close
ఈ రథయాత్ర అమ్మకోసం..!

ఈ రథయాత్ర అమ్మకోసం..!

పూరీ జగన్నాథుని పేరు వినగానే అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర కనులముందు నిలుస్తుంది. ఈ రథయాత్ర భక్త జనసందోహానికి ఓ వేడుక. సోదర, సోదరీ సహితుడై కొలువైన జగన్నాయకుడి ఆలయంలో ప్రతిదీ విశిష్టమైనదే. స్వామి రూపంలోనే కాదు నివేదించే అన్నభోగం మొదలుకుని ఆయనకు జరిపే ఉత్సవాల వరకూ అన్నీ ప్రత్యేకమైనవే. ఆబాలగోపాలాన్నీ భక్తిపారవశ్యంలో ముంచెత్తుతూ జులై 14వ తేదీన జరగనున్న జగన్నాథ రథయాత్ర గురించి...

హైందవ సంస్కృతిలో దేవుళ్ల రథ యాత్రలు కొత్తేమీ కాదు. దాదాపు ప్రతి ఆలయంలో పర్వదినాల్లోనో విశేషమైన తిథుల్లోనో ఇవి జరుగుతూనే ఉంటాయి. వీటిలో పూరీ యాత్ర భిన్నమైంది. ఇతర ఆలయాల్లో రథం మీద ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగిస్తారు. కానీ, జగన్నాథుని సంబరాల్లో మాత్రం మూల విరాట్టులే కదిలొస్తారు. రథాలమీద ఆసీనులై భక్తకోటికి దర్శనమిస్తారు. జగన్నాథుని రథయాత్రలో అన్నింటా కొత్తదనం వెల్లివిరుస్తుంది. అంబరాన్ని తాకుతున్నాయేమో అనిపించేలా ఉండే రథాలను ఏ ఏటికాయేడు కొత్త కలపతో సరికొత్త సామగ్రితో తయారుచేస్తారు.

రూపం వెనక...
ఇంద్రద్యుమ్న అనే రాజుకు విష్ణువు కలలో కనిపించి సముద్రంలో చాంకీనది ముఖద్వారం వద్ద నీటిలో తేలియాడుతున్న వేప దుంగలను తీసుకొచ్చి విగ్రహాలుగా తీర్చిదిద్దమని సూచిస్తాడు. రాజు ఆ ప్రాంతానికి వెళ్లి దుంగలు తీసుకువస్తాడు కానీ విగ్రహాలను తయారుచేయడానికి ఎవరూ ముందుకు రారు. దిగులుపడుతున్న రాజు వద్దకు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తాను విగ్రహాలను రూపొందిస్తానంటాడు. అయితే తనకు ఒక ప్రత్యేక గది ఇవ్వాలనీ, 21 రోజుల పాటు తనకు ఎలాంటి అంతరాయం కలిగించకూడదనీ హెచ్చరిస్తాడు. అందుకు రాజు అంగీకరిస్తాడు. రోజులు గడిచిపోతున్నా ఆ గది నుంచి ఎలాంటి శబ్దాలూ వినిపించవు. రాజు ఆతృతతో ఒక రోజు వెళ్లి గది తలుపులు తెరుస్తాడు. అక్కడ విశ్వకర్మ కనిపించడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలి ఉంటాయి. దీంతో పశ్చాత్తాపం చెందిన రాజు బ్రహ్మదేవుడికై తపస్సు చేసి, ఆ విగ్రహాలు అవే రూపాల్లో పూజలందుకుంటాయన్న వరాన్ని పొందుతాడు.

ఈ యాత్ర అందుకే .!
ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండిచాదేవి పిల్లలు లేని కారణంగా జగన్నాథుడినే తన కొడుకుగా భావించి పూజించింది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గుడి కట్టించింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి గుండిచాదేవిని తల్లిగా స్వీకరించి, ఏడాదిలో కొద్దిరోజులు ఆమె దగ్గర ఉంటాననే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం గుండిచా మందిరానికి జగన్నాథుడు రథాలమీద చేరుకోవడమే ఈ యాత్ర ఉద్దేశం.

యాత్ర ఇలా...
రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్యనాడు విగ్రహాలకు నేత్రోత్సవం జరుగుతుంది. అప్పటి వరకూ చీకటిగదిలో ఉంచిన ఆ విగ్రహాలకు మరుసటి రోజు నుంచీ యథావిధిగా పూజాదికార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ విదియనాడు విగ్రహాలను కదిలించి రథాలమీద అలంకరింపజేస్తారు. పూరీ రాజు అక్కడకు చేరుకుని బంగారు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. కస్తూరి కళ్లాపి జల్లి, రథాన్ని తాళ్లతో లాగి రథయాత్రను ప్రారంభిస్తాడు. దీన్నే గుండిచాయాత్ర లేదా ఘోషయాత్ర అంటారు. గుండిచా ఆలయంలో ఏడు రోజులు పూజలందుకున్న జగన్నాథుడి విగ్రహాన్ని దశమినాడు (జులై 22) తిరుగు ప్రయాణం చేయిస్తారు. దీన్నే బహుదా యాత్ర అంటారు. మరుసటిరోజు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి రత్నసింహాసనంమీద పునఃప్రతిష్ఠిస్తారు. దీంతో రథయాత్ర పరిసమాప్తమవుతుంది.

స్వామి సన్నిధికి ఇలా...
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ పూరీకి రవాణా మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పూరీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖుర్ధా రైల్వే స్టేషన్‌ నుంచి పూరీకి 44 కిలోమీటర్ల దూరం. ఈ మార్గంలోనే బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

- బల్లెడ ధనుంజయరావు, ఈనాడు ఒడిశా డెస్క్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.