close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాజులూరు.. ‘పది’లో వీరికి సాటిలేరు!

కాజులూరు.. ‘పది’లో వీరికి సాటిలేరు!

ఆ పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత శాతం... 100. 10జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య... 37. ట్రిపుల్‌ ఐటీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 35. ఈ గణాంకాలు ఏ కార్పొరేట్‌ స్కూలుకో సంబంధించినవి కావు. గ్రామీణ ప్రాంతంలోని ఓ జడ్పీ హైస్కూల్‌ సాధించిన ఘనత ఇది. దీని వెనక రాత్రీపగలూ కష్టపడి చదివే విద్యార్థులూ, వారి వెనక నిరంతరం ప్రోత్సహించే ఉపాధ్యాయులూ ఉన్నారు. ఆ పాఠశాల గురించి తెలుసుకోవాలనుకుంటే తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లాల్సిందే!

దో సర్కారు బడి... అక్కడ చదివేవారంతా కూలీలూ, సన్నకారు రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు. అయితేనేం, చదువులో తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఓవైపు ఉపాధ్యాయుల అంకితభావం, సమష్టి కృషి, చిత్తశుద్ధి; మరోవైపు తల్లిదండ్రులూ, గ్రామస్థుల ప్రోత్సాహం... ఇవన్నీ తమ బంగారు భవిష్యత్తుకేనని గ్రహించి తమలోతాము పోటీపడుతూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంపాదిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాలోని కాజులూరు జడ్పీ హైస్కూలు విద్యార్థులు. ఈ స్కూలు నుంచి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 154 మంది హాజరై వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏకంగా 37 మంది 10 జీపీఏ సాధించడం గమనార్హం. ఇంకా 18 మంది 9.8 జీపీఏ, మరో 18 మంది 9.7 జీపీఏ, మిగిలినవారు 9.6 నుంచి 8.7 జీపీఏ మధ్యలో ఉన్నారు. గత పదేళ్లుగా ఈ స్కూలు సాధించిన ఫలితాల్ని పరిశీలిస్తే ప్రతిసారీ 90 శాతానికి పైగా, అయిదు సార్లు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇక్కడి విద్యార్థులు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ఉపకారవేతనాల్నీ(ఎన్‌ఎంఎంఎస్‌) అందుకుంటున్నారు. దశాబ్ద కాలంలో ఇక్కణ్నుంచి 51 మంది ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.

పదిమీద గురి...
ఈ హైస్కూల్లో మొత్తం 25 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరిదీ ఒకటే మాట, ఒకటే బాట. ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాల్ని తు.చ. తప్పకుండా ఆచరిస్తారు. ఎవరైనా సెలవు పెడితే ఖాళీ ఉన్న ఆ తరగతికి వెళ్లడానికి మిగతావారు పోటీపడుతుంటారు. అన్ని తరగతులమీదా శ్రద్ధ చూపినా విద్యార్థి భవిష్యత్తుకి కీలకమైన పదో తరగతిమీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పదో తరగతి విద్యార్థుల్ని వారి సామర్థ్యాన్నిబట్టి మూడు విభాగాలు చేస్తారు. ఆపైన ‘ఏ’లోని వారిని ఎలా సానపట్టాలో, ‘బి’లోని వారిని ఎలా మెరుగుపర్చాలో, ‘సి’లోని వారు వెనకబడకుండా ఏం చేయాలో ప్రణాళిక వేసుకుంటారు. ప్రతి విభాగానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. వార్షిక పరీక్షలకు మూడునెలల ముందునుంచే పాఠశాలలో సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులే సొంత ఖర్చుతో స్నాక్స్‌ అందిస్తుంటారు. వీరిని చూసి గ్రామస్థులూ కొన్నిసార్లు తమవంతుగా స్నాక్స్‌ అందిస్తున్నారు.

తల్లిదండ్రులకే ఫోన్‌...
విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో ఉపాధ్యాయులు అస్సలు రాజీ పడరు. ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు టీచర్ల దగ్గర ఉంటాయి. ఎవరైనా ముందస్తు సమాచారం ఇవ్వకుండా బడి మానేస్తే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి కనుక్కుంటారు. అకారణంగా పాఠశాలకు డుమ్మా కొడితే పిల్లాడితోపాటు తల్లిదండ్రుల్నీ పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తారు. విద్యార్థుల మార్కుల వివరాల్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా ఇంటి దగ్గర కూడా విద్యార్థిని చదివించేలా తల్లిదండ్రులకు సూచనలిస్తారు. ఇదంతా చూస్తూ,  ప్రైవేటు స్కూళ్లలో పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు మనసు మార్చుకుని తమ పిల్లల్ని ఈ హైస్కూల్లో చేర్చుతున్నారు కూడా.  ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేస్తుండటం, ఉపాధ్యాయులంతా మంచి అర్హతలూ, అనుభవం ఉన్నవారు కావడంతో అన్ని ఆదాయ వర్గాలకు చెందిన పిల్లలూ ఈ స్కూల్లో చేరుతున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 200 మంది విద్యార్థులు చేరారు. వారిలో ఇదివరకు ప్రైవేటు స్కూళ్లలో చదివినవాళ్లు 50మందికిపైనే ఉన్నారు. పదేళ్ల కిందట ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 400 ఉంటే ఇప్పుడు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
ఈ ఏడాది పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులందరికీ రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు వచ్చాయి. 9.8 జీపీఏ వచ్చిన వాళ్లలోనూ కొందరికి రానున్నాయి. వీరందరూ ఇంటర్‌తోపాటు నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ విద్యనీ ఉచితంగా అభ్యసించనున్నారు. అంటే పైసా ఖర్చు లేకుండా ఉన్నత చదువులు పూర్తవుతున్నాయన్నమాట. ఈ విషయంలో ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులే కాదు కాజులూరు గ్రామం మొత్తం ఎంతో గర్వంగా ఉంది. ఉపాధ్యాయుల్నీ, విద్యార్థుల్నీ సన్మానించి ఆనందపడుతోంది.

- చీలి శ్రీను, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.