close
హైదరాబాద్‌లోనే చదువుతున్నా!

హైదరాబాద్‌లోనే చదువుతున్నా!

సాధారణంగా టీనేజ్‌ అమ్మాయిలేం చేస్తారు... చదువుకుంటారు, కెరీర్‌ ఎలా నిర్మించుకోవాలో ప్రణాళికలు వేసుకుంటారు, విరామం దొరికితే సినిమాలు చూస్తారు. కానీ మాళవిక నాయర్‌ మాత్రం ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క నటిగా కెరీర్‌ నిర్మించుకుంటోంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో ఆకట్టుకున్న మాళవిక... ఇటీవల విడుదలైన ‘విజేత’ చిత్రంతోనూ మంచి మార్కుల్ని అందుకుంది. ఈ మలయాళీ మనసులోని మాటలివి...

నేను ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ టైపు. ఏ విషయంలోనైనా సరే కచ్చితంగా ఉంటా. ఈ అలవాటు చిన్నప్పటి నుంచీ ఉంది. పుట్టిన వాతావరణం, పెరిగిన పరిస్థితులు అలాంటివి. నాన్న (శశి నాయర్‌) దగ్గర నాకెప్పుడూ కావల్సినంత స్వేచ్ఛ ఉండేది. ఏదైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఏం చేసినా ‘పర్‌ఫెక్ట్‌గా ఉండాలి’ అంటారాయన. అదే నాకూ అలవాటైంది. అమ్మ బిందు మాత్రం చాలా కఠినంగా ఉండేది. అందుకే నాన్న దగ్గర చేసినంత అల్లరి, ఆయనతో ఉన్న చనువు అమ్మ దగ్గర ఉండేది కాదు.
నేను దిల్లీలో పుట్టా. ఆరో తగగతి వరకూ అక్కడే చదువుకున్నా. నాన్న ఇంటీరియర్‌ డిజైనర్‌. ఆయన ఉద్యోగరీత్యా కేరళ వచ్చాం. మా బంధువులంతా కేరళలోనే ఉండేవారు. కొన్నాళ్ల తరవాత కేరళ వదిలి మళ్లీ దిల్లీ వచ్చేశాం. అటూ ఇటూ తిరగడం వల్ల ఎక్కువమంది స్నేహితుల్ని సంపాదించుకోలేకపోయా. ఎక్కడున్నా చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఓ విధంగా చెప్పాలంటే నాకు చదువంటే ప్రాణం. ఆటలంటే ఇష్టం. ఈ రెండూ ఉంటాయి కాబట్టి స్కూల్‌ మానేది తక్కువే. సాధారణంగా చివరి గంటలో డ్రిల్‌ పీరియడ్‌ ఉండేది. దాని కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసేదాన్ని. ఆటలాడి... అలసిపోయి ఇంటికెళ్తే అమ్మ చల్లటి నిమ్మకాయ నీళ్లు ఇచ్చేది. ఆ రుచి ఇప్పటికీ గుర్తుంది. సైన్స్‌లో ఎప్పుడూ మంచి మార్కులు వస్తుండేవి. సైన్స్‌కి సంబంధించిన ఆర్టికల్స్‌, పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. ఆ ప్రభావంతో విశ్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, ఆస్ట్రోనాట్‌ అవ్వాలనుకునేదాన్ని. పదో తరగతిలో ఉన్నప్పుడే ‘బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ పుస్తకాన్ని చదివేశాను. అయితే అప్పట్లో ఆ పుస్తకం ఏమీ అర్థం కాలేదు. కాస్త వయసు, అవగాహన వచ్చాకే అందులోని విషయాలు తెలిశాయి.

