close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్నేహబంధం.. ప్రాణబంధం..!

స్నేహబంధం.. ప్రాణబంధం..!

అమ్మ ఆప్యాయతనీ నాన్న బాధ్యతనీ అన్న అనురాగాన్నీ చెల్లి మమకారాన్నీ ప్రియురాలి ప్రేమనీ గురువు స్ఫూర్తినీ...  కలగలిపి అందించే అనుబంధం...  కడదాకా వీడిపోని ప్రాణబంధం...  అదే స్నేహబంధం..!

మైత్రీ దినోత్సవం..!

ప్రపంచ మైత్రీ దినోత్సవం అన్న ఆలోచనని 1958, జులై 20న డాక్టర్‌ ఆర్టెమియో బ్రాచో, పరాగ్వేలో ప్రవేశపెట్టాడు. ఆయన తన స్నేహితులతో కలిసి డిన్నర్‌ చేస్తూ జాతి, రంగు, మతం, భాషాపరమైన భేదాలు మరిచి ప్రపంచ ప్రజలందరిలోనూ స్నేహం చిగురించాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశాడు. దాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఆ తరవాత పదిరోజులకి ప్యుయర్టో పినాస్కో అనే పట్టణంలో వేడుక జరిపాడు. అందుకే ఇప్పటికీ దక్షిణ అమెరికా దేశాల్లో జులై 30వ తేదీనే ఈ వేడుకను జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి కూడా ఆ రోజునే అధికారికంగా ప్రకటించినా యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ ఆగస్టు తొలి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించడంతో చాలా దేశాలలో ఆ రోజునే ఫ్రెండ్‌షిప్‌ డేగా జరుపుకోవడం, పువ్వులూ కార్డులూ బొకేలూ ఇచ్చిపుచ్చుకోవడం అలవాటైంది. స్నేహితుల దినోత్సవం అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడంగా స్థిరపడింది. కానీ తమ స్నేహం చిగురించిన తొలినాళ్లను గుర్తుచేసుకుంటూ, స్నేహబంధం విలువను మననం చేసుకుంటూ, అది కలకాలం నిలవాలని కోరుకుంటూ చేసుకునే అపురూపమైన వేడుకే స్నేహితుల దినోత్సవం.

పౌరాణిక మిత్రులు

ష్టైశ్వర్యాలున్నా మనసు తెలుసుకునే స్నేహితులు లేనివాళ్లు నిరుపేదలే. అలాగే లేమిలో ఉన్నా ప్రాణమిత్రులు ఉన్నవాళ్లు ఎప్పటికీ ధనవంతులే. ఇది కొత్తగా ఎవరో చెప్పినది కాదు, ఎప్పటినుంచో ఉంది. మనిషి పుట్టినప్పటినుంచీ స్నేహం అనే బంధం ఉందో లేదో తెలీదు కానీ పౌరాణిక కాలం నుంచీ చెలిమి అనే అనుబంధం మాత్రం ఉంది. కర్ణ-దుర్యోధనుల స్నేహం తెలిసిందే. సూతపుత్రుడన్న కారణంతో పోటీలో పాల్గొనలేకపోతోన్న కర్ణుడి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే దుర్యోధనుడు, అతడిని అంగరాజ్యానికి రాజుని చేస్తాడు. ప్రతిగా కర్ణుడు, తన మిత్రుడు చేస్తున్నది తప్పు అని తెలిసినా, తను కుంతీపుత్రుడిని అని తెలుసుకున్నా స్నేహధర్మానికి కట్టుబడి యుద్ధంలో ప్రాణాలర్పించాడు. స్నేహమెంత గొప్పదో లోకానికి చాటాడు. అలాగే రామసుగ్రీవులూ కృష్ణార్జునులూ కృష్ణసుదాముల మైత్రీ స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనమే.

స్నేహదూత

స్నేహితుల వేడుకలకి ఒక్కరోజేం సరిపోతుంది... అందుకే మే మూడో వారాన్ని అమెరికాలో కొత్త స్నేహితులూ పాత స్నేహితులూ కలుసుకునేందుకు కేటాయించారు. అంతేకాదు, సెప్టెంబరు మూడో ఆదివారం మహిళా స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా జరుపుకుంటారట.
* ఫిబ్రవరి నెల అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రేమికుల దినోత్సవమే కానీ దేశాలమధ్య స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది. అలాగే, 1997లో స్నేహానికి ప్రపంచ రాయబారిగా విన్నీ ద పూ అనే కార్టూన్‌ క్యారెక్టర్‌ను ఎంపిక చేసింది. ఆసియా దేశాల్లో- మిగతా దేశాలతో పోలిస్తే మలేషియా, బంగ్లాదేశ్‌లలో స్నేహితుల దినోత్సవాన్ని భారీయెత్తున జరుపుకుంటారట.

