close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బుద్ధుడి అడుగుజాడల్లో..!

బుద్ధుడి అడుగుజాడల్లో..!

‘మనదేశంలో బౌద్ధం ప్రాభవం కోల్పోవచ్చుగాక... కానీ అది పుట్టి పెరిగిన ప్రదేశం మనదేశంలోనే ఉంది. ప్రపంచంలోని బౌద్ధులందరికీ కూడా అదే ప్రముఖ బౌద్ధక్షేత్రం. అందుకే అక్కడ ఎటు చూసినా బౌద్ధ సన్యాసులే. అదే బీహార్‌ రాష్ట్రంలోని బుద్ధగయ’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన మత్స్యరాజ హరగోపాల్‌.

బౌద్ధ విహారాలకు నిలయమైన ప్రాంతాన్ని అప్పట్లో విహార్‌ అని పిలిచేవారు. అదే నేడు బీహార్‌గా మార్పు చెందింది. అందుకే అక్కడ అడుగడుగునా బుద్ధుడు నడయాడిన జాడలు కనిపిస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది ఆయన జ్ఞానోదయం పొందిన మహాబోధి వృక్షానికి నిలయమైన బుద్ధగయ. అక్కడ ఉన్న మహాబోధి మందిరం బౌద్ధమత కేంద్రంగా విరాజిల్లుతోంది. బుద్ధగయ అసలు పేరు ఉరువెలా. సిద్ధార్థుడు దుఃఖకారణాలకోసం అన్వేషిస్తూ అనేక ప్రాంతాల్లో సంచరించి ఉరువెలా అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఓ మర్రిచెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలోకి వెళ్లాడు. కొన్నిరోజులకు జ్ఞానోదయం కలిగింది. అలా బుద్ధత్వం సిద్ధించింది కాబట్టి సిద్ధార్థుడు బుద్ధుడుగానూ ఆయనకు నీడనిచ్చిన మర్రిచెట్టు బోధివృక్షంగానూ ఉరువెలా ప్రాంతం బుద్ధగయగానూ ప్రాచుర్యం పొందాయి.

వేలాది సంవత్సరాలుగా పూజలందుకుంటోన్న ఈ మందిరాన్ని ‘ద లివింగ్‌ టెంపుల్‌’గా పిలుస్తారు. 2013లో ఉగ్రవాద దాడుల తరవాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయిక్కడ. నిజానికి ఇది మధ్యలో కొంతకాలం మట్టితో కప్పబడిపోయింది. 13వ శతాబ్దంలో తుర్కుల దాడిలో ఇది ప్రాభవాన్ని కోల్పోయింది. తరవాత మనదేశంలో బౌద్ధానికి ఆదరణ కరవవడంతో ఇది మట్టి, ఇసుకలతో మూసుకుపోయింది. 1880-84 నాటి తవ్వకాల్లో ఇది మళ్లీ వెలుగుచూసింది.

మందిరంలోకి అడుగుపెట్టగానే ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ మంద్ర స్వరంతో వినిపించే పదాలు మనల్ని అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వాటిని వింటూ ప్రధాన మందిరంలోకి అడుగుపెట్టాం. గర్భాలయంలో భూమిని స్పర్శిస్తూ, భిక్షాపాత్రతో ధ్యానముద్రలో కూర్చున్న బుద్ధ భగవానుడు సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అంతరాలయంలోకి వచ్చి చాలాసేపు బుద్ధుణ్ణి చూస్తూ కూర్చున్నాం. అక్కడ ఎంతసేపు కూర్చున్నా ఏమీ అనరు. బాలభిక్షువులు ప్రార్థన చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తారు. వాళ్ల ముఖాల్లోని ప్రశాంతత సందర్శకుల్ని చకితుల్ని చేస్తుంది.