అంతా నాన్న వల్లే!
‘బాగుంది... బాగా చేశావ్‌...’ ఇలాంటి ప్రశంసలు నాన్న నుంచి వినాలని చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాను. ఏంటో, నేనేం చేసినా.. ఆయన్నుంచి పొగడ్తలు వచ్చేవి కావు. ‘చదువు ఒక్కటే కాదు... మిగిలిన వాటిల్లోనూ ప్రతిభ చూపించాలి’ అనేవారు. ఆయన కోసమే నాట్యం నేర్చుకున్నా. పెయింటింగ్‌ వేయడంలో తర్ఫీదు పొందా. స్కూలు అవ్వగానే ఇలా కోచింగు క్లాసుల చుట్టూ తిరగడం నాకెందుకో ఇబ్బందిగా అనిపించేది. ‘ఇదంతా అవసరమా?’ అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ... సినిమాల్లోకి వచ్చిన తరవాత వాటి విలువ తెలిసింది. నాన్నకు నటుడవ్వాలని కోరిక ఉండేది. అది తీరలేదు. కనీసం నన్ను కెమెరా ముందు నిలబెట్టి... ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నారు. ఆయనవల్లే, సినిమాల్లోకి రాగలిగాను. చిన్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. నా హుషారు చూసి కిడ్స్‌ మోడల్‌గా ఫొటోలు తీయించారు. కొన్ని వ్యాపార ప్రకటనల్లో నా ఫొటోలు వచ్చాయి కూడా. అవి చూసి కొందరు మలయాళ దర్శకులు బాలనటిగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. డైలాగులు పెద్దగా ఉండేవి కావు. అసలు ఎలా నటించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. నా జీవితంలో మేలిమి మలుపు తమిళంలో చేసిన ‘కుకూ’. అప్పటికి నా వయసు పద్నాలుగేళ్లు. అందులో అంధురాలిగా నటించా. ఆ సినిమా కోసం ఎలాంటి హోం వర్క్‌ చేయలేదు. దర్శకుడు ఏం చెబితే అది చేశా. అదో బ్లాక్‌బస్టర్‌ హిట్‌. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ‘ఏమాత్రం కష్టపడకపోయినా ఇంత గుర్తింపు వచ్చిందేంటి’ అని చాలా ఆశ్చర్యపోయాను. నాన్న కూడా ‘బాగా చేశావ్‌... శభాష్‌’ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మాటలవి. చదువులతో సాధించలేనిది సినిమాలతో సాధించా. అందుకే ‘సినిమా’ నాకు మరింత నచ్చింది.
తెలుగులో నా మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. నా ఫొటోలెక్కడో చూసిన నాగ అశ్విన్‌ నా నంబర్‌ కనుక్కుని ఫోన్‌ చేశారు. ఆ సినిమా స్క్రిప్టు మొత్తం మెయిల్‌ చేశారు. నాన్నకీ బాగా నచ్చింది. ‘నువ్వు చెయ్‌’ అన్నారు. ఆ సినిమా చేయకపోతే నిజానికి చాలా కోల్పోయేదాన్ని. ఎక్కడో హిమాలయాల్లో గజగజ వణికే చలిలో చిత్రీకరణ జరిపారు. సదుపాయాలు కూడా ఎక్కువగా ఉండేవి కావు. చాలా విషయాల్లో సర్దుకోవాల్సివచ్చేది. చలి తట్టుకోవడానికి స్లీపింగ్‌ బ్యాగ్స్‌ ఇచ్చేవారు. తెల్లారుఝామున మూడింటికి... ఆ బ్యాగులు కూడా గడ్డకట్టుకుపోయేవి. చాలా రోజులు ఇంటికి దూరంగా గడపాల్సివచ్చింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని షూటింగ్‌ పూర్తి చేశాం. కానీ ఒక్కరోజు కూడా బాధపడింది లేదు. ఎందుకంటే... సెట్లో అందరి మధ్య అంతటి అనుబంధం ఉండేది.  రోజుకో కొత్త అనుభవం, కొత్త పాఠంలా అనిపించేది. ఆ సినిమా హిట్‌ అవడంతో నాకూ గుర్తింపు వచ్చింది. అంతకు ముందు సినిమాలంటే ఎక్కడో ఓ మూల కాస్త నిరాసక్తత ఉండేది. కానీ ‘ఎవడే..’ పూర్తయ్యాక.. ‘నేను ఈ పరిశ్రమలో ఉండాల్సిందే’ అని బలంగా అనిపించింది.

