close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సినిమా హాలు... మీ ఊరికే వస్తుంది!

సినిమా హాలు... మీ ఊరికే వస్తుంది!

టీవీ, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌... ఎన్నున్నా అభిమాన నటుల సినిమాల్ని హాల్లో ఈలలూ, అరుపుల మధ్య చూస్తే ఉండే  కిక్కేవేరు. జనాలు సినిమా హాళ్లకు క్యూ కట్టేది అందుకే మరి! నగరాలూ, టౌన్లలో సినిమా హాళ్లుంటాయి. కానీ, పల్లెల సంగతో! ఇప్పుడు అక్కడికీ సినిమా హాళ్లు వచ్చాయి. వాటిపేరు ‘కారవాన్‌ టాకీస్‌’!నేడే చూడండి... మీ అభిమాన థియేటర్లో... కొన్నేళ్ల కిందటి వరకూ రిక్షాలో తిరుగుతూ సినిమాల గురించి ఇలా ప్రచారం చేసేవారు. కారవాన్‌ టాకీస్‌ రాకతో చరిత్ర పునరావృతమవుతోంది. పల్లెల్లో ఆ పిలుపు మళ్లీ వినిపిస్తోంది. కారవాన్‌ టాకీస్‌... ఇదో మొబైల్‌ సినిమాహాల్‌. ఒక వ్యాన్‌మీద సినిమా తెరను ఏర్పాటుచేస్తారు. ఆ వ్యాన్‌ థిÅయేటర్‌లు లేని మారుమూల గ్రామాలకూ వెళ్లి అక్కడ సినిమాలు ప్రదర్శిస్తుంది. 2014లో 24 కారవాన్‌ టాకీస్‌లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 114కు పెరిగిందంటే వీటికి పెరుగుతున్న ఆదరణను అర్థం చేసుకోండి!
సినిమా ఉచితం...
ఒకప్పుడు మండల కేంద్రాల్లోనూ, కాస్త పెద్ద పల్లెల్లోనూ సినిమా హాళ్లు ఉండేవి. గత రెండు దశాబ్దాల కాలంలో వాటిలో చాలావరకూ మూతపడ్డాయి. ఆ తర్వాత పల్లెవాసుల్లో చాలామంది సినిమాహాళ్లకి దూరమయ్యారనే చెప్పాలి. ‘జనాలు సినిమా హాళ్లకి దూరం కాలేదు, సినిమాహాళ్లే జనాలకి దూరమయ్యాయి’ అని భావించింది సినిమా పంపిణీ విభాగంలో సేవలు అందించే ముంబయి సంస్థ యూఎఫ్‌ఓ. పరిష్కారంగా సినిమా తెరని మొబైల్‌ వ్యాన్‌ ఎక్కించి పల్లెలకే పంపిస్తోంది. సినిమా ప్రొజెక్టర్‌, 15X12 పరిమాణంలో ఉండే తెర, సౌండ్‌ సిస్టమ్‌, జనరేటర్‌ ఈ మొబైల్‌ వ్యాన్లో ఉంటాయి.
