close
పెళ్ళి

పెళ్ళి
- సలీం

నాన్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేలోపలే నా చెంప ఛెళ్ళుమంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నాన్న కోప్పడటం నేనెరగను. చిన్నప్పుడు అమ్మ కొట్టినా నాన్న అక్కున చేర్చుకుని బుజ్జగిస్తూ అమ్మను మందలించిన సందర్భాలు ఎన్నో! అలాంటిది నాన్న ఈరోజు చెంపదెబ్బ కొట్టినందుకు వరదలా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి.
వంటింట్లో ఉన్న అమ్మ కంగారుపడుతూ ‘‘ఏమైందండీ’’ అంటూ హాల్లోకొచ్చింది.
‘‘మనం చుట్టుపక్కల తలెత్తుకోకుండా చేసింది నీ కూతురు. ఎవరో కిరణ్‌ అట, వాడితో హోటళ్ళ వెంటా పార్కుల వెంటా తిరుగుతోందట. ఎంత అప్రతిష్ఠ! మరో నెల్లో పెళ్ళి పెట్టుకుని దీనికిదేం పోయేకాలం’’ నాన్న కోపంతో మండిపడుతూ అన్నాడు.
‘‘ఎదిగిన పిల్లను పట్టుకుని కొట్టడానికి మీకు చేతులెలా వచ్చాయండీ. అది ఇంజినీరింగ్‌ చదివిన పిల్ల. పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మంచేదో చెడేదో దానికి బాగా తెలుసు. మనమ్మాయి అలాంటి పని చేసిందంటే నేను నమ్మను’’ అంది అమ్మ.
నామీద అమ్మకున్న నమ్మకం నాన్నకు లేనందుకు చాలా బాధేసింది. ఓ ఆడదానికే మరో ఆడదాని మనసు అర్థమవుతుంది. అపార్థం చేసుకోకుండా ఉండటంలో అమ్మల్ని మించిన వాళ్ళెవరుంటారు? నిన్నటి వరకూ ‘నా కూతురు బంగారం... అది మన కూతురు కావడం మన అదృష్టం’ అంటూ మురిసిపోయిన నాన్న ఈరోజు ఎవరో చెప్పిన చెప్పుడుమాటలు విని నన్ను పరాయిదాన్ని చేస్తూ అమ్మతో ‘నీ కూతురు’ అనడం ఎంత దారుణం!
‘‘నీకు తెలియదు నువ్వు నోర్మూసుకో. నిశ్చితార్థమై ఈరోజుకి సరిగ్గా నలభై రోజులు. ఆ మూడుముళ్ళూ పడేదాకా జాగ్రత్తగా ఉండాలన్న జ్ఞానం లేదా దీనికి? ఇది పరాయి మగాడితో తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడనుకున్నావా దీనికి కాబోయే మొగుడు?’’
‘‘మనమ్మాయంటే గిట్టనివాళ్ళెవరో మీకు లేనిపోనివి కల్పించి చెప్పి ఉంటారండీ. కిరణ్‌ అంటే దాని ఆఫీసులో పనిచేసే కుర్రాడే. అతని గురించి మనమ్మాయి నాతో చెప్పిందిలెండి. చాలా బుద్ధిమంతుడట. పక్కన ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా తలొంచుకుని తన పనేదో తాను చేసుకుంటాడట. అతని గురించీ మనమ్మాయి గురించీ చెడుగా ఎవరు మాట్లాడినా నేను నమ్మను.’’
‘‘కళ్ళారా చూసినవాళ్ళు చెప్పినా నమ్మవా?’’
‘‘ఎవరా కళ్ళారా చూశానని చెప్పినవాళ్ళు? ఎదురుగా రమ్మనండి. వాళ్ళ కళ్ళు పీకి చేతిలో పెడ్తాను.’’
‘‘ఎవరో అయితే నాకింత బాధ ఎందుకుంటుంది? మన కాబోయే అల్లుడే చూశాడట. గంట క్రితమే ఫోన్‌ చేసి చెప్పాడు. మనమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదట. చెడిపోయిన పిల్లని పెళ్ళి చేసుకునేంత ఖర్మ తనకేమీ పట్టలేదంటూ కోపంగా నా మొహం మీదే ఫోన్‌ పెట్టేశాడు’’ నాన్న తల పట్టుకుని కుర్చీలో కూలబడిపోయాడు.
