close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వద్దొద్దు... కూర్చోవద్దు..!

కాళ్లు కిందకి వేలాడేస్తూ ఎత్తుమీద కూర్చుంటే సౌకర్యంగా ఉంటుందన్న కారణంతో పీట నుంచి కుర్చీ అలవాటు చేసుకున్నాడు మనిషి. చెక్కకుర్చీలో చాలాసేపు కూర్చుంటే నొప్పని దానికో మెత్తని పరుపు కుట్టించాడు. ఎంతసేపని నిటారుగా కూర్చుంటాం, కాసేపు వెనక్కి వాలితే బాగుంటుంది కదా... మడత కుర్చీ తయారైంది. కుర్చీలోంచి లేవకుండానే ఎటు అంటే అటు కదలాలిగా... రివాల్వింగ్‌ ఛెయిరూ రూపొందింది. మరింత ఆరామ్‌గా కూర్చోవాలనుకుంటే బీన్‌బ్యాగూ వచ్చింది. మొత్తానికి సుఖంగా కూర్చోవడానికి ఆధునిక మనిషి వెతుక్కోని మార్గం లేదు. ఫలితం...  వ్యాధులూ అలాగే వెతుక్కుంటూ వస్తున్నాయి.

‘కూర్చుని తింటే కొండలయినా కరుగుతాయి’ అంటారు పెద్దలు. కూర్చుని తింటే జరిగే నష్టం మాట అలా ఉంచి, తినకుండా ఊరికే కూర్చున్నా బోల్డంత నష్టం అంటున్నారు డాక్టర్లు. నిజం, రోజంతా కూర్చునే ఉండేవారితో గుండెజబ్బు జతకడుతుంది. మధుమేహం పిలవని పేరంటంలా వచ్చి కూర్చుంటుంది. కండరాలూ కీళ్లూ బిగుసుకుంటాయి. వెన్నునొప్పి సరేసరి. రక్తప్రసరణ మందగిస్తుంది. మధ్యమధ్యలో పూడికలూ అడ్డుపడొచ్చు. ఎముకలు పెళుసుబారతాయి. మతిమరపూ పలకరిస్తుంది. కుంగుబాటు పొంచే ఉంటుంది. క్యాన్సర్లు హాయ్‌ చెబుతాయి... ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు చాంతాడంత అంటున్నాయి తాజా పరిశోధనలు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాటిలో నాలుగోవంతు మరణాలకి కారణం కూర్చోవడమేనట. అంటే కేవలం వ్యాయామలోపం వల్లే ఏటా దాదాపు 32 లక్షల మంది మరణిస్తున్నారు. వాటిల్లో 21 శాతం రొమ్మూ పేగు క్యాన్సర్లూ, 27 శాతం మధుమేహం, 30 శాతం హృద్రోగ మరణాలని తేల్చారు. క్యాన్సర్‌ కారకాల్లో ధూమపానం తరవాత స్థానం కూర్చోవడానిదేనన్నది ఆస్ట్రేలియా నిపుణుల పరిశీలన. అందుకే ‘కూర్చోవడం ధూమపానంతో సమానం’ అంటున్నారు. రోజుకి ఆరుగంటలకన్నా ఎక్కువ సమయం కూర్చుని ఉంటే ప్యాకెట్టుకి పైగా సిగరెట్లు తాగినట్లే, ఆ మేరకు మరణానికి దగ్గరవుతున్నట్లే. ఒక సిగరెట్టుతో 11 నిమిషాల ఆయుష్షు తరిగిపోతే, ఓ గంట కూర్చోవడం వల్ల 22 నిమిషాల జీవితం కరిగిపోతుంది.

నమ్మశక్యం కాకున్నా నమ్మక తప్పని నిజమిది. సరిగ్గా ఇరవయ్యో శతాబ్దం చివరలో- అంటే కంప్యూటర్‌ యుగంలో పట్టుకున్న ఈ రోగం ఓ పట్టాన వదలడం లేదు.

