close
దాంపత్య బంధం

దాంపత్య బంధం
- నూతలకంటి సురేఖ

సాయంత్రం ఆరు గంటలయింది. చేతిలో బ్యాగుతో లోపలికొస్తున్న మనవరాలిని ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఏంటే రాధీ, ఈ అనుకోని రాక’’ అంది రాధమ్మ.
‘‘ఏం, ఇక్కడికి రావాలంటే నీ పర్మిషన్‌ తీసుకునిగానీ రావాలా?’’ కోపంగా అంది రాధిక.

‘‘ఎందుకే అంత కోపం, నేనేదో పరాచికానికంటేనూ’’ అందామె.

అమ్మమ్మ అలా అనేసరికి సర్దుకుని ‘‘ఏం లేదమ్మమ్మా, నిన్నూ తాతయ్యనూ చూడాలనిపించి వచ్చాను’’ అంది.
కానీ తనని చూస్తుంటే భర్తతో ఏదో గొడవపడి వచ్చినట్లనిపించింది రాధమ్మకి.

‘‘జర్నీ చేసి చిరాగ్గా ఉంది, స్నానం చేసి వస్తా. గౌరి పెద్దమ్మ ఇంకా రాలేదా’’ అంటూనే గదిలోకి వెళ్ళిపోయింది.
‘‘అమ్మా, ఏం చేస్తున్నావు’’ అంటూ ఇంట్లోకి వచ్చింది గౌరి.

‘‘ఏం లేదే గౌరీ, ఇప్పుడే రాధీ వచ్చింది. ‘ఏంటే, ఈ అనుకోని రాక’ అన్నానని నామీద కయ్య్‌మంది. చూడబోతే మళ్ళీ మొగుడితో గొడవపడి వచ్చిందేమోనని  అనుమానంగా ఉందే తల్లీ’’ నిట్టూరుస్తూ అంది.
‘‘నేను చిన్నగా దాంతో మాట్లాడి తెలుసుకుంటాలే. నువ్వు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకు’’ అంది గౌరి.

‘‘ఆ... ఏం ఆరోగ్యమోలేమ్మా, కన్నకూతుర్నీ అల్లుణ్ణీ పోగొట్టుకున్నాం. దీన్ని చూసుకునే బతుకీడుస్తున్నాం. ఇదేమో తడవకోసారి మొగుడితో గొడవ పెట్టుకుని వస్తుంది. అయినవాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు.
అదే బయటి వాళ్ళయితే ఊరుకుంటారా.

ఈ వయసులో మాకు దీనివల్ల మనశ్శాంతి లేకుండాపోతుందే’’ అంది.

‘‘చిన్నపిల్ల కదమ్మా... నాలుగు రోజులు పోతే తనే తెలుసుకుంటుంది. నువ్వేం కంగారుపడకు’’ భరోసాగా అని, ‘‘ఈ పూట వంటేం చేయమంటావో చెప్పు. రాధీ కిష్టమైన గుత్తొంకాయ కూర చేయనా?’’ అంది.
‘‘నీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యి. నేను కాసేపు నడుం వాలుస్తా’’ అంటూ వెళ్ళిపోయింది రాధమ్మ.

