close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నమూనా రాకెట్‌ లాంచ్‌ చేశాం!

నమూనా రాకెట్‌ లాంచ్‌ చేశాం!

రాకెట్లూ, విమానాలూ, భారీ పరిశ్రమలూ... మొదలైన రంగాల్లో ఇంజిన్ల తయారీ, సాఫ్ట్‌వేర్‌ సేవల్ని అందించే సంస్థ హనీవెల్‌. తమ ఉద్యోగుల పిల్లలకోసం ఈ సంస్థ ఏటా ‘హనీవెల్‌ లీడర్‌షిప్‌ ఛాలెంజ్‌ అకాడమీ(హెచ్‌.ఎల్‌.సి.ఎ)’ని  అమెరికాలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి వెళ్లొచ్చిన హైదరాబాద్‌ కుర్రాడు రోహిత్‌ తిరుమలశెట్టి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నాడిలా...

నీవెల్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అభివృద్ధి, పరిశోధన విభాగాలున్నాయి. అందులో భారత్‌ ఒకటి. తమ ఉద్యోగుల పిల్లల్లో 16-18 ఏళ్ల మధ్య వారిని స్టెమ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) సబ్జెక్టులవైపు ప్రోత్సహించేందుకు ఏటా హెచ్‌.ఎల్‌.సి.ఎ.ని నిర్వహిస్తున్నారు. దీనికి అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఉన్న ‘యునైటెడ్‌ స్టేట్స్‌ స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సెంటర్‌ (యూఎస్‌ఎస్‌ఆర్‌సీ)’ వేదిక. ఇది నాసాకు అనుబంధంగా పనిచేసే సంస్థ. ఇక్కడ రాకెట్‌ సైన్స్‌ రీసెర్చ్‌ యూనిట్‌, రాకెట్‌ లాంచ్‌ పాడ్‌తోపాటు మ్యూజియం కూడా ఉంది. ఈ ఏడాది హెచ్‌.ఎల్‌.సి.ఎ.కి ఎంపికైన 162 మందిలో నేనొకడిని. ఇండియా నుంచి మొత్తం 23 మంది ఎంపికవగా హైదరాబాద్‌ నుంచి నేనొక్కడినే ఉన్నాను. ‘ఈ ప్రోగ్రామ్‌ నీకు ఎలా ఉపయోగపడుతుంది?’ లాంటి ప్రశ్నలకు రాసిన సమాధానాలతో పాటు అలవాట్లూ, ఇతర అఛీవ్‌మెంట్లూ, లక్ష్యాలూ... మొదలైన అంశాల్ని పరిశీలించాక దీనికి ఎంపిక చేస్తారు.

అదే నా లక్ష్యం...
నాన్న ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి. ఆయన ఎక్కువగా విమానాలూ, రాకెట్ల గురించి చెబుతుంటే  వినేవాణ్ని. అలా చిన్నప్పట్నుంచీ వాటిపైన ఆసక్తి పెరుగుతూ వచ్చింది. హనీవెల్‌లో ఏటా రికగ్నిషన్‌ డే ఉంటుంది. ఉద్యోగులు చేసే ప్రాజెక్టుల్ని ఆరోజు కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తారు. అలా ఓసారి వెళ్లినపుడే ఏరోస్పేస్‌ విభాగంలో సైంటిస్ట్‌ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం ఆటోమొబైల్‌ విభాగంలో డిప్లొమా(రెండో సంవత్సరం-ఎస్‌జీఎమ్‌జీ పాలిటెక్నిక్‌ కాలేజీ) చేస్తున్నాను. ఏరోనాటికల్‌ లేదా ఏరోస్పేస్‌ విభాగంలో పీజీ చేసి ఆపైన రీసెర్చ్‌ చేయాలనేది నా ఆలోచన.

