close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రేపటి కోసం

రేపటి కోసం
- నందిరాజు పద్మలతా జయరాం

‘‘అక్కా, రేపు శనివారం కదా... నీకు సెలవేగా’’ గేటు దగ్గరే ఎదురైంది నీలిమ.
‘‘అవునూ, అయితే!’’ స్కూటీని లోపలికి తెస్తూ అడిగాను.
‘‘ఏం లేదు, రేపు నన్ను ‘రంగస్థలం’ సినిమాకి తీసుకెళ్తావా, ప్లీజ్‌...’’ రెప్పలార్పుతూ అడిగింది నీలిమ.

చికాకనిపించింది నాకు. ఏమిటీ పిల్ల... సొంత వాళ్ళని అడిగినట్లడుగుతుంది. సెలవు రోజుల్లో కట్టుకుపోయేంత పనులు నాకు. ఇంతకుముందు ఒకసారి తీసుకెళ్ళాను.
అదే అలవాటు చేసుకుంటే ఎలా? అయినా పెళ్ళయి ఏడాది అయిందేమో... హాయిగా ఆలూమగలూ వెళ్ళక, నా వెంట పడుతుందేంటి?

‘‘చూద్దాంలే నీలిమా, రేపేం పని లేకపోతే, పిల్లలు కూడా సరే అంటే అప్పుడు చూద్దాం’’ అని స్కూటీని లోపలికి తెచ్చాను. నిరాశగా వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళిపోయింది నీలిమ.

కాస్త ఫ్రెష్‌ అయి వచ్చాక పకోడీల పళ్ళెం, మంచినీళ్ళూ చేతికిచ్చింది అత్తయ్య. ఎదురుగా కూర్చుంది నాతో కబుర్లు చెప్పడానికి. రోజూ అంతే ఆవిడ. వద్దని చెప్పినా వినదు. ‘అలసి సొలసి వస్తావు, ఆ మాత్రం అందిస్తే నేనేం అరిగిపోను’ అంటుంది. మధ్యాహ్నం తను చూసిన సీరియళ్ళూ కొత్త వంటకాల వివరాలతోపాటు ఇరుగుపొరుగు ఇళ్ళ సమాచారం అంతా నా చెవిన వేస్తుంది. అవి అయ్యాక దగ్గరలో ఉన్న పార్కులో వాకింగ్‌కి వెళ్ళి వస్తుంది. రాత్రి వంటపని నాదే కాబట్టి గబగబా కానిచ్చి పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయించే టైముకి సూర్యం వస్తాడు. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తింటాం. బుజ్జి వాళ్ళ బామ్మ దగ్గర పడుకుంటాడు, గౌరి మాత్రం నన్ను కరుచుకుని పడుకుంటుంది. ఎప్పుడో తప్ప, మా ఇంట్లో వాదులాటలు కూడా ఉండవు. సూర్యానికే కాస్త నోటి దురుసు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు నన్ను. కొడుకునే కోప్పడుతుంది అత్తయ్య.

‘‘ఒరే బడుద్ధాయ్‌, సంధ్యలాగా ఇంటా బయటా ఒక్కరోజు సమర్ధించుకు రారా, తెలిసొస్తుంది. పాపం, ఆ పిల్ల పదిహేను మైళ్ళు బండి మీద ఉద్యోగానికి వెళ్ళొస్తోంది. పిల్లల్ని మల్లెమొగ్గల్లా చూసుకుంటుంది. దాన్నేమీ అనకు’’ అంటూ వెనకేసుకొస్తుంది. అదృష్టమేమో అమ్మలాంటి అత్తగారు దొరకడం. మా ఆడబడుచుల్ని చూసినట్లే నన్ను కూడా చూస్తుంది ఆవిడ.

