close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మరో ప్రపంచం కోసం!

మరో ప్రపంచం కోసం!

ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి, దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. కొత్త అవకాశాలూ కొత్త సవాళ్లూ పుట్టుకొస్తున్నాయి. ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునేలా, సవాళ్లని పరిష్కరించుకునేలా పిల్లల్ని సిద్ధం చేస్తోంది వరల్డ్‌వ్యూ సంస్థ. ఎందుకంటే, నేటి బాలలే రేపటి ప్రపంచ పౌరులు!

డాదికోసం ప్రణాళికవేస్తే వరి వేయాలి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే మొక్కలు నాటాలి, శతాబ్దానికి ప్రణాళిక వేస్తే పిల్లలపైన దృష్టి పెట్టాలి అనేది చైనా సామెత. ఈ సామెతే తమ కంపెనీ లక్ష్యం కూడా అని చెబుతారు ‘వరల్డ్‌వ్యూ’ వ్యవస్థాపకులు, ఎండీ సామల సంప్రీత్‌ రెడ్డి. ఇంజినీరింగ్‌ రోజుల్లో విద్యార్థుల వేదిక అయిన ‘ఐసెక్‌’లో సభ్యుడిగా చురుగ్గా ఉండేవారు సంప్రీత్‌. ‘క్లాస్‌ పుస్తకాల ద్వారా కంటే ఐసెక్‌ సభ్యుడిగా దేశవిదేశాల్లో పర్యటిస్తూ చాలా అంశాలు నేర్చుకున్నా’నని చెబుతారాయన. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్న తరుణంలో విద్యార్థుల్ని బాల్యంనుంచే భవిష్యత్తుకు తగ్గట్టుగా సిద్ధం చేయాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. దీన్ని స్నేహితుడు, ఐసెక్‌ సభ్యుడూ అయిన ఆదిత్య సోమాతో పంచుకున్నాడు. అందుకు ఆయన ముందుకు వచ్చారు. దీనికోసం హైదరాబాద్‌, వైజాగ్‌లతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చదివే స్కూల్‌ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు.

నగరానికి దూరంగా...
కొత్త ప్రదేశాలకూ, విదేశాలకూ వెళ్లినపుడు అక్కడి వాతావరణానికి ఎంత త్వరగా అలవాటు పడతారో దాన్నిబట్టే మన జీవన విధానం ఉంటుంది. కొత్తకి అలవాటు పడటం నాయకత్వ లక్షణం కూడా. ఈ సామర్థ్యాన్ని పిల్లల్లో తెచ్చేందుకు విల్‌(వరల్డ్‌వ్యూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ లీడర్‌షిష్‌) కార్యక్రమాన్ని ప్రారంభించిందీ సంస్థ. నేటి విద్యార్థులు 20-30 ఏళ్ల తర్వాత వచ్చే సమస్యల్ని పరిష్కరించాలి. వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకే విల్‌ కార్యక్రమంలో ప్రకృతి గురించి నేర్పుతారు. దీనికోసం హైదరాబాద్‌కు 120కి.మీ. దూరంలోని జడ్చెర్లలో 60 ఎకరాల విస్తీర్ణంలోని పొలంలో క్షేత్ర పర్యటనల్ని ఏర్పాటుచేస్తారు. ఆ పొలాన్ని విద్యార్థులచేత మరో పదేళ్లలో అడవిగా మార్చాలన్నది వరల్డ్‌వ్యూ ప్రణాళిక. ఈ పర్యటనలో శారీరక దారుఢ్యం, ఆహార సేకరణ, జీవ వైవిధ్యం లాంటి అంశాల్ని పిల్లలే తమకుతాము నేర్చుకునే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇంకా అక్కడి ‘జంక్‌ మ్యూజియం’లో ఉండే పాత సామాన్లని ఉపయోగించి ఏదైనా నిర్మాణం, పరికరం లాంటివి చేయాలి.   పునర్వినియోగం నేర్పడం దీని వెనక ఉద్దేశం. డబ్బు విలువ చెప్పేందుకు కొంత డబ్బు ఇచ్చి ఒక షాపింగ్‌ మాల్‌, దుకాణానికి పంపి ఏదైనా విలువైన వస్తువు కొని తెమ్మని పిల్లలకు చెబుతారు. ‘ఆ సందర్భంలో ఏది అవసరం, ఏది విలాసం అని తెలుసుకుంటారు’ అని చెబుతారు ఆదిత్య.