హెచ్‌.ఎల్‌.సి.ఎ.లో ప్రధానంగా సైన్స్‌, మ్యాథ్స్‌, కోడింగ్‌, ఇంజినీరింగ్‌ నైపుణ్యాల్ని ఉపయోగించి వారిచ్చే టాస్క్‌లు చేయాల్సి ఉంటుంది. మార్చి 2-8 మధ్య మా ప్రోగ్రామ్‌ జరిగింది. ఫిబ్రవరి 28న ఇక్కడ నుంచి అమెరికా బయలుదేరాను. న్యూజెర్సీలో మామయ్య వాళ్ల ఇంట్లో రెండ్రోజులు ఉండి మార్చి రెండో తేదీన యూఎస్‌ఎస్‌ఆర్‌సీకి చేరుకున్నాను. విద్యార్థులందరూ వచ్చేసరికి ఆరోజు మధ్యాహ్నం అయింది. లంచ్‌ తర్వాత క్యాంపస్‌ మొత్తం చూపించారు. సాయంత్రం అక్కడున్న మైదానంలో ఫుట్‌బాల్‌ ఆడుకోమన్నారు. ఆ మైదానంలోనే ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. తర్వాత రోజు మా అందరినీ 10 గ్రూపులుగా విభజించారు. ప్రతి ఒక్కరికీ జంప్‌ సూట్‌ ఇచ్చారు. ప్రోగ్రామ్‌ మొత్తం ఆ డ్రెస్‌తోనే ఉన్నాం. తర్వాత అది మాకే ఇచ్చేశారు. రెండో రోజు లంచ్‌ తర్వాత అసలు శిక్షణ మొదలైంది. రాకెట్‌ సైన్స్‌ అంటే ఏంటి, మొదట రాకెట్లని ఎవరు లాంచ్‌ చేశారు, వీటివల్ల ప్రయోజనాలేంటి... తదితర అంశాల గురించి చెప్పారు.

రాకెట్‌ తయారు చేశాం...
మూడో రోజు నుంచీ ఛాలెంజ్‌లు ఇవ్వడం మొదలైంది. ఆరోజు ఫ్లైట్‌ సిమ్యులేటర్స్‌ దగ్గరికి తీసుకువెళ్లారు. అవన్నీ నిజంగా విమానంలో వాడే కాక్‌పిట్‌లే. విమానం టేకాఫ్‌ చేయడం, నడపడం, ల్యాండింగ్‌లాంటి విషయాల్ని మూడు గంటలపాటు చెప్పారు. సిమ్యులేటర్‌ని నడుపుతూ వర్చువల్‌గా లక్ష్యంమీద బాంబులు వేయడం మాకిచ్చిన మొదటి ఛాలెంజ్‌. ముగ్గురు చొప్పున ఒక జట్టుగా ఏర్పడి ఛాలెంజ్‌ని పూర్తి చేశాం. దీనిలో
సిమ్యులేటర్‌ మీద ఆపరేట్‌ చేస్తుంటే స్మార్ట్‌తెరమీద మనం నడిపే విమానం కనిపిస్తుంది. మిగతా ఇద్దరితో సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ పూర్తిచేయాలి. అప్పుడు నిజంగానే ఫైటర్‌ ప్లేన్‌లో ఉన్నట్టు అనిపించింది. నాలుగో రోజు షటిల్‌ లాంచ్‌ గురించి చెప్పి తర్వాత నమూనా రాకెట్‌ తయారుచేసి లాంచ్‌ చేయమన్నారు. అందుకు అవసరమైన సామగ్రితోపాటు, ఫిజిక్స్‌ సూత్రాల పుస్తకమూ మాకిచ్చారు. మేమే వివిధ పరికరాల కొలతలు తీసుకుని వస్తువుల్ని కట్‌చేసి నమూనా రాకెట్‌ని తయారుచేశాం. దాన్ని లాంచ్‌ చేశాం కూడా. అది బాగా లాంచ్‌ అయింది. అలా రాకెట్‌ పనితీరు గురించి ప్రయోగ పూర్వకంగా తెలుసుకోగలిగాం. రాకెట్‌ లాంచ్‌ కోసం అవసరమైన చిప్‌ల తయారీనీ నేర్పారు. ఆరోజు రాకెట్ల నేపథ్యంలో ఉండే సినిమా చూపించారు.

