close
ఆ ఇల్లే మా స్టూడియో!

ఆ ఇల్లే మా స్టూడియో!

  ‘ఈ బాబు గారికి... పాత పాట పాడుతున్న జేబు మోతకి...’ అంటూ ‘పెళ్లిచూపులు’లో ఓ కొత్త రాగం వినిపించాడు. ‘ఊహలు ఊరేగే గాలంతా... ఇది తారలు దిగి వచ్చే వేళంటా...’ అంటూ ‘సమ్మోహనం’లో ‘సమ్మోహనం’గా శ్రుతి మీటాడు. ‘ఆగి ఆగి సాగె మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి... నేల వీడి కాళ్లు నింగిలోకి తేలెనా...’ అంటూ ‘ఈ నగరానికి ఏమైంది?’లో ఈతరం మెచ్చే బాణీ ఇచ్చాడు. శబ్దాల హోరులో కొట్టుకుపోతున్న సినిమాపాట ధోరణిని మార్చి తీయనైన తెలుగు పదాల్ని హాయిగొల్పే రాగాల తోడుగా మనకు వినిపిస్తున్న ఆ సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌. ఈ రాగాల సాగరుడి సంగీత ప్రస్థానమిది...
 

సంగీత దర్శకుడిగా నా మొదటి సినిమా పెళ్లిచూపులు కాదు. అంతకంటే ముందు ‘రేస్‌’ సినిమాకి నా ఫ్రెండ్‌ సంజయ్‌తో కలిసి పనిచేశాను. అన్నాళ్లూ మాకు నచ్చిన మ్యూజిక్‌ చేస్తూ వచ్చాం. మొదటిసారి ‘మాకు ఇలాంటి సంగీతం కావాలి, అలాంటి పాటకట్టాలి’ అని ఒకరు చెప్పేసరికి మాకు ఆ పని వాతావరణం నచ్చలేదు. సినిమావాళ్లు ఇలానే ఉంటారు కాబోలనుకుని ఆ తర్వాత సినిమాలకి పని చేయకూడదనుకున్నాం. నాకూ, నా ఫ్రెండ్స్‌కీ సంగీతం అంటే చాలా ఇష్టం. మ్యూజిక్‌ చేయాలనేది మా తాపత్రయం తప్ప సినిమాలే లక్ష్యమని ఎప్పుడూ అనుకోలేదు. ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థం కావాలంటే నా కథని మొదట్నుంచీ తెలుసుకోవాల్సిందే!

అమ్మావాళ్లది విజయనగరం. నాన్నది నల్గొండ. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. అమ్మకు సంప్రదాయ సంగీతంలో ప్రవేశం ఉంది. నాకు మూడేళ్లప్పటినుంచీ అమ్మ పాడేవన్నీ నేనూ పాడేవాణ్ణట. నేను చదివిన ఆల్‌ సెయింట్స్‌ స్కూల్లో రామాచారి మాస్టారు సంగీతం పాఠాలు చెప్పేవారు. నేను బాగా పాడుతున్నానని గమనించి స్కూల్‌ సంగీత బృందంలో చేర్చుకున్నారు. లలిత గీతాలూ, భక్తి గీతాల్లాంటివి ఎక్కువగా పాడేవాళ్లం. ఆయన సొంతంగా కంపోజ్‌ చేసిన ఎన్నో పాటల్ని మాచేత పాడించారు. పాడటంతోపాటు క్లాసులో బెంచీలమీద దరువు వేయడమూ అలవాటైంది. ఎనిమిదో తరగతిలో ఉన్నపుడు స్టైల్‌గా ఉంటుందని చెప్పి నాన్నచేత కీబోర్డు కొనిపించాను. అప్పుడప్పుడూ దానిమీద సాధన చేసేవాణ్ని. ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో గిటార్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్నెట్‌లో సంగీతం గురించి చదివేవాణ్ని. అంతర్జాతీయ గాయకుల పాటలు వినేవాణ్ని. మా అన్నయ్యకీ సంగీతం బాగా ఇష్టం. రకరకాల ఆల్బమ్‌లు సేకరించి టేప్‌ రికార్డర్‌లో వింటుండేవాడు. నేనూ ఒక చెవి అటుపడేసేవాణ్ని. స్టీవెన్‌ బెన్‌హర్‌ అని అన్నయ్య ఫ్రెండ్‌... మంచి గిటారిస్ట్‌. గిటార్‌ని సరాదాగా నేర్చుకుంటున్న నాకు దాంతో ఎలాంటి అద్భుతాలు చెయ్యొచ్చో అతను చెప్పేవాడు. వివిధ రకాల సంగీతాల్ని పరిచయం చేశాడు.