‘‘అయ్యో దేవుడా... కాబోయే అల్లుడు అంత మాటన్నాడా? ఇప్పుడెలాగండీ. మన బంధువులందర్నీ పిలిచి ఘనంగా నిశ్చితార్థం చేశాంగా. పెళ్ళి తప్పిపోతే అందరికీ ఏమని సమాధానం చెప్తాం?’’
‘‘అదేగా ఇందాకటినుంచీ నా గుండెల్ని మెలిపెడుతున్న ప్రశ్న. నిశ్చితార్థందాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే దీనికి పెళ్ళవుతుందా? అక్రమ సంబంధం కారణంతో పెళ్ళి తప్పిపోయిందని తెలిస్తే, మన పిల్లని ఎవరు చేసుకుంటారు?’’ నాన్న తల పట్టుకుని కుర్చీలో కూలబడిపోయాడు.
నాకు తల తిరిగిపోతోంది. ఏం జరుగుతోంది? నేను వినయ్‌తో అన్నదేమిటి... ఆ నీచుడు నాన్నతో చెప్పిందేమిటి? వాడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోడానికి ఎంత కథను అల్లి చెప్పాడో... తనని పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదని నేను కదా చెప్పాను... నిశ్చితార్థం జరిగాక తనని పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదని అమ్మాయే చెప్పిందని పదిమందికీ తెలిస్తే తనకు అవమానమని, వినయ్‌ నామీద నింద మోపాడు. తనే నన్ను వద్దనుకుంటున్నట్లు నాన్నతో చెప్పాడు. ఎంతటి దుర్మార్గం!
వినయ్‌ని పెళ్ళి చేసుకోనని చెప్పినందుకు ఇంటికి రాగానే నాన్న చిందులు తొక్కుతాడని ఊహించానుగానీ ఆ వినయ్‌గాడు నా శీలానికి మసిబూసి నన్ను తిరుగుబోతుని చేసి మా అమ్మానాన్నల ముందు దోషిలా నిలబెడతాడని ఊహించలేదు.
‘‘కాబోయే అల్లుడి కాళ్ళు పట్టుకునైనా బతిమాలుదామండీ. అనుకున్న పెళ్ళి ఆగిపోతే ఎంత అవమానం!’’ అమ్మ ఏడుస్తోంది.
‘‘లాభంలేదు. నేను చాలాసేపు బతిమాలాను. మీ అమ్మాయిని చేసుకునే ప్రసక్తేలేదనీ, ఈ నిర్ణయంలో మార్పుండదనీ గట్టిగా చెప్పేశాడు. అయినా రేపోసారి వాళ్ళింటికెళ్ళి అబ్బాయితో, వియ్యంకుడితో మాట్లాడతాను’’ అన్నాడు నాన్న.
‘‘అవసరం లేదు. అతనొప్పుకున్నా నేనొప్పుకోను’’ అన్నాను.
‘‘అతను కాదంటే నీకు పెళ్ళే కాదే’’ అంది అమ్మ.
‘‘ఫర్లేదు. పెళ్ళి కాకపోతే ఒంటరిగా ఉండిపోతాను తప్ప అటువంటి దగుల్బాజీ వెధవని చేసుకోను.’’
‘‘నువ్వు తప్పటడుగు వేసి అతన్నెందుకు తప్పుపడతావు? బంగారంలాంటి కుర్రాడు. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంటులో అసిస్టెంట్‌ ఇంజినీరు. ఏదోరోజు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు స్థాయికి ఎదుగుతాడు. పెద్దలంటే ఎంత గౌరవం! దైవభక్తి కలవాడు. అంత మంచి కుర్రాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు?’’ అన్నాడు నాన్న.
‘‘అతనిలో మీకు వేయి సద్గుణాలు కనిపించినా నాకొద్దు. అతన్ని నేను పెళ్ళి చేసుకోను’’ అంటూ విసురుగా నా గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను.