కూర్చునే తీరికెక్కడ?
కంప్యూటర్లు లేనప్పుడు ఎవరూ కూర్చోలేదా అంటే ఇంతగా లేదనే చెప్పాలి. వేల సంవత్సరాల నుంచీ మనిషి ఒకచోట ఎప్పుడూ పట్టుమని ఓ రెండు గంటలైనా విశ్రాంతిగా కూర్చోలేదు. నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునేవరకూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. ఆడవాళ్లకయితే ఇంటిపనీ, వంటపనీ, పిల్లలపెంపకం, పెద్దవాళ్లను చూడటం... ఇలా శరీరంలోని ప్రతి కండరం కదిలేలా ఎటు అంటే అటు వంగేలా... ఎన్నో పనులు. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం అనేది మహా అయితే అరగంటో గంటో. ఆ సమయంలోనూ ఏదో ఒక పని. మగవాళ్లూ అంతే... పొలంపనులూ ఊరిపనులతో కూర్చునే తీరికెక్కడ? ఆ మధ్యలోనే కర్రసాములూ కత్తిసాములూ. ఇక పిల్లల సంగతి సరేసరి... దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి, కర్రాబిళ్లా, తొక్కుడుబిళ్ల... ఒక్కచోట కూర్చుంటేనా... బడిలోనూ గంటగంటకీ మాస్టారు వచ్చినప్పుడల్లా లేవడం, గుడ్‌మార్నింగ్‌ చెప్పడం. ప్రేయర్లూ వ్యాయామాలూ ఆటలూ... స్థిరంగా కూర్చున్నదెన్నడు? రోజుకి ఎన్ని అడుగులు వేస్తున్నారో లెక్కపెట్టలేనంత కదలిక.

కూర్చోవడమే పని!
మరి ఇప్పుడు... పిల్లలకేమో ఇంటాబయటా స్కూలూ ట్యూషన్లూ కోచింగులూ. ఆడుకునేందుకు టైమే లేదు. సెలవులొచ్చినా... టీవీ స్మార్ట్‌ఫోన్లతోనే కాలక్షేపం. పెద్దవాళ్లయినా అంతే... ఇంట్లో టీవీ, ఆఫీసులో కంప్యూటరూ. ఇంటిపనులన్నింటికీ ఎలక్ట్రిక్‌ సాధనాలు. ఆఫీసుల్లో సీటులోంచి లేచే పనిలేకుండా ఇంటర్‌కమ్‌లూ ఎస్సెమ్మెస్సులూ ఈమెయిళ్లూ. ఒళ్లు అలిసేదెక్కడ? వీటికితోడు బైక్‌లూ ఆటోలూ కార్లూ హాయిగా కూర్చోవడాన్ని మరింత పెంచాయి. లేస్తూనే రెడీ కావడం, బస్సులోనో కారులోనో ఆఫీసుకి వెళ్లి కూర్చోవడం, సాయంకాలం తిరిగి బస్సో కారో ఎక్కి ఇంటికి చేరడం, సోఫాకి అతుక్కుని టీవీ చూస్తూనే భోజనం ముగించుకుని బెడ్డెక్కడం... ఇక, నడిచేదెక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. మొత్తంగా కూర్చోవడం పెరిగింది. ఎంతంటే రోజుకి 12 గంటలకి పైగా. దీనికి పిల్లాపెద్దా ఆడామగా తేడా లేదు.

బిజీ జీవితానికి బద్ధకం కూడా తోడయి, సోఫాలోనుంచి అంగుళం కదలకుండా రిమోట్‌ అనీ ఫ్యాన్‌ స్విచ్‌ వేయమనీ పిలిచేవాళ్లూ లేకపోలేదు. అంటే వాళ్లలో కూర్చునే వ్యాధి బాగా ముదిరినట్లే. కొందరు దీనికి కాస్త భిన్నం. వీళ్లు ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టరు కానీ ఫిట్‌నెస్‌ మంత్ర అంటూ ఉదయాన ఓ గంట వాకింగో ఏరోబిక్సో యోగానో చేసి హమ్మయ్య, ఇక రోజంతా కూర్చున్నా ఏం కాదు అనుకుంటారు. అయితే ‘ఓ గంట వ్యాయామం చేసినంత మాత్రాన గంటల తరబడి కదలకుండా కూర్చుంటే నష్టం ఉండదనుకుంటే పొరపాటే, కాకపోతే నష్టం తీవ్రత రవంత తగ్గుతుందంతే’  అంటోంది బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌.