రెహమాన్‌ని కలిశాం!
ఇంజినీరింగ్‌లో చేరిన కొత్తలో నా చిన్ననాటి స్నేహితుడు సంజయ్‌ చాలా ఏళ్ల తర్వాత కలిశాడు. డ్రమ్స్‌ నేర్చుకున్నట్టు చెప్పాడు. తర్వాత నుంచి మేమిద్దరం కలిసి సంగీత సాధన చేయడం మొదలుపెట్టాం. తర్వాత మరికొందరు స్నేహితులతో కలిసి రాక్‌ బ్యాండ్‌ ప్రారంభించాం. మా ప్రాక్టీసు చిక్కడపల్లిలోని సంజయ్‌ వాళ్లింట్లో సాగేది. 2004 నుంచి ఇప్పటిదాకా అక్కడే మా ప్రాక్టీసు.  ఇప్పుడదే మా స్టూడియో కూడా. వాళ్లింట్లో అంత ప్రోత్సాహం ఉండేది మరి! 2004 నుంచి 2010 వరకూ రాక్‌ బ్యాండ్‌తో బిజీగా ఉండేవాళ్లం. ఇండియా అంతా తిరిగి 40 చోట్ల ప్రదర్శనలిచ్చాం. పబ్‌లలోనూ సంగీతం వినిపించేవాళ్లం. దాంతోపాటు ‘కెథార్సిస్‌’ అనే బ్యాండ్‌ని మొదలుపెట్టాం. దీన్లో ప్రధానంగా శాస్త్రీయ సంగీత వాద్యాలే ఉపయోగిస్తూ ప్రయోగాలు చేస్తుంటాం. కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఫణితోపాటు శాక్సాఫోన్‌ వాయించే వరుణ్‌.. మా బృందంలో ప్రధాన సభ్యులు. నేను గిటార్‌, కీబోర్డు వాయిస్తాను.
అప్పుడప్పుడూ కొత్తవాళ్లనీ పిలిచి ప్రాక్టీసు చేస్తుంటాం. ప్రదర్శనలూ ఇస్తుంటాం. మెలోడి తరహా పాటల్నే సాధన చేస్తాం. 2007లో ఓ టీవీ మ్యూజిక్‌ టాలెంట్‌ షోలో మా కెథార్సిస్‌ బృందం పాల్గొంది. అందులో గెలిచి ఏ.ఆర్‌.రెహమాన్‌ స్టూడియోలో రెండు పాటలు రికార్డింగ్‌ చేసే అవకాశం దక్కించుకున్నాం. అప్పుడే రెహమాన్‌ని కలిసే అవకాశం వచ్చింది. ‘మా సంగీతం గొప్పగా ఉండాలి. పది మందీ మెచ్చాల’ని ఎప్పుడూ అనుకోలేదు. కొత్తదనం కోసం ప్రయత్నించేవాళ్లం. అదే మాకు గుర్తింపు తెచ్చింది.

