close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భరత్‌ వట్వాని అనే నేను...

భరత్‌ వట్వాని అనే నేను...

అట్టకట్టుకుపోయిన జుట్టూ, ఒంటినిండా పేరుకున్న మట్టీ, ఎండుకుపోయిన పొట్టా నిస్తేజం నిండిన కళ్లూ, మనుషులకూ ప్రపంచానికీ దూరమైన మనసూ... రోడ్లమీద అనాథలుగా తిరుగాడే ఇలాంటి మతి చెడినవాళ్లని చూస్తే సాధారణంగా ఎవరైనా సరే ఒకింత చీదరగా పక్కకు తప్పుకుంటారు. కానీ భరత్‌ వట్వాని వాళ్లని ఆప్యాయంగా చేరదీస్తారు. కంటికి రెప్పలా కాచుకుంటారు. ఓపికగా వైద్యం చేస్తారు. అలా ఇప్పటిదాకా ఏడువేలమందికి పునర్జీవితాన్ని ఇచ్చారాయన. ఆ సేవకు గుర్తింపుగా ప్రసిద్ధ రామన్‌మెగసెసె అవార్డుకి ఎంపికయ్యారు. ఆయన్ని ఓసారి పలకరిస్తే...

ఈ మధ్యనే- మేం చికిత్స అందించిన బిహార్‌కు చెందిన రోగిని మా ప్రతినిధిని తోడిచ్చి వాళ్ల ఊరికి పంపించాం. అక్కడికి చేరుకున్నాక మా ప్రతినిధి ఫోన్‌ చేసి ఏడుస్తున్నాడు. ఏమైందని అడిగితే... పేషెంట్‌ తల్లి ఆరోజు ఉదయమే చనిపోయిందన్నాడు. కొన్ని సంవత్సరాలపాటు ఇంటికి దూరమైన ఆ వ్యక్తి తల్లిని ఆఖరి చూపు చూసుకున్నాడు. ఆమెకు అతనొక్కడే కొడుకు. ఇన్నేళ్ల తర్వాత తల్లి చితికి నిప్పు పెట్టడానికి వచ్చాడని అంత దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలు రాల్చారు. మా ప్రతినిధి ఆరోజుని ఎప్పటికీ మర్చిపోలేనంటాడు. ఇప్పటివరకూ మా సంస్థ ఇలా ఇంటికి దూరమైన దాదాపు ఏడువేల మందిని తిరిగి కుటుంబంతో కలిపింది. అందులో మొదటివాడు
మీ తెలుగు వ్యక్తే!