కూర్చుంటే ఏమవుతుంది?
కూర్చోవడంవల్ల ముందుగా పెరిగేది శరీర పరిమాణమే. ఎందుకంటే జీవక్రియా వేగం నెమ్మదిస్తుంది. దాంతో క్యాలరీలు ఖర్చవడం తగ్గుతుంది. కొవ్వుల్ని కరిగించే లిపో ప్రొటీన్‌ లిపేజ్‌ అనే ఎంజైమ్‌ పనితీరు 90 శాతానికి పడిపోతుంది. అంటే కొవ్వుల్ని జీర్ణం చేసే శక్తి కూడా మందగిస్తుందన్నమాట. ఫలితమే ఊబకాయం. కదలకుండా 20 నిమిషాలు కూర్చున్నా జీవక్రియా వేగం తగ్గుతుంది.

అదే నాలుగు గంటలు కూర్చుంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరుగుదలని నియంత్రించే ఎంజైమ్‌ విడుదల దాదాపుగా ఆగిపోతుంది. ‘నేను ఎక్కువేం తినడం లేదు... అయినా ఎందుకింత లావవుతున్నా’ అన్న సందేహం చాలామందిని పట్టి పీడిస్తుంటుంది. కానీ ఎక్కువ తినడం కాదు, కుర్చీలోంచి కదలకపోవడమే దీనికి కారణం.

అదేసమయంలో క్లోమగ్రంథి పనితీరూ క్రమం తప్పుతుంది. కదలకుండా పది గంటలపైనే కూర్చుంటే, శరీరంలో ఇన్సులిన్‌ స్రావం 40 శాతం తగ్గిపోతుంది. మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారపుటలవాట్లు మంచిగా ఉన్నా ఆనువంశికంగా వచ్చే అవకాశం లేకున్నా కొందరిలో మధుమేహం రావడానికి కారణం కదలకుండా కూర్చోవడమే. అందుకే ఎక్కువ సమయం నిలబడే లేదా నడిచే వాళ్లతో పోలిస్తే కూర్చునేవాళ్లలో మధుమేహం 112 రెట్లు ఎక్కువ. మహిళల్లో- అదీ నలభయ్యేళ్లు దాటిన స్త్రీలలో ఈ సమస్య మరీ ఎక్కువ. అదే మధ్యమధ్యలో లేచి రెండు నిమిషాలు నడిస్తే, ఇన్సులిన్‌ స్రావం పెరిగి రక్తంలో చక్కెర నిల్వలు తగ్గినట్లు అనేక పరిశోధనల్లో తేలింది.

పది గంటల సంగతలా ఉంచండి. కేవలం మూడు గంటలు ఏకబిగిన కూర్చున్నా చాలు, రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. రెండు వారాలపాటు రోజుకి ఆరుగంటలకన్నా ఎక్కువసేపు కూర్చుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితం... గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో క్రమేణా పూడికలు ఏర్పడతాయి. గుండె కొట్టుకునే వేగంలోనూ తేడా వస్తుంది. దాంతో బీపీ పెరిగి, ఏ క్షణంలో గుండె పట్టేస్తుందో చెప్పలేం అంటూ హెచ్చరిస్తోంది ద లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌.

రక్తప్రసరణ మందగించడం వల్ల మెదడుకి రక్తంతోబాటు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. ఫలితంగా మెదడు కణాల్లో రెండు శాతం నశిస్తాయని తేలింది. ఇందుకోసం నాలుగు గంటలపాటు కదలకుండా కూర్చున్నవాళ్ల మెదడును స్కాన్‌ చేసి చూడగా- కొత్తవిషయాలను గుర్తుపెట్టుకునే టెంపోరల్‌ లోబ్‌ భాగంలో కణాల తగ్గుదల కనిపించింది. ఇది భవిష్యత్తులో పూర్తిస్థాయి మతిమరపుకీ దారితీయొచ్చు. అంతేనా... మెదడు కణాల్లో చురుకుదనం తగ్గి, ఒకలాంటి గందరగోళం నెలకొంటుంది. మత్తుగా అనిపిస్తుంది. కోపతాపాలు పెరుగుతాయి. పిల్లలూ యుక్తవయస్కుల్లో ఒకలాంటి అలజడి. అదే డిప్రెషన్‌కీ దారితీస్తుంది. కంప్యూటర్‌ లేదా టీవీ ముందు అదేపనిగా కూర్చుంటున్న పిల్లలు తరచూ చిర్రుబుర్రులాడటానికీ అస్సలు మాట్లాడకపోవడానికీ అదే కారణం.

