close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కృషి ఉంటే...

కృషి ఉంటే...
- జ్యోతి సుంకరణం

‘ఎలా ఉన్నారంకుల్‌...?’’ గేటు తీసుకుని లోపలికి వస్తూ పలకరించాడు ప్రభాకర్‌.
అక్కడే మొక్కలకి నీళ్ళు పోస్తున్న శ్యామలరావు తలెత్తిచూసి ‘‘ఓ... నువ్వా ప్రభాకర్‌, చాలా రోజులకి కనిపించావు. ఈ ఊరెప్పుడు వచ్చావ్‌, ఎలా ఉన్నావ్‌... అమ్మా నాన్నా ఎలా ఉన్నారు?’’ అంటూ ఆనందంగా ప్రశ్నల వర్షం కురిపించాడు.

‘‘అంతా బావున్నామంకుల్‌. ఈ ఊరొచ్చి రెండు రోజులయింది. నాన్నగారు రిటైర్‌ అయిపోయారు. అమ్మానాన్నలని నాతో తీసుకుపోదామని వచ్చాను. రఘు ఊళ్ళోనే ఉన్నట్లు తెలిసింది. తనని కూడా ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఉన్నాడా రఘు ఇంట్లో’’ అడిగాడు ప్రభాకర్‌.
‘‘ఆ ఉన్నాడు, అంతకంటే ఏం చేస్తాడు..? నీకు తెలిసే ఉంటుంది- ఉద్యోగం కూడా మానేశాడు. మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. మీలాంటి ప్రయోజకులైన స్నేహితులని చూసైనా వాడిలో మార్పు రావటంలేదు, ఏవిటో మా ఖర్మ’’ నిర్లిప్తంగా అన్నాడు శ్యామలరావు.

‘‘అదేమిటండీ, పెద్దవారు మీరే అలా నిరాశపడితే ఎలా... వాడిలో మార్పొస్తుంది, మంచి ఉద్యోగంలో సెటిల్‌ అవుతాడు. ఏదో కొద్దిరోజులు టైమ్‌ బావుండలేదంతే’’ సర్ది చెప్పబోయాడు ప్రభాకర్‌.
‘‘హు... ఇంకేం మార్పు, ఇంకేం ఉద్యోగం. లక్షలు పోసి మంచి ఇంజినీరింగ్‌ కాలేజీలో మీ అందరితోపాటూ చేర్పించాను... ఏం చేశాడు... అక్కడేదో సరిగా లేదంటూ మధ్యలో మానేశాడు. పోనీలెమ్మని వేరే డిగ్రీలో జాయిన్‌ చేస్తే దాన్ని కూడా వదిలేశాడు. సరైన చదువులేక, ఒకపక్క ఉద్యోగ వయసు దాటిపోతుంటే ఇంకేమిటి... చిన్నో చితకో ఏదో ఒక ఉద్యోగంలో నిలదొక్కుకోరా అంటే వినటం లేదు. నేనో పెద్ద శత్రువుని అయిపోయాను వాడికి. నాతో మాట్లాడటమే మానేశాడు. కాస్త నువ్వయినా చెప్పి చూద్దూ... మంచీ చెడూ’’ అన్నాడు బాధగా శ్యామలరావు.

‘‘తప్పకుండా అంకుల్‌, వాడు జాబ్‌ మానేసినట్లు తెలిసి ఆ విషయాలు మాట్లాడదామనే వచ్చాను’’ అని ప్రభాకర్‌ చెప్పడంతో-
‘‘అదిగో లోపల బెడ్‌రూమ్‌లో ఉన్నట్లున్నాడు వెళ్ళు’’ అంటూ శ్యామలరావు ఇంటిలోకి చేయి చూపించడంతో రఘు దగ్గరికి వెళ్ళాడు ప్రభాకర్‌.

