close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊళ్లు కదిలాయి... నీళ్లు వచ్చాయి!

ఊళ్లు కదిలాయి... నీళ్లు వచ్చాయి!

అనగనగా... ఓ పోటీ. పాల్గొన్నవారందరికీ బహుమతి గ్యారంటీ! ఫస్టు వచ్చినవారికి లక్షల రూపాయల ప్రోత్సాహకాలు అదనం. ఇదేదో బోర్డు తిప్పేసే కంపెనీల బాపతు ప్రకటన కాదు..! దీని గురించి తెలియాలంటే మహారాష్ట్ర వెళ్లాలి. అక్కడి పల్లెల్లో జరుగుతున్న నిశ్శబ్దవిప్లవాన్ని చూడాలి. శ్రమదానంతో వారేం సాధించుకున్నారో, ‘సత్యమేవ జయతే వాటర్‌ కప్‌’ పోటీ తెచ్చిన మార్పేమిటో చూసి తీరాలి!

మామూలుగా వినాయక చవితితో పండగల సందడి మొదలవుతుంది. మహారాష్ట్రలోని కొన్ని వేల పల్లెల్లో మాత్రం జులైలోనే పండగ సందడి కన్పిస్తోంది. ఆ ఊళ్లకు నీళ్లొచ్చాయి మరి!
చెరువులు నిండిన సంబరాన్ని కళ్లారా చూడడానికి మెట్టినిళ్లనుంచి ఆడపడుచులు వచ్చారు. పసుపుకుంకుమలతో గంగమ్మకు పూజలు చేశారు. ఊళ్లన్నీ పండగ చేసుకున్నాయి. 45 రోజుల పాటు రోజూ లక్షా పాతికవేల మంది చేసిన శ్రమదానం ఫలితమది. కొన్ని దశాబ్దాలుగా నీటి కరవుతో అల్లాడుతున్న వేలాది గ్రామాలు ఈసారి వానాకాలం వస్తూ వస్తూ ఉండగానే నీటితో కళకళలాడుతున్నాయి. నీళ్లు వచ్చేవరకూ పెళ్లి చేసుకునేది లేదని ప్రతిజ్ఞ చేసి పలుగూ పారా పట్టిన యువకులంతా ఇక పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతున్నారు.

వానాకాలం చెరువులు నిండడం ఎవరికైనా మామూలు విషయమే కానీ అక్కడ చాలామందికి అది జీవితంలో తొలిసారి చూస్తున్న విశేషం. సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దగ్గర్నుంచీ తాగునీటికోసం ట్యాంకర్ల వద్ద తొక్కిసలాటలో పిల్లలు ప్రాణాలు కోల్పోవడం వరకూ ఎన్నో విషాదాలను వారు ప్రత్యక్షంగా చూశారు. మంటలను ఆర్పేందుకు నీళ్లు లేక తగలబడుతున్న ఇళ్లను చేష్టలుడిగి చూస్తూ నిలబడడం ఎలా ఉంటుందో వారికి తెలుసు. నీరు లేకపోవడం వల్ల ఇళ్లకు చుట్టాలు రాక, ఆడపిల్లలకు పెళ్లిళ్లుకాక, మగపిల్లలకు చదువులు సాగక... నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటున్నవారికి నీరు రావడాన్ని మించిన పండగేముంటుంది?

వారి ముంగిటికి ఆ పండగని తెచ్చింది ఓ స్వచ్ఛంద సంస్థ. ‘పానీ ఫౌండేషన్‌’ పేరుతో దాన్ని ప్రారంభించింది ఆమిర్‌ఖాన్‌ దంపతులు.