వెంకయ్య, రాధమ్మలకు ఒక్కతే కూతురు సుజాత. కూతుర్ని ఎంతో గారాబంగా పెంచారు. గౌరి తల్లిదండ్రులు వాళ్ళ పొలంలోనే పనిచేస్తూ ట్రాక్టర్‌ ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. అనాథ అయిన గౌరీని తెచ్చుకుని కూతురితోపాటు పది వరకూ చదివించారు. తరవాత రాధమ్మకు ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్‌ జరగటంతో గౌరి ఇక చదువుకోనని చెప్పి ఇంటిపనీ, వంటపనీ చూసుకోవటం మొదలుపెట్టింది. సుజాత కూడా ఇంటర్‌ వరకూ చదివి మానేసింది. ఒకే వయసు కావటంతో గౌరీ, సుజాతా చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. వయసుతోపాటు వాళ్ళ స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. గౌరి బాధ్యత తమదే కనుక ఆస్తి లేకపోయినా మంచివాడైన రమేష్‌కిచ్చి పెళ్ళిచేసి, ఇద్దరినీ తమ ఇంటి ఆవరణలోనే వేరే ఇల్లు కట్టి అందులో ఉంచుకున్నారు. పొలం ఖర్చులూ ఇంటి ఖర్చులూ అన్నీ రమేష్‌ జాగ్రత్తగా చూసుకునేవాడు. తరవాత రెండేళ్ళకు సుజాతను పట్నంలోని బాగా ఆస్తిపరులైన రవీంద్రకిచ్చి పెళ్ళి చేశారు. అతను గవర్నమెంటు ఉద్యోగి. చాలా మంచివాడు. అతనికి ఒక తమ్ముడూ, చెల్లీ ఉన్నారు. అందరూ కలిసి ఉండేవారు. చెల్లికి అప్పటికే పెళ్ళయిపోయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళంతా సుజాతను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. రవీంద్ర అయితే ఆమెను వదలి ఉండేవాడే కాదు. పుట్టింటికి కూడా త్వరగా పంపేవాడు కాదు. పెళ్ళయిన రెండేళ్ళకి రాధిక పుట్టింది. ‘నా కూతురికి మా అమ్మపేరు పెట్టాల్సిందే’నని పట్టుబట్టి ఆ పేరు పెట్టింది. అప్పటికే గౌరికి ఒక అమ్మాయీ, రాధికతోపాటు అబ్బాయీ ఉన్నారు.

అప్పుడే రమేష్‌కి చెడు స్నేహాలు అలవాటయ్యాయి. రోజూ తాగి వచ్చేవాడు. అప్పుడప్పుడూ గౌరీని కొట్టేవాడు. పిల్లలని కూడా సరిగా పట్టించుకునేవాడు కాదు. తామిద్దరిమధ్యా దాపరికాలు ఏమీ లేవు కనుక సుజాతకు అన్నీ చెప్పుకుని ఏడ్చేది గౌరి. ఆమె బాధ చూసి తను కూడా చాలా బాధపడేది. ఒక్కోసారి బాగా కోపమొచ్చి రమేష్‌కి విడాకులిచ్చేయమని చెప్పేది. ‘అమ్మా నాన్నా తోడున్నారుగా హాయిగా ఉండొచ్చు’ అనేది. నవ్వి ఊరుకునేది గౌరి. ఆ నవ్వు చూసి సుజాతకి కోపం ఇంకా ఎక్కువయ్యేది. అలాగే అయిదేళ్ళు గడిచిపోయాయి. ఈలోపు రమేష్‌కి విడాకులిచ్చేయమని గౌరికి ఎన్నోసార్లు చెప్పింది, అయినా గౌరి వినలేదు. ఎలా మారాడోగానీ అన్నేళ్ళకు అతనిలో క్రమంగా మార్పు వచ్చింది.
మళ్ళీ వెనకటి రమేష్‌గా మారిపోయాడు. పిల్లల్ని కూడా బాగా చదివించి ప్రయోజకుల్ని చేశాడు.

రాధిక ఇంటర్లో ఉండగా రవీంద్రకి హార్ట్‌ ప్రాబ్లమ్‌ వచ్చింది. గుండె చాలా వీక్‌ అయిందన్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. సంవత్సరం తరవాత ఒకరోజు రాత్రి నిద్రలోనే ప్రాణాలు వదిలాడు రవీంద్ర. భర్త మరణం సుజాతని చాలా కుంగదీసింది. ఏం మాట్లాడేది కాదు. మౌనంగా కూర్చునేది. కూతుర్ని ఆ స్థితిలో వదలిరాలేక వెంకయ్య, రాధమ్మలు అక్కడే ఉన్నారు కొన్నాళ్ళు. గౌరి, రమేష్‌ అప్పుడప్పుడూ వచ్చి వెళ్ళేవారు. సుజాతను ఓదార్చి మళ్ళీ మనుషుల్లో పడేలా చేయాలని చాలా ప్రయత్నించేది గౌరి.