ఆ బాధ నాకు తెలుసు
నా చిన్నపుడే నాన్న చనిపోయారు. దాంతో మానసికంగా ఎప్పుడూ ఒంటరితనం నన్ను వేధిస్తుండేది. ఆత్మహత్య ఆలోచనలూ వచ్చేవి. ఆ మానసిక స్థితి నుంచి ఎంతో ప్రయాసతో బయటపడ్డాను. అందుకేనేమో ఊరూ, వాడా విడిచి కనీసం ఆకలిదప్పుల స్పృహకూడా లేని మానసిక రోగుల్ని చూస్తే కదిలిపోతాను. ఏ అమ్మకన్న బిడ్డోనని పలకరించాలనుకుంటాను. నేను మానసిక వైద్యుడిగా మారటానికీ బహుశా అదే కారణం కావచ్చు. మేము మొదట చేరదీసిన వ్యక్తి గురించి మీకు పూర్తిగా చెప్పలేదు కదూ... ఓరోజు నేనూ, మా ఆవిడ స్మితా ముంబయిలోని ఒక రెస్టరెంట్లో కూర్చుని భోజనం చేస్తున్నాం. రోడ్డుకి అవతల చిరిగిన దుస్తులూ, బక్క చిక్కిన శరీరం, మాసిన జుట్టుతో ఒక వ్యక్తి ఉన్నాడు. చూస్తుండగానే అర్థమైంది అతడో మానసిక రోగి అని. తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. కాసేపటి తర్వాత చూసేసరికి కొబ్బరిచిప్ప పట్టుకుని రోడ్డుపక్కన మురికి నీటిని తాగుతున్నాడు. వెంటనే రోడ్డు దాటి వెళ్లి అతడితో మాట కలిపాం. ‘మాతో వస్తావా’ అంటే వస్తానన్నాడు. అతణ్ని మా క్లినిక్‌కి తీసుకువెళ్లి స్నానం చేయించి మందులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకున్నాం. రెండు నెలల చికిత్సతో సాధారణ వ్యక్తిగా మారాడు. తర్వాత తెలిసింది అతను తెలుగు వాడని. సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అనీ. అతడి తండ్రి జిల్లా పరిషత్‌లో ప్రభుత్వోద్యోగి అని చెప్పాడు. కడప జిల్లా అని గుర్తు. అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు. ఆ అబ్బాయి చెప్పిన అడ్రస్‌కి ఉత్తరం రాస్తే తండ్రి వచ్చారు. ఆయన కళ్లల్లో ఆనందం ఇప్పటికీ గుర్తే. ఇది జరిగింది 1988లో. అప్పట్లో అలాంటివారి గురించి పనిచేసే సంస్థలేవీ మాకు కనిపించలేదు. అందుకే రోడ్డుమీద మతిస్థిమితం కోల్పోయి ఎవరైనా కనిపిస్తే వారిని మా క్లినిక్‌కి తీసుకొచ్చి మామూలు మనిషిగా మార్చి వాళ్ల కుటుంబాలతో కలిపేవాళ్లం. నా శ్రీమతి స్మిత కూడా మానసిక వైద్యురాలు. దాంతో నా పని మరింత సులభమైంది. మా చిన్న క్లినిక్‌లో పేషెంట్లకి మూడు గదులుంటే ఒక గదిని వీరికి కేటాయించాం. కొన్ని కారణాలవల్ల మొదట్లో మగవాళ్లనే తీసుకునేవాళ్లం. తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో స్త్రీలకూ చికిత్స చేయసాగాం. మేం చేరదీసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. తర్వాత మాకు మరో సైకియాట్రిస్ట్‌ తోడయ్యారు. అందరినీ మా ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లోనే పెట్టేవాళ్లం. సేవల విస్తరణకు వీలుగా ఒక స్వచ్ఛంద సంస్థని ప్రారంభించమని స్నేహితులు సలహా ఇచ్చారు. అలా 1991లో ‘శ్రద్ధ రీహాబిలిటేషన్‌ ఫౌండేషన్‌’ మొదలైంది. వైద్యులుగా మేం కెరీర్‌ని ప్రారంభించిందీ అప్పుడే. కానీ, ఆర్థిక విషయాల్ని పట్టించుకోలేదు. మానవత్వంతోనే ఆలోచించాô. ప్రజల నుంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో మేం చేస్తున్న మంచి పనికి ఆటంకం కలగలేదు. ప్రఖ్యాత జేజే స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో లెక్చరర్‌గా పనిచేసిన ఒకాయన మతిస్థిమితంలేని పరిస్థితిలో మాకు కనిపించారు. మూడు నాలుగు నెలల్లో మామూలు మనిషిని చేశాకే ఆయనెవరనేది తెలిసింది. తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరిగి ఉద్యోగంలో చేర్పించాం. దాని గురించి ముంబయిలో చాలామందికి తెలిసి మమ్మల్ని ప్రశంసించారు. తర్వాత దాదాపు 150 మంది కళాకారులు వచ్చి ఒక ఎగ్జిబిషన్‌ పెట్టారు. అక్కడ తమ పెయింటింగ్‌లూ, విగ్రహాల్ని అమ్మగా వచ్చిన డబ్బుని మా సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తంతో ముంబయిలోనే దహిసర్‌ అనే ప్రాంతంలో స్థలం కొని భవనం కట్టాం. దాంతో ఒకేసారి 50 మంది వరకూ అక్కడ చికిత్స పొందగలిగేవారు. ఆ షెల్టర్‌లో ఉండే మానసిక రోగులవల్ల తమకు ఇబ్బందిగా ఉంటోందనీ ప్రశాంతత కరవవుతోందనీ కొందరు కోర్టుకి వెళ్లారు. కానీ కోర్టు మా పనిని మెచ్చుకుని కేసు కొట్టేసింది.