జాగ్రత్తగా చూసేవారు
ఓరోజు దర్శకురాలు నందినిరెడ్డి గారి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఓ కథ ఉంది వింటావా’ అన్నారు. ‘సరే’ అన్నాను. ఫోన్లోనే స్క్రిప్టు మొత్తం చెప్పేశారు. నాకు నచ్చింది కానీ ‘చేయలేను’ అనేశాను. ఎందుకంటే అప్పటికి ప్లస్‌టూలో అడుగు పెట్టాను. షూటింగులని తిరిగితే చదువేమైపోతుందోనని భయం వేసింది. అందుకే ‘చేయను’ అని చెప్పేశా. కానీ ఎందుకో... తర్వాత కూడా ఆమె చెప్పిన కథ, పాత్ర పదే పదే గుర్తొచ్చి ‘ఈ సినిమా ఎందుకు చేయకూడదు’ అనిపించింది. వెంటనే ఫోన్‌చేసి.. ‘నేను చేస్తా’ అని చెప్పేశా. నాన్న అనుమతి లేకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం అది. అలా... తెలుగులో నా రెండో సినిమా ‘కల్యాణ వైభోగమే’ అవకాశం వచ్చింది. సెట్లో అందరికంటే చిన్నదాన్ని నేనే. అందుకే నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. నా వయసు పందొమ్మిదేళ్లే. కానీ చూడ్డానికి పాతికేళ్ల అమ్మాయిలా కనిపించేదాన్ని. అదే ఓ విధంగా నా ప్లస్‌ పాయింట్‌ అనుకుంటా. ఆ సినిమాలో పెళ్లి కూతురిలా నన్ను చూసి మా టీచర్లు నమ్మలేకపోయారు.  ఓ వైపు షూటింగ్‌, మరోవైపు చదువు. ఆ ఆర్నెల్లూ చాలా బిజీ బిజీగా గడిచిపోయింది. ‘సినిమాల్లో పడి చదువులో డల్‌ అయ్యావు’ అని నా టీచర్లంతా అంటారేమోనని భయం. అందుకే షూటింగ్‌ తర్వాత సాయంత్రం ట్యూషన్లకు వెళ్లేదాన్ని. ‘కల్యాణ వైభోగమే’ కూడా నటిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరవాత తెలుగులో అవకాశాలు చాలా వచ్చాయి. కానీ చెప్పాను కదా... నాకు చదువంటే ఎంతిష్టమో. అందుకే ‘ఇలాంటి పాత్రలే చేయాలి’ అని కొన్ని పరిమితులు పెట్టుకుని చేద్దామనుకున్నాను. సినిమాలకి వీలుగా ఉంటుందని ప్లస్‌టూ తర్వాత హైదరాబాద్‌ వచ్చేశా. ఇక్కడి సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నాను. నచ్చిన కథ దొరికితే సినిమా చేస్తాను. లేకుంటే చదువులో బిజీ. ‘విజేత’, ‘టాక్సీవాలా’లలో అలాంటి పాత్రలు దక్కాయి. వీటి మధ్య రెండు తమిళ చిత్రాల్లోనూ నటించా. ‘విజేత’లో చాలా వరకూ నేను స్కూటీ మీద తిరుగుతూ ఉంటాను. నిజానికి నాకు స్కూటీ నడపడం పూర్తిగా రాదు. ఈ సినిమాకోసమే నేర్చుకున్నాను. షూటింగ్‌లో రెండు సార్లు పడ్డాను కూడా. అయినా ఇంకా పూర్తిగా రాలేదు. కల్యాణ్‌దేవ్‌ చాలా సింపుల్‌గా ఉంటాడు. వర్క్‌ విషయంలో రాజీ పడడు. లైట్‌ తీసుకుని చేద్దామన్న సందర్భమేలేదు. ప్రతీదీ పూర్తిగా హార్ట్‌ పెట్టి చేశాడు.
డ్యూయెట్లూ, రొమాన్స్‌లకు నేనేం వ్యతిరేకం కాదు కానీ, ఆయా  సన్నివేశాలవల్ల కథకు ఉపయోగం ఏమిటి అనేదే ఆలోచిస్తా. సరైన సమాధానం దొరికితే ‘ఓకే’. లేదంటే... ‘నో’ చెప్పేస్తా. నటిగా కొత్త లక్ష్యాలేం లేవు. సినిమా సినిమాకీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్లడమే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... నావల్ల ఇంట్లోవాళ్లకు చెడ్డపేరు రాకూడదు.

