close
ప్రశ్న

ప్రశ్న
- రుక్మిణి-నాగేంద్రనాథ్‌

సంత రుతువు ఆగమనంతో, ఆకాశంలో అందమైన రంగులు పోగుచేసుకున్నాయి.
మబ్బుల కదలికతో ఎదలో సందడి మొదలైంది. సిగ్గుల దొంతరలో పుట్టిన నీటిచుక్క నెమ్మదిగా నేలకు జారి మట్టి ముద్దను తాకింది. మట్టిలో దాగిన విత్తనంలో వింతైన పులకింత.

మొలకెత్తిన విత్తనంలోంచి రెండు చిగురుటాకులు చేతుల్లాగా సాగి, ప్రకృతికి నమస్కరించాయి.
మత్తుగా కళ్ళు తెరిచింది కమల. అలసటలోనే ఆనందం. బాధలోనే సంతృప్తి. బిడ్డను చేతుల్లోకి తీసుకుంది.

కళ్ళు తెరవని ఆ పసికందును ఆమె అడిగిన మొదటి ప్రశ్న... ‘.....’.
ఆ మాటల్లో బాబుకు ఏమి అర్థమయిందో ఏమో, చిగురుటాకులాంటి లేత పెదాలపై చిరునవ్వు వెలసింది.
అమ్మ హృదయంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం మెరిసింది.

భర్త రాజేష్‌ పక్కనే నిలబడి, తల నిమురుతూ ఉంటే నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది కమల. వారిద్దరిదీ ప్రేమ వివాహం. ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అనుమతితోనే పెళ్ళి చేసుకున్నారు.

రాజేష్‌ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కమల కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు. ‘ఇద్దరమూ బయటికి వెళితే బాబుకు కష్టం. కొద్దిరోజుల వరకైనా ఆగుదాం’ అన్నాడు రాజేష్‌. సరే అనుకున్నారు ఇద్దరూ.

బాబు మొదటి బర్త్‌డే రోజు ఆత్మీయులను పదిమందిని పిలుచుకుని ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. బుడిబుడి నడకలతో వచ్చి, ఒడిలో కూర్చున్న బాబును గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టకుంది కమల. తన మనసులో మెదిలిన ప్రశ్న అడిగింది. ‘.....’. బాబు వంశీకి ఏమర్థమయిందో ఏమో, నవ్వుతూ తల పైకీ కిందికీ ఊపాడు. కమల నవ్వింది. ‘నా బంగారుకొండ’ అంటూ ముద్దుల వర్షం కురిపించింది.

పక్కనే ఉండి వారిద్దరి సంభాషణ వింటున్న రాజేష్‌ చిన్నగా నవ్వుకున్నాడు.

* * *

కాలం కదులుతూనే ఉంది, తన గుర్తులను వదిలివేస్తూ. మూడు సంవత్సరాల కాలం ఆనందంగా గడిచిపోయింది. వంశీ పెద్దవాడయ్యాడు. ఆటలూ పాటలతో ఆ తల్లిదండ్రులకు అపురూపమయ్యాడు. కమలా రాజేష్‌లు, వంశీని స్కూల్లో చేర్పించాలనుకున్నారు. మంచిరోజు చూసి దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పించారు.

సాయంత్రం వంశీ స్కూలు నుండి వచ్చాక, ముద్దుముద్దుగా- ఆ స్కూలు గురించీ ఫ్రెండ్స్‌ గురించీ మిస్‌ల గురించీ చెపుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
బాబును దగ్గరికి తీసుకుని, తన ప్రశ్న అడిగింది కమల- ‘‘నాన్నా వంశీ, నేను పెద్దయ్యాక నన్ను మంచిగా చూసుకుంటావా?’’

‘‘ఓ, నిన్ను బాగా చూసుకుంటానమ్మా, నాన్నను కూడా’’ అంటూ కళ్ళు పెద్దవిగా చేసి, చిట్టిచిట్టి చేతులతో అభినయిస్తూ వంశీ చెప్పిన మాటలకు కడుపు నిండిపోయిందా తల్లికి.
కమలకు నవ్వు ఆగలేదు. పకపకమని నవ్వింది. వంశీని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకుని, ఎదకు హత్తుకుంది ‘నా బంగారుకొండ’ అంటూ.
ఇద్దరినీ గమనిస్తున్న రాజేష్‌ చిరునవ్వు నవ్వుకున్నాడు.

* * *

కాలం గడుస్తూనే ఉంది. రాజేష్‌కు ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చింది.
నాలుగు డబ్బులు పోగేసి, సొంత ఇల్లు సంపాదించుకున్నారు. కమల కూడా ఒక స్కూల్లో టీచర్‌గా చేరింది. జీవితం ఒక గాడిన పడుతున్నదనుకునే సమయంలో వారి బతుకులలో కాలం పెద్ద మరకవేసింది. రోడ్‌ యాక్సిడెంట్‌లో రాజేష్‌ మరణించాడు.