టీవీ కార్యక్రమమే ప్రేరణ
ఆమిర్‌ఖాన్‌ విలక్షణ నటుడే కాదు, సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి. ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం ద్వారా సమాజంలోని సమస్యలను టీవీ తెరపైకి తెచ్చి పలు కోణాలను చర్చకు పెట్టాడు. ఒక్కో అంశం మీద లోతైన
పరిశోధన చేసి సమగ్రంగా రూపొందించిన ఆ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. ఆ షోలోనే ఓ వారం నీటి సమస్య అంశమూ చర్చకు వచ్చింది. ప్రాణం పోయాల్సిన నీరు ప్రాణాలు తీస్తున్న వైనాన్ని కళ్లకు కట్టింది
ఆ నాటి చర్చ. ఆ కార్యక్రమాన్నే ప్రేరణగా తీసుకుని ‘పానీ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు ఆమిర్‌ దంపతులు. టీవీ కార్యక్రమానికి పనిచేసిన బృందమే ఇప్పుడు ఫౌండేషన్‌కీ పనిచేస్తోంది. డైరెక్టర్‌ సత్యజిత్‌ భత్కల్‌ సీఈవోగా ఉన్నారు. సతారా పట్టణంలో శ్రమదానంతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టి ‘నీటి డాక్టరు’గా పేరొందిన అవినాష్‌ పాల్‌ సంస్థకు మార్గదర్శి. రాష్ట్రంలో కరవు పరిస్థితికి కారణమెవరైనా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని నమ్మి వాటర్‌షెడ్‌ కార్యక్రమాల వికేంద్రీకరణా నిర్వహణా- సమస్య పరిష్కారానికి తోడ్పడతాయని నిపుణుల ద్వారా తెలుసుకున్న పానీ ఫౌండేషన్‌ ఆ దిశగా కృషి మొదలుపెట్టింది.

సంస్థ చిన్నదే...
నీటి సంరక్షణ గురించి పనిచేస్తున్న ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే ‘పానీ ఫౌండేషన్‌’ చాలా చిన్నది. ఏర్పడి కూడా కేవలం మూడేళ్లే. కానీ పెద్ద లక్ష్యాన్ని చక్కని ప్రణాళికతో ఎలా సాధించవచ్చో ఆచరించి చూపిస్తోంది. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారమూ అక్కడే ఉంటుందని చాటిచెబుతోంది. ప్రజలు తమ పల్లెల్లోనే, తమ చేతుల్తోనే తమకు అవసరమైన నీళ్లు సంపాదించుకునేందుకు ప్రేరణనిస్తోంది. సంవత్సరంలో ఆర్నెల్లు నీటి కోసం ఆరు కిలో మీటర్లు నడవడమా, ఒకటి రెండు నెలలు కష్టపడి శ్రమదానం చేయడమా... ఏది నయమన్న ఆమిర్‌ ప్రశ్నకు రెండోదానికే ఓటేశారు జనం. పలుగూ పారా చేతబట్టి ఊరూరా ప్రభంజనంలా కదిలారు. ఆడా మగా, పిల్లాజెల్లా, ముసలీ ముతకా ఎవరూ వెనకడుగు వేయలేదు. వారి పట్టుదల ముందు ఎర్రగా కాసిన మే నెల ఎండ వెలవెలబోయింది. భూమి నోరు తెరుచుకుని వానచినుకులకు స్వాగతం పలికింది. ఫలితం... ఏడాదికి సరిపడా నీటిని సాధించాయి గ్రామాలన్నీ. వారు పోటీ పడింది లక్షల రూపాయల క్యాష్‌ అవార్డు కోసం కాదు, ఏళ్ల తరబడి వెంటాడుతున్న కరవు రికార్డుకి భరతవాక్యం పలకవచ్చన్న ఆశతో. తగిన శిక్షణ ఇచ్చి మరీ వారిని ఆ ఉద్యమానికి సిద్ధం చేసింది పానీ ఫౌండేషన్‌.

