close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రావమ్మా శ్రావణలక్ష్మీ రావమ్మా..!

రావమ్మా శ్రావణలక్ష్మీ రావమ్మా..!

వెండిమబ్బుల వెనకదాగిన వానచినుకు పుడమినిచేరి పులకిస్తున్నవేళ... ఆషాఢం సృష్టించిన ఎడబాటును చెరిపేస్తూ నవవధువు మెట్టినింట కాలిడుతున్నవేళ... నోములూ వ్రతాలతో ముత్తయిదువలు సందడిచేస్తున్నవేళ... సంతోషాలను వాయినమివ్వడానికీ ఆనందాలను దోసిళ్లలో నింపడానికీ వస్తున్న శ్రావణలక్ష్మికి (ఈ రోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం) స్వాగతం.శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఊరూ... ప్రతి వీధీ... ప్రతి ఇల్లూ... నోములూ వ్రతాలతో నిండైన ముత్తయిదువలతో కళకళలాడుతూ ఉంటుంది. ఓ వైపు ఆధ్యాత్మిక శోభనూ మరోవైపు ఆనందకర వాతావరణాన్నీ సంతరించుకునే ఈ మాసంలో ప్రతిరోజూ విశిష్టమైనదే. చంద్రుడు శ్రవణా నక్షత్రంలో అడుగుపెట్టడంతో ఈ మాసం ప్రారంభమవుతుంది. అందుకే దీనికి శ్రావణమాసం అని పేరు.
ప్రతిరోజూ పండగే
సాధారణంగా ఏ మాసంలోనైనా ఒక ప్రత్యేక తిథి వచ్చిందంటే చాలు ఆ నెలంతా పండగవాతారణాన్ని సంతరించుకుంటుంది. అలాంటిది ప్రతి రోజూ ఓ పండగే ప్రతి ఘడియా విశిష్టమైనదే అయిన శ్రావణమాసం ఇంకెంత ప్రత్యేకమో కదా. ముత్తయిదువలు ఆచరించే వ్రతాలూ నోముల్లో ఎక్కువ భాగం ఈమాసంలోనే ఉండటంవల్ల దీన్ని వ్రతాల మాసమనీ, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమనీ చెబుతారు. శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో మొదటిది మంగళగౌరీ నోము. పార్వతీదేవి గౌరీదేవిగా మారిన వృత్తాంతం శివపురాణంలో కనిపిస్తుంది. నారాయణుడూ నారాయణీ అన్నాచెల్లెళ్లు. ఇద్దరూ నలుపు వర్ణంలోనే ఉంటారు. పూర్వం ఓ సారి పార్వతీపరమేశ్వరులకు ప్రణయకలహం వచ్చినప్పుడు శివుడు అమ్మవారిని ఆటపట్టిస్తూ ‘నల్లనిదానా’ అన్నాడట. అప్పుడు పార్వతీదేవి కోపంతో తపస్సుచేసి ఎరుపు (గౌర) వర్ణంలోకి మారిందట. అందుకే అమ్మవారికి గౌరి అన్నపేరు వచ్చింది. అలాంటి గౌరీదేవిని ఈ నెలలో పూజిస్తే సకలశుభాలూ కలుగుతాయని ప్రతీతి. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలూ గౌరీదేవిని పూజించి, వాయినాలు ఇవ్వాలి. ఐదేళ్ల పాటు ఈ నోము నోచుకున్న తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల మహిళల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని చెబుతారు.
లక్ష్మీదేవికి ప్రీతికరమైన వారంగా శుక్రవారాన్ని పేర్కొంటారు. అందులోనూ శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలంటే ఆ తల్లికి ఇంకా ఇష్టమట. వీటిలో మరింత శ్రేష్ఠమైంది శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. అందుకే ఆ రోజు పేదాగొప్పా చిన్నాపెద్దా తేడాలేకుండా పెళ్లయిన ప్రతి మహిళా శక్తి కొద్దీ అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటుంది. దీపావళి తర్వాత జరుపుకునే నాగులచవితిలాగే మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో వచ్చే శుద్ధ చవితిని నాగచతుర్థిగా లేదా నాగులచవితిగా భావిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్టదగ్గరకు వెళ్లి పాలుపోసి, నాగదేవతను పూజిస్తారు.
శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. తమకు ఉత్తమ సంతాన భాగ్యం కలగాలని కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పుత్రదా ఏకాదశి వ్రతాన్ని చేపట్టిన మహాజిత్తు అనేరాజు సంతానాన్ని పొందినట్టు పురాణగాథ.విశిష్ట పౌర్ణమి
శ్రావణమాసంలో వచ్చే మరో ముఖ్యమైన తిథి శ్రావణ పూర్ణిమ. హయగ్రీవజయంతి, రాఖీపౌర్ణమి, జంధ్యాలపౌర్ణమి, ఉపాకరణ (వేదాధ్యయనాన్ని ప్రారంభించే రోజు)... ఇలా ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రహ్మదగ్గరి వేదాలను హిరణ్యాక్షుడనే రాక్షసుడు అపహరించాడు. వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు పౌర్ణమిరోజునే హయగ్రీవ రూపం ధరించాడట. అందుకే పౌర్ణమినాడు స్థితికారకుడిని హయగ్రీవ రూపంలో కొలుస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కాచెల్లెళ్లు చేసుకునే పండగ రాఖీపౌర్ణమి. తోబుట్టువులం ఒకరికి ఒకరం రక్షగా నిలుస్తాం అన్నదానికి నిదర్శనంగా రక్షాబంధనాన్ని కట్టుకుంటారు ఆ రోజు. శ్రావణ పున్నమినే జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆరోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తదాన్ని ధరిస్తారు. బహుళపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజు సంకటాలను హరించే గణపయ్యను భక్తిశ్రద్ధలతో పూజించడం సంప్రదాయం. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుడు. ఆ వెన్నదొంగ శ్రావణబహుళ అష్టమి రోజున జన్మించాడు. ఆ రోజును కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అంటారు. గోవిందుణ్ణి భక్తితో ఆరాధించి, ఆయనకి ఇష్టమైన పాలూ, వెన్నా, మీగడా, అటుకులను నైవేద్యంగా పెట్టాలి. వరలక్ష్మీవ్రతం, మంగళగౌరీ వత్రం... మాదిరిగానే కృష్ణాష్టమిని కూడా వ్రతంగా జరుపుకునే ఆచారం కొన్ని చోట్ల ఉంది. పగలంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. బియ్యపుపిండితో చిన్ని కృష్ణుడి పాదాలు ఇంటిలోకి వచ్చేలా ముద్రలు వేస్తారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశిరోజు ఏకాదశి వ్రతాన్ని చేస్తే ఇష్టకామ్యాలు నెరవేరతాయట. అందుకే దాన్ని కామికా ఏకాదశి అంటారు. ఈ రోజు వెన్న దానం చేస్తే విశేష ఫలం లభిస్తుందట.
శ్రావణబహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. అకాల మృత్యుభయం తొలగిపోవాలనీ సంతానం క్షేమంగా ఉండాలనీ మహిళలు కందమొక్కకి సంతానలక్ష్మిని ఆవాహనం చేసి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పోలాల అమావాస్య రోజున పాడిపశువులకు పూజచేస్తారు. ప్రకృతిలోని ప్రతి జీవిలో ఆ పరమాత్మ కొలువై ఉన్నాడన్న భారతీయ సంప్రదాయానికి నిదర్శనమే శ్రావణమాసం... శుభాలమాసం... సౌభాగ్యాలమాసం!