విదేశీ పర్యటనలు
వరల్డ్‌వ్యూ చేపట్టే మరో కార్యక్రమం ‘ఫ్యూచర్‌ సేక్‌’. దీన్లో భాగంగా విద్యార్థుల్ని విదేశీ పర్యటనలకు తీసుకువెళ్తారు. గతేడాది సింగపూర్‌ పర్యటన ఏర్పాటుచేశారు. అక్కడ వనరులు చాలా పరిమితంగా ఉంటాయి. నీటి అవసరాలు, పచ్చదనం, రవాణా, విద్యుత్‌ వినియోగం లాంటి అంశాల్లో భారత్‌ని సింగపూర్‌తో పోల్చి చూసేలా ప్రోత్సహిస్తారు. అక్కడి ఇళ్లూ, స్కూళ్లూ, కార్యాలయాల సందర్శనలు ఉంటాయి. పరిమితమైన వనరులతో అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారో చూపడమే దీని ఉద్దేశం. సింగపూర్‌లో 34 శాతం విస్తీర్ణంలో పచ్చదనం ఉంది. ప్రతి నీటిబొట్టుని ఒడిసి పట్టుకుంటారు. భవిష్యత్తులో సింగపూర్‌ ఒక గార్డెన్‌లో ఉండాలనేది అక్కడి పాలకుల ప్రణాళిక. ఈ పర్యటన అనుభవాలతో విద్యార్థులు ప్రాజెక్టులు చేయాలి. తమ ఇంట్లో, స్కూల్లో, పరిసరాల్లో ఎలాంటి మార్పులు తేగలరో ఆ ప్రాజెక్టులో చెప్పాలి. సింగపూర్‌లాగే పరిమిత వనరులతో అభివృద్ధి చెందుతున్న దుబాయి, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లోనూ పర్యటనల్ని ఏర్పాటుచేశారు. ఈ పర్యటనల ద్వారా పునరుత్పత్తి, పునర్వినియోగం, మిత వినియోగం గురించి నేర్పేలా చేస్తారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి మోడల్‌ యూఎన్‌ (ఎమ్‌యూఎన్‌)కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు కూడా. రెండేళ్ల కిందట హైదరాబాద్‌లోనే ఈ సదస్సుని నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 1500 మంది విద్యార్థులు దీన్లో పాల్గొన్నారు. పాకిస్థానీ విద్యార్థులూ వచ్చారు. ఇలాంటి చోట ఇతరుల భాష మాత్రమే కాదు, వారి భావోద్వేగాలనీ అర్థం చేసుకోవడం తెలుస్తుంది. ఈ ఏడాది డూన్‌ స్కూల్‌ విద్యార్థుల్ని అమెరికాలో జరిగిన కాన్ఫరెన్స్‌కు పంపింది వరల్డ్‌వ్యూ. ఏటా అయిదారువేల మంది విద్యార్థులతో ప్రత్యక్షంగా వీరు పనిచేస్తున్నారు. వీరంతా భవిష్యత్తులో వ్యాపారవేత్తలూ, అధికారులూ, కళాకారులూ, రాజకీయ నాయకులూ అవుతారు. వీళ్లు చేసే ప్రతిపనిలోనూ ఈ అనుభవం పనికొచ్చి భవిష్యత్తును అందంగా తీర్చదిద్దగలిగితే ఎంత బావుంటుందో ఆ ప్రపంచం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.