మానవ శరీర అమరిక ఎక్కువసేపు కూర్చుని ఉండటానికి అనుకూలించదు. దాంతో ఎక్కువసేపు సరైన భంగిమలో- అంటే నిటారుగా కూర్చోలేక ఆనుకునో వంగిపోయో కూర్చుంటారు. ఆ భంగిమల కారణంగా పొట్ట కండరాలూ బలహీనంగా మారతాయి. మెడా, భుజాల కండరాలూ బిగుసుకుంటాయి. మొత్తంగా కండరాల్లో సాగేగుణం తగ్గుతుంది. ఫలితం... ఎక్కువసేపు కూర్చునేవాళ్లలో వెన్నెముక సమస్యలూ కీళ్లనొప్పులూ వాపులూ వస్తాయి. చివరకు ఆస్టియోపొరోసిస్‌ వచ్చినా ఆశ్చర్యం లేదు. అదే పనిగా కూర్చుంటే కాళ్ల కండరాలూ మొద్దుబారతాయి.

కూర్చోవడం వెరికోజ్‌ వెయిన్స్‌(రక్తనాళాలు గట్టిపడి పైకి కనిపించడం)వ్యాధికీ దారితీస్తుంది. ఇది ఎక్కువయితే కాళ్లలో పాదాల్లో డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌- అంటే గట్టిపడ్డ సిరల్లో రక్తం గడ్డలు కట్టి, రక్తప్రసారానికి అవరోధం- ఏర్పడుతుంది. ఒక్కోసారి దీనివల్ల ఊపిరితిత్తులకి కూడా రక్తప్రసరణ తగ్గి, శ్వాస ఆగిపోతుంది. ఇదే పల్మొనరీ ఎంబొలిజం. వైద్యపరిభాషలో మెడికల్‌ ఎమర్జన్సీ అంటారు. మరణం కూడా సంభవించవచ్చు.

అందుకే... నిపుణులు మరీ మరీ చెబుతున్నారు. కూర్చోకండి, లేవండి, నిలబడండి, నడవండి అని. వింటేనా... రోజుకి 12 గంటలకి పైగా కూర్చునేవాళ్ల సంఖ్య 70 శాతానికి పెరిగింది. దాంతో కూర్చోవడంమీద పరిశోధనల్ని మరింత ముమ్మరం చేసింది అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ. గత రెండు దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యంమీద ఓ కన్నేసి ఉంచగా- రోజుకో మూడు గంటలకన్నా తక్కువగా కూర్చున్నవాళ్లతో పోలిస్తే ఆరుగంటలకి పైగా కూర్చున్న మహిళల్లో 94 శాతం మంది ముందుగా మరణించారనీ, పురుషుల్లో ఇది 48 శాతం అనీ తేలింది. సుమారు పది నుంచి ఇరవై సంవత్సరాలపాటు రోజుకి ఆరుగంటలకన్నా ఎక్కువ సమయం కూర్చుంటే ఏడేళ్ల ఆయుష్షు తగ్గినట్లే. అంతెందుకు ప్రతిరోజూ మూడు గంటలపాటు కదలకుండా టీవీ చూసినా కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడినా గుండెజబ్బు వచ్చే ప్రమాదం ఉంది. కూర్చోవడంవల్ల యాంటీఆక్సిడెంట్ల శాతం తగ్గడమే కాక, శరీరంలో క్యాన్సర్‌ కారక ఫ్రీ రాడికల్స్‌ సంఖ్య పెరగడంతో రకరకాల క్యాన్సర్లూ వస్తున్నాయనేది సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధన.

