close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ హార్మోన్‌ పెరగాలంటే...

ఆ హార్మోన్‌ పెరగాలంటే...

పురుషుల్లో ఆరోగ్యానికీ సంతానసాఫల్యతకీ టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ ఎంతో కీలకం అన్నది తెలిసిందే. దీని స్థాయులు తక్కువగా ఉంటే, బరువు పెరగడంతోబాటు శృంగారేచ్ఛ తగ్గిపోవడం, సంతానలేమి వంటి సమస్యలు చోటుచేసుకుంటాయి. అయితే నిద్ర, వ్యాయామం, ఆహారపుటలవాట్లు ఆ హార్మోన్‌ విడుదలమీద అత్యధిక ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి జీవనశైలిని మార్చుకోవడం వల్ల ఫలితం ఉంటుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవేమంటే...
* నిద్రలేమి హార్మోన్లమీద తీవ్ర ప్రభావం చూపిస్తుందనీ అది టెస్టోస్టెరాన్‌మీదా పడుతుందనీ చికాగో విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తేలింది. ఇందుకోసం వాళ్లు ఒక వారం రోజులపాటు రోజూ ఎనిమిది గంటలు నిద్రపోయి, తరవాతి వారం పని ఒత్తిడి కారణంగా ఏ మూడుగంటలో పడుకునే వాళ్లని పరిశీలించగా- నిద్రా వేళల్లోని తేడాల కారణంగా వాళ్లలో హార్మోన్‌ ఉత్పత్తి తగ్గినట్లు తేలింది.
* సమతులాహారం తీసుకోకున్నా కూడా టెస్టోస్టెరాన్‌ స్థాయులు తగ్గిపోతాయట. కాబట్టి తినే ఆహారంలో పిండిపదార్థాలూ ప్రొటీన్లతోబాటు తగినన్ని కొవ్వులు తప్పనిసరిగా ఉండాలి. ఊబకాయమూ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తికి అడ్డంకేనట. ఊబకాయంతో బాధపడే 14-20 సంవత్సరాల వాళ్లలో మిగిలిన వాళ్లకన్నా యాభై శాతం టెస్టోస్టెరాన్‌ తక్కువగా ఉన్నట్లు క్లినికల్‌ ఎండోక్రైనాలజీ జర్నల్‌ పేర్కొంటోంది.
* టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తికి వ్యాయామమూ అత్యవసరమే. శారీరకంగా చురుగ్గా ఉండేవాళ్లలో హార్మోన్‌ స్థాయులు సమపాళ్లలో ఉన్నాయనీ అదే కదలకుండా కూర్చునేవాళ్లలో తక్కువగా ఉందనేది మరో అధ్యయనం.
* ఒత్తిడివల్ల టెస్టోస్టెరాన్‌ స్థాయులు తగ్గిపోతున్నట్లు అనేక పరిశీలనలు చెబుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తపడాల్సిందే మరి. 


అధరం... అదరహో..!

ఒంటికీ మొహానికే కాదు, పెదాలకీ స్క్రబ్‌ అవసరమే. మృతకణాలని తొలగించి పెదాలు మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడే స్క్రబ్‌లు లిప్‌స్టిక్‌ల్లానే మార్కెట్లో దొరుకుతాయి. కానీ వీటిని అందుబాటులో ఉన్న వస్తువులతో స్వయంగా చేసుకుని, వాడుకోవడమే మేలు. అందుకోసం...
* టేబుల్‌స్పూను చొప్పున కొబ్బరినూనె, తేనె తీసుకుని అందులో రెండు టేబుల్‌స్పూన్ల ముడిపంచదార, 2 టీస్పూన్లు గోరువెచ్చనినీళ్లు కలిపి పేస్టులా చేసి పెదాలమీద పూసి రెండుమూడునిమిషాలపాటు మృదువుగా రుద్ది తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. కొబ్బరినూనెలోని కొవ్వుఆమ్లాలు చర్మాన్ని మృదువుగా చేస్తే, పంచదార మృతకణాలని తొలగిస్తుంది. తేనె పెదాలు పగలకుండా నివారిస్తుంది.
* అరటీస్పూను దాల్చినచెక్కపొడిలో 2 టీస్పూన్ల చొప్పున తేనె, ఆలివ్‌నూనె కలిపి పేస్టులా చేసి పెదాలకు పట్టించి మృదువుగా రుద్ది కడిగేసినా మేలే. అలాగే టేబుల్‌స్పూను చొప్పున తేనె, కాఫీపొడి తీసుకుని పేస్టులా కలిపి పెదాలమీద ఓ నిమిషంపాటు రుద్ది కడిగేసినా మంచిదే. లేదూ కాసిని గులాబీరేకుల్లో కొద్దిగా పాలు పోసి పేస్టులా నూరి రుద్దినా అధరాలు మృదువుగా మారి అందంగా మెరుస్తాయి. 


వాసన తెలీడం లేదా..!

రవై పైబడ్డవాళ్లలో వాసన పసిగట్టే లక్షణం క్రమంగా తగ్గుతుంటే వాళ్లకి భవిష్యత్తులో మతిమరపు వచ్చే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నాయి అనేక పరిశోధనలు. ఇందుకోసం దాదాపు మూడువేలమందిని ఎంపికచేసి కొన్ని పదార్థాల్ని వాసన చూడమన్నారట. వాళ్లలో కొంతమంది మాత్రం ఆ వాసనల్ని చెప్పలేకపోయారు. ఆ కొందరిని ఓ ఐదేళ్ల తరవాత పరిశీలించగా వాళ్లలో దాదాపు అందరికీ మతిమరపు వచ్చినట్లు గుర్తించారు. అలాగే మరో అధ్యయనంలో మతిమరపుతో బాధపడుతున్నవాళ్లని ఎంపికచేసి గమనించగా వాళ్లలో చాలామంది వాసనల్నీ గుర్తించలేకపోతున్నట్లు తేలింది. దీన్నిబట్టి వాసనని గుర్తించలేనివాళ్లు ముందుగానే వైద్యుల దగ్గరకు వెళ్లడం మంచిదన్నది నిపుణుల సలహా.


మిర్చి ఎంత మంచిదో..!

ఘాటుకోసం రుచికోసం తినే మిర్చిలోని క్యాప్సైసిన్‌, మున్ముందు ఎన్నో అద్భుతాలు చేయనుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ వ్యోమింగ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీకి చెందిన నిపుణులు. క్యాప్సైసిన్‌కి నాడీకణాలమీద ప్రభావం చూపించడం ద్వారా నొప్పిని తగ్గించే గుణం ఉందన్నది తెలిసిందే. ఆ కారణంతోనే ఈ పదార్థంతో రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌తోబాటు ఇతరత్రా నాడీసంబంధ వ్యాధులకు మందును కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే క్యాప్సైసిన్‌తో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయనీ ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్‌ కణాల పెరుగుదలని అడ్డుకుంటుందనీ ఊబకాయాన్ని నియంత్రిస్తుందనీ తాజాగా గుర్తించారు. అందులో భాగంగా వీళ్లు రూపొందించిన మెటాబొసిన్‌ అనే మందు కొంచెకొంచెంగా క్యాప్సైసిన్‌ను విడుదల చేస్తూ రక్తంలో చక్కెర స్థాయుల్నీ కొలెస్ట్రాల్‌ నిల్వల్నీ తగ్గించినట్లు తేలింది. కాబట్టి ఈ మందుతో ఊబకాయాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు అన్న ఆశాభావాన్ని కనబరుస్తున్నారు నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.