close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నంబర్‌ వన్‌ శ్రీమంతుడు!

నంబర్‌ వన్‌ శ్రీమంతుడు!

అమెజాన్‌... అక్కడ ఏదైనా దొరుకుతుంది! జెఫ్‌ బెజోస్‌... అతడు ఏమైనా చేయగలడు!
ప్రపంచమంతా అంటున్న మాటలివి! అనదా మరి..? పాతికేళ్లన్నా కాలేదు ఒక పాత గ్యారేజీలో చిన్న కంపెనీ పెట్టి. అది ఇంతింతై అన్నట్లుగా ఎదిగి ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని ఏలేస్తోంది. ఆయనేమో  ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త వ్యాపార ద్వారాలు తెరుస్తూనే ఉన్నాడు. దాదాపు పది లక్షల కోట్ల ఆస్తితో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ సంపన్నుడి పీఠం ఎక్కేశాడు. మరొకరెవరూ ఇప్పట్లో తనకు పోటీ రానంత ఎత్తులో నిలిచాడు. అవకాశాన్ని సరైన సమయంలో అందిపుచ్చుకోవడమంటే ఏమిటో చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఈ అపరకుబేరుడి జీవితం!

సరిగ్గా ఇరవై నాలుగేళ్ల క్రితం. కొత్తగా పెళ్లయిన దంపతులు సరదా కబుర్లు చెప్పుకుంటూ పొద్దున్నే టిఫిన్‌ తింటున్నారు. మరో చేత్తో పేపరు తిరగేస్తున్న అతడిని ఓ చోట అంకెలు ఆకర్షించాయి. చిన్నప్పటినుంచీ అంతే. అంకెలూ అక్షరాలూ చూడగానే అతడి కళ్లు మెరుస్తాయి. లెక్కల్ని ఎంత బాగా చేస్తాడో అంత బాగా పుస్తకాలూ చదివేస్తాడు. అయితే ఆరోజు పేపర్లో కన్పించిన అంకెలు మాత్రం తన భవిష్యత్తునే మార్చబోతున్నాయని అతనికి తెలియదు. ఒక్క ఏడాదిలో వెబ్‌ ప్రపంచం 2300 శాతం విస్తరించిందన్నదే ఆ వార్త. ఆ మాటే భార్యకి చెప్పి ఇంత అభివృద్ధి చెందుతున్న రంగానికి మనం దూరంగా ఉండడం ఏమీ బాగోలేదోయ్‌... అన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఇద్దరిదీ ఒకటే ఆఫీసు. కలిసే వెళ్లారు కానీ ఆ రోజంతా ఆఫీసులో అతడు అన్యమనస్కంగానే ఉండడం ఆమె గమనించింది.

రాత్రి ఇంటికి రాగానే ‘ఆన్‌లైన్‌లో ఏమైనా అమ్మితే ఎలా ఉంటుంది...’ భార్యను అడిగాడతను. పొద్దున చదివిన వార్తను దృష్టిలో ఉంచుకునే అతనలా అంటున్నాడని అర్థమైంది ఆమెకి. కొన్నాళ్లపాటు ఇద్దరూ తీవ్రంగా ఆలోచించారు. ఓ ఇరవై వస్తువుల లిస్టు రాశారు. అన్నిటిలోకీ పుస్తకాలైతేనే బాగుంటుందనిపించింది. ఆరోజుల్లో అమెరికాలో పుస్తకపఠనం అలవాటు చాలా జోరుగా ఉండేది. అందుకని పుస్తకాలతో మొదలుపెట్టి తర్వాత ఇతర వస్తువులకూ విస్తరిస్తే బాగుంటుందనుకున్నారు. ఆ ఆలోచన గురించి ఆఫీసులోనూ చర్చించేవాడు. ‘ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఎప్పుడు మొదలెడతావ్‌’ అంటూ యజమాని షా తరచూ ఆటపట్టించేవాడు. ‘చూస్తూ ఉండండి...’ అంటూనే మూడు నెలలు తిరిగేసరికల్లా ఆలోచనల్లో స్పష్టత తెచ్చుకుని ఉద్యోగం మానేస్తున్నట్లు ప్రకటించారు జెఫ్‌, మెకెంజీలు. అప్పుడు మొదలైంది అలజడి. అప్పటికే చిన్న చిన్న ఆన్‌లైన్‌ దుకాణాలు కొన్ని ఉన్నాయి. కానీ అవేవీ మార్కెట్‌ని ప్రభావితం చేయలేకపోయాయి. అలాంటిదే మరో దుకాణమా... దానికోసం లక్షణంగా ఉన్న ఉద్యోగాలు మానేయడమా... ఎంత తెలివితక్కువ పని... అని అందరూ చెవులు కొరుక్కున్నారు. ఎందుకంటే- వాళ్లకి జెఫ్‌ గురించి అప్పటికి ఏమీ తెలియదు మరి.

