close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ పోస్ట్‌మ్యాన్‌... సేవలో సూపర్‌మ్యాన్‌!

ఈ పోస్ట్‌మ్యాన్‌... సేవలో సూపర్‌మ్యాన్‌!

ఉత్తరాలు చేరవేయడమే పోస్టుమ్యాన్‌ విధి. చాలామంది అంతవరకే పరిమితమవుతుంటారు. కానీ సహచరులకు భిన్నంగా పోస్టల్‌శాఖ వారి పొదుపు ఖాతాల వివరాలు పేదలకు తెలియజేస్తూ దగ్గరుండి మరీ వారితో ఖాతాలు తెరిపిస్తుంటారు విజయవాడ గాంధీనగర్‌ మాజీ పోస్టుమ్యాన్‌ రామచంద్రరావు. పదవీ విరమణ పొందినా ఉదయం ఆరింటికల్లా విధులకు హాజరుకావడం మానరు. ఆయన సేవలకు గుర్తుగా తపాలాశాఖ చరిత్రలోనే మొదటిసారి లక్షకు పైగా పోస్టుకార్డులను ఆయన ఫొటోతో ముద్రించి గౌరవించడం విశేషం.

నెల్లూరు జిల్లాకు చెందిన రామచంద్రరావు కుటుంబంలో చిన్న తగాదా కారణంగా పదిహేనో యేటే ఇంట్లోంచి పారిపోయి విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచీ దాదాపు ఏడేళ్లపాటు గాంధీనగర్‌లోని ఒక హోటల్‌లో పనిచేశారు. ఆ క్రమంలోనే రోజూ అక్కడికి వచ్చే పోస్టల్‌ డైరెక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన సహకారంతోనే 1981లో పోస్టల్‌ శాఖలో జీడీఎస్‌ ప్యాకర్‌గా ఉద్యోగం పొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పరీక్షరాసి పోస్టుమ్యాన్‌ అయ్యారు.
సంపాదనలో కొంత పోస్టుమ్యాన్‌గా పదోన్నతిని పొందినప్పటి నుంచీ పేద విద్యార్థులకు తన వంతు సాయాన్ని అందిస్తున్నారు రామచంద్రరావు. మొదటి ఏడాది దసరా మామూళ్లుగా వచ్చిన సొమ్మూ, నెలనెలా తన సంపాదనలో తీసిన అయిదు శాతం డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలూ పెన్నులూ పంపిణీ చేశారు. అప్పటి నుంచీ ఆ వితరణ అలా కొనసాగుతూనే ఉంది. గతంలో ఎప్పుడో ఒక జిలేబీ వ్యాపారికి రామచంద్రరావు చేసిన సహాయానికి కృతజ్ఞతగా యాభై వేల రూపాయలు అందించబోయాడు ఆ వ్యాపారి. తనకు ఆ డబ్బు అవసరంలేదనీ దాంతో మధ్యాహ్న భోజన సమయంలో సరైన ప్లేట్లు లేక ఇబ్బంది పడుతున్న ఈదర జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందజేయమనీ చెప్పి తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు రామచంద్రరావు. ఇటీవల పదవీవిరమణ పొందినా అది ఆయన దినచర్యలో ఎలాంటి మార్పూ తీసుకురాలేదు. ఇప్పటికీ పోస్టుమ్యాన్‌ ఆహార్యం ఉట్టిపడేలాంటి దుస్తులే ధరిస్తూ తన వృత్తిమీద ఉన్న ప్రేమనూ గౌరవాన్నీ చాటిచెబుతున్నారాయన.

వీధికి అతడిపేరే...
పదవీ విరమణ వృత్తికే కానీ తనకు కాదంటారు రామచంద్రరావు. అందుకే ఇప్పటికీ రోజూ పోస్టాఫీసుకు వెళ్లి తనవంతు సేవను అందిస్తుంటారు. వీధి వ్యాపారులకూ పేదలకూ తపాలా శాఖ అందిస్తున్న పొదుపు ఖాతాలూ రికరింగ్‌ డిపాజిట్ల వివరాలూ, జాతీయ పొదుపు ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అంశాలమీద ప్రజలకు అవగాహన కల్పిస్తారు. దగ్గరుండి మరీ వారితో పొదుపు ఖాతాలను మొదలుపెట్టిస్తారు. రామచంద్రరావు చేస్తున్న ఈ సేవలను గుర్తించిన విజయవాడ నగర పురపాలక సంస్థ ఆయన నివాసం ఉండే ఇందిరానాయక్‌ కాలనీలోని ఒక వీధికి పోస్టల్‌ రామచంద్రరావు వీధి అని పేరు పెట్టింది. ఆయన సేవలను గుర్తించిన తపాలాశాఖ 2012 సంవత్సరానికి ఉత్తమ పోస్టుమ్యాన్‌గా గౌరవించింది. ఆ తర్వాతి కాలంలో రామచంద్రరావు ఫొటో ఉన్న లక్ష పోస్టుకార్డులను ముద్రించింది. ఇలా ఒక పోస్టుమ్యాన్‌ ఫొటోతో పోస్టుకార్డులను ముద్రించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. డాక్‌ సేవా అవార్డుతోనూ సత్కరించింది. తన వృత్తినీ సేవనూ రెండింటినీ సమర్థంగా నిర్వహించిన రామచంద్రరావు పేరును తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో ఇటీవలే నమోదు చేశారు కూడా. స్వచ్ఛభారత్‌లో భాగంగా చుట్టుపక్కల కాలనీల్లో మొక్కలు నాటి మూడేళ్లుగా వాటి రక్షణ బాధ్యతలనూ ఆయనే చేపడుతూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆ నవ్వే కారణం
‘ఒక రోజు పోస్టుకార్డులు బట్వాడా చేసి ఇంటికి వెళ్తున్నా. గాంధీనగర్‌లోని బాబాయ్‌ హోటల్‌ దగ్గర ఒక చిన్నారి రోడ్డుమీద ఏడుస్తూ  కనిపించాడు. అతణ్ణి చూడగానే ఎందుకో నా మనసు చివుక్కుమంది. వెంటనే ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగా. దానికా అబ్బాయి చదువుకోవడానికి తన దగ్గర పాఠ్య పుస్తకాలు లేవనీ, దాంతో మాస్టారు తరగతి నుంచి బయటకు పంపించేశారనీ చెప్పాడు. చాలా బాధేసింది. నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతోనే ఆ పుస్తకాలను కొని, స్కూల్‌కి తీసుకెళ్లి అప్పజెప్పా. ఆ క్షణంలో ఆ ఆబ్బాయి నన్ను చూసి నవ్విన నవ్వు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. ఆ నవ్వే నన్ను సేవ వైపు మళ్లేలా చేసిందటూ అప్పటి సంఘటనను గుర్తుచేసుకుంటారాయన.

- ఎ.శివరామకృష్ణ, ఈనాడు డిజిటల్‌, విజయవాడ
చిత్రాలు: దుర్గాప్రసాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.