close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సేవకు ఐఏ‘ఎస్‌’!

సేవకు ఐఏ‘ఎస్‌’!

ఊరికి బస్సు రావడం లేదు... కలెక్టరుకు ఓ వినతిపత్రం ఇద్దాం. బడిలో టీచర్లు లేరు... కలెక్టరుకు లేఖ రాద్దాం. ఆస్పత్రిలో వైద్యుల్ని నియమించలేదు... కలెక్టరుకి అర్జీ పెట్టుకుందాం. పల్లె నుంచి పట్టణం దాకా సమస్య ఏదైనా, జిల్లా పాలనాధికారి దృష్టికి వెళ్తే కానీ పరిష్కారం కాదు. అదీ ఆ పదవి గొప్పదనం. అందుకే పట్టుబట్టి ఆ హోదా కోసం కష్టపడి చదివారు. బాధ్యత తమకు ఎలాగూ తెలుసు, దానికి అధికారం తోడైతే సమాజాన్ని మార్చవచ్చనీ, ప్రజల బతుకుల్ని బాగుచేయవచ్చనీ భావించారు. అలా ఐఏఎస్‌కి ఎంపికై... ప్రజలతో మమేకమై... అధికారులుగా రాణిస్తున్న కొందరి స్ఫూర్తిగాథలివి!

ఆ ఆలోచన వెనక ఓ తెలుగువాడు!

ముఖ్యమంత్రితో అధికారుల సమావేశం జరుగుతోంది. ‘రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోతోంది. పరిస్థితిని మార్చేందుకు వెంటనే ఏమన్నా చేయాలి...’ అన్నారు ముఖ్యమంత్రి. స్వచ్ఛందంగా ఆ బాధ్యతను అందుకున్నారు ఐసీడీఎస్‌ అధికారి నరహరి. దిగితే కానీ లోతు తెలియదన్నట్లు బాధ్యత తీసుకున్నాకే సమాజంలో ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలిసింది ఆయనకు. కట్నం మహమ్మారికి భయపడి ఎంతోమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను వీలైతే కడుపులో ఉండగానే, లేదంటే పురిట్లోనే చంపేస్తున్నారని తెలిసి కడుపు తరుక్కుపోయింది ఆ యువ అధికారికి. ఆ విషయం గురించి సామాజికవేత్తలతో, నిపుణులతో చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఏమన్నా పథకాలున్నాయేమోనని వాకబుచేశారు. ఎక్కడా ఏమీ కన్పించలేదు. దాంతో తానే పూనుకుని ఓ పథకాన్ని రూపొందించారు. తల్లిదండ్రులు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందనుకోవాలంటే- పాపతో పాటు డబ్బు రావాలి. పాప పుట్టగానే ప్రభుత్వమే కొంత మొత్తం బ్యాంకులో జమ చేస్తే అది ఆమె పెళ్లినాటికి పెద్ద మొత్తం అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులకు అమ్మాయి భారం అన్పించదు. ఆ ఆలోచనే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ అయింది. 2007 నుంచి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకాన్నే కొద్దిపాటి మార్పులతో కేంద్రప్రభుత్వమూ, సగానికి పైగా రాష్ట్రాలూ అమలుచేస్తున్నాయి. అంతటితో ఆగలేదు నరహరి. భ్రూణహత్యల్ని నివారించడానికి యాక్టివ్‌ ట్రాకర్‌ డివైస్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎక్కడైనా లింగనిర్ధారణ పరీక్షలు జరిగితే వెంటనే తెలిసిపోయేది. ఆ ల్యాబొరేటరీలపై చర్యలు తీసుకునేవారు. ఈ రెండు చర్యల ఫలితంగా బాలికల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. అదొక్కటే కాదు, మధ్యప్రదేశ్‌ క్యాడర్‌లో ఉన్న తెలుగు యువకుడు నరహరి ఎక్కడ పనిచేసినా పాలనపై తనదైన ముద్ర వేశారు. నగరాల్లో దివ్యాంగులూ వృద్ధులూ గర్భిణులూ ఇతరుల సహాయం అక్కర్లేకుండా తిరిగేందుకు వీలుగా ఆస్పత్రులూ, బస్టాండ్లూ, ప్రభుత్వ కార్యాలయాలూ లాంటి చోట్ల ర్యాంపులూ రెయిలింగ్‌లూ నిర్మించాలని ఓ చట్టం ఉంది. దాన్నెవరూ పట్టించుకోరు. కానీ ప్రజల సౌకర్యానికి పెద్ద పీట వేయాలని భావించే నరహరి దాన్ని కచ్చితంగా అమలు చేసి ఒక్క ఏడాదిలోనే గ్వాలియర్‌ని సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దారు. ‘సత్యమేవజయతే’ టీవీ కార్యక్రమం ఆ విషయాన్ని ప్రసారం చేసి ఆయనను ఎంతగానో ప్రశంసించింది. ఇండోర్‌ కలెక్టరుగా ఉన్నప్పుడు ఆ నగరాన్ని కూడా గ్వాలియర్‌లాగా సౌకర్యవంతమైన నగరంగా చేయడమే కాక, స్వచ్ఛనగరంగా కూడా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వ బహుమతి అందుకున్నారు నరహరి. 90 శాతానికి పైగా రైతుల చేత పంటబీమా చేయించారు. ఒకే రోజు లక్షా 33వేల మొక్కలు నాటి గ్వాలియర్‌ని రికార్డుల్లోకి ఎక్కించిందీ ఆయనే. ఇక విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే పాఠాలు చెప్పడమంటే నరహరికి చాలా ఇష్టం. ‘ఎవరైనా తమ సమస్యలు చెబుతుంటే నాకు గతం గుర్తొస్తుంది. నిరుపేదనైన నేను కలెక్టరు కుర్చీదాకా వచ్చింది సమస్యల్ని పరిష్కరించడానికే కదా అన్పిస్తుంది. మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అదే నాకు స్ఫూర్తి...’ అంటారు నరహరి. 