నాలుగు ముఖద్వారాలు ఉన్న ఈ ఆలయంలో అనేక స్తూపాలూ చైత్యాలూ ఉన్నాయి. ఈ మందిరాన్ని అశోకుడు నిర్మించాడనీ అంతరాలయంలోని బుద్ధుడిని ఆయనే ప్రతిష్ఠించాడనీ అంటారు. అయితే ప్రస్తుతం ఉన్న మందిరం క్రీ.శ. ఆరో శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న స్తూపాలు 2500 సంవత్సరాల నాటివిగానూ మెట్లు క్రీ.పూ.రెండో శతాబ్దంలోనూ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే బౌద్ధమతంలో భాగంగా అశోక చక్రవర్తి ఈ ప్రాంతంలోనే అనేక స్తూపాలనూ విహారాలనూ చైత్యాలనూ నిర్మించినట్లు ఆధారాలున్నాయి. భక్తులే కాదు, చారిత్రక పర్యాటకులెందరో అత్యంత ప్రాచీనకాలంనాటి ఈ ఆలయాన్ని చూసి ప్రశంసలతో ముంచెత్తుతారు.

మహాబోధి..!
తరవాత మహాబోధి వృక్షం దగ్గరకు వెళ్లాం. ఈ చెట్టును అసలు చెట్టుకి ఐదోతరానిదిగా చెబుతారు. దీనికిందే తూర్పుదిక్కుకి అభిముఖంగా బుద్ధుడు వజ్రాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్లాడనీ, వైశాఖ పూర్ణిమరోజు ఆయనకి జ్ఞానోదయం అయిందనీ అంటారు. ఇక్కడ బౌద్ధులతోబాటు సందర్శకులూ ధ్యానం చేసుకోవచ్చు. ప్రధాన మందిరం చుట్టూ ఉన్న ప్రాంగణం పచ్చదనంతో అలరారుతుంటుంది. దానిమీద చాపలూ పరుపులూ వేసుకుని దేశవిదేశీయులెందరో నెలలు, సంవత్సరాల తరబడి ధ్యానంచేస్తూ అక్కడ గడిపేస్తుంటారు.

ఆ తరవాత దానికి పక్కనే ఉన్న ‘నిమేషలోచన చైత్యము’ అనే స్థలానికి వెళ్లాం. ఇక్కడినుంచే బుద్ధుడు వారంరోజులపాటు కనురెప్పలు కదల్చకుండా బోధివృక్షం వైపే చూస్తూ తన కృతజ్ఞతను చాటుకున్నాడట.

జ్ఞానోదయమైన తరవాత మూడో వారం గడిపిన ప్రదేశమే ‘చక్రమణ’. అక్కడ ఆయన పాదం మోపిన ప్రతిచోటా తామరపువ్వులు వచ్చినట్లు చెబుతారు.

తరవాత రత్నగృహం అనే ప్రదేశానికి వెళ్లాం. జ్ఞానోదయానంతరం ఇక్కడ బుద్ధుడు నాలుగో వారం గడిపినట్లూ ఆయన శరీరంలోనుంచి అయిదు రంగులు వెలువడినట్లూ తెలుస్తుంది. ఆ అయిదూ కామ, క్రోథ, లోభ, మద, మాత్సర్యాలకు ప్రతీకలని అంటారు.

కర్మల ద్వారా మానవుడు సద్గతి పొందుతాడనీ జన్మ ద్వారా కాదని బుద్ధుడు గ్రహించి బోధించిన ప్రదేశమే కీర్తిఅజపాల. ఇవన్నీ చూసుకుంటూ సరస్సు దగ్గరకు చేరుకున్నాం. ఆరో వారంలో ఆయన ఈ సరస్సు దగ్గర గడిపాడనీ మానవ మేధస్సులోని అలజడులనూ ఆటుపోట్లనూ తట్టుకుని ఏకాగ్రత సాధించడం ఎలానో ఆయన గ్రహించి బోధించిన ప్రదేశం ఇదేననీ అంటారు. అక్కడినుంచి రాజాయితనమ్‌ అనే ప్రదేశానికి వెళ్లాం. ఇక్కడ బుద్ధుడు బర్మాలో బౌద్ధమత
వ్యాప్తికోసం వెంట్రుకని ఇచ్చాడని చెబుతారు.