*   *   *

‘‘ఒరేయ్‌, ఎక్కడ చూడు అన్యాయం, అక్రమం, అవినీతి... అయితే కుల రాజకీయాలు లేకపోతే కాకా పట్టేవాడికే అవకాశాలు... టాలెంట్‌ ఉన్న నాలాంటివాడిని ఎవరూ గుర్తించరు. అన్నిచోట్లా లొసుగులే, అంతా అవకతవకలే. ఎవరి అభివృద్ధినీ ఎవరూ చూడలేరు. అవకాశం దొరికితే వెనక్కి లాగెయ్యాలనే చూస్తారు... అదేమిటని ప్రశ్నించే నేను ఈ సమాజానికి నచ్చను. కుళ్ళి కంపు కొడుతున్న ఈ సమాజంలో నేనెందుకు పుట్టానా అని బాధనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సమాజం నుంచి పారిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ చూస్తూ అన్నీ గ్రహిస్తూ కూడా ఏమీ పట్టనట్లు మీ అందరిలాగా రాజీపడుతూ బతికెయ్యడం నావల్ల కాదు’’ అసహనంగా అన్నాడు రఘు- ‘ఏదో ఒక దాన్లో సెటిల్‌ అవ్వు’ అని సలహా ఇచ్చిన ప్రభాకర్‌తో.

‘‘అన్నిచోట్లా మంచీ చెడూ రెండూ ఉంటాయిరా. ఈ సమాజం అద్దం లాంటిది. దానివైపు నువ్వెలా చూస్తావో నీకది అలాగే కనపడుతుంది. పైగా సమాజమంటే ఎక్కడినుంచో పుట్టుకు రాలేదు. నీలాంటి నాలాంటి వాళ్ళందరం కలిస్తేనే ఏర్పడ్డదీ సమాజం. నువ్వు సమాజాన్ని ఇష్టపడితే, నిన్ను సమాజం ఇష్టపడుతుంది. ‘కుళ్ళిందీ భ్రష్టుపట్టిందీ, నేనెందుకు ఇక్కడ పుట్టానా’ అని నువ్వు అనుకున్న ఈ సమాజంలోనే అబ్దుల్‌ కలాం వంటి మహనీయులెందరో పుట్టారు. జీవితంలో అంతా మనకు నచ్చినట్లు ఉండదు. కొన్ని ఇష్టపడాలి, కొన్నిటికి కష్టపడాలి. వయసైపోయిన మీ నాన్నగారి కోసమైనా నువ్వు రాజీపడి ఏదో ఒక దానిలో నిలదొక్కుకోక తప్పదు’’ అంటూ హితవు చెప్పాడు ప్రభాకర్‌.
‘‘హు...బావుందిరా, బయట లోకంతో వేగలేక ఇంటికివస్తే నన్ను అర్థంచేసుకుని నాకు సపోర్ట్‌ ఇవ్వడం మానేసి, నన్ను మాటలతో హింసిస్తున్నాడు మా నాన్న. ఆయనకి నేను సంపాదించే డబ్బుతోనే పని, నా మనసుతో కాదు. నెలకింత తెచ్చి చేతుల్లో పోసేస్తే ‘అబ్బ... నా కొడుకెంత ప్రయోజకుడైపోయాడో’ అని మురిసిపోతాడు. అసలు బైట ఎవరిదాకో ఎందుకు... నా ఇంట్లోనే నాకు కావాల్సినట్లు లేదు. అందరి సలహాలతో విసిగిపోయాను. నువ్వు కూడా ఇవే చెపుదామని వచ్చి ఉంటే మాత్రం దయచేసి వెళ్ళిపో’’ అనేశాడు రఘు.

ఇక తను ఏం చెప్పినా వినేలాలేడని గ్రహించిన ప్రభాకర్‌ ‘‘సరేరా, ఈ మ్యాటర్‌ ఇంతటితో వదిలేద్దాం, వేరే ఏదైనా మాట్లాడుకుందాం. అన్నట్టు- మనం ఎయిత్‌, నైన్త్‌ చదువుకునేటప్పుడు శంకరం అనే అబ్బాయి ఉండేవాడు... ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్‌ వాడే వచ్చేవాడు గుర్తున్నాడా’’ వాతావరణాన్ని తేలికపరుస్తూ అడిగాడు.