ఆమె... అపరాజిత

తెల్లవారు జామున నాలుగు గంటల వేళ... నది ఒడ్డున ఇసుక నింపిన 150 లారీలు... మరో పది నిమిషాలైతే అన్నీ తలా ఓ పక్కకీ వెళ్లిపోయేవే! ఇంతలో అపరకాళికలాగా విరుచుకుపడింది సబ్‌డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ విజయా జాదవ్‌. ఆమె వెంట వచ్చిన పోలీసులు లారీలను చుట్టుముట్టి డ్రైవర్లందరినీ అరెస్టు చేశారు. ఆ మర్నాడు రాత్రి పది గంటల వేళ... వైన్‌ షాపుల చుట్టుపక్కల ఇళ్లన్నీ సోదా చేస్తూ ఆమే! అధికారుల దాడి సంగతి తెలిసి ఎవరో కరెంటు తీసేశారు. చీకట్లోనే టార్చిలైటు పట్టుకుని మరీ వెదికి వైన్‌షాపుల చుట్టూ లైసెన్సులేని బార్లు నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు విజయ. మహారాష్ట్రకు చెందిన విజయ ఐఏఎస్‌కి ఎంపికై మూడేళ్లే. ఝార్ఖండ్‌లోని గిరీధిహ్‌ లాంటి సమస్యాత్మక ప్రాంతానికి అధికారిగా వెళ్లాల్సి రావడాన్ని ఆమె తనను తాను నిరూపించుకునే అవకాశంగా భావించారు. ఇసుక మాఫియా, అక్రమంగా మందుగుండు సామగ్రి తయారీ, లైసెన్సు లేని మద్యం వ్యాపారం... వీటన్నిటిపై దాడులు చేస్తూ అస్తవ్యస్తంగా ఉన్న పాలనా వ్యవహారాల్ని ఒక కొలిక్కి తెచ్చే పనిలో ఆమె తల మునకలై ఉండగా- ఆధార్‌ లేదని రేషన్‌ ఇవ్వకపోవడంతో ఆకలి చావు అన్న వార్త పాలనాయంత్రాంగాన్ని కుదిపేసింది. విజయ భయపడలేదు. పక్కా ప్రణాళికతో- తనతో పాటు సిబ్బంది అంతా సబ్‌డివిజన్‌లోని గ్రామాలను తలా ఒకటీ దత్తత తీసుకునేలా చేశారు. గ్రామాలకు వెళ్లి అందరి వివరాలతో డేటాబేస్‌ తయారు చేసి రేషన్‌ కార్డులు ఇచ్చారు. వారం తిరక్కుండానే గ్రామాలన్నిట్లో రేషను సక్రమంగా అందే ఏర్పాటు చేయడంతో మరో ఆకలి చావు అన్న వార్త రాలేదు. అంత త్వరగా సమస్యని పరిష్కరించినందుకు విజయ ప్రజలనుంచే కాక ప్రభుత్వం నుంచీ కూడా ప్రశంసలందుకున్నారు. లేడీ సింగం అంటూ పత్రికలు ఆమె గురించి రాశాయి. ఆ విషయం ప్రస్తావిస్తే విజయ నవ్వుతూ తన పర్సులో దాచుకున్న ఒక కాగితాన్ని చూపిస్తారు. ‘నేను మీకు అపరాజిత అనే పేరు పెడుతున్నా’ అంటూ ఓ చిన్నారి రాసిన లేఖ అది. అవినీతీ అక్రమాలపై పోరాటంలో తానెప్పటికీ అపరాజితగానే నిలవాలని ఆశిస్తున్నానంటారు విజయ.

మిరకిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ మణిపూర్‌

ల్లె నుంచి పట్టణానికి వెళ్లాలంటే అది ఏ ప్రాంతమైనా ఈ రోజుల్లో గంటకో రెండుగంటలకో ఓ బస్సు ఉంటుందనుకుంటాం. బస్సు కాదు కదా, అసలు రోడ్డే లేని ఊళ్లు మణిపూర్‌లో ఎన్నో. ఈ ఈశాన్య రాష్ట్రం ఎత్తైన కొండలూ లోతైన లోయలతో చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది కానీ ఆ కొండలమీద పల్లెల్లో నివసించడం మాత్రం చాలా కష్టం. ఎత్తుపల్లాల వల్ల అక్కడ రోడ్లు వేయడం బోలెడంత ఖర్చూ శ్రమలతో కూడిన పని. రోడ్డులేని ఊళ్లకు ఉద్యోగులేం వస్తారు. అందుకే ఆ పల్లెల్లో బడులుండవు. ఆస్పత్రులు ఉండవు. పండిన పంటలను పట్టణాల మార్కెట్‌కి తరలించే వెసులుబాటు ఉండదు. పల్లె నుంచి దగ్గర్లోని పట్టణానికి వెళ్లాలంటే రెండు రోజులు నడవాలి. అలాంటి ఓ జిల్లాలో గిరిజన తెగ నుంచి ఐఏఎస్‌కి ఎంపికయ్యారు ఆర్మ్‌స్ట్రాంగ్‌ పామె. పిల్లల్ని చదివించడానికి పామె తండ్రి పట్టణానికి మకాం మార్చబట్టి అది సాధ్యమైంది. ఐఏఎస్‌ సాధించాలన్న కల నెరవేర్చుకుని సొంత జిల్లాకే సబ్‌కలెక్టరుగా వచ్చారు పామె. రాగానే రంగంలోకి దిగి జిల్లాలో రోడ్డు వసతి లేని గ్రామాల్ని గుర్తించారు. మొత్తం 31 గ్రామాల్ని కలుపుతూ వంద కిలోమీటర్ల రోడ్డు వేస్తే అది ఆ చివరా ఈ చివరా పొరుగు రాష్ట్రాలనూ కలుపుతుంది. దాంతో జిల్లావ్యాప్తంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. పథకం సరే. మరి, డబ్బేదీ? ప్రభుత్వం అన్ని నిధులివ్వదు. దాంతో ఫేస్‌బుక్‌ పేజీ పెట్టి రోడ్డు పథకాన్ని వివరిస్తూ తన వంతు విరాళంగా రూ.4 లక్షలు ప్రకటించారు పామె. ఆయన వినతికి స్థానికులే కాక ప్రవాసులూ స్పందించారు. తగినన్ని నిధులు సమకూరగానే రోడ్డు పని మొదలైంది. పగలంతా ఆఫీసు పనిచేసి సాయంత్రం కాగానే రోడ్డు పనికి వెళ్లేవారు పామె. అవసరమైన చోట తానూ ఓ చెయ్యి వేసేవారు. ఐఏఎస్‌ అధికారే వచ్చి పని చేస్తుంటే యువత కూడా ఉత్సాహంగా వచ్చి శ్రమదానం చేసింది. రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నర దశాబ్దాలకు పామె పుణ్యమా అని ఆ ఊళ్లకి రోడ్డు ఏర్పడింది. కల నెరవేరి పల్లెలన్నీ పండగ చేసుకున్నాయి. పత్రికలు అతడిని ‘మిరకిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ మణిపూర్‌’ అని కొనియాడాయి.