బాబు కోసమనే బతికి ఉన్న కమల, వంశీని పెంచి పెద్దచేసింది.
పదవ తరగతిలో ఫస్ట్‌క్లాస్‌లో పాసైన వంశీని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది. ‘‘నాన్నా, నువ్వు పెద్దయి, ఉద్యోగం సంపాదించాక, నా ముసలితనంలో నన్ను బాగా చూసుకుంటావా?’’ అని అడిగింది.

‘‘అమ్మా, మనకెవరున్నారమ్మా? నాకు నువ్వూ నీకు నేనూ. నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా’’ అన్నాడు వంశీ దృఢంగా. ఆమె కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆనందంగా నవ్వింది కమల.
వంశీ డిగ్రీ పూర్తిచేసి, ఉద్యోగం సంపాదించాడు. తన ఆఫీసులోనే పనిచేస్తున్న విజయతో పరిచయం పెరిగింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కమల సంతోషంగా వాళ్ళ పెళ్ళి జరిపించింది. వంశీ, విజయలు ముచ్చటైన జంట అని అందరూ మెచ్చుకున్నారు.

కాలం కదులుతూనే ఉంది. కమలలో వృద్ధాప్య ఛాయలు ఆరంభమయ్యాయి. ఇంట్లో చిన్ని మనవరాలు పుట్టింది.
‘‘మేమిద్దరం ఉద్యోగం చేస్తూనే ఉన్నాం కదా, నువ్వింకా కష్టపడటం ఎందుకమ్మా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా’’ అన్నాడు వంశీ.
నవ్వింది కమల.

వంశీ, విజయలు ఆఫీసుకెళితే పాపను చూసుకునే పని కమల వంతయింది.
కాలం కదులుతూనే ఉంది. మరో బాబు పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ జరిగింది విజయకు.
కాలం కదులుతూనే ఉంది.

పిల్లలిద్దరూ స్కూలుకు వెళుతూ ఉన్నారు. వంశీ పెళ్ళయి పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి.
ఆ రోజు ఆదివారం. పిల్లలకు ఆటవిడుపు. నానమ్మను విడవనే విడవరు. మనవడికి టిఫిన్‌ తినిపించి, మూతి తుడిచి దగ్గరికి తీసుకుంది.

నానమ్మ ఏదో చెప్పబోతున్నదని మనవడికి అర్థమైంది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. వారి చూపులు గుండె లోపలి అంచులదాకా పయనించి ఆప్యాయంగా తడుముకున్నాయి.
వంశీ చిన్నప్పటినుంచీ తాను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు మనవడిని అడగాలనుకుంది కమల.

ఇంతలో ‘అమ్మా’ అంటూ అక్కడికి వచ్చాడు వంశీ. కమల చూపు వంశీ వైపు తిరిగింది. ఏమిటన్నట్లు చూసింది. వంశీ వెనకాల కోడలు కూడా వచ్చింది. ‘‘అమ్మా, రోజూ మేమిద్దరమూ ఆఫీసుకు వెళ్ళిపోతున్నాం. పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతున్నారు. నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటున్నావు. ఈ వయసులో ఒంటరితనం బోర్‌గా విసుగ్గా ఉంటుంది కదా, అందుకని...’’ కమల వంశీ వైపు, కోడలు వైపు చూసింది అర్థంకానట్లుగా.

‘‘నీకు ఆశ్రమంలో అయితే బాగుంటుంది, నీ వయసువాళ్ళు చాలామంది తోడుగా ఉంటారు కదా అని అనుకున్నాం.’’
కమల నవ్వింది.
‘‘నావల్ల మీకు ఇబ్బంది అవుతూ ఉందని ఈమధ్య గమనిస్తూనే ఉన్నాను. మీనుండి దూరంగా ఉంటే మీక్కూడా మార్పు ఉంటుంది కదా!’’
‘‘అవునమ్మా, బాగా ఆలోచించావు.’’

‘‘మీరు మీ ఆఫీసుకు దగ్గర్లో ఇల్లు చూసుకుని మారిపోండి వెంటనే.’’
నట్టింట్లో పిడుగుపడినట్లయింది. వంశీ, విజయల మెదళ్ళలో క్షణకాలం నిశ్శబ్దం పాకిపోయింది.
‘‘అమ్మా, నువ్వొక్కదానివి...’’
‘‘అవును. నేనొక్కదాన్నే ఉండదల్చుకున్నాను.’’

కోడలు విజయ కలుగజేసుకుని అంది- ‘‘ఇల్లు మీకు వదిలేసి, మేము బయటికి వెళ్ళాలా?’’

కమల సూటిగా విజయ కళ్ళలోకి చూసింది. ‘‘ఔను. ఈ ఇల్లు నా సొంతం. నా పేరున ఉంది. మీరు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోక తప్పదు’’ దృఢంగా పలికిన కమల మాటలు శాసనంగా వినిపించాయి.
నెలరోజులు తిరిగేసరికి వంశీ, విజయలు ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయారు. వెళ్ళేముందు కోడలు చురుకు మాట వదిలింది.