తలచుకుంటే చేసి తీరతాడు!
జెఫ్‌ బెజోస్‌ ఏదైనా అనుకున్నాడంటే చాలు దాన్ని ఆచరణలో పెట్టేవరకూ నిద్రపోడు. ఆ విషయం అతడికి నాలుగేళ్లున్నప్పుడే గుర్తించింది తల్లి జాక్లిన్‌. పడిపోతాడని ఉయ్యాల మంచం లాంటి దానిమీద పడుకోబెడితే తనకు పెద్ద
మంచమే కావాలని పేచీ పెట్టాడు. తండ్రి స్క్రూడ్రైవరుతో పనిచేయడం చూసిన చిన్నారి జెఫ్‌ అది తీసుకుని తన మంచానికి అడ్డంగా ఉన్న పట్టీలను ఊడదీసేందుకు ప్రయత్నించాడు. అది చూసి విస్తుపోయింది జాక్లిన్‌. టీనేజరుగా ఓ మెకానిక్‌తో ప్రేమలో పడి మోసపోయి 17ఏళ్లకే తల్లయిన ఆమెకు పిల్లవాడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండేది. తెలివీ ఉత్సాహాలతో మెరిసే ఆ కళ్లలోకి చూస్తూ కథలు చెబుతూ స్వాంతన పొందేది. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి ప్రవేశించాడు మైక్‌ బెజోస్‌. క్యూబా నుంచి వలసవచ్చిన బెజోస్‌ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూనే కష్టపడి చదువుకునేవాడు.

బ్యాంకులో జాక్లిన్‌ సహోద్యోగిగా చేరిన బెజోస్‌ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జెఫ్‌ని దత్తపుత్రుడిగా స్వీకరించాడు. చదువు పూర్తి చేసి హ్యూస్టన్‌కి మకాం మార్చి ఇంజినీరుగా స్థిరపడ్డాడు. చిన్నారి జెఫ్‌ బుర్రలో రేకెత్తే సందేహాలన్నిటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చేవాడు బెజోస్‌.