మా అమ్మ- మా అక్కావాళ్ళ ఇంటి విషయాల్లో తలదూర్చి తప్పు చేయడం నాకు తెలుసు. దాంతో అక్క తన అత్తగార్నీ ఆడబడుచుల్నీ తోడికోడలినీ బద్ధశత్రువులుగా చూడటం, ప్రతి చిన్న విషయాన్నీ పూసగుచ్చినట్లు అమ్మకి అందించగానే అమ్మ యాక్షన్‌లోకి దిగిపోయి సలహాలు అందించడం, వాటిని అక్క బ్రహ్మాండంగా పాటించి, బావగారి బుర్ర పాడుచేయడం వగైరా జరగడంతో, ఆయన పోకచెక్కలాగా నలిగిపోయి హైబీపీ తెచ్చేసుకున్నారు. లాభంలేదని అటువాళ్ళకీ ఇటువాళ్ళకీ కూడా దూరంగా అమెరికా పారిపోయారు ‘మంచి ఉద్యోగం వచ్చింది’ అంటూ. పిల్లలతో అక్క అమ్మ దగ్గర ఉంటోంది.

‘పిచ్చిదాన్లా ఉండకు. వచ్చిన జీతం దాచుకో. అల్లుణ్ణి ఇంటి ఖర్చులు పెట్టుకోనీ... అది అతని బాధ్యత. కాస్త గమనిస్తూ ఉండు. మీ అత్తగారు మీ ఆడబడుచుకి ఏమేమి ఇస్తోందో కనిపెట్టుకుంటూ ఉండు. కాపురం అంటే చాలా తెలివిగా మసలాలి’- ఇది అమ్మ నా పెళ్ళి అయిన కొత్తల్లో చేసిన హితబోధ.

‘అమ్మా, పక్షులూ జంతువులూ కూడా తమ పిల్లలు పెద్దయ్యాక వాటి మానాన వాటిని బతకమని వదిలేస్తాయి. అలాంటిది, మనిషిని, అందునా చదువూ సంధ్యా ఉన్నదాన్ని... ప్లీజమ్మా! నా విజ్ఞతకి నన్నొదిలెయ్యి. ఏదైనా సమస్య వస్తే నిన్నుకాక ఎవరిని అడుగుతాను చెప్పు’ అన్న నా జవాబుకి అమ్మ అలిగిన మాట నిజమే కానీ, నా వరకు నాకు హాయిగా ఉంది.

పాపం, అత్తయ్య! ఎన్ని సీరియళ్ళు చూసినా, వాటిల్లోని ఆడ విలన్‌ల లక్షణాలు వంటపట్టించుకోలేదు. మా ఆదాయ వ్యయాల గురించి అడగదు. ఆవిడ పూజకి కాసిని పూలూ, కాలక్షేపానికి నాలుగు పత్రికలూ తెచ్చిస్తూ కాసేపు కబుర్లు వింటే చాలు, మరేమీ అవసరం లేదావిడకి. నాకూ ఆవిడకీ కూడా సుఖం, సూర్యమూ పిల్లలూ కూడా హ్యాపీ. ఏడాదికోసారి తన కూతురి కుటుంబాన్ని భోజనానికి పిలిచి, మాచేత వాళ్ళకి బట్టలు పెట్టిస్తుంది. ఆడపడుచుని అన్న అహంకారం ఆ అమ్మాయికీ లేదు. గౌరినీ బుజ్జినీ తెగ ముద్దు చేస్తుంది. బట్టలూ బొమ్మలూ కొంటూనే ఉంటుంది. సూర్యానికివేవీ పట్టవు. జీతం నా చేతిలో పెట్టి ఫ్రీగా తిరుగుతాడు.

‘‘అత్తయ్యా, ఆ నీలిమేంటీ... నన్ను సినిమాలకి తీసుకెళ్ళమంటుంది? వాళ్ళాయనతో వెళ్ళొచ్చు కదా, కుదరకపోతే అత్తామామా ఉన్నారు. నన్నడుగుతుందేంటీ?’’ కాఫీ కలుపుకొచ్చి కప్పు అందిస్తూ అన్నాను అత్తయ్యతో.
‘‘ఏదో విషయం ఉందమ్మా, తెలీటం లేదు. ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం, మనింటికి వచ్చిన ఈ ఏడాదిలో నేనైతే చూళ్ళా. బంగారు బొమ్మలా ఉంటుందిగా, దిష్టి భయమేమో! అప్పుడప్పుడూ ఏదో గొడవలైతే జరగడం,
ఆ పిల్ల వెక్కెక్కి ఏడవడం వినిపిస్తుంటుంది నా గదిలోకి.’’