‘‘అమ్మా, మన ఊరెళ్దాం’’ అని భర్త పోయిన చాన్నాళ్ళకి కూతురు మొదటిసారిగా అడగటంతో ఆమెను తీసుకుని ఊరికి వచ్చారు. కొద్దిరోజులు బాగానే ఉంది. గౌరితో కబుర్లు చెప్పింది. ఆ రాత్రి ఎంతో ఉత్సాహంగా ఉన్న సుజాత తెల్లారి ఉదయం మరిలేవలేదు.

కూతురి మరణాన్ని ఆ ముసలి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. చిన్న వయసులోనే అల్లుడి అనారోగ్యం, మరణం, ఆరు నెలలైనా గడవకముందే కూతురి ఆకస్మిక మరణం వాళ్ళని చాలా కుంగదీసింది. వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి బయటపడగలిగారూ అంటే అది ఒక్క గౌరి సాహచర్యం, సేవల మూలంగానే.

మూడేళ్ళ తరవాత చదువైపోయిన రాధికను సిటీలో ఉన్న మేనత్త కొడుకు సాకేత్‌కిచ్చి పెళ్ళి చేశారు. మేనత్తకు, అన్న కూతురని రాధికంటే చాలా ఇష్టం. సాకేత్‌ కూడా రవీంద్రలాగా చాలా మంచివాడు. రాధికే కొంచెం పెంకిపిల్ల. మొండి. చీటికీ మాటికీ భర్తతో గొడవపడి వస్తుంటుంది. ‘తల్లీ తండ్రీ లేరులే అని గారం చేయటంతో ఇలా తయారయింది. ఈ పిల్లకి ఏం చెప్పి, ఎలా చెప్పి, మంకుతనం వదిలించి భర్తకి దగ్గర చేయాలా’ అని ఆలోచనలోపడ్డారు గదిలోని రాధమ్మ, వంటగదిలోని గౌరి.

మర్నాడు పొద్దున్నే సాకేత్‌ ఫోన్‌ చేశాడు. మనవరాలు ఫోనెత్తక పోవటంతో రాధమ్మే ఫోన్‌ తీసి, ‘‘హలో బాబూ, నేను నానమ్మని’’ అంది. కుశల ప్రశ్నలయ్యాక ‘‘రాధీ విషయం మాట్లాడాలని చేశాను నానమ్మా. ప్రతి విషయానికీ గొడవపడుతుంది. నా మాట అసలు వినదు. ఈమధ్య అమ్మ చెప్పినా వినటం లేదు. అన్నీ తను చెప్పినట్లే వింటున్నా కూడా ఇలా చేస్తోంది. ఇలా అయితే కష్టం నానమ్మా. ఇంకోసారి ఇలా మీ ఇంటికి వస్తే ఇక అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇదంతా తనకి అర్థం అయ్యేట్లు చెప్పి పంపించండి’’ సూటిగా, స్పష్టంగా చెప్పి ఫోన్‌ పెట్టేశాడు సాకేత్‌. ఆమెకేం చేయాలో పాలుపోలేదు. గౌరి వచ్చిందాకా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. రాగానే ఫోన్‌ విషయం చెప్పింది.

‘‘నేను రాధీతో సాయంత్రం మాట్లాడతాలే’’ అంది ధైర్యం చెపుతూ.
సాయంత్రం రాధికను మేడపైకి తీసుకెళ్ళి ‘‘ఏంటమ్మా... ఏమైనా గొడవ అయిందా?  అత్తయ్యకానీ సాకేత్‌ కానీ ఏమైనా అన్నారా... నాకు చెప్పు తల్లీ’’ అని అడిగింది గౌరి.