టీచర్లకే మార్కులేశాడు
పదకొండేళ్ల వయసులో స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పే తీరుపై తోటి పిల్లల్ని ప్రశ్నించాడు జెఫ్‌. అందరూ చెప్పిన సమాధానాల ఆధారంగా వారికి ర్యాంకులిచ్చి ఎవరు ఎంత బాగా పాఠాలు చెబుతారో గ్రాఫ్‌ తయారుచేసి మరీ చూపించాడు. అది చూసి టీచర్లంతా నవ్వుకున్నారట. ఇంట్లోనూ ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉండేవాడు. తమ్ముడు తన వస్తువుల జోలికి రాకుండా చూసేందుకు ఒక అలారం తయారుచేసి తన గదిలో అమర్చాడు. ఏటా వేసవి సెలవుల్లో అమ్మమ్మా తాతయ్యల ఇంటికి వెళ్లేవాడు. ప్రభుత్వోద్యోగిగా రిటైరయిన తాత అంటే జెఫ్‌కి చాలా ఇష్టం. పెద్ద పొలమూ, పాడి పశువులూ, గాలి మరలతో తాతయ్య ఇల్లు జెఫ్‌కి ఓ పెద్ద కర్మాగారంలా ఉండేది. సొంతంగా ఏ పనైనా చేసుకోవడం అక్కడే నేర్చుకున్నాడు. కాస్త పెద్దయ్యాక ఓ వేసవిలో మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేశాడు. ఆ తర్వాత ఏడాది స్నేహితురాలితో కలిసి తానే సమ్మర్‌ స్కూల్‌ పెట్టాడు జెఫ్‌. దాని పేరు డ్రీమ్‌ ఇన్‌స్టిట్యూట్‌. కలలు కనడమూ ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడడమూ అప్పుడే మొదలైంది జెఫ్‌ జీవితంలో. ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రిక్‌ ఇంజినీరింగ్‌లలో పట్టాపుచ్చుకున్న జెఫ్‌కి ఇంటెల్‌, బెల్‌ ల్యాబ్స్‌ లాంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు వచ్చినా చేరలేదు. కొన్నాళ్లు వాల్‌స్ట్రీట్‌లో వేర్వేరు సంస్థల్లో పనిచేశాడు. ఆ తర్వాత డి.ఇ.షా అనే పెట్టుబడుల సంస్థలో చేరి నాలుగేళ్లకే వైస్‌ప్రెసిడెంట్‌ స్థానానికి ఎదిగాడు. అమెజాన్‌ కోసం వదిలేసింది ఆ ఉద్యోగాన్నే.

కారు వెనకసీట్లో...
‘ఎనభైఏళ్లొచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఉద్యోగం మాని పొరపాటుచేశాననుకోను కానీ, విప్లవాత్మకంగా మారుతున్న వెబ్‌ని వినియోగించుకోలేకపోతే మాత్రం బాధపడేవాణ్ని. అందుకే ధైర్యంగా ఉద్యోగం మానేయగలిగాను అంటాడు జెఫ్‌. తండ్రి దగ్గరకు వెళ్లి కొంత మొత్తం డబ్బూ కారూ తీసుకున్నాడు. తిరుగుప్రయాణంలో భార్య కారు నడుపుతుంటే తాను వెనకసీట్లో కూర్చుని వ్యాపార ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇంటికి దగ్గరగా ఉన్న పాత గ్యారేజ్‌లో అమెజాన్‌ సంస్థను ప్రారంభించాడు.

తొలి ఉద్యోగి భార్య మెకెంజీనే. ఖర్చు కలిసిరావడం కోసం పాత తలుపులను కొని వాటితో చెక్క బల్లలను జెఫ్‌ స్వయంగా తయారుచేసేవాడు. అది ఒక సంప్రదాయంగా మారిపోయి దాదాపు 20 ఏళ్లపాటు సంస్థలో అలాంటి బల్లల్నే వాడారు. ఎవరితోనైనా సమావేశమవ్వాల్సి వస్తే పక్కనే ఉన్న పెద్ద పుస్తకాలషాపుకి వెళ్లేవాడు. కొత్తలో- ఎవరైనా ఆన్‌లైన్లో ఒక వస్తువు కొనగానే గంట మోగే ఏర్పాటుచేశాడు. అది మోగగానే సిబ్బంది ఆ వస్తువుని కొని ప్యాక్‌ చేసి పంపించే ఏర్పాట్లలో మునిగిపోయేవారు. కొనుగోళ్లు పెరిగి కొద్దిరోజుల్లోనే ఆ గంట ఆగకుండా మోగడంతో దాన్ని తీసేశారు. తొలి నెలలోనే అమెజాన్‌ అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ, బయట 45 దేశాల్లోనూ పుస్తకాలను అమ్మింది. సంస్థను ప్రారంభించిన మూడేళ్లకు పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లాడు జెఫ్‌. అయితే సరిగ్గా అమెజాన్‌ నిలదొక్కుకుంటున్న సమయంలోనే డాట్‌కామ్‌ సంక్షోభం వచ్చింది. ఆన్‌లైన్‌ వ్యాపారాలన్నీ అతలాకుతలం అవుతున్న వేళ వచ్చి పెద్ద పోజు కొడుతోందనీ ఇది కూడా మిగతావాటిలాగే ఫట్‌మంటుందనీ గేలిచేస్తూ అందరూ దాన్ని అమెజాన్‌.బాంబ్‌ అనేవారు. కానీ ఆ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది అమెజాన్‌. పుస్తకాలనుంచీ అన్నిరకాల వస్తువులూ అమ్మే వేదికగా మారింది. ఊహకందనంత వేగంగా విస్తరించింది.