అవేమిటో తెలుసుకోవాలనిపించింది.
మా ఇంట్లో అద్దెకి దిగడానికి నెలముందే వాళ్ళకి పెళ్ళయిందట. నీలిమకి పెద్దగా చదువున్నట్లు లేదు. ఆ భర్తా, మామా ఇద్దరూ ఏదో బిజినెస్‌ చేస్తారట. నీలిమ తప్ప వాళ్ళెవరూ మా ఎవరితోనూ కలవరు. గలగలా మాట్లాడే అత్తయ్య కూడా వాళ్ళతో మాటలు కలపలేకపోయింది. నీలిమకి పిల్లలంటే ఇష్టం. గౌరిని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది.

* * *

శనివారం. మ్యాట్నీ ఆట. చిన్నపిల్లలా లీనమైపోయి చూసింది నీలిమ రంగస్థలం సినిమాని.
తన కుటుంబ విషయాల్ని తెలుసుకునే ఉద్దేశ్యం నాది. ఇంటర్వెల్లో మాటల్లో పెట్టాను. నెమ్మదిగా తన భర్త వివరాలడిగాను.
‘‘ఏం బిజినెస్సో నాకు తెలియదు.

మా ఆయనకి బిజినెస్‌ పనుల్లో తీరికుండదు. పైగా సినిమా ఇంట్రెస్ట్‌ కూడా లేదక్కా. అందుకే...’’ మొహమాటంగా అంది.
‘‘అదికాదు. మీ ఇంట్లో ఏమిటి సమస్య? నీకేం ఇబ్బందులు లేవు కదూ!’’

మౌనం వహించింది. ఏదో చెప్పబోయి చుట్టూ చూసి ఆగిపోయింది. ఏదో ఉంది. కానీ చెప్పడానికి బాగా భయపడింది. నేను రెట్టిస్తే అంటీముట్టనట్లు చెప్పింది. సారాంశం షరా మామూలే. పెళ్ళికి ఇస్తామన్న కట్నం పది లక్షలైతే, ఇంకా ఆరు లక్షలు బాకీ పెట్టారట వాళ్ళు. నాకు అర్థమయింది గొడవకి కారణం. నాతో వ్యక్తిగత విషయాలు పంచుకునేందుకు తను ముందుగా నన్ను నమ్మాలి. అంత సాన్నిహిత్యమేముందని? పోనీలే, సినిమాకయినా పంపుతున్నారు నాతో. తన సినిమా టికెట్టు తనే తీసుకుంది నీలిమ. నేనెంత చెప్పినా వినలేదు. సినిమా చూసిన సంతోషంతో ముఖం వెలిగిపోయింది ఆ పిల్లకి.

* * *

‘‘సంధ్యా, వీలున్నంత త్వరగా ఇంటికి రామ్మా! జాగ్రత్తగా నడుపు బండిని’’ ఆఫీసుకి వచ్చీరాగానే అత్తయ్య ఫోను. భయమేసింది. వివరాలు చెప్పలేదు -
మా ఇంట్లో అంతా బాగానే ఉన్నారని మాత్రం హామీ ఇచ్చింది.

ఆదరాబాదరాగా వచ్చిన నాకు ఇంటిముందు జనం గుమిగూడి ఉండటంతో హడలుపుట్టింది. గౌరిని ఎత్తుకుని అత్తయ్య ఎదురొచ్చింది. సూర్యం నాకన్నా ముందే ఆఫీసుకి వెళ్ళిపోయాడు కనుక ‘హమ్మయ్య’ అనుకున్నా, ఇంకా ఏదో భయం.

నీలిమావాళ్ళ పోర్షన్‌ వైపు చూపిందావిడ. అప్పటికే అక్కడున్న ఇరుగుపొరుగు అమ్మలక్కల్ని పక్కకి సున్నితంగా తోసి వాళ్ళింట్లోకి వెళ్ళాను.
వాళ్ళ పడగ్గదిలో ఫ్యానుకి వేలాడుతూ నీలిమ.
గుండె ఝల్లుమంది. మంచానికి అడుగు ఎత్తులో పచ్చని పసుపు రాసిన పాదాలు, నిద్రపోతున్నట్లున్న ముఖం.