‘‘ఆ... అవునవును, చాలా బాగా గుర్తున్నాడు. వాడికన్నా ఎక్కువ మార్కులు రావాలని ఎంత పోటీపడేవాళ్ళం మనం... లాభంలేకపోయేది. అంత తెలివైనవాడిని- వాళ్ళ నాన్న చదువు మానిపించి, బలవంతంగా కూలి పనులకి వేరే ఊరు పంపించేశాడుగా. అప్పుడు మన రామారావు మాస్టారితోపాటూ మనం కూడా ఎంతో బాధపడ్డాం’’ అంటూ పాత విషయాలన్నీ గుర్తుకుతెచ్చుకున్నాడు రఘు.
‘‘ఆ... ఆ... వాడే ఆమధ్య నాకు కనిపించాడు, వాడే పరిస్థితిలో ఉన్నాడో చెప్తే ఆశ్చర్యపోతావ్‌’’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ప్రభాకర్‌.

‘‘నాకు ఉద్యోగంలో ప్రమోషన్‌ రావడం, జీతం పెరగడంతో ‘రేపో మాపో పెళ్ళి కూడా చేసుకోబోతున్నావుగా, దానికన్నా ముందుగా మంచి ఇల్లు కొనుక్కుని ఓ ఇంటివాడివి కా’ అంటూ నా కొలీగ్స్‌ అందరూ సలహా ఇవ్వడంతో ఇళ్ళ వేటలో పడ్డాను. తెలిసినవాళ్ళందరినీ వాకబు చేశాను, అందరూ ఒకే పేరు చెప్పారు. ‘భద్రం కన్‌స్ట్రక్షన్స్‌’ అని. ఆ బిల్డర్‌ కట్టించిన ఇళ్ళు అయితే అన్నివిధాలా బావుంటున్నాయనీ అక్కడికే వెళ్ళమనీ అడిగిన అందరూ చెప్పడంతో ఆ బిల్డర్‌తో బాగా పరిచయమున్న నా కొలీగ్‌ని తీసుకుని వెళ్ళాను అతన్ని కలవడానికి. వర్క్‌ జరుగుతున్న ఓ బిల్డింగ్‌ దగ్గరికి వెళ్ళి, మేము కలవడానికి వచ్చినట్లుగా అక్కడే పనిచేస్తున్న ఓ కూలీ ద్వారా కబురు పెట్టించి, ఆ బిల్డర్‌ రాకకోసం ఎదురుచూస్తూ నిలుచున్నాం. ‘ఇతన్ని నమ్మొచ్చుగా, ఫర్వాలేదా?’ అంటూ చుట్టూ పరిసరాలు గమనిస్తూ అడిగాను నా కొలీగ్‌ని. ‘అయ్యో, భలేవాడివే... మనకి ఎంతలో కావాలో ఎటువంటిది కావాలో చెప్పి, కళ్ళు మూసుకుని డబ్బు అతని చేతిలో పెట్టేసి, మళ్ళీ గృహ ప్రవేశానికి రావచ్చు, నాది గ్యారంటీ’ అంటూ ఘంటాపథంగా చెప్పాడతను. అయినా నాకు మనసులో ఎక్కడో చిన్న అనుమానం... ఇంతలో ‘అదిగో, అతనే వస్తున్నాడు చూడు’ అని నా కొలీగ్‌ అనడంతో దూరంగా వస్తున్న వ్యక్తిని చూశాను. ఎక్కడో చూసినట్లనిపించాడు. ‘ఎవరా...’ అని ఆలోచనలోపడ్డాను. నన్ను చూసి నా కొలీగ్‌ ‘ఆశ్చర్యంగా ఉంది కదూ అతన్ని చూస్తే, బిల్డర్‌లూ కాంట్రాక్టర్లూ అంటే- వేళ్ళన్నిటికీ బంగారపుటుంగరాలూ చేతులకి బ్రేస్‌లెట్లూ మెడలో దుక్క లాంటి బంగారు గొలుసులూ వేసుకుని కనిపిస్తారుగా. కానీ, ఇతనలాగ కాదు, నార్మల్‌ చొక్కా, ప్యాంటుతో ఏదో ఇక్కడ జీతానికి పనిచేసే వర్కర్‌లాగా ఉంటాడు, సింపుల్‌గా’ అంటూ సరదాపడిపోతూ చెప్పాడు. ఈలోగా దగ్గరగా వచ్చిన అతన్ని చూస్తూనే గుర్తుపట్టి అప్రయత్నంగానే అనేశాను ‘శంకరం...నువ్వేనా?’ అంటూ ఆనందంగా. తను కూడా నన్ను వెంటనే గుర్తుపట్టాడు. ‘నువ్వు ప్రభాకర్‌వి కదూ’ అంటూ కౌగిలించుకున్నాడు. చాలా ఏళ్ళకి చూడటంతో ఇద్దరం ఆనందంతో తబ్బిబ్బయ్యాము కాసేపు. ఆ తర్వాత నేనొచ్చిన విషయం చెప్పడంతో, అవన్నీ తర్వాత, ముందు మనం కలవక కలవక ఇన్నాళ్ళకి కలిశాం. కాసేపు కూర్చుని అప్పటి సంగతులవీ చెప్పుకుందాం రా’ అంటూ తను కూర్చునే గదిలోకి లాక్కుపోయాడు.

