close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిమ్మనీళ్లు తాగడం మంచిదేనా?

నిమ్మనీళ్లు తాగడం మంచిదేనా?

నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదన్నది తెలిసిందే. అయితే ఆ నిమ్మను మంచినీళ్లతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు న్యూట్రిషనల్‌ ఎపిడమియాలజీ నిపుణులు. ముఖ్యంగా తగినన్ని మంచినీళ్లు తాగనివాళ్లు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి ఆ నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు.
* పంచదార లేకుండా గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ పిండుకుని తాగడంవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. నిమ్మలోని పోషకాలు పొట్టలోని జీర్ణరసాలను ప్రేరేపించి, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడతాయి.
* ఈ నీళ్లలోని సి-విటమిన్‌ కొన్ని రకాల వ్యాధులను- ముఖ్యంగా ఈసోఫేగల్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియని పెంచి బరువును తగ్గించడానికీ తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచి జలుబూ జ్వరాలూ వంటివి రాకుండా రక్షిస్తుంది.
* నిమ్మలోని మెగ్నీషియం, పొటాషియంలు బీపీని అదుపులో ఉంచడం ద్వారా హృద్రోగాలనీ నివారిస్తాయి. రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చేస్తాయి. అంతేకాదు, పొట్టలో హానికర బ్యాక్టీరియా పేరుకోకుండా కాపాడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే గుణాలూ నిమ్మకాయకి ఉన్నాయి అంటున్నారు ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు.


 

పలకరింపూ ఆనందమే..!

లో, హాయ్‌, బాగున్నారా... అన్నీ చిన్న మాటలే. పొడి పొడి పలకరింపులే. కానీ ఆ మాటలు కూడా ఎంతోకొంత ఆనందాన్ని కలిగిస్తాయి. బంధాలు బలపడ్డానికి కారణమవుతాయి అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా నిపుణులు. బిజీగా ఉండో లేదా మనస్తత్వం రీత్యానో చుట్టుపక్కలవాళ్లను చూసినా చూడనట్లు వెళ్లిపోతుంటారు చాలామంది. కానీ అలా ముఖం ముడుచుకునో బిగదీసుకునో ఉండటం కన్నా రోజూ తారసపడే వ్యక్తుల్ని చూసినప్పుడు పలకరించడం మంచిది. కనీసం చిరునవ్వు నవ్వినా చాలని చెబుతున్నారు. సాధారణంగా ఉదయం లేవగానే ఇంట్లో బస్సులో కాలేజీలో ఆఫీసుల్లో కుటుంబసభ్యులూ సహచరులూ స్నేహితులూ సహోద్యోగులతో ఏదో ఒకటి మాట్లాడుతుంటాం. అయితే ఆ సంభాషణ హాయ్‌ అంటే హాయ్‌ అన్నట్లు కాకుండా కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే ఇద్దరికీ ఆనందంగా ఉంటుంది. అదే వాళ్ల మధ్య ఉండే బంధాన్నీ నిలబెడుతుంది అన్నది ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. అది కుదరనప్పుడు కొంచెంగానయినా పలకరించినా మంచిదే. దీనివల్ల ముభావంగా ఉండేవాళ్లూ ఇటు బోళాగా మాట్లాడేవాళ్లూ ఇద్దరూ కూడా ఆనందంగా ఉంటారన్నదే తాజా అధ్యయన సారాంశం.


 

ముఖారవిందంకోసం...

కొందరికి ముక్కుతోబాటు నుదురూ చుబుకంమీదా కూడా వైట్‌, బ్లాక్‌ హెడ్స్‌ వస్తుంటాయి. దాంతో చేతులు మాటిమాటికీ వాటిమీదకే వెళుతుంటాయి. ఫలితంగా సమస్య మరీ ఎక్కువవుతుంది. అలాకాకుండా ప్రతిరోజూ ఆవిరి పట్టడం వల్ల ఇవి కొంతవరకూ తగ్గుతాయి. గోటితో వీటిని అస్సలు తీయకూడదు. రిమూవర్‌ మాత్రమే వాడాలి. ఆ భాగంలో తరచూ స్క్రబ్‌ వాడకూడదు. సముద్ర ఉప్పులో కాస్త నిమ్మరసం, కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ఆయా భాగాల్లో పట్టించి మర్దన చేయాలి. దీనివల్ల మృతకణాలూ మురికీ పోతాయి. అలాగే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పండ్లనూ కూరగాయల్నీ ఎక్కువగా తీసుకుంటే మొటిమలూ బ్లాక్‌హెడ్సూ రావడం తగ్గుతుంది. అప్పటికీ ఇంకా ఉంటే కమలాతొక్కల పొడిలో కాసిని నీళ్లు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరవాత కడిగేయాలి. దీనివల్ల జిడ్డూ తగ్గుతుంది. మురికీ పోతుంది. లేదంటే టీస్పూను ఓట్సులో టీస్పూను పంచదార వేసి మెత్తగా చేసి, అందులో కాస్త ఆలివ్‌నూనె వేసి కలిపి ముఖానికి పట్టించి, పది నిమిషాలాగి కడిగేయాలి. అలోవెరా జెల్‌ పట్టించి పది నిమిషాలు ఉంచడం లేదా గుడ్డు తెల్లసొనని మొహానికి పట్టించి ఆరాక ఆ పొర తీసి కడిగినా ఫలితం ఉంటుంది.


 

ఆలస్యంగా తింటున్నారా..?!

లసిపోయి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి, ఏదో కాస్త తిని, నిద్రలోకి జారుకునేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కానీ ఆలస్యంగా తిని, వెంటనే నిద్రపోవడం వల్ల క్యాన్సర్లు పెరుగుతున్నాయని స్పెయిన్‌కు చెందిన బార్సెలోనా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు. తాజా కూరగాయలతో పోలిస్తే మాంసాహారం తినేవాళ్లలో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువన్నది తెలిసిందే. అయితే ఆలస్యంగా తినడంవల్ల కూడా ప్రొస్టేట్‌, రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం అధికమనేది తాజా పరిశోధనలో తేలింది. ఇందుకోసం వీళ్లు కొందరిని ఎంపికచేసి వాళ్ల జీవనశైలిని పరిశీలించగా, రాత్రి నిద్రపోవడానికి రెండు గంటల ముందే అంటే 9 గంటలకి ముందే డిన్నర్‌ ముగించే వాళ్లలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందనీ, అలాకాకుండా పది గంటలు దాటాక తిని, వెంటనే నిద్రపోయేవాళ్లలో క్యాన్సర్‌ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందట. అంతేకాదు, కొందరు క్యాన్సర్‌ రోగుల జీవనశైలిని పరిశీలించినప్పుడు కూడా వాళ్లలో చాలామంది లేటుగా తినే అలవాటు ఉన్నవాళ్లే అన్నది వెలుగులోకి వచ్చింది. మొత్తమ్మీద క్యాన్సర్‌కీ తినే సమయానికీ సంబంధం ఉంది అంటున్నారు సదరు పరిశోధకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.