ఆర్నెల్ల ఉద్యోగం!
రాక్‌బ్యాండ్‌, పబ్‌లలో ప్రదర్శనలతో వచ్చేది ఖర్చులకు సరిపోయేదంతే! అప్పటికే ఇంజినీరింగ్‌ పూర్తయి మూడేళ్లయింది. ఆ దశలో ఉద్యోగంలో చేరమని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేశారు. అప్పుడు ఓ ఫ్రెండ్‌ సాయంతో మొబైల్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కొత్త పాటల్ని రింగ్‌ టోన్‌లుగా కట్‌చేయడమే నా పని. నెలకు రూ.10వేలు జీతం. అక్కడ చేస్తూనే మా బ్యాండ్‌ని కొనసాగించాం. కానీ కొన్నాళ్లకి విసుగొచ్చేసింది. సంగీతానికి దూరమవుతున్నానేమో అనిపించింది. ఆర్నెల్లు చేశాక ఉద్యోగం మానేశాను. నాన్నకు పరిస్థితి చెప్పాను. ‘మరో రెండేళ్లలో రిటైరవుతున్నా. అప్పటివరకూ నీ ఇష్టం’ అన్నారు. నా ఫ్రెండ్‌ సంజయ్‌ కూడా ఉద్యోగం మానేశాడు. ప్రొఫెషనల్స్‌గా మారాలనుకున్నాం.  ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ సంగీత సాధన చేసేవాళ్లం. సంజయ్‌ వాళ్ల నాన్నగారే మాకు మధ్యాహ్నం వండి పెట్టేవారు. ‘టేప్‌లూప్‌’ పేరుతో కంపెనీ పెట్టి ఇతర ఆదాయ మార్గాల్నీ వెతుక్కున్నాం. వాణిజ్య ప్రకటనలూ, డాక్యుమెంటరీలకూ సంగీతం అందించేవాళ్లం. మేం సంగీతం అందించిన ‘కాళిందీ కుంజ్‌’ అనే డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌కి వెళ్లింది. బాలల చిత్రోత్సవం నేపథ్యంలో తీసిన ‘శీష్‌ మహల్‌...’ ఆల్బమ్‌లో హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌ భాషల్లో పాటలతోపాటు ఒక భజన పాట పెట్టి ప్రయోగం చేశాం.

అన్నీ ప్రయోగాలే...
షార్ట్‌ఫిల్మ్స్‌ మొదలయ్యాక మాకు మరింత పని దొరికింది. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌తో పరిచయమైంది అప్పుడే. అతడితో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కి కలిసి పనిచేశాం. అలా స్నేహితులమైపోయాం.  తన టేస్ట్‌ నాకు తెలుసు. మా శైలి అతనికి తెలుసు. మేం చేసిన వాటిలో ‘సైన్మా’ షార్ట్‌ఫిల్మ్‌ గురించి చెప్పుకోవాలి. కథ, మాటలూ, పాటలూ, చిత్రీకరణ పూర్తిగా ప్రయోగాత్మకంగా చేశాం. దానికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత తరుణ్‌ సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఆగిపోయేవి. ఒకరోజు సీరియస్‌గా వచ్చి ‘సినిమా ఓకే అయింది. షూట్‌కి వెళ్లడమే ఆలస్యం’ అన్నాడు. పాత అనుభవాల దృష్ట్యా నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ, మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అదే ‘పెళ్లిచూపులు’. సైన్మా తరహాలోనే దీన్నీ ప్రయోగాత్మకంగా తీశాం. తెలుగులో ఈ మధ్య ఎవరూ చేయని ‘సింక్‌ సౌండ్‌’లో చేశాం. అంటే, షూటింగ్‌ స్పాట్‌లోనే డైలాగులు రికార్డ్‌ అవుతాయి. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే అందరూ అక్కడికక్కడే డైలాగులు చెప్పాలి. బయట నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్‌ లేకుండా చూడ్డానికే ఏడెనిమిది మంది ఉండాలి. షూటింగ్‌ స్పాట్‌ నుంచే సౌండ్‌ విభాగం పని మొదలవుతుంది. దీనివల్ల నూటికి నూరుపాళ్లు సినిమా సహజంగా ఉంటుంది. ఈ సినిమాలో పాటలన్నీ లిప్‌ సింక్‌ లేకుండా ఉంటాయి. తరుణ్‌ శైలి అది. అలా ఉండేసరికి నాకు ఫ్రీడమ్‌ బాగా వచ్చింది. ‘రాలుపూల రాగాలు...’ పాట లిప్‌ సింక్‌ ఉండుంటే వచ్చేది కాదేమో. సాహిత్యం కూడా సంప్రదాయ పద్ధతిలో ఉండాలనుకోలేదు. కొత్త అమ్మాయి శ్రేష్ఠచేత ఒక పాట రాయించాం. అది నచ్చి మరోపాట కూడా రాయించాం. నా రెండో సినిమా ‘యుద్ధం శరణం...’కి కూడా ఆమెచేత రాయించాను. నటుడు రాహుల్‌ రామకృష్ణ మాకు మంచి ఫ్రెండ్‌. అతడిచేత రెండు పాటలు రాయించాం. అలా ట్యూన్లతోపాటు సాహిత్యంలోనూ కొత్తదనం వచ్చింది. మా ప్రయోగాలకు ఆమోదం ఉంటుందో లేదోనన్న భయం ఉండేది. పాటల్ని రిలీజ్‌ చేశాక మొదట్లో స్పందన అంతంత మాత్రమే వచ్చింది. సినిమా రిలీజ్‌ అయ్యాక మాత్రం ఆ పాటలు బాగా విన్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో చేసిన సినిమా. దానికి జాతీయ అవార్డు రావడం ఇంకా హ్యాపీ.

