ఉద్యోగమైనా, వ్యాపారమైనా కొన్ని పరిమితులకు లోబడి చేయాల్సివస్తుంది. అదే హాబీకి అలాంటి పరిమితులుండవు. కేవలం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి సరిగా చేయలేదని అడిగేవారుండరు. అలా స్వేచ్ఛగా హాబీని ఆస్వాదించగలగడం వ్యక్తిగత జీవితానికి మేలు చేస్తుంది. ఫలితంగా ఇనుమడించిన ఉత్సాహంతో ఆఫీసులో బాగా పనిచేసి ఉత్పాదకత పెంచడం ఉద్యోగ జీవితానికి మరెన్నో రెట్లు మేలు చేస్తుందని పరిశోధనల్లో రుజువైంది.
* వృత్తి ఉద్యోగాల వల్ల కోల్పోతున్న వాటిని భర్తీ చేసుకునేలా హాబీని ఎంచుకోవాలి.
ఉదాహరణకు ఒక డాక్టరునే తీసుకుంటే ఆపరేషన్లన్నీ ఉదయమే ఉంటాయి కాబట్టి తెల్లారేసరికి ఆస్పత్రికెళ్లిపోతారు. తిరిగి ఇంటికి చేరేసరికి రాత్రి అవుతుంది. బయటి ప్రపంచంతో ఇరుగు పొరుగుతో సంబంధం లేకుండా రోజులు గడిచిపోతాయి. అలాంటివారు వారంలో రెండు రోజులైనా పొద్దున్నే అప్పాయింట్‌మెంట్లు లేకుండా చూసుకుని ఉదయపు సూర్యకాంతిలో కాసేపు నడవడం, కాసేపు ఏదైనా ఆడడం, చుట్టుపక్కల వారితో మాట్లాడడం లాంటివి చేస్తే రిలాక్సవుతారు. సంఘజీవితాన్ని కోల్పోకుండా ఉంటారు.ప్రయోజనాలివీ!
శరీరానికి వ్యాయామం ఎలాగో మనసుకు హాబీ అలాంటిదని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. వ్యాయామం మానేస్తే శరీరం ఆకృతి కోల్పోయే ప్రమాదం ఉంటుంది కానీ హాబీ అలా కాదు. ఇది జీవితబీమా వారి డబుల్‌ బెనిఫిట్‌ స్కీమ్‌లా మానేసినా కూడా దాని ప్రభావం మనసు మీద ఎంతో కొంత ఉంటుంది. ఒకప్పుడు ఫలానా ఆట ఆడేవాణ్ణి, చాలా ఎంజాయ్‌ చేసేవాణ్ణి... అనుకున్నప్పుడల్లా మనసు మరోసారి ఆడుతున్న అనుభూతికి లోనవుతుంది.
సంతోషకరమైన హార్మోన్ల విడుదలకు కారణమవుతుంది. అందుకే ‘బిజీగా ఉన్నాన’ని మభ్యపెట్టుకోకుండా ఓ హాబీకి తీరిక చేసుకోవాలి.మనకంటూ ఓ హాబీ ఉంటే...
క్రమశిక్షణ అలవడుతుంది: సాధారణంగా మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే- చేతిలో ఒక పని ఉంది. ఆఫీసుకు వెళ్లేలోపలో, లేదా పిల్లలు ఇంటికొచ్చేలోపలో అది చేయాలనుకుంటాం. ఎంత టైం ఉందో చూసి అంత టైముకీ సరిపోయేలా చేస్తున్న పనిని సాగదీస్తామన్న మాట. ఒకవేళ అది కాస్త ముందుగా అయిపోయినా మరో పనేదీ ప్లాన్‌ చేసుకోలేదు కాబట్టి ఆ కాస్త ఖాళీ సమయాన్నీ ఏ ఫోనుతోనో టీవీముందో గడిపేస్తాం. అదే మనకిష్టమైన హాబీ పిలుస్తోందనుకోండి. చేతిలోని పనిని గబగబా ముగించేస్తాం. సమయం కలిసొచ్చేలా పనులను ప్లాన్‌ చేసుకుంటాం. అంటే హాబీల వల్ల
మిగిలిన పనుల్నీ క్రమశిక్షణతో సమర్థంగా, త్వరగా పూర్తిచేయడం అలవడుతుంది.
మనసుకి విశ్రాంతి: ఇష్టమైన హాబీని సాధనచేయడంలో లీనమైపోతే- సమయం ఎలా గడిచిపోయిందో తెలియనేలేదంటే- మనసు ఎంతగానో రిలాక్సయినట్లు అంటున్నారు సైకాలజిస్టులు. అదే మనసు రీఛార్జ్‌ అవడానికి మనమిచ్చే విశ్రాంతి.