ఆమ్టే ప్రోత్సాహం...
ప్రముఖ సంఘ సంస్కర్త బాబా ఆమ్టే నాకెంతో స్ఫూర్తి. ఆమ్టేని మొదటిసారి కలవడానికి  వెళ్తున్నపుడు తోవలో ఒక మానసిక రోగిని చూశాం. ఆయన కాళ్లూ చేతుల్ని గొలుసులతో కట్టేశారు. ఎన్నో రోజులుగా అలాగే తిరుగుతున్నట్టున్నాడు. నాకున్న నైపుణ్యంతో నెమ్మదిగా మాటల్లోకి దించి అప్పటికప్పుడు నిక్కరు మాత్రం మార్చి కారులో కూర్చోబెట్టి బాబా దగ్గరికి తీసుకువెళ్లాం. అతడిని అలా చూసి బాబా ఎంతో వేదనపడ్డారు. వాళ్లబ్బాయి ప్రకాష్‌ ఆమ్టే సుత్తీ సేనం తీసుకొచ్చి గొలుసుల్ని విరగ్గొట్టారు. అతడిని గొలుసుల్లో అలా చూశాక రాత్రంతా నిద్ర పట్టలేదని మర్నాడు ఉదయం నాతో అన్నారు బాబా. ఆయన సున్నితమైన మనసు నన్ను ఆయనకు మరింత దగ్గర చేసింది. తాను మానసిక రోగులకు చాలా చేయాలనుకున్నా కుదరలేదంటూ మా సేవల్ని విస్తరించాలని చెప్పారు. నాకు తెలిసిన దాతలతో బాబా అన్న మాటలు చెప్పడంతో వారంతా ముందుకు వచ్చారు. దాంతో ముంబయికి 120కి.మీ. దూరంలో కర్జాత్‌ అనే గ్రామంలో స్థలం కొని అక్కడ షెల్టర్‌ నిర్మించాం. 2006 మార్చిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించాం. నాన్నని చిన్నప్పుడే కోల్పోయిన నాకు పెద్దవాళ్లు ఎవరు కనిపించినా వాళ్లలో నాన్నని చూసుకోవాలనిపిస్తుంది. బాబాలో నేను తండ్రిని చూసుకున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలనేది బాబా నమ్మిన బాట. మేమూ అదే మంత్రంగా పనిచేశాం.

ప్రకృతి ఒడిలో...
చాలామంది మానసిక రోగులు తామున్న చోటునుంచి రైలెక్కి వెళ్లిపోతారు. రైళ్లలో వారిని ఎవరూ టికెట్‌ అడగరు. దాంతో ఆఖరి స్టేషన్‌ వరకూ వచ్చేస్తారు. చివరి స్టేషన్లు సాధారణంగా నగరాలే అయి ఉంటాయి. అందుకే అక్కడే వీళ్లు ఎక్కువగా కనిపిస్తారు. ముంబయి మహా నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచీ రైళ్లు వస్తాయి. వాటిలో రోజూ ఇలాంటివారూ వస్తారు. ముంబయి, దాని పరిసర ప్రాంతాల్లో- ఇలాంటివారిని మా సిబ్బంది గుర్తించినా, వేరెవరైనా గుర్తించి ఫోన్‌ చేసినా వెంటనే వెళ్లి వాళ్లని తీసుకొస్తాం. వాళ్లకి ముందు జుట్టు, గోళ్లు కత్తిరించి స్నానం చేయించి బట్టలు మార్చుతారు మా సిబ్బంది. వారిని శారీరకంగా బలంగా తయారుచేయడానికి మంచి పోషకాహారం అందించాక చికిత్స ప్రారంభిస్తాం. నేనూ, నా శ్రీమతీ ముంబయిలో సొంత క్లినిక్‌ నడుపుతున్నాం. వారంలో మూడ్రోజులు ఈ షెల్టర్‌కు వస్తాం. నిపుణులైన డాక్టర్లు కొందరు ఇక్కడ మాకు సాయంగా ఉంటారు. మేం ఉండే ప్రాంతం నుంచి ఇక్కడికి రావడానికి మూడు గంటలు పడుతుంది. ఎక్కువ మందికి ఆశ్రయం ఇవ్వడానికి అనువుగా ఎక్కువ స్థలంలో ఈ గ్రామంలో షెల్టర్‌ని ఏర్పాటుచేశాం. ఈ ప్రాంగణం చాలా విశాలంగా ఉండి, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఇక్కడ కనీసం 120 మంది చికిత్స పొందుతూ ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ చెందిన డాక్టర్లూ, కౌన్సెలర్లూ మా దగ్గర ఉంటారు. వీళ్లంతా సుశిక్షితులైన నిపుణులు. వాళ్లు బయటకు వెళ్లి ఏ కార్పొరేట్‌ హాస్పిటల్‌లోనో పనిచేస్తే పెద్ద జీతాలు వస్తాయి.