గాల్లో తేలినట్టు...
అయిదో రోజు ‘జీ(గ్రేవిటేషనల్‌) ఫోర్స్‌’ అనే పెద్ద రూమ్‌కి వెళ్లాం. అక్కడ వివిధ గ్రహాలమీద గురుత్వాకర్షణ ఎలా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. మాకు చంద్రుడిపైన ఉన్నట్టు చూపించారు. ఒక స్ప్రింగ్‌కి బెల్టుల సాయంతో కట్టి ఆ రూమ్‌లో మమ్మల్ని వేలాడగట్టారు కాసేపటి తర్వాత చూసుకుంటే శరీరం మన ఆధీనంలో లేనట్టనిపించింది. చేతులూ, కాళ్లూ కదుపుతుంటే కదిలేవి కాదు. ఎంత బలం ఉపయోగించినా కొద్దిగానే కదిలేవి. ‘నేనేంటి ఇంత తేలిగ్గా అయిపోయాను, నా బరువంతా ఏమైంద’ని కాసేపు అనిపించినా తర్వాత దాని వెనకున్న సైన్స్‌ అర్థమైంది. ఆరోజు సాయంత్రం ‘స్పేస్‌ నెక్స్ట్‌’ సినిమా చూపించి... ఆ కథలో వాస్తవం ఎంత, ఊహ ఎంత అనేది విడమర్చి చెప్పారు. ఆరో రోజు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పనితీరు గురించి తెలుసుకున్నాం. అక్కడ వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారో వివరిస్తూ... ఒక ఎండిపోయిన పాలకూర కాడను చూపించారు. దాన్ని ఆవిరిలో పెడితే ఉడికినట్టు అయింది. అలా చేసుకుని తింటారట. భూమి తర్వాత గ్రహాల్లో మానవ మనుగడకు అవకాశం ఉన్నది అంగారకుడిపైనే. అందుకని అక్కడికి వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న రాకెట్ల అభివృద్ధిమీద ప్రధానంగా దృష్టి పెడుతోంది నాసా. ఆ విశేషాల్ని చెబుతూ ‘మీరే మార్స్‌ మీద తొలి పౌరులు అయినా కూడా ఆశ్చర్యపోవద్ద’న్నారు. చివరి రోజు అందరం ఒకచోట కలిసి సరదాగా మాట్లాడుకున్నాం. సాయంత్రం డిన్నర్‌, గ్రాడ్యుయేషన్‌ జరిగింది. ఆరోజు రాత్రి అక్కడే ఉండి మర్నాడు ఉదయం బయలుదేరి వచ్చేశాం.

జీవిత పాఠాలు...
మేం ఉండేందుకు- ఏడుగురికి ఒక పెద్ద రూమ్‌ చొప్పున ఇచ్చారు. రోజూ ఉదయం ఏడున్నరకి రూమ్‌ నుంచి వెళ్తే తిరిగి సాయంత్రం ఎనిమిదింటికి భోజనం చేసి రూమ్‌కి వచ్చేవాళ్లం. వివిధ రంగాలలో నిపుణులైనవారు రోజుకొకరు చొప్పున సాయంత్రం వేళలో వచ్చి మాట్లాడేవారు. ఓరోజు గిబ్సన్‌ అనే ఏరో స్పేస్‌ సైంటిస్ట్‌ వచ్చారు. అపోలో మిషన్లతో సహా ఆయన ఇప్పటివరకూ 35 మిషన్లలో పాల్గొన్నారు. ఇంకో రోజు నాసా ప్రతినిధి వచ్చారు. మరో రోజు అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వచ్చి విమానయానం, అంతరిక్ష రంగాల్లో పైచదువుల గురించి చెప్పారు. ప్రతి ఛాలెంజ్‌ సమయంలోనూ ఒక స్థాయి వరకూ ట్రైన్‌ చేసి వదిలేసేవారు. దానివల్ల ఏదైనా సొంతంగా చేయడం అలవాటైంది. ఇదివరకు విమానాలు గాల్లో ఎగురుతాయి, రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్తాయి అని మాత్రమే తెలుసు. వాటి వెనక ఉన్న సైన్స్‌ గురించి ఈ కార్యక్రమంలో బాగా తెలిసింది. రాకెట్లు అంతరిక్షంలో ప్రయాణించినపుడు ఒత్తిడికారణంగా వేల డిగ్రీల హీట్‌ వస్తుంది. ఆ వేడిని తట్టుకోవడానికి ఎలాంటి క్యాప్సూల్స్‌ తయారుచేస్తున్నారో తెలుసుకున్నాం. మ్యూజియంలో అపోలో మిషన్‌లో ఉపయోగించిన క్యాప్సూల్‌ని చూశాం.