శుభాకాంక్షలు..!

స్నేహమేరా జీవితం’ అంటూ గత రెండు దశాబ్దాలుగా స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా ముఖ్యంగా విద్యార్థులు జరుపుకోవడం పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియాల పుణ్యమా అని శుభాకాంక్షలు చెప్పుకోవడం మరింత సులభమైపోయింది. మరికొన్నాళ్లకి వర్చ్యువల్‌ శుభాకాంక్షలూ సర్వసాధారణం కావచ్చు. కానీ రెండు శతాబ్దాల క్రితం వరకూ ఏ వేడుకకైనా గ్రీటింగు కార్డులదే హవా. వాటి అమ్మకం కోసమే వ్యాపారసంస్థలు ఈ మైత్రీదినోత్సవానికి ప్రాచుర్యం కల్పించాయన్నదీ వాస్తవమే. వాటి తరవాతి స్థానం మాత్రం కచ్చితంగా పూలబొకేలదే. అయితే ప్రేమికులరోజున ఎర్రగులాబీలు గుబాళిస్తే, స్నేహితులకోసం పసుపూగులాబీ కలగలిసిన పూలగుత్తులు పరిమళిస్తాయట. పసుపు స్నేహితులపట్ల కృతజ్ఞతకీ అభిమానానికీ ప్రతీకగా నిలిస్తే, గులాబీ రంగు స్నేహబంధం లోని మధురిమకి సంకేతం. అయితే అది గ్రీటింగా, బొకేనా అన్నది పక్కనబెడితే, ఆ సందర్భంగా అయినా బిజీ జీవితంలో ప్రాణస్నేహితుల్ని గుర్తుచేసుకోవడం లేదా కలుసుకుని ఆనందంగా గడపడం మంచి విషయం కదూ.

స్నేహశాస్త్రం!  

హ తెలిసినప్పటి నుంచీ చివరిమజిలీ వరకూ జీవితంలోని అన్ని దశల్లోనూ ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. కొందరికి ఒక్కరో ఇద్దరో మాత్రమే జీవితాంతం ఉంటే, మరికొందరికి మాత్రం ఆ జాబితాలోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్లూ చేరుతుంటారు. అంతేతప్ప స్నేహం లేకుండా జీవితం ఉండదు. ఒకవేళ ఉందీ అంటే అది కచ్చితంగా బోరింగే అంటున్నారు పరిశోధకులు. స్నేహానికి సంబంధించిన ఇలాంటి శాస్త్రీయ అధ్యయనాల్లో మరికొన్ని...
* బాల్యస్నేహాలు ఎక్కువగా మధుర జ్ఞాపకాలుగానే మిగులుతాయి. కానీ  కళాశాల స్థాయిలో ఏర్పడే స్నేహాలు చిరస్థాయిగా నిలిచిపోతాయట.
* జంతువుల్లో చింపాంజీలూ బబూన్లూ గుర్రాలూ ఏనుగులూ డాల్ఫిన్లూ తమ జాతి వాటితో స్నేహం చేస్తాయి.
* ఆరోగ్యానికి ధూమపానం, ఊబకాయం ఎంత ప్రమాదకరమో స్నేహితుల్లేని జీవితమూ అంతే ప్రమాదకరం.
* స్నేహితులెక్కువగా ఉన్నవాళ్లు జబ్బులనుంచి త్వరగా కోలుకుంటారు. స్నేహమాధుర్యంతో ఒత్తిడి పారిపోతుంది.
* మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మన మెదడు ఎలా స్పందిస్తుందో స్నేహితులు ప్రమాదంలో ఉన్నా అలాగే పనిచేస్తుంది. అదే ప్రాణస్నేహం.
* చెట్టపట్టాలేసుకుంటూ తిరిగే థిక్‌ ఫ్రెండ్స్‌లో డీఎన్‌ఏ ఒక శాతం ఒకేలా ఉంటుందట. వాళ్ల ఆలోచనలు ఒకేరకంగా సాగడమే కాదు, అప్పుడప్పుడూ వాళ్ల పోలికలూ ఒకేలా ఉంటుంటాయి. అందుకే చాలామంది తమ
స్నేహితుల్ని తమ అన్నో చెల్లో అన్నట్లుగా ఫీలవుతుంటారు. చూసేవాళ్లకీ అలాగే కనిపిస్తారు. ఆ సారూప్యమే వాళ్లనలా దగ్గరకు చేరుస్తుంది.
* ఎవరు నమ్మినా నమ్మకున్నా బెస్ట్‌ బడ్డీస్‌ ప్రభావం శరీరబరువు మీదా ఉంటుంది. వాళ్లు ఆరోగ్యకరమైనవి తింటే పక్కవాళ్లూ క్రమంగా అవే తింటారు.
* స్నేహం అనేది కనిపించని భావం కాదు. మాట్లాడటం, నడవడానికన్నా ముందే పసిపిల్లలు సైతం స్నేహం చేయగలరు. పసివాళ్లు అందరి దగ్గరికీ వెళ్లరు. కొందర్ని చూసి మాత్రం నవ్వుతూ చేతులాడిస్తారు. అంటే వాళ్లను చూడగానే కలిగిన ఆ భావమే స్నేహం. అంటే స్నేహం కూడా భావోద్వేగమే. అందుకే అందరూ అందరికీ స్నేహితులు కాలేరు. కొందరికి కొందరే కాగలరు.