మంచంమీద పడిపోయి దిండులో తలదూర్చి చాలాసేపు ఏడ్చాను. పెళ్ళిచూపుల్లో వినయ్‌ని చూసిన క్షణమే ఇష్టపడ్డాను. అల్లరిగా నవ్వే అందమైన కళ్ళూ, వత్తయిన జుట్టూ, చక్కటి శరీర సౌష్టవం, మంచి ఉద్యోగమూ... ఇంతకన్నా ఏ ఆడపిల్లయినా ఏం కోరుకుంటుంది? అతనికీ నేను నచ్చానట. పెళ్ళికి నేను అంగీకారం తెలపటంతో నిశ్చితార్థం చేశారు.
ఆరోజు ఎంత ఆనందపడ్డానో... మా నిశ్చితార్థానికి వచ్చిన స్నేహితురాళ్ళందరూ ‘నువ్వు చాలా లక్కీనే. కుర్రాడు ఎర్రగా బుర్రగా స్లిమ్‌గా అచ్చం మహేష్‌బాబులా ఉన్నాడే’ అంటూ అభినందించారు. కొంతమంది అమ్మాయిలు నా అదృష్టానికి అసూయపడ్డారు కూడా. కానీ అతడెంత మేడిపండులాంటివాడో ఈ నలభై రోజుల్లో తెలిసొచ్చింది.
ఎలాగూ మరికొన్ని రోజుల్లో పెళ్ళి చేసుకోబోతున్నానన్న ధైర్యంతో అతను సినిమాలకూ షికార్లకూ పిలిచినప్పుడల్లా రెక్కలు తొడుక్కుని వెళ్ళాను. నిశ్చితార్థానికీ పెళ్ళికీ మధ్య రెండు నెలలకు పైగా సమయం ఉండటం నా అదృష్టం. లేకపోతే వాడు మేకవన్నె పులన్న విషయం పెళ్ళికి ముందే తెలిసేది కాదు.
మొదట్లో సభ్యతగానే ప్రవర్తించాడు. రానురాను అతని నిజస్వరూపం బయటపడసాగింది. ఓసారి అతను ఫోన్‌ చేసినపుడు నా ఫోన్‌ ఎంగేజ్‌ వచ్చిందట. మళ్ళా ఫోన్‌ చేసి నాపైన ములుకుల్లాంటి ప్రశ్నలవర్షం కురిపించాడు.
‘ఎవరితో మాట్లాడుతున్నావు?’ అన్నాడు.
‘మా అమ్మతో’ అన్నాను.
‘నమ్మమంటావా?’ గొంతులో చల్లటి మంచుతో చేసిన కత్తులేవో దాచుకున్నట్టు...
‘అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం?’ అన్నాను విసుగ్గా.
‘బాయ్‌ఫ్రెండ్‌ ఏమో అనుకున్నా. తప్పులేదులే... మీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకది సహజమేగా.’
‘నాకెవరూ బాయ్‌ఫ్రెండ్స్‌ లేరు’ అన్నాను కోపంగా.
‘నువ్వు చేసిన కాల్‌ స్క్రీన్‌షాట్‌ పంపించు’ అన్నాడు.
నేను పంపలేదు. మరునాడు సాయంత్రం మా ఆఫీసుకొచ్చి కలుసుకున్నాడు. ‘అంటే ఆ కాల్‌ బాయ్‌ ఫ్రెండ్‌ నుంచనేగా అర్థం. అందుకేగా స్క్రీన్‌షాట్‌ పంపడానికి భయపడ్డావు’ అన్నాడు. ఫోన్‌ అతని చేతికిచ్చి చూసుకోమన్నాను. ఫోన్‌ అంతా వెతుక్కున్నాక వంకరగా నవ్వుతూ ‘ఏమిటీ నీ ఫోన్‌లో కుర్రాళ్ళ ఫొటో ఒక్కటి కూడా లేదు..? అయినా మీ ఆడపిల్లల గురించి నాకు తెలియదా... ఏది దాచాలో ఏది చూపించాలో మీకు బాగా తెలుసు. అన్నీ డిలీట్‌ చేసి ఉంటావు. తెలివిగలదానివి కదా’ అన్నాడు.