తరవాత అక్కడినుంచి దగ్గర్లోని 80 అడుగుల ఎత్తున్న బుద్ధ విగ్రహం దగ్గరకు వెళ్లాం. ధ్యానభంగిమలో ఉన్న ఈ విగ్రహానికి ఇరువైపులా పదిమంది ఆయన శిష్యుల ప్రతిమలు కూడా ఉన్నాయి. తరవాత థాయ్‌ మందిరంలోకి వెళ్లాం. అందులో ప్రతిష్ఠించిన స్వర్ణప్రతిమ శోభాయమానంగా ఉంది. టిబెట్‌ సంస్కృతిని అద్దంపట్టేలా నిర్మించిన కర్మ ఆలయం సందర్శకులను ఆకర్షిస్తుంది.

నలందాలో...
మర్నాడు ఉదయమే రాజగృహ, నలంద, పావాపురి చూడ్డానికి బయలుదేరాం. గయకి 80 కి.మీ. దూరంలోని రాజగృహ అన్న ప్రదేశానికి వెళ్లాం. ఇక్కడే బుద్ధుడు అనేక సంవత్సరాలపాటు బౌద్ధ ధర్మాన్ని బోధించాడట. బింబిసారుడు ఇక్కడే బౌద్ధమతాన్ని స్వీకరించాడనీ మొదటి బౌద్ధ సమ్మేళనం ఇక్కడే జరిగిందనీ చెబుతుంటారు.

ఇక్కడి రత్నగిరి కొండలమీద నిర్మించిన శాంతి స్తూపాన్ని చూడ్డానికి రోప్‌వే ద్వారా వెళ్లాం. ఈ స్తూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడి బుద్ధుడి విగ్రహాన్ని చాలాసేపు అలాగే చూస్తుండిపోయాం. దీన్ని జపాన్‌కు చెందిన బౌద్ధులు నిర్మించారు. తరవాత రాజగృహకి 15 కి.మీ. దూరంలోని నలందాకి బయలుదేరాం. క్రీ.పూ. అయిదో శతాబ్దానికి చెందిన విశ్వవిఖ్యాత నలంద విశ్వవిద్యాలయం ఇక్కడే ఉండేది. గౌతముడు దాన్ని ఎన్నోసార్లు సందర్శించాడనీ క్రీ.శ. 5-12
శతాబ్దాల వరకూ ఈ ప్రాంతం బౌద్ధ మత సిద్ధాంతాల ప్రచారానికి కేంద్రంగా ఉందనీ చెబుతారు. ప్రపంచంలోనే మొదటి రెసిడెన్షియల్‌ విశ్వవిద్యాలయం ఇదే. ఇక్కడ 2000 మంది ఆచార్యులు, 10,000 పైగా విద్యార్థులు ఉండేవారనేదానికి చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.శ. ఏడో శతాబ్దంలో చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.