ఈ వ్యాన్లు వారం సంతలు జరిగే ప్రాంతాలకీ, మండల కేంద్రాలకీ, కాస్త పెద్ద పల్లెటూళ్లకీ ఉదయాన్నే చేరుకుంటాయి. సాయంత్రం ఆ వ్యాన్‌ ఎక్కడ నిలిపి ఉంటుందో, ఏ సినిమా వేస్తారో  సిబ్బంది ఊరంతా తిరిగి మైక్‌లో చెబుతారు. కొత్త సినిమాలతోపాటు బాగా ప్రాచుర్యం పొందిన పాత సినిమాల్నీ ఈ టాకీస్‌లో ప్రదర్శిస్తారు. సాధారణంగా ఊళ్లలో ఉండే స్కూల్‌ మైదానాలూ, ఖాళీ ప్రదేశాల్లో చీకటిపడ్డాక ఏడు గంటలకు కారవాన్‌ టాకీస్‌లో సినిమా వేస్తారు. ఇక్కడ సినిమా చూడ్డానికి టికెట్‌ అవసరంలేదు. ప్రవేశం అందరికీ ఉచితం. కూర్చోడానికి తార్పాన్లు వేస్తారు కూడా. అందుకే బుడి బుడి అడుగుల బుడ్డోళ్ల నుంచి మూడు కాళ్ల ముసలివాళ్ల వరకూ అందరూ తెర దగ్గరకు చేరిపోతారు. చాలా ఊళ్లలో కుటుంబ సభ్యులంతా కలిసే ఈ సినిమా చూడ్డానికి వస్తారు. ఒక్కోచోట సినిమా చూడ్డానికి 200 నుంచి 1000 మంది వరకూ వస్తారు. వచ్చేవాళ్లలో చాలామంది సినిమా హాళ్లకి వెళ్లక కొన్ని సంవత్సరాలవుతోందని చెబుతారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో నెలలో ఒకట్రెండుసార్లు మాత్రమే కారవాన్‌ టాకీస్‌లో సినిమాల్ని ప్రదర్శిస్తారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ కారవాన్‌ టాకీస్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కారవాన్‌ టాకీస్‌లు ఉన్నాయి. తెలంగాణలో వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలూ, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా ఊళ్లకు కారవాన్‌ టాకీస్‌ వెళ్లింది.ప్రకటనలతోనే డబ్బు
కారవాన్‌ టాకీస్‌కి డబ్బు ఎలా వస్తుందనేగా మీ సందేహం! టీవీల్లో ప్రకటనలు వచ్చినట్టే ఈ సినిమా ప్రదర్శన సమయంలో ప్రకటనలు వేస్తారు. ఇంకా వ్యాన్‌ పగటిపూట ఒక ప్రకటనల హోర్డింగ్‌లా పనిచేస్తుంది. ఈ వ్యాన్‌కు అన్నివైపులా ప్రకటనలు రాసి ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వ్యాన్‌ని తిప్పుతూ ప్రచారం చేస్తారు. బదులుగా కార్పొరేట్‌ కంపెనీలనుంచి డబ్బు వసూలు చేస్తారు. ‘పల్లెల్లో మార్కెట్‌ ఉన్న సంస్థలు మాతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి. కోకకోలా, పెప్సీ, ఐటీసీ, యునీలీవర్‌, స్టార్‌ స్పోర్ట్స్‌... ఇలా 50 వరకూ సంస్థలు యూఎఫ్‌ఓ సంస్థతో ప్రకటనలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా శీతలపానీయాలూ, చాక్లెట్లూ, మొబైల్‌ ఫోన్లూ, డీటీహెచ్‌ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తుల్ని తెచ్చి ప్రచారం చేస్తుంటారు. ఈ ఒప్పందాలు సీజన్లవారీ ఉంటాయి’ అని చెబుతారు సంస్థ ప్రతినిధి సిద్ధార్థ్‌ భరద్వాజ్‌. ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తక్కువ. కాబట్టి దక్షిణాదితో పోల్చితే ఉత్తరాదిలో కారవాన్‌ టాకీస్‌కి మంచి డిమాండ్‌ ఉంటోంది. ఒక్కో వ్యాన్‌ నిర్మాణానికి రూ.15 లక్షలు ఖర్చవుతుంది. వాటి నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్నదే. అందుకే వాణిజ్య సంస్థలు ప్రకటనలు ఇచ్చినపుడే వీటిని నడుపుతుంటారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సంస్థ లాభాల్లో నడుస్తోంది. మన దగ్గరా మున్ముందు రామా టాకీస్‌, కృష్ణా టాకీస్‌లా ‘కారవాన్‌ టాకీస్‌’ కూడా అభిమాన థియేటర్‌గా మారినా ఆశ్చర్యపోనవసరంలేదు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.