అందమైన బంధనం..!

ఫ్రెండ్‌షిప్‌ డే వచ్చిందంటే చాలు... స్కూలూ కాలేజీ పిల్లల చేతులన్నీ రంగురంగుల బ్యాండుల్ని చుట్టుకుంటాయి. గ్రీటింగుకార్డులూ కానుకలున్నా లేకున్నా కనీసం ఓ బ్యాండయినా కట్టకపోతే వాళ్లమధ్య స్నేహం లేనట్లే అన్నంతగా ఫ్రెండ్‌షిప్‌ బ్యాండుల ట్రెండ్‌ మొదలైంది. ఈ బ్యాండ్‌లు కట్టుకోవడం మనదగ్గర గత రెండు దశాబ్దాల నుంచే బాగా పెరిగింది. మొదట్లో ఆ రోజుకి పెట్టుకునేలా ప్లాస్టిక్‌తో చేసినవే ఉండేవి. కానీ ఇప్పుడు అవి కూడా యాక్సెసరీల్లానూ ఆభరణాల్లానూ వస్తున్నాయి. రంగులతాళ్లూ మెటల్‌ చెయిన్లకు తోడు బంగారం, వెండితో చేసిన బ్రేస్‌లెట్‌ తరహా బ్యాండుల్నీ పెడుతున్నారు. ఫొటోలూ పేర్లూ ముద్రించిన కస్టమైజ్డ్‌వీ ఉంటున్నాయి. అమ్మాయిలవి రంగురంగుల్లో అందంగా మెరుస్తుంటే, అబ్బాయిల బ్యాండుల్లో మాత్రం ‘ఈగల్‌ ఐ’దే హవా.

వెలకట్టలేని కానుక

ప్రేమ, పెళ్లి కానుకల మాదిరిగానే స్నేహితులమధ్యా కానుకల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఎదుటివాళ్లకు నచ్చినవాటిని ఇవ్వడంతోబాటు శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే అన్న అర్థం వచ్చేలాంటి వస్తువుల్ని ధరించడం, బహుమతిగా ఇవ్వడం నేటి మిత్రుల్లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా, కొటేషన్లు రాసిన లేదా ఫొటోలు ముద్రించిన టీషర్టులూ చెయిన్లూ కప్పులూ కుషన్లూ చాకొలెట్లూ దోస్తుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అయినా, ఏదో సరదాకి ఇచ్చిపుచ్చుకోవడమే కానీ స్నేహానికి మించిన బహుమతి లోకాన ఉంటుందా..!

‘ నువ్వు పెదవి విప్పి ఒక్క మాటా చెప్పకపోయినా నీ మౌనాన్నీ దాని వెనుక ఉన్న బాధనీ అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడు’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.