ఇంకొంత

నాకు తెలుగు అర్థమవుతుంది. ‘కల్యాణ వైభోగమే’లో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా కూడా. ‘విజేత’కు మాత్రం కుదర్లేదు. భవిష్యత్తులో మాత్రం డబ్బింగ్‌ చెప్పే అవకాశం మరొకరికి ఇవ్వను.
* స్విమ్మింగ్‌ అంటే ఇష్టం. కాలేజీ తరఫున కొన్ని పోటీల్లోనూ పాల్గొన్నా. మంచి పెయింటర్‌ని. త్వరలో నా పెయింటింగ్‌లతో ఒక ఎగ్జిబిషన్‌ పెడతాను. పుస్తకాలు బాగా చదువుతా. ఈమధ్య చదివిన పుస్తకం 
‘మై నేమ్‌ ఈజ్‌ రెడ్‌’. 
* నమ్మరుగానీ సినిమాలు అస్సలు చూడను. ఇప్పుడు కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటున్నా. ‘మహానటి’ బాగా నచ్చింది. అందులో ఓ పాత్ర కూడా చేశా. అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌.
* మా అమ్మ చేతి వంటంటే చాలా ఇష్టం. బయట కొత్త కొత్త వంటకాలు టేస్ట్‌ చేస్తుంటా. ఆమధ్య చార్మినార్‌ వెళ్లా. అక్కడి ఫుడ్‌ని రుచి చూశా. చాలా బాగా నచ్చింది. నాకు వంట పెద్దగా రాదు. పప్పు మాత్రం వండుతా. 
*  ఇంటర్‌ చదివేటప్పుడు ఓ అబ్బాయిని ప్రేమించా. కానీ నాది వన్‌ సైడ్‌ లవ్‌. దాన్ని ప్రేమ అనేకంటే ఆకర్షణ అనడం సమంజసమేమో. నా మనసులోని మాట తనకు చెప్పలేదు. ఇప్పుడదంతా తలచుకుంటే సిల్లీగా అనిపిస్తుంది.
* ఏ విషయం గురించైనా అతిగా ఆలోచిస్తా. ఓ విషయం మనసులో నాటుకుపోయిందంటే ఎప్పటికీ పోదు. కానీ, ఎంత ఒత్తిడి ఉంటే అంత బాగా పనిచేస్తా. ఓ నిర్ణయం తీసుకుంటే కష్టమైనా, నష్టమైనా దానికి కట్టుబడి ఉంటా
* కురియన్‌, నవీన్‌ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. కాలేజీ స్నేహితులంతా నన్ను నాలానే చూస్తారు. మిగిలినవాళ్లు సెలబ్రిటీగా భావిస్తుంటారు. కాలేజీలో అడుగుపెట్టగానే సెల్ఫీలూ, ఆటోగ్రాఫులూ అడుగుతుంటే... చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటుంది.
* మలయాళ నటి పార్వతీ మేనన్‌ అభిమానిని. ఆమె ఏ పాత్ర చేసినా... చాలా హోం వర్క్‌ చేస్తుంటారు. 
* ఇంట్లో టామ్‌ బాయ్‌లా ఉంటాను. ప్యాంటూ, చొక్కా వేసుకోవడం అంటే ఇష్టం. నాకో తమ్ముడు ఉన్నాడు. వాడు  బాగా అల్లరి చేస్తాడు. పాడతాడు కూడా.
* సినిమా పరిశ్రమలోనే కాదు, సమాజంలో అంతటా మగాళ్ల ఆధిపత్యం ఉంది. వాళ్లతో పోటీ పడాలంటే, మనకంటూ గుర్తింపు రావాలంటే వాళ్లకంటే ఎక్కువ కష్టపడాలి. సినిమాల్లో నటించే చాలామంది మహిళలకు వాళ్ల ప్రతిభకు తగిన గుర్తింపు రావడం లేదనిపిస్తోంది.

- మహమ్మద్‌ అన్వర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.