మరేం చేయాలి?
ఉద్యోగులూ వ్యాపారులూ- ఒకరనేమిటి, రోజంతా కూర్చుని పనిచేసే వారెవరైనా సరే- గంటకోసారి కుర్చీలోంచి లేచి ఐదు నిమిషాలు అటూ ఇటూ నడవాలి. ఇది కఠిన వ్యాయామం కన్నా ఎక్కువ ఫలితాన్నిస్తుంది. బస్సు కండక్టర్లతో పోలిస్తే డ్రైవర్లలో గుండెవ్యాధులు ఎక్కువగా ఉండటానికి కారణం వాళ్లు కదలకుండా కూర్చోవడమేనట.

కూర్చునేవాళ్లతో పోలిస్తే అటూ ఇటూ తిరిగేవాళ్లు మానసికంగానూ ఆనందంగా ఉంటారు. సరిగ్గా ఆలోచించగలుగుతారు. తక్కువ సేపు కూర్చునేవాళ్లు వ్యాయామం చేయకున్నా ఆరోగ్యంగా ఉంటారు. రోజూ మూడూ నాలుగు గంటలు నిలబడి పనిచేయడం అనేది ఏడాదికి పది మారథాన్‌లు చేసినంత ఫలితాన్నిస్తుంది. నిరంతరం తిరిగేవాళ్లలో ఆస్టియోపొరోసిస్‌ తక్కువ. రక్తప్రసరణ బాగుంటుంది.

కూర్చోవడం ఇంత ప్రమాదకరం కనుకే ఇప్పుడిప్పుడు ఐరోపా, అమెరికా దేశాల్లో ఆఫీసుల్లో కూర్చునీ నిలబడీ కూడా పని చేయగల డెస్కుల్ని ఏర్పాటుచేస్తున్నారు. స్కాండినేవియాలో వెన్నునొప్పులతో బాధపడేవాళ్ల సంఖ్య ఇప్పటికే ఎక్కువ కావడంతో ఈ స్టాండింగ్‌ డెస్కులనేవి తప్పనిసరిగా మారాయి. నిలబడి పనిచేయడంవల్ల ఏకాగ్రత పెరగడమే కాదు, ఉత్పత్తీ పెరుగుతుంది. క్లాసులో టీచరు నిలబడి చెప్పే పాఠానికీ కూర్చుని చెప్పేదానికీ ఉండే తేడా తెలిసిందే.
మొత్తమ్మీద కూర్చోవడానికి విరుగుడు నిలబడడమే. అందుకే కేవలం రోజూ ఓ రెండు గంటలు కూర్చోవడం తగ్గించి, నిలబడి చూడండి... కొలెస్ట్రాల్‌, మధుమేహం ఎంత నియంత్రణలో ఉంటాయో తెలుస్తుంది. మధ్యవయస్కులూ ఊబకాయులూ ప్రతి ఇరవై నిమిషాలకీ రెండు నిమిషాలు నిలబడితే చక్కెర వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దానికి బదులు నడిస్తే మరింత ప్రయోజనకరం. నడుం చుట్టుకొలతా తగ్గుతుంది.

ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిర్ధారించుకోవడం కోసం- ఆస్ట్రేలియా పరిశోధకులు 35-80 ఏళ్ల వయసులోని దాదాపు 700 మందిని ఎంపిక చేసి వారం రోజులపాటు ప్రతి నిమిషం వాళ్లను పరిశీలించారు. వాళ్లలో రోజుకి రెండు గంటలపాటు ఎక్కువగా నిలబడే వాళ్లలో చక్కెర నిల్వలు 2 శాతం, ట్రైగ్లిజరైడ్స్‌ 11 శాతం తగ్గినట్లు తేలింది. నిలబడ్డానికి బదులు ఆ రెండు గంటలూ నడిచిన వాళ్ల బాడీమాస్‌ఇండెక్స్‌ 11 శాతం, నడుం చుట్టుకొలత 3 అంగుళాలూ తగ్గిందని తేలింది.

