close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవార్డుల దవాఖానా...

అవార్డుల దవాఖానా...

అరకొర వసతులూ, అందీ అందని వైద్య సేవలూ... ప్రభుత్వాసుపత్రుల గురించి సాధారణంగా జనంలో ఉండే అభిప్రాయం ఇదే. కానీ కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలందిస్తూ రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వపు కాయకల్ప అవార్డును అందుకున్న ఖమ్మం  ప్రధానాసుపత్రి మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. తాజాగా నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్‌ గుర్తింపు పొంది సర్కారు దవాఖానాల్లో మార్పుకు మచ్చుతునకగా మెరిసింది.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు... ప్రభుత్వాసుపత్రుల దుస్థితిని వివరిస్తూ ఒక సామాన్యుడి గొంతుకగా వెలువడిన ఈ పాట జనానికి బాగా చేరువైంది. ఆ పాట ప్రభుత్వాసుపత్రుల దయనీయ స్థితికి నిలువుటద్దం. కానీ ఖమ్మం ప్రధానాసుపత్రిని చూసిన వాళ్లెవరైనా ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడరు. అంతేకాదు ఇక్కడ వైద్యానికి వచ్చిన వాళ్లెవరైనా ఇది నిజంగా ప్రభుత్వాసుపత్రేనా లేదా కార్పొరేట్‌ ఆసుపత్రా అన్న ఆశ్చర్యానికి గురవుతారు. అందుకే జాతీయ స్థాయిలో పది ఆసుపత్రులకు మాత్రమే ఇచ్చే నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్‌(ఎన్‌క్యూఏఎస్‌) గుర్తింపు పొంది, తెలంగాణలోనే మొట్ట మొదటి ఆసుపత్రిగా ఇది రికార్డు సృష్టించింది.

సేవలూ అవార్డులూ...
ఇరవైరెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పచ్చని చెట్ల మధ్య రెండంతస్తుల్లో అద్దంలా మెరుస్తూ కనిపిస్తుందీ ఆసుపత్రి. లోపలికి వెళ్లగానే విభాగాల వారీగా దారిని తెలిపే సూచికలు పలకరిస్తాయి. ఏ సమయంలో చూసినా అప్పుడే తుడిచారా అన్నట్టుగా ఉంటుంది ఫ్లోరింగ్‌. నిరంతరం అందుబాటులో ఉండే వైద్య సిబ్బందీ, నర్సుల ఆత్మీయ పలకరింపూ, సకాల చికిత్సలూ రోగికి తాము కార్పొరేట్‌ వైద్యశాలలో ఉన్నామన్న భావనను కలిగిస్తాయి. అందుకే వైద్యసేవలూ, సౌకర్యాలూ, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో 2015, 17 సంవత్సరాల్లో ఖమ్మం ప్రధానాసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కాయకల్ప అవార్డులు వచ్చాయి. వీటితోపాటు నగదు ప్రోత్సాహకంగా ప్రతిసారీ రూ.50లక్షలు అందాయి. ఇప్పుడు ఎన్‌క్యూఏఎస్‌ గుర్తింపుతో ఆసుపత్రి అభివృద్ధి కోసం మరో నలభై లక్షల రూపాయలు పోగయ్యాయి. అవార్డులకు దీటుగానే అక్కడి వసతులతో పాటు సిబ్బందీ ఉన్నారు మరి. ఈ ఆసుపత్రిలో మొత్తం వైద్యుల సంఖ్య 50. నర్సులు 154 మంది. నాలుగో తరగతి ఉద్యోగులు 200 మంది. ఇక 400 పడకల సామర్థ్యం ఆసుపత్రి సొంతం. ఇక్కడికి వచ్చే రోజువారీ అవుట్‌ పేషంట్ల సంఖ్య 1600. ఇక్కడి ఎయిడ్స్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం (ఏఆర్‌టీ సెంటర్‌) సేవలు రాష్ట్రంలోనే గుర్తింపు పొందాయి. క్షయవ్యాధి నివారణ విభాగం ఆస్పత్రి ఆవరణలోనే ఉంది.

తల్లీ పిల్లలకు బలం
ఆసుపత్రి అందించే సేవల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రానిది (ఎంసీహెచ్‌) అగ్రస్థానమని చెప్పొచ్చు. ఇందులో 24 గంటలూ తల్లీ పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో ప్రత్యేక వైద్య సేవలందిస్తారు. చక్కటి వసతులుండటంతో పాటు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ధనవంతులూ ఈ ఆసుపత్రికి వస్తుంటారు. నవజాత శిశు చికిత్సా కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)లోనూ అధునాతన ఇంక్యుబేటర్లు, థెరఫీ పరికరాలూ ఏర్పాటు చేశారు. న్యూట్రిషన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌సీ)లో ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల లోపు వయసుండి బరువు తక్కువగా ఉన్న పిల్లలకు సరైన ఆహారంతోపాటు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. తల్లికి కూడా ప్రోత్సాహకంగా రోజుకు రూ.100 అందిస్తుండటంతో ఇక్కడ చేరే పిల్లల సంఖ్యా ఎన్నో రెట్లు పెరిగింది. తొలికాన్పు అయిన వాళ్లకు పసిపిల్లల పెంపకంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కంగారు మదర్‌కేర్‌ వార్డును ఏర్పాటు చేశారిక్కడ. అత్యాధునిక ప్రసూతి గదులు, ఐసీయూ, మెటర్నిటీ వార్డుల వంటి సదుపాయాలు ఉన్నాయి. హై డిఫెండెన్స్‌ చికిత్సాకేంద్రంలో తల్లులకు అత్యవసర సేవలు అందిస్తారు. ప్రమాదాలూ, విపత్తుల సమయాలలో తీవ్రంగా గాయపడిన సందర్భాల్లో అత్యవసర చికిత్స కోసం రూ.15 కోట్ల వ్యయంతో ట్రామా యూనిట్‌ సిద్ధం అయింది.

క్యాన్సర్‌కూ...
క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ యూనిట్‌ కూడా ప్రధానాసుపత్రిలో ఉంది. టాటా ఇన్‌స్టిట్యూట్‌తో కలిపి కీమోథెరపీ, రేడియోథెరపీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ కొరత ఉన్న విభాగాల్లో ప్రయివేటు సేవల్ని వినియోగించుకుంటూ, సిబ్బందిని సమన్వయ పరుచుకుంటూ వెళ్లడం ద్వారానే ఈ విజయాలు సొంతమవుతున్నాయంటారు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. బి మదన్‌సింగ్‌. అన్ని ఆసుపత్రులూ ఇలాంటి వ్యూహాల్నే అనుసరిస్తే ఐసీయూలో ఉన్న ప్రభుత్వాసుపత్రులన్నీ త్వరలోనే డిశ్చార్జ్‌ అయిపోతాయి.

- ఆళ్ల శేషవర్దన్‌ రెడ్డి, న్యూస్‌టుడే, ఖమ్మం
చిత్రాలు: కె.శ్రీనివాస్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.