close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెల్లజుట్టుకి చెక్‌ పెట్టాలంటే...

తెల్లజుట్టుకి చెక్‌ పెట్టాలంటే...

న్యుకారణాలు కొంతా, ఒత్తిడి మరికొంతా... మొత్తమ్మీద ఏదయితేనేం... ఇటీవల చాలామందికి చిన్నవయసులోనే జుట్టు తెల్లబడిపోతోంది. అందుకే ముందునుంచీ కూడా కాస్త జాగ్రత్తపడితే ఆ సమస్యను దీర్ఘకాలంపాటు వాయిదా వేస్తూ పోవచ్చు. అందుకోసం ఈ చిట్కాలు చిన్నవయసు నుంచే పాటించడం ప్రారంభించండి...
నాలుగు ఎండు ఉసిరికాయల్ని తీసుకుని వాటిని ఓ కప్పు కొబ్బరినూనెలో మరిగించాలి. దాన్ని నిల్వచేసుకుని రెండురోజులకోసారి తలకి బాగా పట్టించి మర్దన చేయాలి. తరవాత జుట్టు అంతటికీ పట్టించి అరగంట తరవాత షాంపూ చేయాలి. అందులోని విటమిన్‌-సి కుదుళ్లలో మెలనిన్‌ శాతం పెంచేందుకు దోహదపడుతుంది. రెండు టేబుల్‌స్పూన్ల బ్లాక్‌ తేయాకుని కప్పు నీళ్లలో వేసి మరిగించి చల్లారాక దాన్ని తలకి పట్టించి ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తే కొంతవరకూ సమస్య తగ్గుతుంది. అలాగే కరివేపాకుని కొబ్బరినూనెలో మరిగించి చల్లారాక కుదుళ్లకు పట్టించినా ఫలితం ఉంటుంది. ఇంకా రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి వేడిచేసి గోరువెచ్చగా ఉండగా కుదుళ్లకు పట్టించి అరగంట తరవాత షాంపూ చేయాలి. నిమ్మలోని బి, సి విటమిన్లూ ఫాస్ఫరస్‌ ఖనిజమూ మెలనిన్‌ వృద్ధికి తోడ్పడతాయి.


బరువు తగ్గాలంటే...

రువు... ఎందరినో వేధిస్తోన్న సమస్య. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడంతో కోరిన డ్రెస్సు వేసుకోలేక చాలామంది బాధపడుతుంటారు. అయితే దానికోసం భోజనం మానేయడం, అతిగా వ్యాయామం చేయడం... చేసి తగ్గడం లేదని బాధపడుతుంటారు. కానీ క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం వంటివాటితోబాటు ఇవి కూడా పాటించి చూడండి అంటున్నారు పోషక నిపుణులు. చాలా సందర్భాల్లో దాహాన్ని కూడా ఆకలిగానే పరిగణించి కొందరు అతిగా తినేస్తుంటారు. అలాకాకుండా ఉండాలంటే ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఘనాహారం తీసుకునే శాతం తగ్గుతుంది. ఉదాహరణకు జపాన్‌కు చెందిన బౌద్ధ సాధువులు మెత్తగా దంచిన మాచా గ్రీన్‌ టీని ఎక్కువగా తీసుకోవడంవల్లే ఆరోగ్యకరంగానూ సన్నగానూ ఉంటారు. ఎందుకంటే ఆ పొడిలో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. అవి క్యాలరీలను కరిగించి శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఆపిల్‌ సెడార్‌ వినెగర్‌ కూడా అంతే మేలు చేస్తుంది. అందులోని ఎసిటిక్‌ ఆమ్లం శరీరంలో కొవ్వు పేరుకోనివ్వకుండా చేస్తుంది. పసుపు మరింత అద్భుతమైన ఔషధం. దీన్ని వేడినీళ్లలో వేసి టీరూపంలో తీసుకుంటే అందులోని కుర్‌క్యుమిన్‌ జీవక్రియని పెంచి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. మెంతులు నానబెట్టి ఆ నీళ్లను తాగితే వాటిల్లోని గాలాక్టోమానా అనే పదార్థం కూడా జీవక్రియా వేగాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. లేదంటే మెంతుల్ని కాస్త వేయించి పొడిలా చేసి పరగడుపున కాస్త నీళ్లతో తీసుకున్నా చాలు, క్రమంగా బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు.


ప్రేమబంధం పదిలమేనా?!