శిక్షణ తీరే వేరు!
గ్రామాల్లో రాజకీయాలను ఎదుర్కొని ఊరందరినీ ఒక్కతాటిమీదకు తేవడం అంత తేలిక కాదు. అందుకని వాటర్‌షెడ్‌కి సంబంధించిన సాంకేతిక శిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలూ నలుగురినీ కలుపుకుని ముందుకువెళ్లడమూ కూడా నేర్పిస్తున్నారు. ఒక్కో గ్రామం నుంచి గ్రామస్థులే కొందరిని ఎంపిక చేసి శిక్షణకు పంపుతారు. నాలుగు రోజుల పాటు వారందరికీ వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి పలు అంశాలు నేర్పుతారు. ఉద్యమంలో విజయం సాధించిన ఓ గ్రామానికి తీసుకెళ్తారు. గ్రామ భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్లుగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులు రూపొందించుకోవడమెలాగో నమూనాల సహాయంతో చెబుతారు. ఈ పనులన్నీ జరిగేటప్పుడే నర్సరీనీ పెంచి వర్షాలు రాగానే నాటేందుకు వీలుగా మొక్కలనూ సిద్ధం చేసుకుంటారు. అయితే కొద్దిమందికి లభించే ఈ శిక్షణ ఫలితాలు ప్రజలందరిలోకి వెళ్లడమెలా? దానికి సమాధానమే- సత్యమేవజయతే వాటర్‌ కప్‌ పోటీ. ఇందులో గ్రామాలే పోటీపడతాయి. అంటే ప్రజలంతా నీటి ఉద్యమంలో భాగస్వాములవుతారు. శిక్షణ పొందిన వారి నాయకత్వంలో కలిసి కదులుతారు. పోటీలో చక్కటి ఫలితాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకంగా పెద్ద మొత్తంలో నగదు బహుమతి లభిస్తుంది.

పోటీ ఇలా...
పోటీలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకీ ఆమిర్‌ ఖాన్‌ స్వయంగా లేఖ రాస్తాడు. ఆసక్తి కల గ్రామాలన్నీ ముందుగా తమ ఊరి జనాభాను బట్టి 3 నుంచి 9 మంది వరకూ సభ్యుల్ని ఎంపిక చేసి శిక్షణకు పంపాలి. బృందాలవారీగా శిక్షణ ముగించుకురాగానే గ్రామాల్లో సభలు పెట్టి చేయాల్సిన పనుల ప్రణాళిక రూపొందించుకుంటారు. ఆ తర్వాత శ్రమదానం మొదలవుతుంది. సాధారణంగా ఇది ఏప్రిల్‌, మే నెలల్లో ఉంటుంది. ఎక్కడైనా జేసీబీ లాంటి యంత్రాలు వాడాల్సి వస్తే అందుకు అవసరమైన డబ్బును చందాల ద్వారా సేకరించుకోవాలి. అంతేకానీ ఫౌండేషన్‌ రూపాయి ఇవ్వదు. అయినా ప్రజలు ఉత్సాహంగా శ్రమదానంలో పాల్గొన్నారు. పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవారు సెలవులు పెట్టి మరీ గ్రామాలకు వెళ్లి శ్రమదానం చేశారు. వాననీరు వృథాగా పల్లానికి ప్రవహించి పోకుండా భూమిలో ఇంకేలా బంజరు భూముల్లో, కొండ వాలుల్లో ఇంకుడు గుంతలూ కాలువలూ బావులూ తవ్వడం- శ్రమదానం చేసేవారి పని. దీనికి తోడు ఎవరి పొలాల్లో వారు ఇంకుడు గుంతలు తీసుకోవాలి. పొలాల్లో గడ్డిని తగలబెట్టకుండా దాంతో సేంద్రియ ఎరువు తయారుచేసుకోవాలి. వీటన్నిటికీ అవసరమైన శిక్షణా సాంకేతిక సహాయాల్ని మాత్రం పూర్తిగా ఫౌండేషన్‌ అందిస్తుంది. వానలు పడి శ్రమదానం ఫలితం కన్పించాక 100 పాయింట్ల పట్టిక ఆధారంగా ఏ గ్రామం గెలిచిందీ ప్రకటిస్తారు. పోటీ కోసం ప్రత్యేకంగా ఒక ఆప్‌ని తయారుచేశారు. పోటీలో పాల్గొనే గ్రామాలన్నీ ఆ ఆప్‌ ద్వారా తమ ప్రగతిని అంచనా వేసుకోవచ్చు. రైతులకు అర్థమయ్యేలా మరాఠీలో రూపొందించిన పలు యానిమేషన్‌ చిత్రాలను కూడా ఈ ఆప్‌లో అందుబాటులో ఉంచారు. ఫౌండేషన్‌ తరఫున పుస్తకాలను కూడా ప్రచురించి సరఫరా చేస్తున్నారు. శిక్షణ పొందినవారే కాక ఫౌండేషన్‌ పనుల్లో ఆసక్తి కలవారెవరైనా ‘జలమిత్ర’లుగా నమోదు చేసుకుని వాలంటీర్లుగా సేవలందించవచ్చు. వారికీ ఫౌండేషన్‌ నుంచి తగిన మార్గదర్శకత్వం లభిస్తుంది. పల్లెల్లో శ్రమదానం కార్యక్రమాల పర్యవేక్షణకు లక్ష మంది దాకా ఉన్న ఈ ‘జలమిత్ర’లే అండగా నిలబడుతున్నారు. కొందరు నీటి సంరక్షణ గురించి సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించి ఊళ్లలో ప్రదర్శనలిస్తున్నారు.