అమెజాన్‌ కల్చర్‌
సంపద కన్నా ముందు తమ సంస్థకంటూ ప్రత్యేకమైన విధానాలను సృష్టించుకున్నాడు జెఫ్‌. ఇప్పటికీ వాటినే కొనసాగిస్తున్నాడు. జెఫ్‌కి ఏమాత్రం నచ్చని విషయం అలసత్వం. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఉన్న ఉత్సాహమే ఎప్పుడూ ఉండాలనీ నేర్చుకోవాలన్న ఆసక్తి తగ్గకూడదనీ అంటాడు. జెఫ్‌ దీనికి డే వన్‌ ఫిలాసఫీ అని పేరు పెట్టుకున్నాడు. డే 2 అంటే పతనంగా భావించే అతడు ఆరోజు రానివ్వకుండా డే 1 ఉత్సాహాన్ని ఎల్లప్పుడూ కొనసాగించడానికి ఏం చేయాలో చెప్పమంటూ లేఖలో సిబ్బందినే అడిగాడు. కట్టె కొట్టె తెచ్చె అన్నట్లు చెప్పే బులెట్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లంటే అతనికి నచ్చవు. సిబ్బంది తమ కొత్త ఆలోచనలను వివరంగా రాయాలి. సమావేశంలో వాటిని అందరూ క్షుణ్ణంగా చదువుకోవడానికి సమయం కేటాయిస్తాడు. పెద్ద సంస్థ కదా ఒకేసారి కొన్ని వందలమందితో సమావేశం పెట్టి మాట్లాడి వెళ్లిపోతాడనుకుంటే పొరపాటే. సృజనాత్మక ఆలోచనలు ఎవరి దగ్గర ఉన్నా కనిపెట్టేస్తాడు. వారిని ప్రోత్సహిస్తాడు. ఇతర కార్యాలయాల్లో లాగా సిబ్బందికి ఉచిత భోజనం లాంటి సదుపాయాలు అమెజాన్‌లో ఉండవు. కానీ కష్టపడి, కొత్తగా ఆలోచించి పనిచేసేవారికి మాత్రం చక్కటి ప్రోత్సాహం ఉంటుంది. అమెజాన్‌ ఈ- కామర్స్‌తో సరిపెట్టలేదు జెఫ్‌. ఒక్కటొక్కటిగా పలు రంగాల్లోకి తన వ్యాపారాలను విస్తరించాడు. వెబ్‌ సర్వీసెస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటివన్నీ కూడా మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. వాషింగ్టన్‌పోస్ట్‌ పత్రిక కూడా జెఫ్‌ కొన్న తర్వాత కొన్నాళ్లకే లాభాల బాట పట్టింది.