న్యోన్యంగా ఉండే భార్యాభర్తల్లో ఒకరిపట్ల ఒకరికి గౌరవం, ప్రేమ, ఆకర్షణ... వంటివన్నీ ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో అవన్నీ ఉన్నప్పటికీ తమది నిజంగానే గాఢమైన అనుబంధమేనా అనే సందేహం సహజం. అందుకే మీరెలా ఉంటున్నారో ఒకసారి సరిచూసుకోండి. భార్యాభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు మాటలతో పని లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు నిశ్శబ్దంగా ఉన్నా ఇద్దరిలో ఏ ఒక్కరికీ అసహనంగానో చిరాగ్గానో అనిపించకపోతే అది ఆరోగ్యకరమైన బంధమే. ప్రస్తుతం సోషల్‌మీడియా కారణంగా చెడిపోతున్న బంధాలే ఎక్కువ.
మీ శ్రీమతి/శ్రీవారు దగ్గరలో ఆ చుట్టుపక్కల లేనప్పుడు వాళ్లు నెట్‌లో ఏమి చూస్తున్నారో లేదా ఫోనులో ఎవరితో ఎక్కువ చాట్‌ చేస్తున్నారనేది శోధించడం; భాగస్వామి ఆలస్యంగా వచ్చినా, క్యాంపుకెళ్లినా వాళ్లని అనుమానించడం... వంటివి చేయకపోతే మీకు ఒకరిపట్ల ఒకరికి పూర్తి విశ్వాసం ఉందన్నమాట.
ఇద్దరూ ఉద్యోగస్తులయితే వృత్తి సంబంధమైన ఒత్తిడులు ఎదురైనప్పుడు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ చక్కని సమన్వయంతో వాటినుంచి బయటపడగలుగుతున్నారూ అంటే మీ మధ్య పూర్తి అవగాహన ఉందన్నమాట. 
నీవాళ్లూ నావాళ్లూ అని కాకుండా ఇద్దరి తరఫు బంధువులూ స్నేహితుల పట్ల గౌరవంగా ఉంటున్నారు అంటే మీది కచ్చితంగా అనురాగబంధమే.


ప్లాస్టిక్‌తో మెదడుకీ దెబ్బే!

ర్యావరణానికీ మానవాళికీ ప్లాస్టిక్‌ చేసే హాని గురించి తెలియంది కాదు. అయితే తాజాగా- వాటిల్లోని హానికర థాలేట్లు నాడీకణాల సంఖ్యను తగ్గించడంతోపాటు మెదడు పెరుగుదలనీ అడ్డుకుంటాయి అని తేల్చారు ఇలినాయ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు ఎలుకల్లో చేసిన పరిశోధనల్లో థాలేట్లకు గురయిన ఎలుక పిల్లల మెదడు పెరుగుదలలో ఈ తేడా స్పష్టంగా కనిపించిందనీ అలాగే తల్లి పొట్టలోని పుట్టబోయే పిల్ల ఎలుకల్లోనూ ఈ ప్రభావం కనిపించిందనీ అంటున్నారు. కాస్మొటిక్సూ మంచినీటి బాటిళ్లూ... ఇలా అనేక రకాల ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో ఈ థాలేట్లు ఉంటాయి. కాబట్టి గర్భిణులతోబాటు పసిపిల్లల్ని వీలయినంతవరకూ ప్లాస్టిక్‌ వస్తువుల వాడకానికి దూరంగా ఉంచడం మేలు.


అదే నాకు స్వర్గం...

స్వామీజీ తన ముందు నుంచి వెళుతున్న తాగుబోతుని ఆపి ‘తాగకు నాయనా! ఇలా చేస్తే నువ్వు చనిపోయాక నరకానికి పోతావ్‌!!’ అని చెప్పాడు.
అప్పుడు తాగుబోతు ‘మరి నాకు మందు అమ్మేవాడు ఎక్కడికెళతాడు స్వామీ!’ అని అడిగాడు.
‘అతను కూడా నరకానికే నాయనా!’ చెప్పాడు స్వామీజీ
‘మరి ఆ పక్కనే చికెన్‌ ముక్కలు అమ్మేవాడు...?’ ప్రశ్నించాడు తాగుబోతు.
‘సందేహమే అక్కర్లేదు. అతనూ అక్కడికే...’ చిరునవ్వుతో చెప్పాడు స్వామీజీ.
‘చాలు స్వామీ! వాళ్లిద్దరూ కూడా ఉంటే నాకది స్వర్గమే! అని తూలుతూ వెళ్లిపోయాడు తాగుబోతు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.