‘‘చూడండి మేడమ్‌, తల్లిగారింటికి ఇప్పటికిప్పుడు వెళ్తానంటే వద్దన్నామని ఉరేసుకుంది’’ నీలిమ భర్త నాతో అన్నాడు. అదే మొదటిసారి అతను నాతో మాట్లాడటం. లబలబా ఏడుస్తోంది నీలిమ అత్తగారు. మామగారు గోడకి జారగిలి కళ్ళు మూసుకుని ఉన్నాడు.

వాళ్ళ మొహాలవంక చూస్తే నటన అని స్పష్టంగా తెలుస్తోంది. ఆవేశంగా ఏదో అనబోయాను. ఎవరో నా భుజాన్ని తట్టినట్లయి చూస్తే... సూర్యం. నాకన్నా ముందే వచ్చేశాడు కాబోలు.
‘‘పద, పోలీసు కేసయింది. వాళ్ళు చూసుకుంటారన్నీ’’ అంటూనే నన్ను బయటికి తెచ్చేశాడు.

‘‘ఏమిటిది, ఎందుకిలా జరిగింది? ఇది ఆత్మహత్యేనా!’’ నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు సూర్యం. మళ్ళీ అడిగాను- ఈసారి అత్తయ్యని.
‘‘అనే అంటున్నారు. ఆ దేవుడికెరుక. బంగారంలాంటి పిల్ల. ఎందుకిలా తొందరపడిందో.’’

నేనొచ్చేసరికి పోలీసులున్నారు. మరి కాసేపట్లోనే నీలిమని కిందకు దింపి, మమ్మల్నందరినీ దూరంగా వెళ్ళమని ఫొటోలు తీసుకుని, శవాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. నీలిమ అత్తమామల్నీ భర్తనీ జీపు ఎక్కించుకున్నారు. నీలిమావాళ్ళ పోర్షన్‌ని సీల్‌ చేశారు.

‘‘ఎవరికైనా ఏ విషయమైనా తెలిస్తే దాచకుండా చెప్పండి. చనిపోయిన అమ్మాయి హెరాస్మెంట్‌కి గురి అయిందా? మీరెవరైనా ఆమెతో ఎప్పుడైనా మాట్లాడారా? నిన్న ఏదైనా గొడవ జరగడం, ఆ అమ్మాయి ఏడవడం లాంటివి జరిగాయా?’’ ఆరాగా అడిగాడు పోలీసు అధికారి.
నేను ముందుకు పోబోయాను.
నా భుజం గిల్లి వెనక్కి లాగాడు సూర్యం. కళ్ళతోనే వారించాడు.

గిరుక్కున మా పోర్షన్‌లోకి వెళ్ళి భోరున ఏడ్చాను. నీలిమే కళ్ళల్లో మెదుల్తోంది.
ఆ విశాలమైన కళ్ళూ, బెరుకు చూపులూ, మనిషీ మాటా రెండూ సుకుమారమే - సన్నజాజిలా. ఇంతలో సూర్యం
వచ్చాడు లోపలికి.

‘‘ఎందుకు ఆపారు? వాళ్ళ ఆరళ్ళు పడలేకే ఆత్మహత్య చేసుకుంది అని గట్టిగా చెప్పుండేదాన్ని. ఆ రాక్షసులకి ఉరి పడేది. మీరు ఇంత పిరికివాళ్ళు అనుకోలా, ఛ!’’
‘‘ఆ, నీ ఒక్కదాని మాట నమ్మి ఉరిశిక్ష వేస్తారు మరి. మన దగ్గర ఆధారం ఏముందని...’’

‘‘అంతేనా, సాటి మనిషికి ఇంత అన్యాయం జరిగితే ఊరుకోవడమేనా?
ఎంత కష్టపెడితే ఆ చిట్టితల్లి ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటుంది?

మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు అడిగితే చూచాయగా కష్టాలున్నాయి అన్నదే కానీ ఇంత ఘోరంగా అని నాకు చెప్పలేదు. ఎంత పిరికిది నీలిమ!’’

‘‘సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఎక్కువ ఆలోచించి తలపోటు తెచ్చుకోకు. ఎవరితోనూ చర్చలు పెట్టుకోకు. నన్నూ స్టేషన్‌కి రమ్మంటున్నారు, వెళ్తున్నాను’’ అనేసి బయటికి వెళ్ళాడు సూర్యం.

కోపం స్థానంలో నాకు ఆలోచన మొదలైంది. నీలిమ నిజంగా పిరికిది. అందుకే అవకాశం వచ్చినా నాతో తన కష్టం చెప్పుకోలేదు. ఆరోజు నాకై నేనడిగితే దిక్కులు చూస్తూ ఒక్కో ముక్కా చెప్పింది. ‘మావాళ్ళదే తప్పు. అడిగిన కట్నం ఒప్పుకుని తర్వాత ఇవ్వకుండా ఉన్నారు. వీళ్ళు కట్నం కోసమే చేసుకుంటున్నారని తెలిసినా, ఇస్తామని మావాళ్ళు అబద్ధాలాడారు’ అంటూ.

కానీ నీలిమది ఆత్మహత్య కాదు. ఎందుకంటే చిన్నప్పుడోసారిలాగే వనజ అనే నా స్నేహితురాలి అక్క, పదహారేళ్ళ అమ్మాయి. ప్రేమించిన అబ్బాయిని పెద్దవాళ్ళు పెళ్ళాడవద్దన్నారని ఉరి వేసుకుంది. ఇంట్లో చెప్పకుండా నేను వెళ్ళి చూశాను. నైలాన్‌ ఓణీతో ఫ్యానుకి ఉరేసుకుంది. భయంకరంగా ఉన్నదా రూపం. బతకాలన్న ఆశ కలిగో ఊపిరందని బాధతోనో అటూఇటూ గింజుకుంది కాబోలు... చేతులమీదా పాదాలపైనా గాజులూ కాళ్ళపట్టీలూ రాచుకుపోయాయి. పమిట జారి, నాలుక పళ్ళకింద నలిగి... ఆ దృశ్యం నన్ను చాలా రోజులు వెంటాడింది.

నీలిమ అలా లేదు. నీట్‌గా తయారై నిద్రపోతున్నట్లుంది. తలవెంట్రుక కూడా చెదరలేదు. ఎలాంటివాళ్ళకైనా చావేమీ తీయని అనుభూతి కాదు. నీలిమది కోరి తెచ్చుకున్న చావుకాదు, కచ్చితంగా హత్యే. నిందితులకి శిక్ష పడాల్సిందే. అత్తమామల్నీ భర్తనీ స్టేషన్‌కి తీసుకెళ్ళారుగా... ఇన్వెస్టిగేట్‌ చేయకపోరు. పోస్టుమార్టమ్‌ రిపోర్టులో బండారం బయటపడితే, ఆ రాక్షసులకి యావజ్జీవ కారాగారవాసం తప్పదు.

రెండోరోజుకి నీలిమ తల్లీ అన్నలూ లబోదిబోమంటూ వచ్చారు.
‘‘ఇందరున్నారు, ఒక్కరయినా నా బిడ్డని కాపాడలేకపోయారా... నోట్లో నాలుకలేని పిల్ల’’ అంటూ గోలపెట్టింది నీలిమ తల్లి.
‘‘అంత్యక్రియలు ఇక్కడే చేస్తాం, మా ఊళ్ళో గొడవలవుతాయి’’ అత్తయ్యని అడిగాడు నీలిమ అన్నయ్య.
అత్తయ్య మాట్లాడలేదు.

‘‘మాకూ బాధగానే ఉంది. మేము గమనించి ఉంటే తప్పకుండా కాపాడేవాళ్ళం. ఊహించని ఘటన ఇది. ప్చ్‌, కానీయండి... మీ ఇష్టప్రకారమే ఆ క్రతువులు పూర్తిచేసుకోండి. కానీ, మీవాళ్ళ వాటాకి తాళాలేశారు పోలీసులు, ఎలా మరి?’’ సూర్యం కల్పించుకున్నాడు.

పోలీసులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.

* * *

నాలుగు రోజులయింది. యథావిధిగా రోజువారీ హడావుడి జీవితం. తొమ్మిది అవుతూండగా పోలీసులతో సహా వచ్చి నీలిమ అత్తగారు ఇంటి తాళాలు తీసింది. కాసేపట్లో పోలీసులు వెళ్ళిపోయారు. ఈవిడని ఎలా వదిలారో అర్థంకాక
నేనూ సూర్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం.

‘‘వచ్చేశానండీ. నన్ను వదిలేశారు.

మా అబ్బాయినీ మా ఆయన్నీ కూడా అంత్యక్రియల టైముకి పంపుతామన్నారు. మా తప్పు లేదని వాళ్ళకి తెలిసింది. కాసేపట్లో బాడీ దిగుతుంది, ఏర్పాట్లు జరుగుతున్నాయి’’ అని తలుపులు వేసేసుకుంది.

ఇద్దరం మొహాలు చూసుకున్నాం. ఆఫీసులు మానేసి ఇంట్లోనే ఉండిపోయాం. మరి కాసేపటికి పోస్టుమార్టమ్‌ అయిన నీలిమ శరీరం ఇంటిముందు దిగింది. చుట్టపక్కాలు రావడం, పక్కాగా అంత్యక్రియలు జరగడం అయిపోయింది. నీలిమ భర్తే కన్నీరు కారుస్తూ క్రియ అంతా చేశాడు. మా అత్తగారు ఉండబట్టలేక నీలిమ వదినగార్లని వాకబు చేస్తే, ‘స్టేషన్లో అయిదు లక్షలకి సెటిల్‌మెంట్‌ అయిందనీ, ‘పిల్లల్లేరనే బాధతో నీలిమ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందీ... అత్తింటివారు నిర్దోషులూ’ అని రిపోర్టులో రాసుకున్నారనీ అత్తగారిని సిటీ దాటరాదన్న నిబంధనతో ఇంటికి పంపారనీ, మామగారూ భర్తా కూడా త్వరలోనే బయటపడతారనీ’ తేలింది.

అవాక్కయ్యాం నేనూ అత్తయ్యా. వేలిముద్రల నిపుణులూ పోస్టుమార్టమ్‌ చేసిన డాక్టర్లూ అంతా పరీక్షించే ఉంటారు కదా. మా బుర్రలకి తోచిన చిన్న విషయాలు వాళ్ళకి తెలీకుండా ఉంటాయా! ఏమిటీ అమానుషం? ఆలోచనలు కుదిపేస్తున్నాయ్‌. ఇలా జరుగుతుందని ముందే తెలిసినట్లు నిరామయంగా ఉన్నాడు సూర్యం.

నేను ఆగలేకపోయాను. నీలిమ తల్లిని పట్టుకుని కడిగేశాను.
‘‘నేనేం చేసేదమ్మా, ఈ కేసు చుట్టూ తిరిగి డబ్బులు తగలేస్తే మాత్రం పిల్ల తిరిగి వస్తుందా అన్నారు మావాళ్ళు.
చచ్చిన పిల్ల చావనే చచ్చింది. కేసు తేలి నష్టపరిహారం కోసం చచ్చేట్లు తిరిగేసరికి మా చావుకొస్తుంది. నోరు మూసుకోమన్నారమ్మా నన్ను’’ ఎక్కిళ్ళు పెడుతూ అంది.

నా గుండె మండిపోయింది. ఈ రాక్షసులకి మళ్ళీ మరో నీలిమ దొరక్కపోదు. దాని ఖర్మా ఇలాగే అయితే? ఇంత అన్యాయమా, మనమేం చేయలేమా!?
‘‘వాళ్ళవాళ్ళు ఒక్కళ్ళయినా ఎదురుతిరిగితే మనం ఏమైనా చేయగలం. ప్రస్తుతానికి, మహా అయితే ఇల్లు ఖాళీ చేయించగలం మనం’’ పెదవి విరిచాడు సూర్యం.
‘‘కనీసం ఓ సూసైడు లెటరైనా రాయాల్సింది నీలిమ. వాళ్ళపని పట్టి ఉండేదాన్ని’’ కసిగా అన్నాను.