ముందుతరాలకోసం...
అంతరిక్షంలోకి త్వరలోనే కమర్షియల్‌ ఫ్లైట్‌ పంపడానికి అంతా సిద్ధమైపోయిందని తాజాగా ప్రకటించాడు జెఫ్‌. తన బ్లూఆరిజిన్‌ సంస్థ ద్వారా ఈ యాత్ర ఉంటుందనీ వచ్చే ఏడాది టికెట్లు అమ్మబోతున్నామనీ చెప్పాడు. ఎలన్‌మస్క్‌ సంస్థ స్పేస్‌ఎక్స్‌తో పోటీపడుతున్న బ్లూఆరిజిన్‌ ఇప్పటికే పునర్వినియోగానికి పనికివచ్చే రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. నివాస యోగ్య గ్రహాల సమాచారం తెలుసుకోవడం ఆ సంస్థ లక్ష్యం. భూగ్రహాన్నీ ఇక్కడి వనరుల్నీ మనం విపరీతంగా వాడేశామనీ వట్టిపోయినట్లు తయారైన ఈ భూమి మీద తన మనవల మునిమనవలు బతకడం తనకిష్టం లేదంటాడు జెఫ్‌. గ్రహాంతరయానాన్ని సాధ్యమైనంత త్వరలో సాకారం చేసి ఇతర గ్రహాల మీద మనుషులు నివసించే పరిస్థితులు సృష్టించుకోవాలన్నది తన ఆశయమంటాడు. అందుకే బ్లూఆరిజిన్‌ను ప్రారంభించిన జెఫ్‌ ఏటా వందకోట్ల డాలర్ల విలువ చేసే అమెజాన్‌ షేర్లను అమ్మి ఆ డబ్బును ఈ సంస్థ అభివృద్ధికి కేటాయిస్తున్నాడు. దాదాపు వెయ్యిమంది పరిశోధకులు బ్లూఆరిజిన్‌లో పనిచేస్తున్నారు.

వైఫల్యాలూ తెలుసు!
ఆన్‌లైన్‌ వ్యాపారం, వెబ్‌సర్వీసెస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌... ఇలా అన్నింట్లో లాభాలు వచ్చాయని జెఫ్‌ పట్టిందల్లా బంగారమే అనుకుంటే పొరపాటే. వైఫల్యాలూ అతనికి అనుభవమే. హార్డ్‌వేర్‌ రంగం అంటే జెఫ్‌కి చాలా ఇష్టం. సొంత ఫోన్‌ ‘ఫైర్‌’ని ప్రారంభించాడు కానీ అది అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఫైర్‌ టీవీ, ఫైర్‌ స్టిక్‌లను కూడా తయారుచేశారు. కంపెనీలన్నాక కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలన్నది జెఫ్‌ సిద్ధాంతం. అందుకే ప్రయోగాలు ఆపనంటాడు. ఈ అలవాటు తన తాత దగ్గరే నేర్చుకున్నానని ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీలో ఇచ్చిన ప్రసంగంలో చెప్పాడు. ఇంట్లో ఏది పాడైనా మరమ్మతు చేసేవాళ్లను పిలవకుండా దాన్ని సరిచేయడానికి ప్రయత్నించమని తాత తనకు చెప్పేవాడనీ అలా ఉన్న వనరులతోనే పనిచేయడం అలవాటైందనీ జెఫ్‌ చెబుతుంటాడు. సూది తయారీ నుంచీ బుల్‌డోజర్‌ రిపేరు వరకూ అన్ని పనులూ తన తాత చేయగలిగేవాడంటూ మన పనులు మనమే చేసుకోవాలనే పట్టుదల ఆయన్ని చూసే నేర్చుకున్నానంటాడు. ‘ఒక్కోసారి చేసిన ప్రయత్నం విఫలం కావచ్చు. ఏం ఫర్వాలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయం కాబట్టి కొన్ని ప్రయత్నాల తర్వాత తప్పకుండా గెలుస్తాం. అమెజాన్‌లోనూ ఎన్నో సమస్యలుఎదురయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్త స్ట్రాటజీ అమలుచేయడం, ముందుకు సాగడం... ఇదే సంస్థను విజయపథాన తీసుకెళుతోంది. ఇంకో మాట... తెలివితేటలకన్నా దయార్ద్రహృదయం కలిగివుండడం ముఖ్యమని కూడా మా తాతే నేర్పాడు. తెలివితేటలు దేవుడిచ్చిన బహుమతి. మంచి మనసుతో బతకడం మనం ఎంచుకునే దారి... మొదటిది ఉచితంగా వస్తే, రెండో దానికోసం మనం చాలా కష్టపడాలి. తెలివితేటలుంటే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాలూ గడించవచ్చు. కానీ దాన్ని చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచేలా తీర్చిదిద్దాలంటే దయగల మనసు కావాలి...’ అని ఆ ప్రసంగంలో పేర్కొన్నాడు జెఫ్‌.