కానీ కేవలం ఆత్మ సంతృప్తికోసం మాతో ఉండి రోగులకు సేవలు అందిస్తున్నారు. వీళ్లందరూ ఆయా రోగుల సొంత భాషలోనే మాట్లాడగలరు. దానివల్ల రోగులు త్వరగా స్పందిస్తారు. ఇక్కడ చికిత్స తీసుకునేవాళ్లు సాధారణ వ్యక్తులుగా మారడానికి నెల నుంచి ఆరు నెలల వరకూ పట్టొచ్చు. అంతకాలం వారిని మా పర్యవేక్షణలోనే ఉంచుతాం. మా సిబ్బంది ఉదయమే వారిచేత బ్రష్‌, స్నానం చేయిస్తారు. తర్వాత వ్యాయామాలు చేయించి టిఫిన్‌ పెడతారు. మందులు వేసుకునేలా చేస్తారు. తర్వాత విశ్రాంతి తీసుకోనిస్తారు. కాస్త గాడిలో పడ్డవారు క్యారమ్స్‌లాంటి ఆటలు ఆడుతుంటారు. ప్రాంగణంలో రోగులచేత మొక్కలు నాటిస్తూ, వ్యవసాయం చేయిస్తూ వారి మూలాల్ని గుర్తుచేస్తాం. ఒకసారి మానసికంగా కోలుకున్నాక ఎక్కడ నుంచి వచ్చారో కనుక్కుంటాం. పక్కాగా తెలిస్తే ప్రాంతీయ భాష తెలిసిన మా ప్రతినిధుల సాయంతో వారిని పంపిస్తాం. ఒకవేళ అడ్రస్‌లు దొరకకపోతే పోలీసులతో మాట్లాడి వారిని ఆ రాష్ట్రాల్లోని అనాథ గృహాల్లో ఉంచే ఏర్పాటుచేస్తాం.  రోగులు పేద కుటుంబాలకు చెందినవారైతే ఆ తర్వాత కూడా సంవత్సరం, రెండేళ్లపాటు నెలనెలా పోస్ట్‌ద్వారా మందులు పంపిస్తాô. మతి స్థిమితం లేకుండా రోడ్డుమీద తిరిగేవారిలో సామాన్యులే కాదు, ఉన్నత విద్యావంతులూ ఉంటారు. మా దగ్గరకు వచ్చేవాళ్లలో 98 శాతం మందిని తిరిగి వాళ్ల ఇంటికి చేర్చుతాం. ఈ ఏడాది ఇప్పటివరకూ 500 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించాం. తప్పిపోయిన వ్యక్తిని తిరిగి అప్పగించినందుకు కృతజ్ఞతగా కొన్ని కుటుంబాలవారు విరాళాలు ఇస్తుంటారు. అలా ఒకరు అంబులెన్స్‌ని డొనేట్‌ చేశారు.