* * *

ఆదివారం. ఇల్లంతా శుభ్రం చేస్తూ మంచం కింద కూడా చిమ్ముతుంటే దొరికిందది. తెరిచి చూశాను.
‘‘ఏమిటా అరుపు? మంచి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాను. ఏమయింది?’’ హడలిపోయాడు సూర్యం.
అత్తయ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది.
నా చేయి చాచి చూపించాను.
సూర్యం నా చేతిలోని కాగితాన్ని తీసుకుని చదివాడు. అతని ముఖం వివర్ణమయింది.
అత్తయ్య కూడా చదివింది.
నీలిమ ఉత్తరం అది.

సంధ్యక్కా, నన్ను రక్షించు. మా ఆయనా అత్తమ్మా నాకు చావు ముహూర్తం పెట్టారు. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. ఇంట్లో విషం సీసా కనిపించింది. నన్ను
ఇల్లు దాటనివ్వడం లేదు. ఫోను కూడా లాక్కున్నారు. బాత్‌రూమ్‌ కూడా ఇంట్లోనే ఉండటంతో నాకు ఎవరినీ కలిసే అవకాశం లేదక్కా. మనం సినిమాకెళ్ళినప్పుడు కూడా మన వెనుక మా ఆయన కజిన్‌ ఉన్నాడు. అందుకే నీకేం చెప్పలేకపోయాను. వాళ్ళు రాక్షసులు. నాకిప్పటికి రెండుసార్లు అబార్షన్‌ చేయించారు. అమ్మా అన్నలూ నన్ను వీళ్ళబారిన పడేసి చేతులు దులుపుకున్నారు. నాకో దారి చూపించవూ. సబ్బు కాగితం మీద రాసి ఉండ చుట్టి ఈ ఉత్తరాన్ని కిటికీలోంచి మీ గదిలోకి విసురుతున్నా. నాకు చావాలని లేదు. నన్ను కాపాడక్కా. అన్నలు రానీయకపోతే అడుక్కుతిని అయినా బతుకుతా. ప్లీజ్‌ అక్కా... నీలిమ చనిపోవడానికి రెండురోజుల ముందు తారీఖు వేసి ఉంది. కాగితం కూడా దొరకలేదేమో, సబ్బుని చుట్టి ఉన్న రాపర్‌ కాగితం మీద రాసిన అక్షరాలు.
‘‘పద, వెళ్దాం.’’
‘‘ఎక్కడికి?’’ సూర్యం చేయి పట్టుకుని ఆపుతూ అడిగాను.

‘‘ఈ ఆధారం చాలు. పోలీసు అధికారుల్నీ టీవీ ఛానల్స్‌నీ కలుద్దాం. ముందు మన చుట్టుపక్కల వాళ్ళని కలుపుకుని పోదాం. నీలిమని కాపాడలేకపోయినా, కనీసం ఆమెను చంపినవారికి శిక్షపడేలా చూద్దాం.’’
‘‘సూరీ, వాళ్ళూవాళ్ళూ ఒక్కటయిపోయాక, మనకెందుకురా?’’ మూడేళ్ళ గౌరిని ఎత్తుకున్న అత్తయ్య అంది.

‘‘గౌరి కోసమమ్మా... గౌరి లాంటి రేపటి తరం పాపలకోసం. అవునమ్మా, కనీసం రాబోయే తరానికైనా ఈ బలవంతపు చావులు తప్పాలి. పిరికితనంతోనో పరువు పోతుందనో చావును కొనితెచ్చుకునే ఇలాంటి నీలిమలు ఏ ఒక్కరో ధైర్యంగా బయటపడినా సంతోషమే. మన ప్రయత్నం మనం చేద్దాం. పద సంధ్యా!’’
సూర్యం చేతిని గట్టిగా పట్టుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.