రెండూ రెండే...
తరుణ్‌తో బాగా పనిచేయడానికి కారణం తను నాకు మంచి ఫ్రెండ్‌ కావడమే. అలాంటపుడు హార్ట్‌ పెట్టి చేస్తాం. ‘యుద్ధం శరణం’ డైరెక్టర్‌ కృష్ణ కూడా నాకు ఫ్రెండ్‌. అది కూడా మంచి ఆల్బమ్‌. దానికి మన దగ్గరకంటే చెన్నైలో మంచి స్పందన రావడం చూసి ఆశ్చర్యమేసింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణగారి నుంచి ఒకరోజు ఫోన్‌ వచ్చింది. ‘యుద్ధం శరణం’ ఆడియో ఫంక్షన్‌లో ఆయన పరిచయమయ్యారు. ‘ఈ సినిమాలో పాటలు బావున్నాయి. ప్రత్యేకించి రెండు పాటలు నాకు బాగా నచ్చాయి. మనం కలిసి పనిచేద్దాం. ఓ కథ చెబుతాను. ముందు విను, తర్వాత నీ అభిప్రాయం చెప్పు’ అన్నారు. ‘మీలాంటి డైరెక్టర్‌తో పనిచేయడంకన్నా ఏం కావాలి సర్‌’ అన్నాన్నేను. కథ విని ఓకే అనుకున్నాం. అదే ‘సమ్మోహనం’. అప్పటికి తరుణ్‌ భాస్కర్‌ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’ చేస్తున్నాను. కాస్త టైమ్‌ ఇవ్వమని అడిగాను. అందుకు ఆయన సరేనన్నారు. ఇంద్రగంటి గారికి సాహిత్యంతోపాటు సంగీతమూ బాగా తెలుసు. ‘వివేక్‌ ఇక్కడ ఫలానా రాగంలో ట్రై చేద్దాం’ అని చెప్పేవారు. సాహిత్యం గురించీ వివరంగా చెప్పేవారు. ఎలాంటి గిమ్మిక్కులూ లేకుండా సెమీ క్లాసికల్‌ తీరులో ట్యూన్లు ఇచ్చాను. దీన్లో సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రిలతోపాటు ఇంద్రగంటి గారి నాన్నగారు శ్రీకాంత్‌ శర్మ కూడా పాట రాశారు. ఆ పాట నచ్చి నేనే పాడాను. ‘ఫెయిలైనా ఫర్వాలేదు. కానీ మనసుకు అనిపించింది చేయకపోవడం తప్పు’ అని చెబుతారు ఇంద్రగంటి. అది నాకు బాగా నచ్చింది. ఆయనతో పనిచేయడం నేర్చుకోవడానికి మంచి అవకాశమని చెప్పాలి. ‘సమ్మోహనం’ పాటల్ని ఇండస్ట్రీలోనూ చాలామంది మెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత రెండు వారాలకే ‘ఈ నగరానికి ఏమైంది?’ కూడా రిలీజైంది. ఈ ఆల్బమ్‌ కూడా బాగా విన్నారు. రెండూ భిన్నమైన కథలు, వాటికిచ్చిన సంగీతం కూడా భిన్నంగా ఉంటుంది. రెంటినీ ఎంజాయ్‌ చేశాను.