అతని మనస్తత్వం గురించి నాన్నకు చెప్పాలనుకున్నాను. ఆర్నెల్లక్రితమే నాన్నకు గుండెనొప్పి వస్తే రెండు స్టంట్లు వేశారు. ఈ విషయాలన్నీ చెప్పి ఆయన మనసుని నొప్పించడం ఇష్టంలేక నాలో నేనే కుమిలిపోయాను. పెళ్ళయ్యాక నా మంచి ప్రవర్తనతో అతనిలో మార్పు తీసుకురాగలనన్న పిచ్చి నమ్మకం...
మా అక్కా బావా పండక్కి ఇంటికొచ్చినపుడు భోజనానికి వినయ్‌ని కూడా రమ్మని పిలిచాడు నాన్న. రెండున్నరేళ్ళ మా అక్క కొడుకు చరణ్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు భోజనం చేస్తున్నంతసేపూ నేను వాణ్ణి ఆడిస్తూనే ఉన్నాను. ‘మా చెల్లెలికి చరణ్‌ అంటే ప్రాణం. వాడు నా కొడుకు కాదట. తన కొడుకంటుంది’ అంటూ నవ్వింది అక్క. భోజనాలయ్యాక బావ నా చేతుల్లోంచి బాబుని ఎత్తుకుంటూ ‘ఈ ప్రేమంతా రేపు తనకో బాబు పుట్టేవరకే’ అన్నాడు. ‘నాకు కొడుకు పుట్టినా పెద్దకొడుకు మాత్రం వీడే’ అన్నాను.
మరునాడు వినయ్‌ నుంచి ఫోనొచ్చింది. ‘ఏంటీ, మీ అక్క కొడుకంటే అంత ప్రేమ? సొంత కొడుక్కన్నా ఎక్కువలా ఉన్నాడే’ అన్నాడు.
‘అవును. వాడంటే నాకు చాలా ఇష్టం. అక్కకు ఇంకో నెలలో డెలివరీ అవుతుందనగా సాయానికి నేనే వెళ్ళాను. మాకు ఎండాకాలం సెలవలు. అమ్మ డెలివరీ సమయానికి వచ్చింది. వాడ్ని మొదట ఎత్తుకుంది నేనే తెలుసా?’ అన్నాను ఉత్సాహంగా.
‘మీ అక్క కడుపుతో ఉంది కాబట్టి బావ అవసరాలన్నీ నువ్వే తీర్చి ఉంటావుగా.’
అతనిలోని చెడు ఉద్దేశం వెంటనే తట్టకపోవటం వల్ల ‘మరంతేగా.
మరదల్ని కదా... ఏ లోటూ రాకుండా చూసుకున్నాను. మీ అక్కకంటే నువ్వే బెటర్‌ అన్న కాంప్లిమెంట్‌ కూడా కొట్టేశాను తెలుసా?’ అన్నాను.‘నేను ఊహించాలే. మీ అక్కకంటే నువ్వే అందంగా ఉంటావు కదా. కడుపుతో ఉన్న అక్కలకు సాయంగా వచ్చిన మరదళ్ళని రుచి చూడకుండా వదిలేసే ప్రవరాఖ్యులు ఈ రోజుల్లో ఎవరుంటారు? అందుకేనేమో మీ బావ కొడుకంటే అంత ప్రాణం?’
నాకు సర్రున కోపం వచ్చింది. ‘నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా బావ చాలా మంచివారు. నన్ను సొంత చెల్లెలికన్నా ఎక్కువగా చూస్తారు’ అన్నాను.
‘మాంసం తిన్నామని ఎవరైనా ఎముకలు మెళ్ళో వేసుకుంటారా? అక్కలకు అనుమానం రాకుండా మేనేజ్‌ చేయాలంటే ఆ మాత్రం ముసుగేయకపోతే ఎట్లా.’