తర్వాత ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన వేల్యూ ల్యాబ్స్‌ అనే సంస్థ మాకు కొన్నేళ్లుగా ఆర్థికంగా సాయంచేస్తోంది. ఆ సంస్థ సీయీవో అర్జున్‌ రావు కోరిక మేరకు హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల కిందట మానసిక రోగుల కోసం ఒక పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాం. అందుకు అవసరమైన నిధులను ఆ సంస్థే అందించింది. కానీ అంకితభావం ఉన్న మానసిక వైద్యులు లేక దాన్ని కొద్ది నెలల్లోనే నిలిపేయాల్సి వచ్చింది. ఆ అనుభవం కారణంగానే తర్వాత ఇతర ప్రాంతాలకు సేవల్ని విస్తరించడానికి ధైర్యం చాలడంలేదు. నిజానికి మనదేశంలో కొన్ని లక్షల మంది మానసిక రోగులున్నారు. వారందరినీ ఆదుకోవడం ఒక వ్యక్తివల్లో ఒక సంస్థవల్లో కాదు. ఇప్పటికే ఈ విషయంలో మనం చాలా ఆలస్యం చేశాం. నాకు అవార్డు వచ్చిన ఈ సందర్భం మానసిక రోగులకు అందించే సేవల విస్తరణకు మంచి అవకాశం అవ్వాలనేది నా కోరిక. విస్తరణ పనులు మేముగా చేయలేం కాబట్టి వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లూ, స్వచ్ఛంద సంస్థలూ ముందుకు వస్తే అందుకు అవసరమైన వైద్య శిక్షణనూ సాంకేతిక పరమైన సహాయాన్నీ అందిస్తాం. మొన్ననే ఝార్ఖండ్‌ నుంచి ఒక డాక్టర్‌ ఫోన్‌ చేసి తానూ మానసిక రోగులకు సేవలు అందించాలనుకుంటున్నాననీ, సహకారం అందివ్వమనీ కోరారు. నేను 100 శాతం సాయం చేస్తానని చెప్పాను. మా సంస్థ నిర్వహణకు నెలకు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. అందులో మా కుటుంబం రూ.2లక్షలు ఇస్తోంది, మరో స్థిరాస్తి సంస్థ యజమాని రూ.3లక్షలు ఇస్తారు. వేల్యూ ల్యాబ్స్‌ రూ.2లక్షలు ఇస్తుంది. వీరు కాకుండా ఇంకా దాతలు తమకు తోచిన విధంగా సాయపడతారు. ముంబయిలోని రోటరీ క్లబ్‌ తరచూ మాకు ఆర్థికంగా సాయపడుతోంది.  నాకు ఇప్పుడు అవార్డు ప్రైజ్‌ మనీగా వచ్చే మొత్తాన్ని కూడా శ్రద్ధ సంస్థకు కార్పస్‌ ఫండ్‌గా ఇస్తాను. దానిమీద వచ్చే వడ్డీని మాత్రం వినియోగించుకునేలా చేస్తాను.

సేవచేసే వారుంటే డబ్బు సాయం ఎవరో ఒకరు చేస్తారు. కానీ సేవ చేసేవాళ్లే కరవయ్యారు. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. నా తర్వాత ‘శ్రద్ధ’ బాధ్యతల్ని మా అంత శ్రద్ధాసక్తులతో చూసుకునేవారి కోసం చూస్తున్నాను. విధి మమ్మల్ని ఇక్కడి వరకూ నడిపించింది. దేవుడు ఆ తర్వాత కాలానికి కూడా ఏదో ఒక ప్రణాళిక రాసే ఉంటాడు కదా!