ప్రస్తుతం ‘నీదీ నాదీ ఒకటే కథ’ డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయతో ఒక సినిమాకి పనిచేస్తున్నా. పాత బస్తీ నేపథ్యంలో వచ్చే మరో సినిమానీ ఒప్పుకున్నాను. ఇవి కాకుండా వెబ్‌ సిరీస్‌లకూ పనిచేస్తున్నాను. మేం సంగీతం అందించిన ‘నిరుద్యోగ నటులు’, ‘స్టోరీ డిస్కషన్స్‌’ వెబ్‌సిరీస్‌లకు మంచి స్పందన వచ్చింది. త్వరలో స్టోరీ డిస్కషన్స్‌ పార్ట్‌-2 మొదలవుతోంది.

దర్శకుడూ, సంగీత దర్శకుడూ ఒకర్నొకరు అర్థం చేసుకున్నపుడు పని వాతావరణం బావుంటుంది. మంచి సంగీతం వస్తుంది. అలాంటివారితోనే మేం పనిచేస్తాం. అది ఎంత చిన్న ప్రాజెక్టు అయినా సరే..!

పాటలే పాఠాలు...

నాన్న కరుణ సాగర్‌ ముడుంబ, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ లక్ష్మి, గృహిణి. అన్నయ్య కల్యాణ్‌. 
* ఎవరి దగ్గరా శిష్యరికం చేయలేదు. సంగీతం వింటూనే నేర్చుకునేవాణ్ని. ప్రధానంగా ఇళయరాజా పాటలే నాకు పాఠాలు. ఆయన పాట వింటున్నపుడు అందులో ఏయే పరికరాల్ని ఎలా వాయిస్తున్నారూ, ఎందుకు వాయిస్తున్నారూ; కర్ణాటక, పాశ్చాత్య సంగీతాల్ని ఎలా వాడుతున్నారూ... తదితర అంశాల్ని గమనిస్తాను. రెహమాన్‌ పాటల నుంచీ ఎన్నో విషయాల్ని నేర్చుకున్నాను.
* సినిమా మ్యూజిక్‌ అంటే అది సంగీతంలో ఒక భాగం. మేం అన్ని రకాల సంగీతాల్నీ చేయడానికి ఇష్టపడతాం. 
* చాలామందికి పాటలు, సంగీతం సంప్రదాయంగా వచ్చే వృత్తి. అలాంటివాళ్లు ఎక్కడైనా పాడుతుంటే వెంటనే వాటిని రికార్డు చేస్తాను. అందులో చరిత్ర ఉంటుంది, వేదాంతం ఉంటుంది. వీలున్నచోట సినిమాల్లో వాటిని 
పెడుతుంటాను కూడా.
* మాకు వచ్చే ఆదాయంలో 70-80 శాతం వాద్య పరికరాలూ, రికార్డింగ్‌కి అవసరమైన పరికరాలకే ఖర్చు చేస్తుంటాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.