‘‘ఇల్లు ఒక్కటే ఉంటే గడవదు. తిండి ఎక్కడనుంచి వస్తుందో చూస్తాం.’’
కమల నవ్వింది.
కొడుకూ కోడలూ వెళ్ళిపోయిన తరవాత, ఇల్లు కిరాయికి ఇచ్చి, ఆ డబ్బుతో తానొక ఆశ్రమంలో చేరింది. ప్రతీ నెలా వచ్చే అద్దె డబ్బు ఆశ్రమం ఖర్చులకు సరిపోతోంది.
కాలం కదులుతూనే ఉంది.

ఆశ్రమంలో తనకోసం విజిటర్స్‌ వచ్చారంటే వెళ్ళింది కమల. వంశీ, విజయ, మనవలు ఉన్నారు. నానమ్మను చూసి మనవల ఆనందానికి అంతులేదు. ఒకరితో ఒకరు పోటీపడి నానమ్మతో కబుర్లు చెప్పారు.
కోడలు దూకుడుగా అంది-‘‘సొంత ఇల్లు అద్దెకు ఇచ్చి, మమ్మల్ని అద్దెకొంపల పాలు చేశారు.’’
కమల నవ్వింది.

‘‘మీరు ఆ ఇంట్లోనే ఉంటే ప్రతి నెలా నా ఆశ్రమం ఖర్చు మీరే ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రతి నెలా మీ జీతంలోంచి కట్టే ఇబ్బందిలేదు. ఇల్లు అద్దెకు ఇచ్చాం కాబట్టి ప్రతీ నెలా అద్దె కచ్చితంగా వస్తుంది. ఇక, ఇల్లంటావా, నా తదనంతరం అది మీదే కదా.’’
వంశీ తల నిమురుతూ అంది కమల. ‘‘ఏ తల్లి అయినా కొడుకును అడిగే ప్రశ్న ఒకటే- ‘నా ముసలితనంలో నన్ను మంచిగా చూసుకుంటావా నాన్నా’ అని.

అందరు తల్లుల్లాగే నేను కూడా అదే ప్రశ్న అడుగుతూ వచ్చాను. నా కోడలు రాకముందు నీ జవాబుకూ, కోడలు వచ్చాక నీ ప్రవర్తనకూ చాలా తేడా వచ్చింది. అది సహజం కూడా. మన జీవితంలో ఎప్పుడు, ఏ విషయానికి, ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుంటేనే ఆనందంగా జీవించగలం. లేకపోతే మానసిక సంఘర్షణ తప్పదు. ఇప్పుడు నీ భార్యా పిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యం ముసలితల్లికి ఇవ్వడం కుదరదు, ఎవరూ ఇవ్వలేరు, ఇవ్వరు కూడా - అది మానవనైజం.

ఇల్లు మీకు ఇచ్చి నేను ఆశ్రమానికి వెళ్ళిపోయి, రేపొకవేళ మీరు ఆశ్రమానికి నెలనెలా కట్టాల్సిన డబ్బు కట్టకపోతే నా పరిస్థితేమిటి... రోడ్డుపాలు కాలేను కదా. అందుకనే ప్రతీ నెలా నాకోసం ఆశ్రమానికి మీరు కట్టాల్సిన డబ్బు బాధ్యత నేనే తీసుకున్నాను. మిమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్‌ చేయదల్చుకోలేదు.’’

కోడల్ని దగ్గరికి తీసుకుంది కమల ‘‘నువ్వు నాకు పరాయిదానివి కాదు తల్లీ. నా మనవలకు రక్తాన్ని పంచిన బంధానివి. కానీ, ప్రతి తల్లికీ వృద్ధాప్యంలో ఈ సంఘర్షణ తప్పదు. రేపు నీకయినా సరే...’’

‘‘వచ్చే వారం మళ్ళీ వస్తాం నానమ్మా’’ అంటూ ఆనందంగా సెలవు తీసుకున్నారు మనవలు.
అందర్నీ నవ్వుతూ సాగనంపింది కమల.

‘‘అందరు తల్లుల్లాగే నేను కూడా అదే ప్రశ్న అడుగుతూ వచ్చాను. నా కోడలు రాకముందు నీ జవాబుకూ, కోడలు వచ్చాక నీ ప్రవర్తనకూ చాలా తేడా వచ్చింది. అది సహజం కూడా. మన జీవితంలో ఎప్పుడు, ఏ విషయానికి, ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుంటేనే ఆనందంగా జీవించగలం. లేకపోతే మానసిక సంఘర్షణ తప్పదు. ఇప్పుడు నీ భార్యా పిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యం ముసలితల్లికి ఇవ్వడం కుదరదు, ఎవరూ ఇవ్వలేరు, ఇవ్వరు కూడా - అది మానవనైజం.’’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.