శ్రీవారి ప్రసాదం

తిరుమలలో శ్రీవారికి నివేదించే ప్రసాదాల ప్రస్తావన శాస్త్రంలో ఉందా?
తిరుమలలో శ్రీవారి ఆలయం నిర్మాణం నుంచి స్వామివారికి జరిపే సేవల వరకూ ప్రతిదీ శాస్త్ర ప్రకారమే జరుగుతుంది. అందులో శ్రీవారి నైవేద్యం కూడా భాగమే. భక్తులకు తిరుమల ప్రసాదమనగానే మొదట లడ్డూనే కళ్ళముందు మెదులుతుంది. కానీ, నిత్యం స్వామికి యాభై రకాల పదార్థాలను నైవేద్యంగా పెడతారన్న విషయం చాలామంది భక్తులకు తెలీదు. అందులో కమ్మటి దోశెలూ, ఘాటు మిరియాలతో వండిన అన్నం స్వామికి అత్యంత ప్రీతిపాత్రం. సుప్రభాతం మొదలు పవళింపు సేవదాకా నిత్యం శ్రీవారికి ఎన్నో కైంకర్యాలు జరుగుతాయి. ఒక్కో సేవలో భాగంగా స్వామికి ఏ ప్రసాదాన్ని పెట్టాలో ఆగమశాస్త్రం చెబుతుంది. సుప్రభాత సేవలో వెన్న, పాలతో చేసిన పదార్థాలను నివేదిస్తారు. తోమాలసేవ ముగిశాక నల్లబియ్యం, శొంఠి, బెల్లంతో చేసిన పదార్థాలూ, సహస్ర నామార్చన అనంతరం మీగడ, వెన్న, పెరుగుతో చేసిన అన్నం, మధ్యాహ్నం ఆరాధనలో దోశ, వడ, అప్పం, లడ్డూ, రాత్రివేళ మిరియాలతో చేసిన మరీచ్ఛాన్నం, ఉడాన్నం, గసగసాలతో చేసిన పాలు, నేతిలో వేయించిన జీడిపప్పూ... ఇలా సేవనుబట్టి స్వామి వారికి నివేదించే పదార్థాలు మారుతుంటాయి. గర్భాలయానికి ఆగ్నేయ మూలలోని వంటశాలలో కట్టెలపొయ్యి మీద చేసిన పదార్థాలనే స్వామికి నివేదించాలని శాస్త్రం చెబుతోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.