మేమిద్దరం చిన్ననాటి స్నేహితులమని తెలుసుకున్న నా కొలీగ్‌ మమ్మల్ని మాట్లాడుకొమ్మని చెప్పి తను వెళ్ళిపోయాడు. ముందు నా విషయాలన్నీ విన్నాక, పేరుపేరునా అందరి గురించీ అడిగి వివరాలు తెలుసుకున్నాడు. వాడికి అన్నీ గుర్తే, మనకి కూడా గుర్తులేని సంఘటనలెన్నో చెప్పుకొచ్చాడు. ‘అవన్నీ సరేరా ముందు నీ సంగతి చెప్పు... అప్పుడు మీ నాన్న నిన్ను చదువు మాన్పించి తీసుకెళ్ళిపోయాడు కదా... ఆ తర్వాత ఇక్కడికొచ్చి చదువుకున్నావనుకుంటాను, ఇంత పెద్ద స్థాయిలో ఉన్నావు’ అన్నాను. దానికి వాడు గట్టిగా నవ్వి, ‘చదువుకున్నాను, కానీ అప్పుడు కాదు, నాకు చదువొచ్చాక ఈ స్థాయి రాలేదు, ఈ స్థాయికి వచ్చాకే చదువుకున్నాను. మా ఇంట్లో ఎవరూ చదువుకున్నవాళ్ళు లేరు. మా నాన్నకి నేను చదువుకోవడం మొదటినుంచీ ఇష్టంలేదు. నేనేమో చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలని కలలు కంటుండేవాడిని. నా మనసు కనిపెట్టిన మా అమ్మ- నాన్నతో గొడవ పెట్టుకుని నన్ను స్కూల్‌కి పంపించేది. అప్పట్లో అమ్మా నాన్నా ఇద్దరూ పొలం పనులకి వెళ్ళినా, ముగ్గురు అక్కలూ నేనూ...ఇంతమందికి, వచ్చే ఆ నాలుగు డబ్బులతో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి టైమ్‌లో ఎవరో చెప్పారు... సిటీకి వెళితే కూలి పనులుంటాయనీ డబ్బులు బాగా ఇస్తారనీ. ఇక అంతే, ఎవరు చెప్పినా వినలేదు మా నాన్న. రోజల్లా స్కూల్‌లో కూర్చుంటే ఏమొస్తుంది, అదే పనికిపోతే సాయంత్రమయ్యే సరికి చేతిలో డబ్బులు పడతాయని చెప్పి, నేను ఏడుస్తున్నా వినక సిటీలో ఒక పనిలో చేర్చేశాడు. అలవాటుపడేదాకా కొన్ని రోజులు ఏడుస్తూనే చేసేవాడిని. నాన్నా నేనూ అమ్మా ముగ్గురికీ కలిపి డబ్బులు బాగానే వచ్చేవి. పొద్దంతా పనిలోకి వెళ్ళిపోయినా, సాయంత్రం ఇంటికొచ్చి నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ... పడ్డ శ్రమంతా మర్చిపోయేవాడిని. నాన్నకి తెలియకుండానైనా ప్రైవేటుగా పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. అదిగో అప్పుడు దురదృష్టం మళ్ళీ నామీద పడగవిప్పింది. చేతిలో నాలుగు డబ్బులు ఆడగానే మా నాన్నకి తాగుడు అలవాటైపోయింది. అలా తాగి పనిలోకి వెళ్ళి పైఅంతస్తు నుంచి పడిపోయి చనిపోయాడు. అది తట్టుకోలేని మా అమ్మ అనారోగ్యంపాలై మంచాన పడింది. దాంతో మొత్తం కుటుంబ బాధ్యత నామీద పడింది. సంపాదన సరిపోక సాయంత్రాలు వెల్డింగ్‌ పనులకి వెళ్ళిపోయేవాడిని. కొద్దిరోజులు పుస్తకాలూ పరీక్షలూ ఏమీ గుర్తురాలేదు.