ప్లాస్టిక్‌ రహిత కన్నూర్‌ ఆయన చలవే! 

రోజూ కారులో ఆఫీసుకు వెళ్లే ఓ యువ ఐఏఎస్‌ అధికారి- పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఉన్నతాధికారులు వారంలో ఒకరోజు సైకిల్‌ వాడాలన్న నిబంధనలో భాగంగా ఆరోజు సైకిలెక్కారు. కొంతదూరం వెళ్లేసరికి గాలికి ఎగురుతూ వచ్చిన ఓ ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్‌ ఆయన ముఖానికి తగిలింది. అప్రమత్తంగా లేకపోతే సైకిల్‌ మీదినుంచి పడిపోయేవారే. ఆ సంఘటన మీర్‌ మహ్మద్‌ అలీని ఆలోచింపజేసింది. రోడ్లనిండా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఆందోళన కలిగించాయి. దాంతో ఎలాగైనా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలనుకున్నారు. జిల్లా కలెక్టరుగా సవాలక్ష బాధ్యతలను నిర్వహిస్తూనే వ్యక్తిగత ఆసక్తితో ప్లాస్టిక్‌ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు మీర్‌. పెద్దలకన్నా పిల్లలకు చెబితే ఫలితం ఉంటుందని వారాంతాల్లో స్వయంగా పాఠశాలలకు వెళ్లేవారు.  డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ వల్ల జరిగే హాని గురించీ, రీసైక్లింగ్‌ గురించీ ఒక టీచరులా పిల్లలకు వివరించి చెప్పేవారు. పాఠశాలల్లో ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పాలు, నూనె, పిండిలాంటి వాటితో వచ్చే ప్లాస్టిక్‌కవర్లను పిల్లలు ఇళ్లలో సేకరించి తెచ్చి స్కూల్లో ఇవ్వాలి. అలా సేకరించిన ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్‌కి పంపేవారు. ముందు క్యారీబ్యాగులు, ఆ తర్వాత డిస్పోజబుల్‌ సామగ్రి... అలా తన కార్యాలయంలో నిషేధాన్ని ఆచరణలో పెట్టడంతో నెమ్మదిగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ అదే బాటపట్టాయి. అది చూసి ఇతరులూ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించారు. మరో పక్కన క్యారీబ్యాగ్‌లకు బదులుగా వాడడానికి చేనేత సంచులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా, హోటళ్లనుంచీ పార్సెల్‌ తీసుకెళ్లడానికి స్టీలు టిఫిన్‌ బాక్సులు ఉపయోగించేలా కృషిచేశారు. ఫలితంగా జిల్లాలో డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ కన్పించకుండా పోయింది.  యువతీ యువకులతో కలిసి పెరుంబా నదికి రెండువైపులా 14కి.మీ. మేర మేట వేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను కూడా శుభ్రం చేశారు. ‘ప్లాస్టిక్‌ పట్ల విముఖత పెంచి వాడకం తగ్గించాలన్నదే మొదట్లో మా ఆశయం. కానీ ప్రజల సహకారం వల్ల కన్నూర్‌ దేశంలోనే తొలి డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మారింది’ అంటారు సంతోషంగా మీర్‌.

ఈ కలెక్టర్‌ కెరీర్‌ కౌన్సెలర్‌!