‘ఛీ, ఇంత నీచంగా ఆలోచించే నువ్వంటే అసహ్యం వేస్తోంది. నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకిష్టంలేదు. గుడ్‌బై’ అన్నాను.
‘నన్ను కాదన్నాక నీకు పెళ్ళెలా అవుతుందో నేనూ చూస్తాను’ అన్నాడు వినయ్‌.
‘నీకు చేతనైంది చేసుకో పోరా’ అనేసి కాల్‌ కట్‌ చేశాను.
ఇంటికి రావడంతోటే ‘వినయ్‌తో ఏమన్నావు?’ అని అడిగాడు నాన్న.
నేనేదో చెప్పబోయేలోపల చెంప పగిలేలా కొట్టాడు. ‘కిరణ్‌తో సన్నిహితంగా మెలగొద్దు’ అని వినయ్‌ నన్ను హెచ్చరిస్తే, ‘నా ఇష్టం వచ్చినవాడితో తిరుగుతాను. అడగడానికి నువ్వెవరు?’ అని సమాధానమిచ్చానని నాన్నతో చెప్పాడట.
కిరణ్‌ నా కొలీగ్‌. చాలా మంచివాడు. అతనికి మూడేళ్ళ వయసున్నప్పుడు పోలియో వల్ల కుడికాలు చచ్చుబడిపోయిందట. దాన్ని ఈడుస్తూ నడుస్తాడు. చాలా మంచివాడు. ఓరోజు హాట్‌ చాకొలేట్‌ ఫడ్జ్‌ తినాలనిపించి క్రీమ్‌ స్టోన్‌కెళ్ళాను. అక్కడ ఐస్‌క్రీమ్‌ తింటూ కిరణ్‌ కనిపించాడు. ‘నా బలహీనత ఐస్‌క్రీమ్‌ అండీ’ అంటూ నవ్వాడు.
త్వరలో నా పెళ్ళి జరగబోతోందని తెలుసుకుని అభినందనలు తెలిపాడు. ‘మీరెప్పుడు పెళ్ళి చేసుకుంటారు?’ అని అడిగినపుడు అతని మొహం ఉదాసీనంగా మారిపోయింది.
‘మంచి ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి కొన్ని సంబంధాలు వస్తున్నాయండీ. కానీ, నాకలా పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదు. నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తి కావాలి... నా అవిటితనంతో సహా. నన్ను పెళ్ళి చేసుకోడానికి మీకేమీ అభ్యంతరంలేదుగా అని నేనడిగే అమ్మాయి నాకొద్దు. అలా నన్నడిగే అమ్మాయి ఎదురుపడితే అప్పుడు పెళ్ళి చేసుకుంటాను’ అన్నాడు.
సంభాషణ ఆఫీసులో మా బాస్‌ మీదికి మళ్ళి ఇద్దరం నవ్వుకుంటున్నప్పుడు వినయ్‌ లోపలికొచ్చి మమ్మల్ని చూశాడు. ‘నా కాబోయే భర్త’ అంటూ వినయ్‌ని పరిచయం చేశాను. ‘ఇద్దరూ కలిసే వచ్చారా ఈ షాప్‌కి’ అని అడిగాడు కిరణ్‌ని. ‘లేదు సార్‌, నేను ఐస్‌క్రీమ్‌  తినడం మొదలెట్టిన పది నిమిషాలకు తనొచ్చింది’ అన్నాడు కిరణ్‌. ‘ఆఫీసులోంచి బయటికొచ్చేముందే ఈ క్రీమ్‌స్టోన్‌లో కలుసుకోవాలని మీరిద్దరూ అనుకున్నారు కదూ’ అంటూ నవ్వుతూ అడిగాడు.
‘లేదు సార్‌, ఇక్కడికి నేను తరచూ వస్తుంటాను. ఈరోజే మొదటిసారి తను రావడం చూశాను’ అన్నాడు కిరణ్‌.
