close
‘ఈడెవడో భలే కట్‌ చేశాడ్రా’

‘ఈడెవడో భలే కట్‌ చేశాడ్రా’

సినిమా విందు భోజనం అనుకుంటే... టీజర్‌ సూపులాంటిది. అలాంటి టీజర్లనూ, ట్రైలర్లనూ కట్‌ చేయడంలో అందెవేసిన చేయి నవీన్‌ నూలిది. గత పదేళ్లలో మనం చూసిన ప్రచార చిత్రాల్లో ఎక్కువ శాతం నవీన్‌ ‘కట్‌’ చేసినవే. ఆ అనుభవంతో ఎడిటర్‌గానూ మారాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘తొలిప్రేమ’... ఇలా సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఈ యువకెరటం ఎగసిన తీరు అతని మాటల్లోనే..

డిటర్‌ బాధ్యత సినిమాని ‘కట్‌’ చేయడమే అనుకుంటారు చాలామంది. నిజానికి ఓ సినిమా భవిష్యత్తుని నిర్ణయించేది ఎడిటింగ్‌ టేబులేనని నేను నమ్ముతా. ఓ యావరేజ్‌ సినిమాని ఎడిటింగ్‌ నైపుణ్యంతో సూపర్‌ హిట్‌ చేయొచ్చు. అదే ఎడిటింగ్‌ లోపంతో ఓ మంచి సినిమాని పాడుచేయనూ వచ్చు. సినిమాని చూసే మొదటి ప్రేక్షకుడు... ఎడిటరే. అందుకే అనుకుంటా సినిమాలో 24 విభాగాలున్నా... నా మనసు ‘కత్తెర’నే ఎంచుకుంది.

సొంతంగానే నేర్చుకున్నా...
మాది మెదక్‌. రాందాస్‌ పల్లిలో పుట్టాను. నాన్న మహీపతిరావు బ్యాంకు ఉద్యోగి. నాకో చెల్లాయి. ఇంట్లో నాన్న కంటే అమ్మ చాలా స్ట్రిక్టు. సినిమాకెళ్లాలంటే భయం. పదోతరగతిదాకా థియేటర్‌కే వెళ్లలేదంటే నమ్మండి. నా చదువు బాగానే సాగేది. మా బ్యాచ్‌లో నేనే ఫస్టు. ఆటలూ, అల్లరిపనులూ ఉన్నా అవన్నీ పరిమితి మేరకే. ఒకరికింద పనిచేయడం కాకుండా స్వతంత్రంగా ఎదగాలన్న స్వభావం నాది. వ్యాపారాల గురించీ పెద్దగా తెలీదు. దాంతో డిగ్రీ చేసేటప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ విజయకు సినిమాల గురించి పెద్దగా తెలీదు. నేనేమీ అల్లరిచిల్లరగా తిరిగేవాణ్ణి కాదు కాబట్టి నాన్నగారూ అభ్యంతరపెట్టలేదు. ‘ఏం చేసినా సిన్సియర్‌గానే చేస్తాడు’ అనుకున్నారు. కానీ చెల్లి పెళ్లయ్యాక నాన్నగారు అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి మా  మావయ్య ఒకరు టెలీఫిల్మ్‌లు చేస్తుంటే నేనూ ఆయనతో పాటు వెళ్లడం మొదలుపెట్టా. ముందు ఎడిటింగ్‌ నేర్చుకుంటే... సినిమా గురించిన అన్ని విభాగలపైనా అనుభవం వస్తుందనిపించింది. దాంతో అటువైపు చూపుసారించా. నేనేం చేసినా దానికి సంబంధించి ముందుగా చిన్నసైజు రీసెర్చ్‌ చేయడం అలవాటు. అలా ఎడిటింగ్‌పైన అవగాహన పెంచుకున్నాకే ఆ దిశగా అడుగులేశా. కొంత నేర్పు ఒంటపట్టిందనుకున్నాక ఓ టీవీ ఛానల్‌లో ఉద్యోగిగా చేరా. అది నాకు కావల్సినంత అనుభవాన్ని సంపాదించి పెట్టింది. అప్పుడే నా స్నేహితుడు మాధవ్‌ ద్వారా ప్రేమ్‌ రక్షిత్‌ని కలిశాను. అక్కడి నుంచి ప్రొమో ఎడిటర్‌గా నా ప్రయాణం మొదలైంది. ప్రభాస్‌ నటించిన ‘మున్నా’ ట్రైలర్లు నేనే కట్‌ చేశాను.