‘‘ఏం చెప్పను పెద్దమ్మా, అత్తయ్యా సాకేత్‌ మంచివాళ్ళే - కాదనను. కానీ జాబ్‌ చేస్తానంటే ‘ఎందుకు నీకా కష్టం, హాయిగా ఇంట్లో ఉండరాదా’ అంటారు. మొన్న పెళ్ళిరోజుకి ‘సరదాగా ఎటైనా వెళ్దాం’ అంటే, ఓల్డేజ్‌ హోమ్‌కి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టించారు. పెద్దవాళ్ళ ఆశీస్సులు మాకు కావాలంట. సాకేత్‌కి పిల్లలంటే చాలా ఇష్టమట, త్వరగా మనవణ్ణో మనవరాలినో ఇవ్వమని అత్తయ్య గోల. ఆఫీసు నుండి రాగానే మంచినీళ్ళూ కాఫీ నన్నే ఇవ్వమంటాడు. అదేమంటే నేనంటే ప్రేమ లేదా అంటాడు. అవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా. ఇంకా ఇంటికెవరైనా వస్తే ‘ఇష్టమున్నా లేకపోయినా పలకరించి మాట్లాడాలి. లేకపోతే నీకు పొగరనుకుంటారు’ అంటారు. నిన్న అత్తయ్యావాళ్ళ మరిది వస్తే నేను మాట్లాడలేదని సాకేత్‌ కేకలేశాడు. దాంతో నాకు కోపమొచ్చి నాలుగు అనేసి వచ్చేశాను అంతే’’ అంది.

‘‘చూడమ్మా, నేను నీ మంచి కోరేదాన్నని నీకు నమ్మకమేగా?’’ రాధీతో అంది గౌరి.
‘‘అదేంటి పెద్దమ్మా, నువ్వు మా అమ్మలాంటి దానివి’’ అంది రాధీ.
‘‘అయితే ఇదిగో ఈ లెటర్‌ చదువు. తరవాత తప్పెవరిదో నీకే తెలుస్తుంది’’ అంటూ కవరొకటి ఇచ్చింది గౌరి.
గదిలోకి వెళ్ళి మంచం మీద వాలి లెటర్‌ తీసింది రాధిక. ‘ఈ లెటర్‌ ఎవరు రాశారబ్బా... పెద్దమ్మ ఇది చదవమని నాకెందుకిచ్చిందీ’ అనుకుంటూ.

ప్రియమైన గౌరీ,
నేను నీకు చాలా లెటర్స్‌ రాశాను ఇప్పటికి. లెటర్స్‌ చాలా బాగా రాస్తానని నాకు కాంప్లిమెంట్‌ ఇచ్చావు. బహుశా ఇదే నేను రాసే చివరి లెటరేమోనని నాకనిపిస్తోంది. నా గురించి నీకు అంతా తెలుసు. కానీ, నీకు తెలియందీ కొంత ఉంది. నా పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళాక నేనెందుకో వాళ్ళతో త్వరగా కలిసిపోలేక పోయాను. ‘నాన్న బోలెడంత కట్నం ఇచ్చారు. ఇంకా ఎంతైనా ఇవ్వగలరు. వీళ్ళు చెప్పినట్లు వినాల్సిన అవసరం నాకు లేదు’ అన్నట్లు ఉండేది. మా అత్తారింట్లో అందరూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఆయనకైతే నేనంటే ప్రాణం. కానీ, నేనే... వాళ్ళేదన్నా చెప్తే నాకిష్టమైతే చేసేదాన్ని, లేకపోతే లేదు. అయినా వాళ్ళు నన్ను పల్లెత్తుమాట అనేవారు కాదు.
మా మరిది పెళ్ళయ్యాక వేరు వెళ్ళిపోదామని చాలా గొడవపెట్టాను. వాళ్ళు చాలా బాధపడ్డారు. నన్నెంతో బతిమాలారు- వద్దని. అయినా నేను వినలేదు. వేరే తీసుకెళ్ళిపోయాను. ఆయన కూడా వాళ్ళని విడిచి సంతోషంగా రాలేకపోయారు.