పిల్లలు బాగా చదువుకోవాలనీ, మంచి ఉద్యోగాలు చేయాలనీ కలలు కంటారు తల్లిదండ్రులు. కానీ అందుకు తగిన పరిస్థితులే ఊళ్లల్లో లేకపోతే? పెద్దలకైనా ఉద్యోగానికి వెళ్తే తిరిగి ఇంటికొస్తామన్న గ్యారంటీ లేదు. శాంతిభద్రతలు సరిగా లేకపోతే సమాజం ఎంతగా ఇబ్బంది పడుతుందో చెప్పడానికి నిదర్శనం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ ప్రాంతం. అలాంటి చోట ఉద్యోగం చేయాల్సి వస్తే నూటికి తొంభైతొమ్మిది మంది ఈ గండం గడిస్తే చాలు- అనుకుంటారు. కానీ సౌరభ్‌కుమార్‌ అరుదైన ఆ వందో వ్యక్తి. సమస్యల్నీ పరిస్థితుల్నీ ఉన్నవి ఉన్నట్లుగా వదిలేసేటప్పుడు ప్రభుత్వమెందుకు... పాలన ఎందుకు... అన్నది ఆయన ప్రశ్న. ఇంజినీరింగ్‌ చదివి ఐటీ సంస్థలో చేరిన సౌరభ్‌కి ప్రజల మధ్య పనిచేయాలనిపించింది. అందుకే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసి ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. దంతెవాడలో ఉద్యోగంలో చేరాక, జిల్లాలోని సగం సమస్యలకు కారణం- జీవితం పట్ల సరైన అవగాహనా, స్పష్టమైన గమ్యమూ లేక యువత పెడదార్లు పట్టడమే అనిపించింది సౌరభ్‌కి. కలెక్టరుగా విధి నిర్వహణతో పాటుగా పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం తన కనీస బాధ్యతనుకున్నారు. ఎంత పనిఒత్తిడిలో ఉన్నా వారానికోరోజు విద్యార్థులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి బుధవారం మధ్యాహ్నం 50 నుంచి 100 మంది విద్యార్థులతో సౌరభ్‌ సమావేశమవుతారు. ఆ సమయంలో పిల్లలంతా భవిష్యత్తుగురించి తమ ఆలోచనలను చెబుతారు. ఒక్కొక్కరికీ అవసరమైన సలహాలు ఇస్తారు సౌరభ్‌. వారడిగే ప్రశ్నలకీ ఓపిగ్గా సమాధానాలు చెబుతారు. ఆ తర్వాత అంతా కలిసి భోజనం చేస్తారు. ‘కలెక్టరుతో భోజనం’ అనే ఈ కార్యక్రమం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందనీ వారిప్పుడు చదువుమీద శ్రద్ధ పెడుతున్నారనీ అంటున్నారు టీచర్లు. సౌరభ్‌ అంతటితో తన పని అయిపోయిందనుకోవడం లేదు. టీచర్లనీ, తల్లిదండ్రుల్నీ కూడా మార్పుకు సిద్ధంచేయడానికి పూనుకున్నారు. వారంలో ఓ సాయంత్రం ‘ఈవెనింగ్‌ విత్‌ కలెక్టర్‌’ కార్యక్రమంలో వారూ మనసు విప్పి తమ ఆలోచనలను కలెక్టరు దృష్టికి తెస్తున్నారు. పిల్లల చదువులూ ఉద్యోగావకాశాల గురించి సౌరభ్‌ వారితో చర్చిస్తారు. కలెక్టరుగా తన బాధ్యతలకు అదనంగా సమాజంలో మార్పు తేవాలన్న తాపత్రయంతో చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలతో ఆయన- కలెక్టర్‌ తమ కుటుంబసభ్యుడే అనుకునేంతగా ప్రజలతో కలిసిపోయారు. 

ఊరిని వెలిగించాడు!