ఏదో అసంతృప్తి...
నిజానికి అప్పటిదాకా థియటరికల్‌ ట్రైలర్లు తప్ప టీజర్లూ, పాటల ప్రొమోలూ లేవు. ‘మున్నా’తో మొదలైన ఆ ట్రెండ్‌ బాగా జోరందుకుంది. అప్పటి నుంచీ మూడేళ్లదాకా అదే పని చేశా! కానీ ఒకదశలో ‘ఈ మూడేళ్లలో ఏం చేశాను’ అని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ‘నేను’ కనిపించలేదు! ఇంత పని చేసినా, ఇన్ని సినిమాల టీజర్లు కట్‌ చేసినా ‘నవీన్‌ అంటే ఎవరు’ అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు ఏ జవాబూ రాలేదు. చేతినిండా పని ఉంటోంది, డబ్బులొస్తున్నాయి అయినా ఏదో అసంతృప్తి. ఏం చేసినా ‘సోలో’గా చేయాలనిపించింది. నాకు నేనే సొంతంగా కట్‌ చేసిన తొలి ట్రైలర్‌ సుకుమార్‌ రూపొందించిన ‘జగడం’. అక్కడి నుంచి నాకంటూ ఓ గుర్తింపు రావడం మొదలైంది. ఓ సీజన్‌లో పది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంటే... అందులో ఏడెనిమిది ట్రైలర్లు నేనే కట్‌ చేసేవాణ్ణి. దాదాపుగా అయిదువందల సినిమాలకు ట్రైలర్లు, టీజర్లూ చేసిచ్చా.

లాస్ట్‌ పంచ్‌ మనదైతే...
దర్శకులు కొన్నిసార్లు రషెష్‌ మొత్తం ఇచ్చేవారు. అందులోంచి ది బెస్ట్‌ ఏరుకుని టీజర్‌, ట్రైలర్‌ కట్‌ చేసేవాణ్ణి. చివర్లో పంచ్‌ డైలాగ్‌ పెట్టడం.. నేనొచ్చిన కొత్తలో ఓ ట్రెండ్‌. ‘యమదొంగ’ ట్రైలర్‌కి ఇలాంటి ప్రయత్నం చేశాను. థియేటర్లో ఆ ట్రైలర్‌ చూసిన ఓ ప్రేక్షకుడు ‘ఈడెవడో.. భలే కట్‌ చేశాడ్రా’ అన్న మాటలు నా చెవిన పడ్డాయి. ‘అత్తారింటికి దారేది’ ట్రైలర్‌ గుర్తుందా? చివర్లో ‘లాస్ట్‌ పంచ్‌ మనదైతే అందులో వచ్చే కిక్కే వేరబ్బా’ అనే డైలాగ్‌ వినిపిస్తుంది. రషెస్‌లో ఉన్న ఆ డైలాగ్‌ని తీసుకొచ్చి లాస్ట్‌ పంచ్‌గా పెట్టింది నేనే. దాంతో మిగతావాళ్లు ఎడిటింగ్‌ చేసినా సరే ప్రొమోలూ, పది సెకన్ల బుల్లి టీజర్లకి మాత్రం దర్శకులు నా దగ్గరకే వచ్చేవారు. అలా కొన్ని వందల చిత్రాలకి చేశాక ‘ఖలేజా’ సినిమాకి టీజర్‌, ట్రైలర్‌తోపాటూ ఓ పాటనీ ఎడిట్‌ చేయమన్నారు. అది చేసేటప్పుడే త్రివిక్రమ్‌ సహాయకుడు సాయి దగ్గరయ్యాడు. అప్పటి నుంచి ఆయన అందిస్తున్న సహకారం అంతా ఇంతా కాదు. ‘ఖలేజా’ నుంచి దాదాపు త్రివిక్రమ్‌గారి అన్ని సినిమాలకూ నేనే ప్రొమోలు కట్‌ చేశా. వంశీ పైడిపల్లి, కొరటాల శివలకి మొదటి సినిమా నుంచీ ఇప్పటి వరకూ ట్రైలర్లు నేనే రూపొందించా. వాళ్లతో నాకు మంచి అనుబంధం ఉంది.