ప్రస్తుతం ఇక్కడ 14 హెక్టార్లలో భారత పురాతత్వ శాఖ జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన నాటి అద్భుత కళాఖండాలూ కట్టడాలూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎర్ర ఇటుకలతో కట్టిన నాటి బోధనాలయాలూ వసతి గృహాలూ విహారాలూ చైత్యాల్లో కొన్ని ఇప్పటికీ కనిపిస్తాయి. బుద్ధుడి ప్రధాన శిష్యుల్లో ఒకడైన సారిపుత్ర ఇక్కడివాడే. ఆర్యదేవ, వసుబంధు, ధర్మపాల, సువిష్ణు, అసంగ, శైలభద్ర, ధర్మకీర్తి... వంటి వాళ్లంతా ఆచార్యులుగా ఉండేవారు. కుమారగుప్తుడు క్రీ.శ. ఐదో శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడనీ తరవాతికాలంలో హర్షవర్థనుడు, పాలవంశరాజులు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. క్రీ.శ.1200 సంవత్సరంలో భక్తియార్‌ ఖిల్జీ దీన్ని కూలగొట్టాడట.
1970వ దశకంలో భారత పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాల్లో ఇక్కడ బౌద్ధంతోపాటు హిందూ దేవతా విగ్రహాలూ జైన విగ్రహాలూ నాటి శాసనాలూ నాణాలూ బయటపడ్డాయి. ప్రస్తుతం వాటన్నింటినీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. గైడ్‌ ద్వారా నాటి చరిత్రని విని ఎంతో ఆనందించాం.

తరవాత అక్కడికి 18 కి.మీ. దూరంలోని పావాపురికి బయలుదేరాం. ఇక్కడ జైన తీర్థంకరుల్లో చివరివాడైన మహావీరుడు తన పార్థివ శరీరాన్ని త్యజించిన స్థలంలో ఓ మందిరాన్ని నిర్మించారు. అది చాలా అద్భుతంగా ఉంది. దాని చుట్టూ ఓ సరస్సు ఉంది. అందులో ఒకవైపు అంతా తెల్లని కమలాలూ మరోవైపు ఎర్రని కమలాలూ మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ పాలరాతి కట్టడంలో మహావీరుని పాదముద్రలు ఉన్నాయి. ‘అహింస పరమోధర్మ, ప్రశాంతంగా జీవించు-ఇతరులను జీవించనివ్వు, ప్రకృతిలోని ప్రతి ప్రాణినీ ప్రేమించు...’ అని అక్కడ రాసి ఉన్న శిలాఫలకాన్ని చూసే గాంధీజీ ప్రభావితుడైనట్లు చెబుతారు. అక్కడినుంచి తిరుగుప్రయాణంలో గయకి చేరుకున్నాం.

మోక్షగయ!
బుద్ధగయ-గయ జంటనగరాల్లా ఉంటాయి. బౌద్ధులకు బోధగయ ఎలాంటిదో, హిందువులకు గయ అలాంటిదే. గయలో ఫల్గుణీ నది, విష్ణుమందిరం, వటవృక్షం చూడదగ్గ ప్రదేశాలు ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఈ మూడు ప్రదేశాల్లో పిండప్రదానం చేస్తే పూర్వికులకి సద్గతి ప్రాప్తి కలుగుతుందనీ అందుకే గయాశ్రాద్ధం ఎంతో గొప్పదనీ హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఫల్గుణీ నదీతీరంలోనే విష్ణుమందిరం ఉంది. ఈ మందిర ప్రాంగణంలోనే వటవృక్షం ఉంది. ఈ మూడుచోట్లా పిండప్రదానం చేస్తారు. ఇక్కడ తెలుగు పండితులు కూడా ఉన్నారు. శ్రీమహావిష్ణువు తన ఎడమపాదాన్ని గయాసురుని హృదయంమీద నొక్కి ఇక్కడే సంహరించాడనీ అందువల్ల ఒక్క పాదం మాత్రమే ఈ మందిరంలో ఉందనేది ఓ పౌరాణిక గాథ. అయితే అది గౌతముడి పాదమన్నది బౌద్ధుల విశ్వాసం. ఆ పాదాన్ని భక్తులు తాకవచ్చు. ఈ మందిరానికి సమీపంలోనే 15వ శతాబ్దానికి చెందిన మంగళగౌరి ఆలయం ఉంది. దీన్ని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెబుతారు. ఆలయంలోని గర్భగుడి చిన్నగా ఉంది. అందులోని అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతుంటుందట. అది చూసి వారణాశికి వెళ్లి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.