అందరూ విజేతలే!
మొదటి ఏడాది పోటీ చూడగానే ప్రజలకు అది గెలిచే పోటీ అని అర్థమైపోయింది. అప్పటివరకూ వాన నీరు పడింది పడినట్లు కాలవలు కట్టి పల్లానికి పారిపోయేది. దాన్ని పట్టినిలిపాయి వారు తవ్విన ఇంకుడు గుంతలు. దాంతో బావులూ కుంటలూ నిండాయి. భూగర్భ జలాల స్థాయి పెరిగింది. బోర్లు మళ్లీ కళకళలాడాయి. ట్యాంకర్ల అవసరం లేకుండా వేసవి గడిచింది. దాదాపు 14 లక్షల వాటర్‌ ట్యాంకర్ల నీటిని, రూ.272 కోట్ల విలువైన నీటిని... గ్రామస్థులు స్వయంగా సంపాదించుకున్నారు. ఇన్నాళ్లూ నీటి కోసం తాము పడిన తిప్పల్నీ చేసిన పొరపాట్లనీ తలచుకుని ఇప్పుడు నవ్వుకుంటారు ఆ ఊళ్లలోని పెద్దలు. పోటీలో పాల్గొన్న ఊళ్లలో ఎక్కడా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. రైతుల మధ్య  పోట్లాటలు లేవు. పని లేక తాగి తందనాలాడి భార్యల్ని కొట్టడం లేదు. మొత్తంగా నేరాలు తగ్గాయి. నీరున్న ఊరు ఎన్ని పంటలైనా వేసుకోవచ్చు. అందుకే పంటల వైవిధ్యం మీద దృష్టి పెట్టారు. రైతుకు చేతినిండా పని దొరికింది. ఫలితం కళ్లముందు కనబడడంతో మూడేళ్లకే ఉద్యమం ఊపందుకుంది.

2016లో వాటర్‌ కప్‌ తొలిపోటీ జరిగింది. మూడు జిల్లాలకు చెందిన 116 గ్రామాలు పోటీపడగా  సగటున పదివేల మంది చొప్పున శ్రమదానం చేశారు. 1368 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే ఏర్పాటు చేసుకున్నారు. ‘వేలు’ అనే గ్రామం ప్రథమ బహుమతి కింద రూ.50 లక్షలు గెలుచుకుంది.

