close
బావున్నారా... ఏం చేస్తున్నారు?

బావున్నారా... ఏం చేస్తున్నారు?

సినీ పరిశ్రమలోకి ఎందరో వస్తుంటారు... వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎంతకాలమైనా మనసు పొరల్లో నిలిచిపోతుంటారు. హీరోయిన్లుగా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అలాంటి కొందరు తారలే వీళ్లు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుందామా..?

రిచా గంగోపాధ్యాయ్‌

లీడర్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన రిచాగంగోపాధ్యాయ్‌ నాగవల్లి, మిరపకాయ్‌, మిర్చి... లాంటి సినిమాల్లో నటించి అందచందాలూ అభినయంతో పేరుతెచ్చుకుంది. కానీ టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో హీరోయిన్‌గా మంచి స్థాయిలో ఉన్నపుడే ఉన్నట్లుండి అయిదేళ్ల కిందట సినిమాలకు దూరంగా వెళ్లిపోతున్నట్లు ప్రకటించి అమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత సెయింట్‌ లూయీలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీలో చేరి గతేడాదే ఎంబీఏ పట్టా పుచ్చుకుంది. అంతేకాదు, అమెరికాలో పెరిగిన తను సినిమాల్లో నటించాలనే కోరికతో చదువుకి విరామం ఇచ్చి భారత్‌ రావడం, ఇక్కడ హీరోయిన్‌గా నిలదొక్కుకుని మళ్లీ చదువుకోసం తిరిగివెళ్లిన అనుభవాలన్నిటితో బిజినెస్‌ స్కూల్స్‌కి సంబంధించిన న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘పొయెట్స్‌ అండ్‌ క్వాంట్స్‌’లో పెద్ద కథనం కూడా రాసింది. కార్పొరేట్‌ రంగంలో రాణించాలన్నది ప్రస్తుతం రిచా కల అట.

అంజలా జవేరీ

ప్రేమించుకుందాంరా... అప్పట్లో కుర్రకారు గుండెల్లో ఎర్ర గులాబీలు పూయించిన చిత్రం. ఆ సినిమాలో కావేరి పాత్రలో కనిపించిన అంజలా జవేరీని చూసి మనసు పారేసుకోని కుర్రకారు లేరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తర్వాత చూడాలని ఉంది, సమర సింహారెడ్డి,  రావోయి చందమామ... లాంటి సినిమాల్లో అగ్రహీరోలతో ఆడిపాడింది ఈ అమ్మడు. 2001 తర్వాత ఒకటీ అరా సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించి తెరమరుగైపోయింది. ఇంతకీ ఇప్పుడేం చేస్తుందంటారా... పెళ్లి చేసుకుని ఇల్లాలిగా సెటిల్‌ అయిపోయింది. ఖైదీ నంబర్‌ 150, కాటమరాయుడు సినిమాల్లో విలన్‌గా నటించిన తరుణ్‌ అరోరా ఆమె భర్త. తనకంటే ఏడేళ్లు చిన్నవాడట.

ప్రీతీ జింగానియా

మ్ముడు, నరసింహనాయుడు... లాంటి సినిమాలతో అప్పట్లో అందాల హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రీతీ జింగానియా గుర్తుంది కదా... హిందీలోనూ చాలా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు, ఆఖరిసారిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించింది పదేళ్ల కిందట వచ్చిన యమదొంగ, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సినిమాల్లోనే. ఆ తర్వాత బాలీవుడ్‌ నటుడూ డైరెక్టర్‌ అయిన పర్విన్‌ దబాస్‌ని పెళ్లి చేసుకుని కొంతకాలం సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం తల్లిగా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూనే హిందీతో పాటు ఇతర భాషల్లో నటిస్తోంది. గతేడాది ప్రీతీ నటించిన రాజస్థానీ చిత్రం ‘టావ్డొ ద సన్‌లైట్‌’ బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించింది. నటనతో పాటు ప్రీతీ సొంత కంపెనీ ‘స్వెన్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌’ పనులు కూడా చూసుకుంటోంది.