కేవలం పని, సంపాదన, కుటుంబాన్ని పోషించడం - ఇవి మాత్రమే నా కళ్ళముందు కనపడేవి. అయితే, ఏ పనిచెప్పినా తొందరగా, బాధ్యతగా చేస్తుండటంతో అందరూ నన్ను పనిలో పెట్టుకోవడం, మెలకువలు నేర్పిస్తుండటం చేసేవారు. అలా అలా కూలీ నుండి మేస్త్రీ స్థాయికీ, మేస్త్రీ నుండి క్రమక్రమంగా ఎదిగి ఈ స్థాయికీ వచ్చాను. అమ్మకి మంచి మందులిప్పించి జబ్బుని నయం చేయించగలిగాను. అక్కలందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాను. అన్నీ అయ్యాక ఇదిగో... ఈమధ్యనే ప్రైవేటుగా బి.ఏ. రాసి ఆపై ఎం.ఏ. చేసి నేను కూడా చదువుకున్నవాడిని అయ్యాను’ అంటూ చెప్పాడు.

‘శభాష్‌ రా... ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ నీకనుకూలంగా మార్చుకుని, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లు ఇంత అభివృద్ధిలోకి వచ్చావ్‌. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ఒక్క మార్కు తగ్గిందనో ఆవేశపడి ఆత్మహత్యలు చేసేసుకుంటున్న నేటితరం పిల్లలకి నీ జీవితం ఒక పాఠం కావాలి. రియల్లీ హ్యాట్సాఫ్‌ టు యు’ అంటూ వాడి రెండుచేతులూ పట్టుకుని ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను. వాడుమాత్రం ‘ఊరుకోరా... నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్‌’ అంటూ అక్కడే టేబుల్‌మీద ఉన్న వాడి కన్‌స్ట్రక్షన్స్‌ బ్రోచర్‌ ఒకటి తీసి ఇచ్చి నా చేతిలోపెట్టి ‘ఇదిగో ఇది మా నాన్న పేరుమీదే పెట్టాను. ఆయన పేరు భద్రం’ అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ‘హోరినీ, ఇంత అన్యాయం చేశాడు కదా మీ నాన్న, ఆయన మీద నీకు కోపంలేదా, ఆయన పేరే నీ బిజినెస్‌కి పెట్టుకున్నావు?’ అనేశాను. దానికి వాడు నవ్వుతూ ‘మా నాన్న నాకు కావాలని అన్యాయం ఏమీ చెయ్యలేదురా. తన ఆలోచనకి తగ్గట్టు ప్రవర్తించాడంతే. పైగా, దానివలన నాకు మంచే జరిగింది కానీ చెడు కాదు. నిజంగా మీ అందరితోపాటు చదువుకుని ఉంటే నా జీవితం ఎలాగుండేదో నాకు తెలియదు కానీ... ఇప్పుడు మాత్రం నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. అంతేకాదు, నా దగ్గర పనిచేసే కూలీల పిల్లలందరినీ నేనే చదివిస్తున్నాను. ఇక, నా భార్య- బాగా చదువుకుంది, చాలా ఆదర్శభావాలు కలిగినది. స్లమ్‌ ఏరియాలోని పిల్లలకి తనే స్వయంగా వెళ్ళి పాఠాలు చెప్పి వస్తూ ఉంటుంది’ అని చెప్పాడు. ఆ మాటలకీ వాడి సానుకూల దృక్పథానికీ నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఆరోజు నుంచీ వాడంత కాకపోయినా కొంచెమైనా విశాల దృక్పథంతో ఉండాలని నిర్ణయించుకున్నాను. నా కొత్త ఇంటి బాధ్యతను పూర్తిగా వాడిమీదే వదిలేసి, వాడి దగ్గర సెలవు తీసుకున్నాను.