ఎడిటింగ్‌ ఇంత దారుణమా!
తెలుగులో నేను పూర్తిస్థాయిలో ఎడిటింగ్‌ చేసిన తొలి చిత్రం ‘రోమియో’. గోపీ గణేష్‌ దర్శకుడు. ఆ సినిమాతోనే స్నేహితుడిగా మారాడు. అతని వల్లే నేను ఇల్లు కొన్నా. మా పెళ్లికి కూడా తనే మధ్యవర్తి. జీవితంలో నేను సాధించిన అన్ని విజయాల్లో అతను తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత వరసగా ‘మాయ’, ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌’ లాంటి చిన్న చిన్న సినిమాలకు ఎడిటింగ్‌ చేశా. ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌’కి ఉత్తమ ఎడిటర్‌గా నాకు నంది అవార్డు కూడా వచ్చింది! కృష్ణవంశీగారి ‘గోవిందుడు అందరివాడేలే’కీ పనిచేశా. నాకు పాటల్లో ఎఫెక్ట్స్‌ వేయడం చాలా ఇష్టం. కానీ ఆ సినిమాకి చేసిన ఎఫెక్ట్స్‌ కొన్ని కారణాల వల్ల ఫెయిల్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ చేయడానికి తగినంత సమయం లేకపోవడం, డీఐ విభాగంలో చేసిన తప్పుల వల్ల... కొన్ని సన్నివేశాలు పేలవంగా వచ్చాయి. అవి చూసినవాళ్లందరూ ‘ఏంట్రా ఎడిటింగ్‌ ఇంత దారుణంగా ఉంది’ అనుకున్నారు. దాంతో నా బుర్ర తిరిగిపోయింది. ‘ఎడిటింగ్‌ అనేది మన చేతుల్లో లేదు. ఇది మనకు సెట్‌ అవ్వదు’ అనిపించింది. సినిమాలకి దూరమైపోదామనుకున్నా.

నేనూ... దేవీశ్రీ
ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్‌ కనిపించాడు. ‘జులాయి’ కోసం ఆయన చేసిన ఓ ప్రొమోతో ఏర్పడ్డ పరిచయం మాది. ‘సినిమాలు మానేస్తా’ అని చెప్పగానే ‘ఇలాంటి నిర్ణయాలేం తీసుకోకు.. సుకుమార్‌లాంటివాళ్లు తగిలితే నీ కెరీరే మారిపోతుంది’ అని నాకు నచ్చజెప్పాడు. అంతేకాదు ‘సుకుమార్‌ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు.. వెళ్లి  ఒక్కసారి కలువ్‌’ అని సలహా ఇచ్చాడు. ఆయనతో ‘ఆర్య 2’ ప్రొమోలకి పనిచేశానుకానీ ఇప్పుడు నేను గుర్తుంటానో లేదో తెలియదు. దేవి చెప్పాడని సందేహిస్తూనే వెళ్లి కలిశాను. అలా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమాతో నా కెరీర్‌ ట్రాక్‌లో పడింది. అప్పటి నుంచీ దేవిని నా సొంత అన్నదమ్ముడిలాగే చూస్తున్నా. తనూ నా విజయాల్ని సొంత విజయాల్లా అనుకుంటాడు. సినిమాలు కాకుండా అప్పుడప్పుడూ మ్యూజిక్‌ షోలు చేస్తుంటాడు దేవి. ఆ వీడియోలనూ నేనే ఎడిట్‌ చేస్తుంటా. తను చేసే అన్ని ప్రాజెక్టుల్లోనూ నాకు భాగస్వామ్యం అందించాడు. ‘నాన్నకు ప్రేమతో’తో ఓ విధంగా నా జోరు మొదలైంది. ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘తొలిప్రేమ’ అన్నీ చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి నాకు.