దీప్తీ భట్నాగర్‌

పెళ్లి సందడి... ఆ సినిమా ప్రేక్షకుల మదిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక, అందులో స్వప్న సుందరిగా కనిపించిన హీరోయిన్‌ దీప్తీ భట్నాగర్‌ అందాన్ని చూసిన వారందరూ ‘సౌందర్యలహరీ...’ అని పాడేసుకున్నారు. 22 ఏళ్ల కిందట వచ్చింది ఆ సినిమా. ఆశ్చర్యం ఏంటో తెలుసా... దీప్తీ భట్నాగర్‌ను ఇప్పుడు చూసినా ఆ పాటను పాడుకోవచ్చు. యాభయ్యేళ్ల వయసులోనూ ఆ అందం తరగలేదు మరి. తెలుగుతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించిన దీప్తీ భట్నాగర్‌ తర్వాత నిర్మాతగా, యాంకర్‌గా మారి హిందీ ఛానెళ్లలో యాత్రలకు సంబంధించిన షోలను చెయ్యడం ప్రారంభించింది. అలా 2001లో వచ్చిన ‘యాత్ర,’ ‘ముసాఫిర్‌ హూ యారో’... షోలు దీప్తికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ‘ముసాఫిర్‌ హూ యారో’ కార్యక్రమంలో భాగంగా దీప్తి ఆరేళ్లలో ఎనభైదేశాలను చుట్టొచ్చిందంటేనే అది ఎంత విజయవంతం అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ షో తీస్తున్న సమయంలోనే దాని దర్శకుడు రణ్‌దీప్‌ ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈ స్వప్న సుందరి సొంత కంపెనీ ‘దీప్తీ భట్నాగర్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పనుల్ని చూసుకోవడంతో పాటు ‘ట్రావెల్‌ విత్‌ దీప్తీభట్నాగర్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఛానెల్‌నూ నిర్వహిస్తోంది.

గ్రేసీ సింగ్‌

గ్రేసీసింగ్‌... తెలుగువారికి ఈ పేరు ఎంతవరకూ గుర్తుందో తెలీదు కానీ ‘సంతోషం’ సినిమాలో హీరోయిన్‌ అంటే మాత్రం టక్కున గుర్తుకొచ్చేస్తుంది. తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారుకి కిర్రాకు పుట్టించింది మరి. ఆ తర్వాత హిందీ సినిమాలతో బిజీ అయిపోయిన గ్రేసీ ఎనిమిదేళ్ల కిందట ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాతో మరోసారి తెలుగు తెరమీద కనిపించిందంతే. ఇంతకీ ఇప్పుడేం చేస్తోందంటారా... గతేడాది వరకూ ‘సంతోషీ మా’ అనే హిందీ సీరియల్‌లో అమ్మవారిగా కనిపించింది. గ్రేసీ భరతనాట్యం డాన్సర్‌ కూడా. అందుకే, ‘గ్రేసీ సింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’ని ప్రారంభించి భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తోంది. దీనికితోడు తరచూ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. ఈమధ్యే ముంబైలోని ఓ వీధిని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వీధుల్లోని గోడలకు రంగులేస్తూ కనిపించింది. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ వారి కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.

మహేశ్వరి

మేఘాలలో తేలి పొమ్మన్నది..., ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో... 22 ఏళ్ల కిందట వచ్చిన ‘గులాబీ’ సినిమాలోని ఈ పాటలు ఇప్పటికీ హాట్‌ ఫేవరెట్లే. ఇక, ఆ సినిమాలోని హీరోయిన్‌ మహేశ్వరి అప్పట్లో అందరి మనసులూ దోచేసింది. ‘నీకోసం’ సినిమాలో తన నటనతో నంది అవార్డునూ గెలుచుకుంది. ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన మహేశ్వరి వెండితెరకు దూరమై చాలా ఏళ్లైంది. 2008లో పెళ్లి చేసుకుని ఇల్లాలిగా స్థిరపడిన ఈ భామకు ప్రముఖ నటి శ్రీదేవి దగ్గరి బంధువు. ఓరోజు ఇద్దరూ కలిసినపుడు మహేశ్వరి వేసుకున్న డ్రెస్‌ తనే డిజైన్‌ చేసుకుందని తెలిసి శ్రీదేవి తనకూ తన కూతుళ్లకు కూడా డ్రెస్‌లు డిజైన్‌ చెయ్యమని అడిగిందట. ‘శ్రీదేవి అక్క ప్రకటనలకూ సినిమా ఫంక్షన్లక్కూడా నా డిజైన్లను వేసుకునేది. నన్ను ఫ్యాషన్‌ డిజైనర్‌గా మార్చింది తనే’ అంటుంది మహేశ్వరి. ఆ ప్రోత్సాహంతోనే హైదరాబాద్‌లో ఓ షాపుని కూడా తెరిచి ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉంది.

మమతా మోహన్‌దాస్‌

రాఖీ రాఖీ... పాటతో గాయనిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మమతా మోహన్‌దాస్‌ పాటలతోనే కాదు, యమదొంగ, కింగ్‌, చింతకాయల రవి... లాంటి  సినిమాల్లో నటనతోనూ ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే, ఈ భామ తెలుగులో నటించిన ఆఖరి సినిమా 2009లో వచ్చిన ‘కేడీ’నే.
గత ఎనిమిదేళ్లుగా మమత బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. అలా అని ధైర్యం కోల్పోలేదు. లాస్‌ఏంజెలెస్‌లో ఉంటూ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూనే మధ్యమధ్యలో మళయాళ, తమిళ సినిమాల్లో నటిస్తోంది. మమత ఏడేళ్ల కిందట బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్‌ పద్మనాభన్‌ను పెళ్లిచేసుకుంది. కానీ ఏడాదిలోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.