మా మరిది వ్యాపారంలో నష్టం వచ్చి ఈయనని అప్పుగా డబ్బడిగాడు. నేను ఇవ్వటానికి వీల్లేదన్నాను. పాపం అప్పుడు కూడా నన్ను చాలా బతిమాలారు డబ్బు ఇద్దామని. అయినా నా మనసు కరగలేదు. అంతకు రెండు నెలల ముందే మా ఫ్రెండ్‌ రజనీవాళ్ళకి అయిదు లక్షలు రవీంద్రతోనే అప్పుగా ఇప్పించాను. మా మరిది అడిగిన మూడోరోజే రజనీ, వాళ్ళాయనా ఐపి పెట్టి ఊరొదిలి పారిపోయారు. ‘అమ్మో, ఈ విషయం రవీంద్రకు తెలిస్తే ఇంకేమైనా ఉందా’ అని భయపడి ఈ విషయం అతనికి చెప్పలేదు. చివరికి తెలియనే తెలిసింది. భయంతో గదిలోనే నిలబడిపోయిన నన్ను పిలిచి ‘డబ్బు పోయిందనీ, నేను తిడతాననీ భయపడుతున్నావా... పిచ్చిపిల్లా, వాళ్ళలాంటివాళ్ళని నీకు మాత్రం తెలుసా!

పోతే పోయాయిలే, వాటి గురించి ఆలోచించి బాధపడకు’ అని నన్ను ఓదార్చారు ఆయన.

అంతకుముందు కూడా నా తప్పులకి తను నన్నేమీ అనలేదు. కానీ, ఈసారి ఆయన మంచితనం నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేసింది. నా తప్పుని నాకు తెలియజేసింది. మర్నాడు నేనే మా మరిదికి ఫోన్‌ చేసి పిలిచి డబ్బులిస్తుంటే ఆయన ముఖంలో కనిపించిన సంతోషం ఎన్ని కోట్లు కుమ్మరించినా రాదు. కృతజ్ఞతాపూర్వకంగా తను చూసిన చూపు నన్ను తల దించుకునేలా చేసింది మళ్ళీ. ఆ రోజెందుకో నాక్కూడా చాలా సంతృప్తిగా అనిపించింది. మనవారందరితో మంచిగా కలిసిపోయి ఉంటే ఎంత సుఖంగా సంతోషంగా ఉంటుందో నాకప్పటికిగానీ అర్థంకాలేదు. నాతో అంత ప్రేమగా ఉండేవారందరినీ ఇన్నాళ్ళూ నా ప్రవర్తనతో ఎంత బాధపెట్టాను కదా అని
గిల్టీగా ఫీలయ్యేదాన్ని.

జీవితంలోని ఆప్యాయతలతో కూడిన ఆనందాన్ని అప్పుడప్పుడే అనుభవిస్తున్న నాకు రవీంద్ర అనారోగ్యం ఊహించని పరిణామం. ఆయన మరణం నాకు కోలుకోలేని దెబ్బ. తను ఉన్నన్నాళ్ళూ విలువ తెలియలేదు. పోయిన
దగ్గర నుండీ అన్నీ ఆయన జ్ఞాపకాలే. నేను మొండితనంగా ప్రవర్తించి ఆయనను బాధపెట్టిన సందర్భాలన్నీ గుర్తుకొచ్చి గుండెలో బాధ సుళ్ళు తిరిగేది. నేను ఎంత బాధపెట్టినా ఏనాడూ కటువుగా మాట్లాడని తన మంచితనం ఈ జన్మకు మరచిపోగలనా. భర్త ప్రేమ, భార్యకు భగవంతుడిచ్చిన వరం గౌరీ. దాన్ని నేను సంపూర్ణంగా అందుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఎంత తపించినా ఆయన తిరిగి రావటానికి ఇది కల కాదు కదా!