సంతోషంగా జీవించడానికి: మనిషి జీవితం సంతోషంగా, అర్థవంతంగా సాగాలంటే సామాజిక సంబంధాలు కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి బంధాలు ఏర్పడేందుకు దోహదం చేస్తాయి హాబీలు. ఏ హాబీ నేర్చుకోవడానికి వెళ్లినా, సాధన చేస్తున్నా మనతో పాటు ఆ పని చేస్తున్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త స్నేహాలకు దారితీస్తాయి. మన ఇష్టాలనూ ఆసక్తులనూ వారితో పంచుకోవడం వల్ల సామాజిక అనుబంధాలు బలపడతాయి. వారంతా వేర్వేరు రంగాలకు చెందినవారై ఉంటారు కాబట్టి ఆయా రంగాల సమాచారమూ మనకు తెలుస్తుంది.
ప్రత్యేక గుర్తింపు: ఆఫీసులో ఓ పార్టీ జరుగుతుంది. రోజూ కలిసే సహోద్యోగులే అక్కడా ఉంటారు కాబట్టి మాట్లాడుకోవడానికి కొత్త విషయాలేవీ ఉండవు. అదే మనకో హాబీ ఉంటే దాని గురించీ, మనం సాధించిన ప్రగతి గురించీ, అందుకున్న ప్రశంసలగురించీ, దాని కారణంగా కలుసుకున్న ప్రముఖుల గురించీ బోలెడు విషయాలు చెప్పొచ్చు. అవన్నీ కొత్త విషయాలు కాబట్టి ఆసక్తిగా వింటారు. ఏ పాటలు పాడడమో, నృత్యం చేయడమో హాబీ అయితే ఓ ప్రదర్శనా ఇవ్వవచ్చు.ఒత్తిడి హుష్‌ కాకి: ఆఫీసు అన్నాక ఎవరికైనా ఏదో ఒక విషయంలో ఎంతో కొంత ఒత్తిడి సహజం. దానికి తోడు బాస్‌తోనో సహోద్యోగితోనో ఏదో గొడవవుతుంది. ఇంటికి చికాగ్గా వస్తారు. టీవీ పెట్టుకుని చూస్తున్నా మనసులోంచి ఆ చికాకు పోదు. దేనిమీదా దృష్టి నిలవదు. ఆ సమయంలో పిల్లలొచ్చి ఏదన్నా అడిగినా కసురుకోవడమో విసుక్కోవడమో మామూలే. అదే, రాగానే ముఖం కడుక్కుని వేడివేడిగా ఓ కప్పు టీనో కాఫీనో తాగి గదిలోకి వెళ్లిపోయి ఇష్టమైన పెయింటింగ్‌ వేయడంలో లీనమైపోతే... కాసేపటికే మనసు రిలాక్సవుతుంది. జరిగిందంతా మర్చిపోతారు. ఓ గంట తర్వాత హాయిగా తేలికైన మనసుతో బయటకు వచ్చి కుటుంబసభ్యులతో ఆనందంగా గడపొచ్చు. హాబీ ఒత్తిడిని ఎదుర్కొనే శక్తినిస్తుంది.
అవసరమైనప్పుడు ఆదుకుంటుంది: ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది- గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదు అని. ఆ బుట్ట పడిపోతే అన్నీ పగిలిపోతాయి కాబట్టి వేర్వేరు బుట్టల్లో పెట్టుకుంటే ఒకదాంట్లోవి పోయినా మరో దాంట్లోవైనా మిగులుతాయని. అలాగే ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం లేని ఓ చక్కటి ప్రవృత్తిని సాధన చేస్తే అవసరమైనప్పుడు దాని ద్వారా అదనపు ఆదాయమూ పొందవచ్చు. పూర్తి వృత్తిగా మార్చుకునే అవకాశమూ ఉంటుంది.
దృక్పథమే మారిపోతుంది: మంచి హాబీని కొనసాగించడం వల్ల దాని ప్రభావం జీవితంలోని మిగతా విషయాల మీదా పడుతుంది. మనలో నిద్రాణంగా ఉన్న సామర్థ్యాలు
బయటపడతాయి. సహనం అలవడుతుంది. ఆత్మవిశ్వాసమూ ఆశావహదృక్పథమూ పెరుగుతాయి. సమస్యలను సవాళ్లుగా స్వీకరించి ఎదుర్కొనగల ధైర్యం వస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి కుటుంబ జీవితమూ ఉద్యోగ జీవితమూ కూడా ఆనందంగా సాగుతాయి. చేతిలో ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో రిటైరైనా బాధనిపించదు.