వినయ్‌ అంతటితో ఆ విషయాన్ని వదిలేయలేదు. ‘కిరణ్‌కీ నీకూ ఎప్పటినుంచి స్నేహం? ఇద్దరూ ఎంత క్లోజ్‌? ఇలా నెలలో ఎన్నిసార్లు కలుసుకుంటారు? ఆఫీసులో పక్కపక్కనే కూర్చుంటారా? ఇలానే పకపకలూ ఇకఇకలూ పంచుకుంటారా?’ లాంటి సవాలక్ష ప్రశ్నలు. అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాను. పైకి నమ్మినట్టు కనిపించినా మనసులో అనుమానాన్ని భద్రంగా దాచుకుని, ఇప్పుడు అవకాశం రాగానే నాన్న చెవిలో ఆ విషమంతా కక్కాడని అర్థమైంది.
‘పెళ్ళయ్యాక ఉద్యోగం మానేయాలి’ అనే కండిషన్‌ పెట్టాడు వినయ్‌. ‘ఎందుకు మానేయాలి?’ అని అడిగితే, ‘నువ్వు కష్టపడటం నాకిష్టం లేదు. నేను సంపాయిస్తున్నాగా, నువ్వెందుకు నీ కోమలమైన శరీరాన్ని శ్రమపెట్టాలి? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటే బోల్డు మానసిక ఒత్తిడికి లోను కావాలి. హాయిగా ఇంటిపట్టున ఉండు’ అన్నాడు.
ఆడవాళ్ళకు ఉద్యోగంవల్ల వచ్చే డబ్బులకన్నా అదిచ్చే ఆత్మస్థైర్యమే ముఖ్యమన్న విషయం ఈ మగవాళ్ళకు ఎప్పుడు అర్థమవుతుందో? నిశ్చితార్థం జరిగినప్పటి నుంచీ ఇంట్లోవాళ్ళు కూడా వినయ్‌కి వంతపాడటం మొదలెట్టారు. ఇంకా నయం వాడి మాటలు నమ్మి ఉద్యోగాన్ని వదులుకోలేదు. వాడు ఉద్యోగం మానేయమంది నేను శ్రమపడకూడదని కాదు... వాడికున్న అనుమాన జాడ్యంతో. పరపురుషుడి కంటబడకుండా నన్ను నాలుగుగోడల మధ్యా బంధించాలనుకున్నాడు.
నేను సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరి రెండేళ్ళు. కిరణ్‌ నాకన్నా మూడేళ్ళు సీనియర్‌. మాకు టీమ్‌ లీడర్‌. అందరితో ఎంత మర్యాదగా మాట్లాడతాడో... ఆడపిల్లలతో అయితే మరీనూ. నాకెప్పుడూ అతనంటే గౌరవమే తప్ప మరో ఆలోచన రాలేదు. వినయ్‌ మా ఇద్దరికీ సంబంధం అంటగట్టాక ఇప్పుడు నా ఆలోచనలు అటువైపుగా సాగుతున్నాయి. కిరణ్‌కేం తక్కువని? స్ఫురద్రూపి, మర్యాదస్థుడు, మంచివాడు... అతని అవిటితనం బాహ్యరూపానికి సంబంధించినది. కళ్ళకు కన్పించే అవకరంతో సమాధానపడొచ్చు. పైకి కన్పించని అనేక అవలక్షణాలతో ఉండే వినయ్‌లాంటి వాళ్ళని భరించడమే కష్టం... కష్టమే కాదు నరకం కూడా.
మరునాడు ఆఫీసు ముగిశాక ‘‘క్రీమ్‌ స్టోన్‌కెళ్ళి ఐస్‌క్రీమ్‌ తినాలని ఉంది, కంపెనీ ఇస్తారా ప్లీజ్‌’’ అని అడిగాను కిరణ్‌ని.
‘‘ఐస్‌క్రీమ్‌ తినిపిస్తానంటే మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను’’ అన్నాడు నవ్వుతూ.
ఐస్‌క్రీమ్‌ తింటున్నప్పుడు ‘‘నన్ను పెళ్ళి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా?’’ అని అడిగాను.
‘‘ఐస్‌క్రీమ్‌ ఇంత మధురంగా ఎప్పుడూ లేదు తెలుసా’’ అంటూ హాయిగా నవ్వాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.