close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పెద్దపులినెక్కి రావమ్మా..!

పెద్దపులినెక్కి రావమ్మా..!

ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లోనూ ప్రకృతి ఆరాధన ఓ భాగం. భారతీయ సంప్రదాయంలో ఆ ప్రకృతినే జగన్మాతగా శక్తిస్వరూపిణిగా కొలుస్తారు, ఉత్సవాలు నిర్వహిస్తారు. రుతువులు మారుతున్న వేళ వరుణుడు కరుణించి పుడమిని తాకుతున్న వేళ ఆయురారోగ్యాలు ప్రసాదించమని జరిపే వేడుకే బోనం. శివసత్తుల పూనకాలూ,  పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా జరిగే ఈ సంబరాల్లో ఉజ్జయినీ మహంకాళి బోనాలు విశిష్టమైనవి.

గన్మాత ఉజ్జయినీ మహంకాళి ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తుందనీ ఈ సందర్భంగా ఇక్కడి వారి బాగోగులు చూసుకుంటుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసంలోని తొలి ఆదివారం నుంచీ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ బోనాలతో నగరమంతా నెలరోజులపాటు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. వీటిలో ఉజ్జయినీ మహంకాళీ బోనాలకు ఓ ప్రత్యేకత ఉంది. స్థలపురాణం ప్రకారం... 1813వ సంవత్సరంలో సికింద్రాబాద్‌కు చెందిన సురిటి అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మిలిటరీ టవర్‌లో పనిచేస్తున్న సమయంలో - స్థానికంగా కలరా వ్యాధి ప్రబలింది. దీంతో వందల మంది మృత్యువాతపడ్డారట. అప్పుడాయన అక్కడి అమ్మవారిని దర్శించి వ్యాధి నుంచి కాపాడమనీ, అదే జరిగితే సికింద్రాబాద్‌లోనే విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తాననీ మొక్కుకున్నాడు. అన్నట్లుగానే అప్పయ్య తిరిగి వచ్చాక 1815లో చెక్కలతో తయారుచేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అని
నామకరణం చేశాడు. పూర్వం ఇక్కడ ఉన్న పెద్ద బావికి మరమ్మతులు చేస్తుండగా మాణిక్యాలమ్మ విగ్రహం దొరికిందట. ఆ విగ్రహాన్ని మహంకాళి అమ్మవారి పక్కనే ప్రతిష్ఠించారు. సురిటి అప్పయ్య 1864లో కట్టె విగ్రహం స్థానంలో అమ్మవార్ల ప్రతిమలను ఏర్పాటుచేశారు. 1953లో దేవాదాయ ధర్మాదాయశాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది.

ఉత్సవం ఇలా...
బోనాల పండగకు పదిహేను రోజుల ముందు అమ్మవారికి ఎదురెళ్లి పుట్టింటికి తీసుకొచ్చే ఎదుర్కోళ్లతో ఈ వేడుక ప్రారంభమవుతుంది. దీన్నే ఘటోత్సవం అంటారు. బోనాల ముందురోజు వరకూ అమ్మవారు ఘటంమీద అన్ని వీధులూ ఊరేగుతుంది. బోనాల సమర్పణ ఈ జాతరలో జరిగే ముఖ్య ఘట్టం. మహంకాళికి భక్తితో సమర్పించే అన్నమే బోనం. ఎవరికివారు ఏయే రకంగా వండి నైవేద్యం పెడతామని మొక్కుకున్నారో ఆ విధంగా వీటిని తయారుచేస్తారు. వాటన్నింటినీ ఓ పాత్రలో పెట్టి, దానిమీద దీపం ఉంచి, తలమీద పెట్టుకుని ఆలయానికి తీసుకువచ్చి మొక్కు తీర్చుకుంటారు. బోనంతోపాటు కొందరు సాక సమర్పిస్తారు. సాక అంటే చెట్టు కొమ్మ. పసుపు నీరు నింపిన కుండలో వేపకొమ్మను ఉంచి ఆలయానికి తీసుకువచ్చి మాతాంగేశ్వరికి అర్పిస్తారు. బోనాల రోజున అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇంట్లో తయారుచేసి వాటన్నింటినీ ఒక బండిలో పెట్టుకుని ఊరేగింపుగా తీసుకొచ్చిన ఆహారంలోని కొంత భాగాన్ని అమ్మవారికి సమర్పించి, మిగిలింది ఇంటికి తీసుకువెళ్లి దాన్నే మహాప్రసాదంగా అందరూ పంచుకుని తింటారు. ఒళ్లంతా పసుపురాసుకుని, కాళ్లకు గజ్జెలుకట్టి చేతిలోని పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ తప్పెట వాద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఊరేగే పోతురాజులు ఈ వేడుకల్లో మరో ప్రత్యేక ఆకర్షణ. బోనాలు జరిగిన మరుసటి రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ముఖ మండపంలోని మాతాంగేశ్వరీ దేవాలయంలో ఓ మహిళ కుండమీద నిలబడి భవిష్యత్తును చెబుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుమీద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి మంగళవాయిద్యాలతో ఊరేగిస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా
మెట్టుగూడ ప్రాంతానికి ఘటంలో పోతురాజుల సహితంగా సాగనంపు సేవ జరుగుతుంది. ఈ ఘటంతో బోనాలు ముగుస్తాయి. అమ్మ అనుగ్రహం పొందిన ఆనందంతో భక్తులందరూ ఇళ్లకు చేరుకుంటారు.

- సుంకరి అరుణ్‌కుమార్‌, న్యూస్‌టుడే, బన్సీలాల్‌పేట్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.