ఆనందంగా ఉంది
- డా।। స్మితా వట్వాని

మూడు దశాబ్దాల తర్వాతైనా మా సేవలకు గుర్తింపు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది.  మానసిక రోగుల్లో మహిళలూ ఎక్కువగానే ఉంటారు. అలాంటివారికి చికిత్స అందించేటపుడు నేను పర్యవేక్షించేదాన్ని. 1993 ప్రాంతంలో ఒకామె మూడేళ్లపాపతో  ముంబయిలోని ఒక వంతెన కింద కనిపించింది. ఆమెనీ, పాపనీ షెల్టర్‌కి తీసుకొచ్చి చికిత్స అందించాం. ఆమెది గుజరాత్‌. కానీ సొంతూరికి తిరిగి వెళ్లనని గట్టిగా చెప్పేసింది. ఆమె ప్రస్తుతం ‘కర్జాత్‌’ షెల్టర్‌లో వంటపని చేస్తోంది. వాళ్ల అమ్మాయి కొంతవరకూ చదువుకుని పనిలో కుదురుకుంది. ఇంకోసారి ఒక గర్భిణీని రక్షించాం. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని భర్త ఇంటినుంచి వెళ్లగొట్టాడు. కొన్నాళ్ల చికిత్స తర్వాత ఆమె కోలుకుంది. తర్వాత పుట్టింటికి కబురుపంపి వారిని రప్పించాం. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్లని మామూలు మనుషులుగా మార్చిన ప్రతిసారీ ఎంతో సంతృప్తి ఉంటుంది. ఇన్నేళ్లూ పిల్లలకు సరిగ్గా సమయం కేటాయించలేదన్న అసంతృప్తి ఏ మూలనో ఉండేది. కానీ ఈ అవార్డు అవన్నీ మర్చిపోయేలా చేసింది. మాకంటే పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు.

హైదరాబాద్‌ నుంచి...
- అర్జున్‌ రావు, సీఈవో, వేల్యూ ల్యాబ్స్‌

హైదరాబాద్‌లో రోడ్లమీద మానసిక పరిస్థితి బాగాలేకుండా తిరిగేవాళ్లు చాలామంది కనిపించేవారు. అలాంటివారికి ఆశ్రయం కల్పించే నమ్మకమైన సంస్థల గురించి ఆరాతీసినపుడు మాకు ‘శ్రద్ధ’ గురించి తెలిసింది. దాదాపు పదేళ్లుగా వారితో కలిసి పనిచేస్తున్నాం. హైదరాబాద్‌లో ఎవరైనా మానసిక రోగులు కనిపిస్తే గుర్తించి వారికి తెలియజేసేవాళ్లం. ఆ సంస్థ సిబ్బంది వచ్చి వాళ్లని మహారాష్ట్ర తీసుకొని వెళ్లేవారు. చికిత్స తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించేవారు. అలా మాద్వారా ఇప్పటివరకూ దాదాపు 200 మందిని వారి కుటుంబాలతో కలిపాం. కంపెనీ సీఎస్‌ఆర్‌లో భాగంగా వారి చికిత్సకు అయ్యే ఖర్చుని మేమే భరించేవాళ్లం.

వ్యక్తిగతం

ప్రజల గురించి సానుభూతితో ఉండేవారంటే నాకు ఇష్టం. నా భార్య స్మిత అలాంటి వ్యక్తి. అదే మమ్మల్ని ఒకటి చేసింది. స్మిత వాళ్లది పుణెలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. పీజీలో ఆమె మా లెక్చరర్‌. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.

* మాకు నలుగురు పిల్లలు. వారిలో పెద్దమ్మాయి తప్ప మిగిలిన ముగ్గుర్నీ దత్తత తీసుకున్నాం. పెద్దమ్మాయి ఐఐటీ గాంధీనగర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. పెద్దబ్బాయి ఎంబీఏ చేసి ఓ ట్రావెల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండో అమ్మాయి అమెరికాలో ఉంటోంది. రెండో అబ్బాయి ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు.

* మానసిక ప్రశాంతత కోసం సంగీతం ఎక్కువగా వింటాను. ట్రెక్కింగ్‌ బాగా ఇష్టం. ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కి రెండుసార్లు వెళ్లాను.

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.