నిలబడితే గుండె నిమిషానికి పదిసార్లు అదనంగా కొట్టుకుంటుంది. దానివల్ల గంటకి అరవై క్యాలరీలు అదనంగా కరుగుతాయి. అందుకే రోజుకి ఎనిమిది గంటలు పనిచేసేవాళ్లు ప్రతి గంటకీ ఓ ఐదు నిమిషాలు
నిలబడటం, కాసేపు నడవడం, లేచినప్పుడు రెండు చేతుల్నీ పైకెత్తి శరీరాన్ని అటూ ఇటూ విల్లులా వంచడం వల్ల నెలకి 2,500 క్యాలరీలు కరగడం ఖాయం. దీన్నిబట్టి కూర్చోవడానికి బదులు నిలబడటం, దానికి బదులు నడకా ఎంత మంచివో అర్థం చేసుకోవచ్చు.

స్కూల్లో డ్రిల్లు మాస్టర్‌ రెడీ, అటెన్షన్‌, స్టాండ్‌ ఎట్‌ ఈజ్‌... అంటూ ఆటల పీరియడ్‌లో డ్రిల్లు చేయించడం ప్రతీ ఒక్కరికీ అనుభవమే. సరిగ్గా అదేవిధంగా ఆఫీసులో కూడా మధ్యమధ్యలో లేచి నిటారుగా నిలబడటం, కాళ్లను కాస్త ఎడంగా పెట్టడం చేయాలి. దీనివల్ల కూర్చోవడంతో వచ్చే అనర్థాలు చాలావరకు తగ్గుతాయి. పిల్లల్ని కూడా నయానో భయానో రోజూ కాసేపు ఆరుబయట ఆడుకునేలా చేయాలి.

జనం ఎక్కువగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వాడేలా చర్యలు చేపట్టడం, ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆఫీసుల్లో సైకిల్‌ లేన్లు ఏర్పాటుచేయడం, లంచ్‌బ్రేక్‌లో ఉద్యోగులు కాసేపు నడిచే వీలు కల్పించడం, ఆఫీసులో లిఫ్ట్‌లకు బదులు మెట్లు వాడటం, కొలీగ్స్‌తో వర్కుకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఫోనులోకన్నా నేరుగా వెళ్లి కలిసి మాట్లాడటం, వీలయినంత వరకూ నడుస్తూ మాట్లాడుకునేలా సమావేశాలను ఏర్పాటుచేయడంవల్ల కొంత ఫలితం ఉంటుంది.
 

జీవనశైలిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు నిబద్ధతతో చేసుకుంటే కూర్చునే అలవాటు క్రమంగా తగ్గిపోతుంది.

* * *

ఛత్రపతి సినిమా చూశారా... అందులో గృహప్రవేశానికి వచ్చిన జయప్రకాష్‌రెడ్డిని కూర్చోండి సార్‌ అని మర్యాద చేస్తే... ‘కూర్చుంటాలేవయ్యా... కుర్చీ కనబడతంటే పగిలిపోతందిక్కడ...’ అంటాడు భయంతో. కుర్చీ కింద ఛత్రపతి పెట్టిన బాంబు భయానికి ఆయనకు కూర్చోవాలంటేనే వణుకొస్తుంది. ఆ సినిమాలో జయప్రకాష్‌రెడ్డి కుర్చీ కింద ఛత్రపతి బాంబు పెడితే నిజజీవితంలో ప్రతి ఒక్కరి కుర్చీ కిందా దేవుడే బాంబు పెట్టాడు. గంటల తరబడి కదలకుండా కూర్చుంటే అది పేలేలా సెట్‌ చేశాడు.

ఏంటీ ఇంకా కూర్చునే ఉన్నారా... లేవండీ చప్పున..!

డెస్కుల్లో పనిచేస్తుంటే..!

ఎత్తుకి తగ్గట్లుగా స్టాండింగ్‌ డెస్కుల్ని అమర్చుకుని గంటకి పది నిమిషాల చొప్పున నిలబడాలి.
అలాంటి ఏర్పాటు లేకపోతే గంటకి ఐదు నిమిషాల బ్రేక్‌ తీసుకుని నడవడం బెటర్‌. ఫోన్‌ మాట్లాడాల్సి వచ్చినా నడుస్తూ మాట్లాడితే మేలు.