ఇప్పుడు చెప్పరా రఘూ...శంకరం కథ అంతా విన్నాక నీకేమనిపించింది...ప్రకాశించే సూర్యకాంతికి ఒక దారి మూసుకుపోతే వంద దారులగుండా అది ప్రసరించేస్తుంది అనిపించటంలేదా? ఎవరూ ఎవరి టాలెంట్‌నీ ఆపలేరు. అలా అనుకుని ఎదుటివారి మీద తప్పు తోసెయ్యడం మూర్ఖత్వమే. నీ ఆలోచనా ధోరణికీ వాడి ఆలోచనా ధోరణికీ ఎంత తేడా ఉందో చూశావా... మీ నాన్న నీకు లక్షలు డొనేషన్‌ కట్టి ఇంజినీరింగ్‌లో జాయిన్‌ చేస్తే కూడా దానిలో ఏదో చెడుని వెతికి మధ్యలో వచ్చేశావ్‌. అదే శంకరంవాళ్ళ నాన్న మంచి మార్కులతో పాస్‌ అయ్యేవాడిని చదువు మానిపించి కూలిపనిలో పెడితే, దానిలో కూడా మంచినే వెతుక్కుని వాడు అభివృద్ధిలోకి వచ్చాడు. మీరిద్దరూ కూడా ఇదే సమాజంలోంచి వచ్చినవాళ్ళే. ఏవిటీ సమాజం ఇలా ఉందీ అని అస్తమానూ తిట్టుకుంటూ ఏ పనీ చేయకుండా, ఎందులోనూ అడ్జెస్ట్‌ అవకుండా, నీకు నువ్వూ ఉపయోగపడక, నీవారికీ ఉపయోగపడకపోవడం పలాయనవాదం అనిపించుకుంటుందే తప్ప మరోటీ మరోటీ కాదు. అంతా ఇలా ఉన్నారూ అలా ఉన్నారనుకునేకన్నా... ఎలా ఉంటే బావుంటుందో ఏం చేస్తే సమాజం బాగుపడుతుందో అది చేసి చూపించు. ‘ఈ సమాజం నాకేమిచ్చిందీ అనుకునేముందు నేనీ సమాజానికి ఏమిచ్చానూ’ అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. కుళ్ళి పాడైపోతోందీ అని నువ్వంటున్న ఈ సమాజాన్ని బాగు చెయ్యడానికి నీలోని ఆవేశాన్ని ఉపయోగించుకో. నీకు నచ్చే, నిన్ను మెచ్చే ఒక ఆరోగ్యకరమైన, అందమైన సమాజ శిల్పాన్ని నీ చేతులతో నువ్వే చెక్కి మంచి శిల్పివికా. చూశావుగా శంకరాన్ని... సమస్యల్ని తిట్టుకుంటూ కూర్చోకుండా కష్టపడి ప్రయోజకుడయ్యాడు. తనూ తన కుటుంబం అని మాత్రమే అనుకోకుండా, పదిమంది పేద పిల్లల్ని కూడా చదివిస్తున్నాడు. మనకి తెలిసింది వీడి గురించి మాత్రమే. ఇలా మనం ఆదర్శంగా తీసుకోవాల్సినవాళ్ళూ చేతులెత్తి మొక్కాల్సినవాళ్ళూ మన చుట్టూ ఇంకెందరో. మనం వాళ్ళనే చూద్దాం, వాళ్ళ బాటలోనే నడుద్దాం. కాదూ... నేను అందరిలో చెడునే చూస్తానూ, అందరినీ తిట్టుకుంటూ ఓ మూలన కూర్చుంటానూ- అంటే నీ ఇష్టం. స్నేహితుడివి కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాను’’ అనేసి, ఇంటికి వెళ్ళడానికి లేచాడు ప్రభాకర్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.