భార్యాభర్తలు ఆకూ వక్కల్లాంటివారు. వారి బంధం ప్రేమ అనే సున్నంతోనే పండుతుంది. వీటిలో ఏది తక్కువైనా అర్థంలేకుండా పోతుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, ఆప్యాయత, నమ్మకం. అంతేకానీ, మేడలూ డబ్బులూ కాదు. ఇవి తెలీక చాలామంది భార్యాభర్తలు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అమ్మ చెప్పింది- రమేష్‌ మళ్ళీ మంచిగా మారేలా చేసింది నువ్వేనని. నీతోపాటే పెరిగినా నీ బుద్ధి నాకు రాలేదు. నీతో ఎన్నోసార్లు చెప్పాను- రమేష్‌కి విడాకులివ్వమని. నవ్వేసి ఊరుకునేదానివి. ఆ నవ్వులో ఎన్ని అర్థాలు ఉన్నాయో నాకిప్పుడు తెలుస్తోంది. భార్యా భర్తా పాలూ తేనెలా కలిసిపోవాలి. పోలిక పాతదే అయినా అదే నిజం. దాన్ని అర్థం చేసుకున్నవారి జీవితాలు ధన్యం. వారు ఎప్పటికీ ఆదిదంపతులే. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉంటారని ధీమాగా ఉన్న నా గుండె ఆయన వియోగంతో చాలా బలహీనపడిపోయింది. ఆయన తోడు లేకుండా బతకడానికి నాకు శక్తి చాలటం లేదు. ఎప్పుడో ఒకరోజు ఈ గుండె ఆగిపోతుంది గౌరీ. అమ్మా నాన్నా జాగ్రత్త. రాధీ నీ పెంపకంలో నీలాగే సహనశీలిలా ప్రేమమూర్తిలా తయారవుతుంది. నాకా నమ్మకం ఉంది. ఉంటా...

నీ
సుజాత

తల్లి ఉత్తరం చదివిన రాధిక కళ్ళు కన్నీళ్ళతో మసకబారాయి. అమ్మ తనమీదెంత నమ్మకం పెట్టుకుంది. ఇన్నాళ్ళూ అమ్మమ్మా పెద్దమ్మా చెపుతున్నా తానెంత మూర్ఖంగా ప్రవర్తించింది... ఛీ ఛీ, తను మనిషేనా! సాకేత్‌ నిజంగానే శ్రీరాముడి లాంటివాడు. ఈ లెటర్‌ చదివాక తన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి. పోనీలే, సమయం మించిపోకముందే తను కళ్ళు తెరిచింది. మారిన తనను చూసి అత్తయ్యా, సాకేత్‌ ఎంత ఆనందపడతారో.

‘థ్యాంక్యూ అమ్మా, నువ్వీ లెటర్‌ రాయకపోయుంటే నా తప్పు నాకు ఎప్పటికీ తెలిసేది కాదేమో. థ్యాంక్యూ పెద్దమ్మా, నువ్వీ లెటర్‌ చదవమని నాకిచ్చుండకపోయుంటే నేను మారేదాన్నికాదేమో. మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్‌’ అనుకుని, ‘‘అమ్మమ్మా, నా సెల్‌ ఎక్కడ పెట్టావు. నేను అర్జంట్‌గా సాకేత్‌కి ఫోన్‌ చేయాలి. తనని వెంటనే రమ్మనాలి. రేపు పొద్దుటే మా ఇంటికెళ్ళిపోవాలి’’ అని అమ్మమ్మకి వినపడేలా పెద్దగా చెప్తూ, హాల్లోకొచ్చి టీపాయ్‌ మీద సెల్‌ తీసుకుని గదిలోకెళ్ళిపోయింది హడావుడిగా. రాధీ మాటలకి పక్కగదిలో నుండి బయటికొస్తున్న రాధమ్మా, అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతూ ఆ మాటలు విన్న గౌరీ ఒకరినొకరు చూసుకుని మనశ్శాంతిగా చిరునవ్వు నవ్వుకున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.