* అడుగుల్ని లెక్కించే పెడోమీటర్‌ వల్ల మంచి ఫలితం ఉంటుందట. గంటకి 500 అడుగుల చొప్పున రోజుకి పదివేల అడుగులు వేయడం అలవాటు చేసుకోవాలి.
ఆప్‌ ద్వారా ఈ అడుగుల్ని లెక్కించుకోవచ్చు.

* కొన్నిరకాల యాక్టివిటీ మానిటర్లూ గెట్‌మూవింగ్‌, మూవ్‌మోర్‌ వంటి ఆప్‌లూ కూడా కూర్చున్న సమయాన్ని అలారం సౌండ్‌ ద్వారా అలర్ట్‌ చేస్తాయి.

* డెస్కుటాప్‌ కంప్యూటర్లమీద పనిచేసేవాళ్లు ఆర్‌ఎస్‌ఐ గార్డ్‌ అనే ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అది గంటగంటకీ స్క్రీన్‌మీద లేవాల్సిన సమయం వచ్చిందని అలర్ట్‌ చేస్తుంటుంది.

* ట్రెడ్‌మిల్‌ డెస్కులు బెటరే గానీ అంతటా సాధ్యం కాదు. వీడియోగేమ్స్‌ ఆడేవాళ్లు వాటికి బదులు కాసేపు ఇతరత్రా ఆటలు ఆడుకోవడం బెటర్‌. లంచ్‌, టీ బ్రేక్స్‌లో ఎంత వేగంగా నడిస్తే అంత మేలు.

* ఆఫీసులోనే కాదు, ఇంట్లోనూ మొక్కలకి నీళ్లు పట్టడం, గిన్నెలు కడగడం, నిలబడి టీవీ చూడటం వంటి చిన్నపాటి పనులు చేసుకుంటూ ఎంత నిలబడ గలిగితే అంత నిలబడటం మేలు.మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా క్రమంగా అలవాటవుతుంది.

ఎలా కూర్చోవాలి?

వెన్నెముక, తల, మెడ నిటారుగా ఉంచి కూర్చోవాలి. డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌ మీ కంటికి 15 డిగ్రీల కోణంలో ఉండాలి. దానికన్నా తల మరీ పైకీ కిందకీ ఉండకూడదు. కీబోర్డు లేదా మౌస్‌ ఉపయోగిస్తున్నప్పుడు మణికట్టు కుర్చీ హోల్డర్‌మీద ఆనుకునేలా ఉండాలి.

కూర్చున్నప్పుడు పాదాలను నేలకు ఆనించి నిటారుగా కూర్చోవాలి. అదే పొజిషన్‌లో కూర్చుని మధ్యమధ్యలో మెడను నెమ్మదిగా తిప్పుతూ భుజాలకు ఆనించేలా ఐదు నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మెడ, భుజాల కండరాలు పట్టేయకుండా ఉంటాయి. స్పాండిలోసిస్‌ రాకుండా ఉంటుంది.  అలాగే ఓ కాలును కింద ఉంచి మరో కాలుని పైకి ఎత్తి కిందకి దించాలి. ఇదేపద్ధతిలో రెండో కాలునీ చేయాలి. ఇలా కాళ్లను కదపడం వల్ల రక్తప్రసరణ మెరుగై పట్టేయకుండా ఉంటాయి.

మోకాళ్ల కుర్చీ అంటే...

డెస్కుల్లో పనిచేసేవాళ్లకోసం ఇటీవల నీలింగ్‌ ఛెయిర్స్‌ వస్తున్నాయి. దీనివల్ల వెన్నెముక కిందిభాగం- ముఖ్యంగా వెన్నుపూస చివరి ఎముకమీద పడే భారం తగ్గుతుంది. ఈ కుర్చీవల్ల శరీర బరువు మోకాళ్లూ పిరుదులూ రెండింటిమీదా సమంగా పడుతుంది. కూర్చునే భంగిమ కూడా 90 డిగ్రీల్లో కాకుండా 60-70 డిగ్రీల మధ్య ఉంటుంది. దాంతో రక్తప్రసరణ మెరుగై, కొన్ని సమస్యలు తగ్గుతాయనేది నార్వే పరిశోధకుల అభిప్రాయం. దాంతో ప్రస్తుతం నీలింగ్‌ ఛెయిర్ల మార్కెట్‌ పెరుగుతోంది.

29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.