* * * * * * * * * *

బెంగళూరులోని ఓ ప్రముఖ సాంస్కృతిక కేంద్రంలో నృత్య కార్యక్రమం జరుగుతోంది. ఆజానుబాహుడైన ఓ నడివయసు వ్యక్తి కథాకళి నృత్యం చేస్తున్నాడు. నృత్యంలో లీనమై చక్కటి ప్రదర్శన ఇస్తున్న అతడిని చూసి ప్రేక్షకుల్లో చాలామంది ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారు కానీ కథాకళి మేకప్‌ వల్ల గుర్తుపట్టలేకపోయారు. కార్యక్రమం పూర్తయ్యాక కళాకారుడి వివరాలు ప్రకటించడంతో ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అభినందనలతో ఆయనను ముంచెత్తారు. ఆయన అప్పుడు ఇస్రో ఛైర్మన్‌ హోదాలో ఉన్న రాధాకృష్ణన్‌. అంగారకయాత్రకు సంబంధించిన పనిలో ఇస్రో తలమునకలుగా ఉన్న వేళ అది. నృత్యప్రదర్శనలు మాత్రమే కాదు, రాధాకృష్ణన్‌ సంగీత కచేరీలూ చేసేవారు. వృత్తిపరమైన ఒత్తిళ్లనుంచి రిలాక్సవడానికి ఆయన ఎంచుకున్న మార్గం అది. మరి రీఛార్జ్‌ కావడానికి మీరెంచుకున్న హాబీ ఏమిటి..?

ఏ హాబీతో ఏమొస్తుంది?

  హాబీలు మంచివని చెప్పడమే కాదు, ఏ హాబీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. హాబీలకు వయసుతో సంబంధం లేదనీ ఏ వయసువారికైనా దాదాపు ఒకే ఫలితాలు ఉంటాయనీ కూడా వారు తేల్చి చెప్పారు.
* శారీరక సామర్థ్యాన్నిఉపయోగించాల్సిన క్రీడల్లాంటి హాబీ ఉన్నవాళ్లలో మల్టీటాస్కింగ్‌ సామర్థ్యం 15 శాతమూ ఉత్పత్తి 23శాతమూ పెరుగుతుంది.
* వంటపని, బేకింగ్‌ లాంటివి సంక్షోభాలను ఎదుర్కొని పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. మెదడుని చురుగ్గా ఉంచుతాయి.
* ఓ సంగీత పరికరాన్ని వాయించాలంటే మెదడులోని రెండు భాగాలూ పనిచెయ్యాల్సిందే. అంటే మెదడు నూటికి నూరుశాతం నిమగ్నమవ్వాలి. అందుకే సంగీతంతో మెదడు పూర్తిగా రిలాక్సవుతుందంటారు.
* కంప్యూటర్‌ నైపుణ్యాలనూ హాబీగా నేర్చుకోవచ్చు. దానివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చాలామంది పెద్దవాళ్లు రిటైరయ్యాక కంప్యూటర్‌తో పనిచేస్తూనో, స్మార్ట్‌ఫోన్‌ వాడుతూనో ఉండడం వల్ల వారిలో వయసైపోతోందన్న ఆలోచనలు రావడం లేదనీ ఆరోగ్యంగా ఉంటున్నారనీ ఓ పరిశోధనలో తేలింది. వేగంగా ఆడే వీడియో గేమ్స్‌ వల్ల పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందట.
* కుట్లూ అల్లికలూ చేసేవారిలో జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గిపోతాయి. కొత్త భాష నేర్చుకున్నా అంతే. ఒక్క భాష వచ్చిన వారికన్నా రెండు భాషలు వచ్చినవారికి ఆల్జీమర్స్‌ వచ్చే అవకాశం చాలా తక్కువ.
* ఆఫీసు మీటింగ్‌లో కూర్చుని చేతిలోని కాగితం మీద బొమ్మలేస్తూ ఎవరైనా కన్పిస్తే- కోపం తెచ్చుకోకండి. ఆ అలవాటు వల్ల వారిలో సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందట.