నిడివితో సంబంధంలేదు...
సినిమా నిడివి ఎంత ఉండాలి అనేది దర్శకుడి చేతుల్లో ఉంటుంది. సినిమా బోర్‌ కొట్టనంత వరకూ నిడివి విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ‘రంగస్థలం’ 2 గంటలా 50 నిమిషాల సినిమా. ‘తొలి ప్రేమ’ రెండు గంటల్లో అయిపోతుంది. రెండింటినీ కట్‌ చేసింది నేనే. రెండూ ప్రేక్షకులకు నచ్చాయి. ‘రంగస్థలం’ సినిమా ఎడిట్‌ సూట్‌లో ఉన్నప్పుడే నాకు నచ్చేసింది. ‘త్వరలో బ్లాక్‌ బ్లస్టర్‌ రాబోతోంది’ అని దర్శక నిర్మాతలకు మెసేజ్‌ పంపా. నిజానికి ఎడిటర్‌ ఎప్పుడూ ఇంత తొందరపడి స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదు. కానీ ఆ సినిమా విషయంలో అలా ఉండకలేకపోయా. అంతేకాదు.. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌ టీజర్‌ని కట్‌ చేసినప్పుడు చాలా అనుమానాలొచ్చాయి. చరణ్‌ పాత్ర ఎలా ఉంటుందో ముందే చెప్పడం బెటర్‌’ అని సుకుమార్‌తో చెప్పాను. ఆయన దానికి ఒప్పుకోవడంతో నా వెర్షనే జనాల్లోకి వచ్చింది. అనుకున్నట్టే ఆ టీజర్‌ సినిమాపైన ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసింది. ‘శ్రీమంతుడు’ టీజర్‌లోనే కథకు మూలమైన ఊరి దత్తత అనే పాయింట్‌ని చెప్పేశాం. ఈ విషయంలోనూ దర్శక నిర్మాతల్ని కన్విన్స్‌ చేయాల్సివచ్చింది. ‘తొలిప్రేమ’ విశ్రాంతి ఘట్టం విషయంలోనూ నేనిచ్చిన కొన్ని సూచనలు వర్కవుట్ అయ్యాయి. ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘ముద్ర’ సినిమాలతోపాటూ రవితేజ, శర్వానంద్‌ల తాజా చిత్రాలు చేస్తున్నా. ‘చదరంగ వేట్టై’, ‘టూ స్టేట్స్‌’ చిత్రాల రీమేక్‌లకూ నేనే ఎడిటర్‌ని. ఇవి కాక మరో మూడు నాలుగు లైన్‌లో ఉన్నాయి. కథ ఏదైనా ఎడిటర్‌ ఎలాంటి మార్పులూ చేయలేడు. దాని ఆత్మను మార్చలేడు. కానీ రూపం మార్చగలడు. కాకపోతే మేం చెప్పేది దర్శకుడు నమ్మాలి. అలా నమ్మాలంటే... ఎడిటర్‌ చేతిలో సక్సెస్‌లు ఉండాలి! అందుకే నా ప్రతిసినిమాకీ విజయం దక్కాలని అనుక్షణం ప్రయత్నిస్తుంటా!

ఆమె చాలా ముక్కుసూటి...

నా శ్రీమతి పేరు నీహారిక. పెద్దలు కుదిర్చిన పెళ్లే. ఆమె నాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఆ లక్షణం నచ్చే ప్రేమించా. ‘నీ దగ్గర ఏముంది? ఎంతుంది? ఏమవ్వాలనుకుంటున్నావ్‌’ అనేం అడక్కుండా... నన్ను నన్నుగా ఇష్టపడింది. మాకిప్పుడు ఓ బాబు. నివాన్‌ అని పేరు పెట్టుకున్నాం. నీహారిక ఎల్‌ అండ్‌ టీలో పనిచేసేది. బాబుని చూసుకోవాలి కదా, అందుకే ఇప్పుడు ఇంట్లోనే ఉంటోంది. మా బావ ప్రదీప్‌ పూడి. ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి ఉన్నారు కదా, ఆయన సోదరుడు. వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు. మా చెల్లాయిని ఆయనకే ఇచ్చాం. చాలా విషయాల్లో నాకు వెన్నుదన్నుగా నిలిచారు. నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నాకు చాలా ఆప్తుడు. ‘డార్లింగ్‌’ నుంచీ పరిచయం. ఆయన సంస్థలో వచ్చిన అన్ని సినిమాలకూ నేను పనిచేశా. నాకు పనేం లేకపోయినా ఆయన ఆఫీసుకు వెళ్తుంటా. ఓ విధంగా సొంత సంస్థలా అనిపిస్తుంది. ‘శతమానం భవతి’, ‘ఊపిరి’లాంటి చిత్రాలకు పనిచేసిన ఎడిటర్‌ మధు.. నాకు మరో ఆప్తుడు. మేం అన్ని విషయాలూ ఓపెన్‌గా మట్లాడుకుంటాం.

- మహమ్మద్‌ అన్వర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.