ప్రపంచమంతా స్నేహితులే...
ఈసారి ప్రోగ్రామ్‌కి 35 దేశాలవాళ్లు వచ్చారు. వాళ్లలో అత్యధికంగా అమెరికన్లు ఉన్నారు. తర్వాతి స్థానం మనవాళ్లదే. మా గ్రూప్‌లో బెంగళూరుకు చెందిన స్మృతి అయ్యర్‌తోపాటు బ్రెజిల్‌, చెక్‌ రిపబ్లిక్‌, కెనడా, జర్మనీ, జార్జియా, హంగేరి, అమెరికాకు చెందినవాళ్లు ఉన్నారు. ప్రతిభ పరంగా ఒకరిని మించి ఒకరన్నట్టున్నారు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ, అందరినీ కలుపుకుంటూ పనిచేసేవాళ్లం. ఎంత క్లిష్టమైన ఛాలెంజ్‌నైనా ఒత్తిడి లేకుండా, ఎంత సులభంగా చేయొచ్చో తెలుసుకున్నాం. గ్రూప్‌ సభ్యులతో మాట్లాడుతూ ఆయా దేశాల సంస్కృతిని తెలుసుకునేవాళ్లం. నేనిప్పటి వరకూ ఎక్కడా పనిచేసింది లేదు. కానీ అక్కడకి వచ్చినవాళ్లలో 80 శాతం చదువుకుంటూ ఏదో ఒక పనిచేస్తున్నవాళ్లే. జార్జియా అమ్మాయికి జ్యువెలరీ వెబ్‌సైట్‌ ఉంది. తన కాలేజీ ఫీజులు తనే కట్టుకుంటుందట. కొందరు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు ట్యూషన్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్లలా కష్టపడటం ఆశ్చర్యంగా అనిపించింది. చైనా, థాయ్‌లాండ్‌ మొదలైన ఆసియా దేశాల వాళ్లు మాత్రం మనలానే తల్లిదండ్రులమీద ఎక్కువ ఆధారపడుతున్నారు.

ఇక అమెరికా అమ్మాయిలైతే ఫుట్‌బాల్‌ భలే ఆడుతున్నారు. పాస్‌లు సరిగ్గా తీసుకోకుంటే కోప్పడుతున్నారు కూడా. ఆటల్లో ఎంత ముందున్నారో వాళ్లని చూశాక అర్థమైంది. మా గ్రూపులోని బ్రెజిల్‌ అబ్బాయి బ్రూనో నాకు మంచి స్నేహితుడయ్యాడు. ఆ అబ్బాయి ఫుట్‌బాల్‌ బాగా ఆడుతున్నాడు. నేను హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాను. అక్కడ ఫుట్‌బాల్‌ ఆడేవాణ్ని. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు నెయమర్‌ అంటే నాకు ఇష్టమని తెలిశాక మా స్నేహం మరింత బలపడింది. మేం ఇప్పుడూ టచ్‌లో ఉన్నాం. అలా 35 దేశాల నుంచి వచ్చిన వాళ్లమంతా స్నేహబృందంగా ఏర్పడ్డాం. అక్కడున్నన్ని రోజులూ పూటకో దేశం వంటకాల్ని పెట్టేవారు. కొత్త ఫుడ్‌ ట్రై చేయడం నాకు ఇష్టం. అన్నీ ఇష్టంగా తినేవాణ్ని.

ఈ పర్యటనలో న్యూయార్క్‌ వెళ్లి స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, టైమ్స్‌ స్క్వేర్‌ చూశాను. నాకు మార్చి మధ్య నుంచి పరీక్షలున్నాయి. అందుకే ప్రోగ్రామ్‌ పూర్తవగానే వచ్చేశాను. కానీ నాతోపాటు ఇండియా నుంచి వచ్చినవాళ్లలో కొందరు అదనంగా 10-15 రోజులున్నారు. ఆ ఒక్క విషయంలోనే  కాస్త అసంతృప్తి. మిగతా అన్ని విధాలా ఈ పర్యటన జీవిత కాలం గుర్తుండిపోతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.