యన ఓ ఐఏఎస్‌ అధికారి... తొలి ఉద్యోగంలో చేరడానికి కారులో బయల్దేరారు. ముసురుకుంటున్న చీకట్లను చీల్చుకుంటూ నెమ్మదిగా వెళ్తోంది కారు. అంతలోనే ‘ఊరొచ్చింది, దిగమన్నా’డు డ్రైవరు. కళ్లు పొడుచుకున్నా కానరాని ఆ చీకటిలో ఊరేంటని గాభరాపడ్డాడా యువ అధికారి. మేఘాలయ రాష్ట్రంలోని ఓ సబ్‌ డివిజన్‌ అది. నలభై ఏళ్లుగా అక్కడ విద్యుత్తు లేదు. అలాగని అక్కడి ప్రజలేం నిరుపేదలు కారు. అది మారుమూల పల్లెటూరూ కాదు. కానీ రాత్రయితే ఏ వీధిలోనూ లైటు వెలగదు. కరెంటు వస్తే తీవ్రవాదం పెరుగుతుందన్న ప్రజల అవగాహనాలోపమూ వారికి నచ్చచెప్పి సమస్య తీర్చే ప్రయత్నం చేయని ప్రభుత్వ బాధ్యతారాహిత్యమూ ఆ పరిస్థితికి కారణాలు. నాలుగు దాటేసరికే సూర్యుడు సెలవుపుచ్చుకునే ఆ కొండప్రాంతం పచ్చదనానికి పర్యాయపదం. అలాంటి చోట ఇళ్లల్లోనే కాదు, వీధుల్లోనూ లైట్లు లేకపోవడంతో సాయంత్రమైతే చీకట్లు ముసురుకుని పనులేవీ సాగేవి కావు. దాంతో ఎలాగైనా ఆ ప్రాంతానికి విద్యుత్తు వెలుగులు తేవాలని నిర్ణయించుకున్నారు రామ్‌కుమార్‌. అందుకు ముందుగా ప్రజలను సిద్ధం చేశారు. స్వయంగా రోజుకో వీధికి వెళ్లి ప్రజల మధ్య కూర్చుని స్థానిక సమస్యల గురించి మాట్లాడేవారు. కరెంటు ఉంటే ఎన్ని పనులు చేసుకోవచ్చో చెప్పేవారు. అలా డివిజన్‌లోని అన్ని గ్రామాలవారికీ ఆయన దగ్గరయ్యారు. కరెంటు ఉంటే బాగుంటుందన్న ఆలోచనను వాళ్లలో కలిగించారు. మొదటి అడుగు విజయవంతమైంది. ఇక పచ్చని ఆ ప్రకృతి ఒడిలో పర్యావరణానికి హాని చేయకుండా కరెంటు తేవాలి. అందుకు సౌరవిద్యుత్తు ఒక్కటే మార్గం. మూడో వంతు ఖర్చు ప్రజలు భరించేటట్లయితే మిగతా నిధులు ప్రభుత్వం ఇచ్చే పథకం ఒకటుంది. దాని గురించి ప్రజలకు చెప్పి కుటుంబానికి పదివేల చొప్పున ఇచ్చేందుకు ఒప్పించారు రామ్‌కుమార్‌. అలా దిగ్విజయంగా సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. ఫలితంగా కొద్దినెలల్లోనే ప్రభుత్వ కార్యాలయాలకూ ప్రజల నివాసాలకూ విద్యుత్తు వెలుగులు ప్రసరించాయి. ఇప్పుడు రాత్రి గతంలోలా భయానకంగా లేదక్కడ. అందరూ వీధుల్లో తిరిగి పనులు చేసుకుంటున్నారు. 
వెలుతురు తెచ్చిన వెసులుబాటుని ప్రయోజనకరంగా మలచుకుంటున్నారు. అదొక్కటే కాదు, రామ్‌కుమార్‌ ఇంకా చాలా మార్పులు తెచ్చారు. కార్యాలయాన్ని పూర్తిగా డిజిటల్‌ చేయించారు. రోడ్లు వేయించారు. బ్యాంకూ ఏటీఎం నెలకొల్పడానికి తోడ్పడ్డారు. ఫలితంగా తీవ్రవాద భయం తగ్గింది. ఆయన బదిలీ అయి వెళ్లిపోయారు కానీ ఊరివారు మాత్రం రోజూ లైటు వేసుకున్నప్పుడల్లా ఆయన్నే తలచుకుంటారు.

డబ్బుంటే... ఓ పేద విద్యార్థిని చదివించవచ్చు. పదిమందికి అన్నదానం చేయొచ్చు. ఇంకా స్తోమత ఉంటే ఓ అనాథాశ్రమమో, వృద్ధాశ్రమమో పెట్టి చాలామందికి ఆశ్రయం కల్పించవచ్చు.
బాగా చదువుకుంటే... పెద్ద ఉద్యోగం చేయొచ్చు. బోలెడు డబ్బు సంపాదించవచ్చు. కానీ ఐఏఎస్‌ అన్న పదం పేరు చివర ఉంటే... ఏకంగా ఊళ్లకి ఊళ్లనే మార్చేయొచ్చు!
వీరు చేస్తున్నది అదే! ఉద్యోగ విధులు నిర్వర్తించడంతో తమ బాధ్యత పూర్తయిందనుకోకుండా తమ అధికారాన్నీ హోదానీ ఉపయోగించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సమాజంలో మార్పు కోసం కృషిచేస్తున్నారు. అందుకే ఈ అధికారులు ప్రజలకు ఆప్తులయ్యారు... వారి ప్రేమకు పాత్రులయ్యారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.