* 2017లో పోటీ 13 జిల్లాలకు విస్తరించింది. 30 తాలూకాలకు చెందిన 1321 గ్రామాలు పోటీపడ్డాయి. 65వేల మంది శ్రమదానం చేశారు. 8261 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసుకున్నారు. ఆ నీటి విలువ ఏడాదికి రూ.1652 కోట్లు ఉంటుందని అంచనా. ‘కాకద్దార’ గ్రామం ప్రథమ బహుమతి గెలుచుకుంది.

* 2018 పోటీకి 24 జిల్లాల నుంచి నాలుగు వేలకు పైగా గ్రామాలు పోటీపడ్డాయి. రోజూ శ్రమదానంలో పాల్గొన్నవారి సంఖ్య లక్ష దాటేది. విజేతను వచ్చే నెల ప్రకటిస్తారు. ఈ ఏడాది గెలిచే మొదటి మూడు గ్రామాలకూ రూ.75, 50, 40 లక్షల చొప్పున ప్రైజ్‌ మనీ ఇస్తారు. ఒక్కో తాలూకా నుంచి ఒక గ్రామం చొప్పున ఎంపికచేసి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. అయితే ఆ బహుమతి అందుకోవడం ఇప్పుడొక అదనపు విషయం మాత్రమే. ఎందుకంటే పోటీపడిన గ్రామాలన్నీ ఇప్పటికే నీటిని గెలుచుకున్నాయి. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి.

మహారాష్ట్రలో మొత్తం 36 జిల్లాలుండగా మూడేళ్లలోనే ఈ పోటీ రెండొంతుల జిల్లాలను కవర్‌ చేసింది. మిగిలిన ఆ ఒక వంతూ మరో రెండేళ్లలో అయిపోవాలి. ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా ట్యాంకర్లతో నీటి సరఫరా చేసే అవసరం లేకుండా చేయాలన్నది పానీ ఫౌండేషన్‌ లక్ష్యం. ఆ తర్వాత నీటి నిర్వహణ మీద దృష్టి పెట్టి కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఈ ఏడాదే ఆ దిశగా కృషి మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు సంస్థ సీఈవో భత్కల్‌.

* * *

పానీ అద్వా పానీ జీర్వా- అన్నది మహారాష్ట్ర జల సంరక్షణ శాఖ నినాదం.

దాని అర్థం ‘నీటికి అడ్డుకట్ట వేయండి. దాన్ని భూమిలోకి ఇంకనివ్వండి’ అని. నలభై ఏళ్లుగా ఆ ప్రభుత్వ నినాదం ప్రజల మనసుల్లోకే ఇంకలేదు, ఇంక నీటినేం ఇంకేలా చేస్తుంది.

ఆ పనిని నాలుగేళ్లు తిరక్కుండానే చేసి చూపించింది ఓ స్వచ్ఛంద సంస్థ. నీటి కోసం ప్రజల పోరాటాన్ని ఓ ఉత్సవంగా మార్చింది పానీ ఫౌండేషన్‌. కరవు రహిత మహారాష్ట్ర అన్నది పగటికల కాదనీ అతి త్వరలో సాకారం కానున్న స్వప్నమనీ చాటింది.

మూడేళ్లు పట్టింది...