చిత్రవిచిత్రమైన హాబీలు!

నాణేలో తపాలా బిళ్లలో సేకరించడం ఒకప్పటి ఫ్యాషన్‌. ఇప్పుడు చిత్రవిచిత్రమైన హాబీలు చాలా ఉన్నాయి. రకరకాల ఆకారాల్లో కార్లు తయారుచేసే సుధాకర్‌ తాను తయారుచేసిన కార్లతో హైదరాబాద్‌లో ఓ మ్యూజియమే పెట్టేశాడు. ఫైసల్‌ అలీఖాన్‌ పాత కెమెరాలు సేకరించే హాబీ ‘మహానటి’ సినిమా వారి అవసరం తీర్చింది. హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ కత్తులు సేకరిస్తుంది. మళ్లీ వాటివల్ల ఎవరికీ హాని జరగకుండా వాటిని మొద్దుబారేలా చేయించి మరీ దాచుకుంటుందట. నటుడు జానీ డెప్‌ బార్బీ బొమ్మలు సేకరించడమే కాదు, వాటితో ఆడుకుంటాడు కూడా. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ గిటార్‌ లాంటి ఒక చిన్న వాయిద్యాన్ని ఎంతో ఇష్టంగా వాయిస్తుంటాడు. లేదంటే బ్రిడ్జ్‌ ఆడతాడు. ట్విటర్‌ మాజీ సీఈవో డిక్‌ కొస్టొలో తేనెటీగల్ని పెంచుతాడు. తేనె తయారయ్యే విధానాన్ని గమనించడమంటే అతనికి చాలా ఇష్టమట.

ఆరోగ్యానికి మేలుబాట

ఖాళీసమయాన్ని ఆరోగ్యకరమైన జీవితానికి మేలుబాటగా మార్చుకునే మార్గమేదైనా ఉందీ అంటే అది ఓ మంచి హాబీతోనేనట. అందులో గొప్ప నైపుణ్యాలేమీ సాధించనక్కర్లేదు, కేవలం ఆస్వాదిస్తే చాలు... నెలలూ ఏళ్లూ గడిచేసరికి ఒత్తిడిలేని ఒక చక్కటి జీవనశైలి అలవడిపోతుంది- అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాథ్యూ జవాకి.
ఏ స్థాయి ఉద్యోగమైనా ఈ రోజుల్లో మనకు తెలియకుండానే ఎంతో కొంత ఒత్తిడి పేరుకుపోవడం సహజం. ఒత్తిడి వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. బీపీ ఎక్కువవుతుంది. హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. దీర్ఘకాల ఒత్తిడి వల్ల గుండెజబ్బులతోపాటు కుంగుబాటూ, స్థూలకాయమూ; జ్ఞాపకశక్తీ, వ్యాధి నిరోధకశక్తీ తగ్గడమూ... లాంటి ఎన్నో నష్టాలున్నాయి. అందుకే ఒత్తిడిని ‘సైలెంట్‌ కిల్లర్‌’ అంటున్నారు. అలాంటి ఒత్తిడిని తగ్గించే శక్తి మన కాలక్షేపపు హాబీకి ఉన్నప్పుడు- ఎందుకు ఆలస్యం, వెంటనే ఓ హాబీ మొదలెట్టేసెయ్యండి మరి... అంటున్నారు మాథ్యూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.