close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెట్టుకి సెలైన్‌ పెట్టారు..!

చెట్టుకి సెలైన్‌ పెట్టారు..!

నిండు వేసవిలో ఆ చెట్టు వద్దకెళితే... ఎర్రటి ఎండకూడా లేతపచ్చగానే కాస్తుంది! దూరం నుంచి చూస్తే అదో చిట్టడవో, పచ్చటి కొంగు కప్పుకున్న కొండగుట్టో అనిపిస్తుంది. మూడెకరాలు విస్తరించిన మహావృక్షం.. కళ్లకి అలాకాకుండా ఇంకెలా కనిపిస్తుంది మరి! ఈ చెట్టుకింద ఒకేసారి వెయ్యిమంది సేదదీరొచ్చు. అలా గత ఏడొందల ఏళ్లలో ఎన్నో తరాలవాళ్లకి నీడనిచ్చి, ఎన్నో జీవాలకి ఆశ్రయంగా నిలిచి, అన్నింటికన్నా ఇక్కడి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ వచ్చిన పిల్లలమర్రి ఇప్పుడు మరణశయ్యపై ఉంది! అయితేనేం ‘ప్చ్‌.. వయసైపోయింది కదా ఏం చేస్తాం!’ అని ఊరుకోకుండా దానికి ‘అత్యవసర’ చికిత్సలు అందిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్లలో రెండు భారతదేశంలోనే ఉన్నాయి. అందులో ఒకటి కోల్‌కతా జగదీశ్‌చంద్రబోస్‌ బొటానికల్‌ గార్డెన్‌లో ఉన్న వటవృక్షమైతే.. ఇంకొకటి మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి చెట్టు. లెక్కలేనన్ని ఊడలతో(పిల్లలతో) ప్రతి ఊడా ఓ బోదెగా అనిపించేలా.. అసలు ప్రధాన బోదె ఏదో గుర్తుపట్టలేనంతగా విస్తరించింది కాబట్టే దీనికి ఆ పేరు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రానికి పదికిలోమీటర్ల దూరంలో కనిపిస్తుందీ మర్రిచెట్టు. గత పాతికేళ్లలో ఓ పర్యటక ప్రాంతంగానూ మారింది. శ్రీశైలం ప్రాజెక్టుతో మునిగిపోయిన ఓ పాతశివాలయాన్నీ ఈ ప్రాంగణంలో పెట్టారు. ఈ చుట్టుపక్కల జరిగిన తవ్వకాల్లో దొరికిన కళాఖండాలూ, ఇతర వస్తువులతో ఓ మ్యూజియం కూడా ఏర్పాటుచేశారు. వాటితోపాటూ జింకలూ, పక్షులతో కూడిన ఓ చిన్న జూ కూడా ప్రారంభించారు. కానీ కొంతకాలంగా ఈ మర్రివృక్షంలోని ప్రధానభాగం చీడల తాకిడికి డొల్లగా మారుతూ వచ్చింది. గత డిసెంబర్‌లో గాలివానకి నేలకూలింది. చెద అక్కడితో ఆగలేదు. చెట్టంతా పాకడం మొదలుపెట్టింది. దాంతో అటవీ శాఖ అధికారులు ఫిబ్రవరి నుంచి చికిత్స అందించడం మొదలుపెట్టారు. చికిత్సలో భాగంగా ఈ చెట్టుకి ‘సెలైన్‌’లు కూడా ఎక్కించారు.

 

చికిత్సా క్రమం ఇది..
ముందు దీనికి పట్టిన చెదల్ని వదిలించాలని అనుకున్నారు. అందులో భాగంగా కుళ్లిపోతున్న వేర్లని బాగు చేయడం కోసం వాటికిందున్న పాత మట్టిని తొలగించి కొత్తదాన్ని వేసి అందులో అతిశక్తిమంతమైన క్లోరోపైరిఫస్‌ పురుగులమందుని కలుపుతున్నారు. వేర్లు దాన్ని పీల్చుకుని ఆరోగ్యకరంగా మారితే చెట్టులోని ఇతర భాగాలూ బాగుపడతాయని భావించారు. ఈ పద్ధతిలో వేర్లయితే కాస్త కోలుకున్నాయికానీ వాటి ద్వారా ఔషధాలు పైకెక్కి చెట్టంతా విస్తరించలేదు. దానికి ఆలస్యం అవుతుందని భావించిన నిపుణులు ఏ కొమ్మకాకొమ్మకి వేర్వేరుగా చికిత్స ఇవ్వాలనుకున్నారు. ప్రయోగాత్మకంగా సెలైన్‌ ఎక్కించారు. ఇది మంచి ఫలితాలనిచ్చింది. కొమ్మలన్నీ మళ్లీ చిగురించడం మొదలుపెట్టాయి! నెలపాటు పురుగుమందులు వాడాక.. చెదలూ తగ్గిపోయాయి. ఇన్ఫెక్షన్‌ పోయింది కానీ... మరి మళ్లీ అవి రాకుండా చెట్టుకి శక్తి కావాలి కదా! అందుకనే ఆవు విసర్జితాలతో చేసే పంచగవ్యతో సేంద్రియ మిశ్రమాన్ని అందిస్తున్నారు. దాంతో చెట్టు పూర్తిస్థాయిలో జీవం సంతరించుకుంది. ఇవే కాదు ఊడలు గాలిలో వేలాడకుండా నేలలో నాటుకుపోయి చెట్టుకి బలం చేకూర్చేలా వాటి చుట్టూ పీవీసీ పైపులతో కంచె ఏర్పాటుచేసి అవి మట్టిలోకి దిగేలా చేస్తున్నారు. బరువైన కొమ్మలు గాలికి ఊడి కిందకు పడిపోకుండా తాత్కాలికంగా ఆర్‌సీసీ పిల్లర్లను సపోర్టుగా ఏర్పాటు చేశారు. మొత్తానికి పదుల సంఖ్యలో పిల్లలకి జన్మనిచ్చి మునిమనవళ్ల సంతానాన్నీ చూసి మరణశయ్యపైకి చేరిన ఓ వృద్ధురాలిని ఐసీయూలో పెట్టి కాపాడుకుంటున్నట్టే ఈ చెట్టుని చూసుకుంటున్నారు! తరచూ జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేలూ వచ్చి ఈ మర్రితల్లి బాగోగులూ కనుక్కొని వెళుతున్నారు!



- నర్సింగోజ్‌ మనోజ్‌ కుమార్‌
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.