ఓ కొత్త విషయం చెప్పి అందరినీ ఒప్పించడం అంత తేలిక కాదు, అందుకే చాలా గ్రామాలు ఏడాదిలో నీటిని సాధించగా మాకు మూడేళ్లు పట్టింది... అంటుంది రూయి గ్రామానికి చెందిన విద్యా గాడ్గే. ఆమె పుట్టినప్పటి నుంచీ కరవు అన్న మాట వింటూనే పెరిగింది. పదిహేనేళ్ల క్రితం తీవ్ర కరవు వల్ల పశువులకు తిండి పెట్టలేక ప్రభుత్వ షెల్టర్‌కి తోలారు. పెంచిన పశువుల మీద ప్రేమ చంపుకోలేని విద్య భర్త ఓ రాత్రి చాటుగా వెళ్లి వాటికి గడ్డివేయడానికి ప్రయత్నించాడు. దొంగతనానికి వచ్చాడని భావించి అక్కడివారు తీవ్రంగా కొట్టడంతో అతడు చనిపోయాడు. అప్పటినుంచి బిడ్డతో పుట్టింటి వద్దే ఉంటున్న విద్యని నీటి సమస్య చాలా బాధించేది. టీవీలో వాటర్‌ కప్‌ వార్తలు చూసి అందులో తమ గ్రామం పాల్గొనేలా చేయాలనుకుంది. అక్కడి మహిళలెవరూ నీరు తెచ్చుకోవడానికి తప్ప ఇల్లు దాటేవారు కాదు. అలాంటిది విద్య తెగించి పట్టణానికి వెళ్లి శిక్షణ పొందింది. శ్రమదానం చేద్దాం రమ్మంటే- ‘తాగడానికి చుక్కనీరు గతిలేదు, ఈ ఎండల్లో కొండలు తవ్వి చచ్చిపొమ్మంటావా...’ అంటూ ఎదురు తిరిగారు ఊరి వాళ్లు. అయినా విద్య వెనకడుగు వేయలేదు. పక్క గ్రామాలను చూపించి, ఊరివాళ్లను బ్రతిమాలీ బుజ్జగించీ నచ్చచెప్పీ తర్వాత ఏడాదికి చాలామందినే శ్రమదానానికి సిద్ధం చేసింది. దాంతో కొంతవరకూ వాన నీటిని ఒడిసిపట్టగలిగారు. ఆ ఏడాది పెద్దగా ట్యాంకర్ల అవసరం రాకపోవడంతో గ్రామస్థుల్లో నమ్మకం పెరిగింది. ఈ సంవత్సరం ఊళ్లోని ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. జూన్‌ చివరికల్లా చెరువులూ కుంటలూ అన్నీ నిండాయి. పాతికేళ్లుగా పనిచేయని బోర్లు నేడు చెయ్యేస్తే చాలు నీళ్లు కుమ్మరిస్తున్నాయి. ‘కాస్త ఆలస్యమైనా మా గ్రామం మారింది. ఇదే మాకు పెద్ద బహుమతి’ అంటుంది విద్య సంతోషంగా.

పుట్టింటికి వచ్చి నీళ్లు మోయాలా?

‘మేం పెళ్లి చేసుకుని అత్తగారిళ్లకు వెళ్లిపోతాం. ఎప్పుడన్నా చుట్టపుచూపుగా అమ్మానాన్నల్ని చూడడానికి వస్తే మా చేత నీళ్లు మోయిస్తారా? రేపు మీరు పెళ్లిళ్లు చేసుకున్నా మా వదినలు వచ్చీ రాగానే బిందె పట్టుకుని రోడ్డెక్కాల్సిందేనా..?’ అంటూ మెహరియాం గ్రామ యువతులు తమ అన్నదమ్ముల్ని నిలదీశారు. వాటర్‌కప్‌ పోటీ గురించి చుట్టుపక్కల ఊళ్లన్నీ మాట్లాడుకుంటుంటే- తమ ఊళ్లో ఉలుకూపలుకూ లేకపోయేసరికి చేసేదిలేక గ్రామసభలో వాళ్లే నోరు విప్పారు. దాంతో కొందరు యువకులు ముందుకొచ్చారు. మహిళల ప్రోత్సాహంతో వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. ఊళ్లో వాళ్లందరినీ కూర్చోబెట్టి అక్కడ తాము నేర్చుకున్నదీ, ఇతర గ్రామాల్లో చూసిందీ వివరించి చెప్పారు. అది విన్నాక ఊరంతా శ్రమదానానికి కదిలింది. కుంటలూ కాలువలూ చెరువులూ; కరకట్టలూ చెక్‌డ్యాములూ ఆనకట్టలూ... ఎక్కడ ఏది వీలయితే అది తవ్వారు, కట్టారు.

ఆ కష్టాన్ని మరిపించాయి నిండిన చెరువులూ కుంటలూ. ‘ఆడపిల్లలే మా కళ్లు తెరిపించారు. మా నీటిని మేమే సంపాదించుకోవచ్చని తెలుసుకున్నాం. ఇక మాకు ఏ కష్టాలూ ఉండవు...’ అంటున్నారు గ్రామస్థులు.

నీటిడ్రమ్ములకు తాళాలేసేవాళ్లం...

  ‘నీటి విలువ మాకు బాగా తెలుసు. బంగారాన్ని అయినా బయట పెట్టి వదిలేసేవాళ్లమేమో కానీ నీటి డ్రమ్ములకు మాత్రం గొళ్లాలు బిగించి తాళాలు వేసుకునేవాళ్లం. సంవత్సరంలో ఆర్నెల్లు ఇంటికి చుట్టాలను రావద్దనేవాళ్లం. దాహమేస్తే గుక్కెడు నీళ్లు కూడా పోయని ఊళ్లు... అని పక్క జిల్లాలవాళ్లు మమ్మల్ని అసహ్యించుకునేవారు. అలాంటి మాకు పానీ ఫౌండేషన్‌ శిక్షణ కళ్లు తెరిపించింది. నడుం వంచి శ్రమదానం చేశాం. జూన్‌ 4న మొదటి వాన కురిసింది. ఎనిమిదో తేదీకల్లా మా తాసీల్దారుకు ఫోను చేసి ఈ ఏడాది ట్యాంకర్లతో పనిలేదని చెప్పేశాం. పదకొండేళ్ల తర్వాత ఏరు నిండుగా ప్రవహిస్తోంది. ఆ నీరంతా వృథాగా పోకుండా కొండవాలులో అంచెలంచెలుగా నీరు భూమిలోకి ఇంకే పద్ధతులన్నీ ఆచరించాం. డ్రమ్ములూ తాళాలతో మాకిక పనిలేదు. మేం ఇప్పుడు నీటి ధనవంతులం...’ అని గర్వంగా చెబుతాడు కింఖేడ్‌ సర్పంచ్‌ సంజయ్‌ అంధాలె.

ఆరోజు ఎంతో దూరం లేదు!

‘సరైన రీతిలో పనిచేస్తే ప్రజలను కదిలించడం సాధ్యమేనని ‘సత్యమేవ జయతే’ సమయంలోనే  తెలిసింది. ఆ కార్యక్రమంలో చాలా అంశాలను చర్చించాం. కానీ ఒకటే అంశాన్ని తీసుకుని కొన్నాళ్లపాటు వదలకుండా కృషిచేస్తేనే సమాజంలో మార్పు తేవచ్చనిపించింది.

అందుకే నీటికరవు రహిత మహారాష్ట్ర లక్ష్యంగా పనిలోకి దిగాం. హివ్రేబజార్‌, రాలెగావ్‌ సిద్ధి లాంటి గ్రామాలకు వెళ్లి చూశాం. ప్రజల భాగస్వామ్యమే వాటిని మిగిలిన గ్రామాలకన్నా భిన్నంగా నిలిపింది. మేమూ అదే దారిలో వెళ్లాలనుకున్నాం. అందుకు ముందుగా ప్రజలను సన్నద్ధం చేయాలి. అవసరమైన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. పానీ ఫౌండేషన్‌ ద్వారా ఆ పని చేస్తున్నాం. మూడు తాలూకాలతో మొదలుపెట్టి మూడో ఏడాదికల్లా 75 తాలూకాలకు చేరుకోగలిగాం. మొత్తం రాష్ట్రమంతా నీటికరవు తీరే రోజు దగ్గర్లోనే ఉందని ఇప్పుడు కచ్చితంగా చెప్పగలను’.

- ఆమిర్‌ఖాన్