వారెన్‌ బఫెట్‌ పొరపాటు!
అమెజాన్‌లో, గూగుల్‌లో పెట్టుబడి పెట్టకపోవడం తన పొరపాటని ఆమధ్య తమ షేర్‌హోల్డర్ల సమావేశంలో చెప్పారు బెర్క్‌షైర్‌ హాత్‌వే అధినేత వారెన్‌ బఫెట్‌. సందర్భం వచ్చినప్పుడల్లా జెఫ్‌ని మనసారా ప్రశంసించే ఆయన అమెజాన్‌ ఓ అద్భుతమంటారు. ఒకే సంస్థ ఒకే సమయంలో అటు ఆన్‌లైన్‌ వ్యాపారంలోనూ ఇటు క్లౌడ్‌ కంప్యూటింగ్‌లోనూ లాభాలబాటలో సాగడం అపూర్వమనీ బెజోస్‌ ఈ తరపు గొప్ప వ్యాపారవేత్త అనీ ప్రశంసించారు. ప్రస్తుతం జెఫ్‌- బెర్క్‌షైర్‌ హాత్‌వే, జేపీ మోర్గాన్‌ సంస్థలతో కలిసి తమ మూడు సంస్థల సిబ్బందికోసం ఒక హెల్త్‌ కేర్‌ ప్రణాళికను రూపొందించే పనిలో ఉన్నాడు. అమెరికాలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో లాభాపేక్ష లేకుండా సిబ్బందికి మంచి వైద్యం అందించేందుకే ఈ ప్రయత్నమట.

రాత్రి గిన్నెలు కడుగుతా
ఇన్ని వ్యాపారాలు చూసుకుంటున్న జెఫ్‌ క్షణం తీరికలేకుండా రోజుకు 14 గంటలు పనిచేస్తాడనీ కుటుంబసభ్యులతో గడపడానికే కుదరదనీ భావిస్తే పొరపాటే. జెఫ్‌ రాత్రి పదింటికల్లా పడుకుంటాడు. ఆరింటికి అలారం అక్కర్లేకుండానే నిద్రలేస్తాడు. ఎనిమిది గంటల నిద్రే తన ఆరోగ్య రహస్యమంటాడు. ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్నీ పట్టించుకుంటాడు. పొద్దున్నే మీటింగులేవీ పెట్టుకోడు. భార్యాబిడ్డలతో కలిసి టిఫిన్‌ చేస్తాడు. అంతేకాదు- గిన్నెలు కడగడం తనకిష్టమైన పని అనీ, వీలైనప్పుడల్లా రాత్రి పూట ఆ పని తానే చేస్తాననీ ఓ ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పాడు జెఫ్‌. పార్టీలూ ఫంక్షన్లకు దూరంగా ఉంటాడు. చురుగ్గా, ఉత్సాహంగా ఉండేవాళ్లతో గడపడానికి ఇష్టపడతాడు. మంచి పనులకు మరో ఆలోచన లేకుండా విరాళాలిస్తాడు. గూగుల్‌లో పెట్టుబడి పెట్టిన తొలి వ్యాపారవేత్త జెఫ్‌. అప్పటికి అమెజాన్‌ పూర్తిగా స్థిరపడనే లేదు. అయినా గూగుల్‌ లాంటి సంస్థల భవిష్యత్తును జెఫ్‌ అంచనా వేయగలిగాడు.

* * *

వ్యాపారవేత్తలంతా వినియోగదారులే దేవుళ్లంటారు. గుండెలోతుల్లో నుంచి ఆ మాట రావాలంటే లాభాలు చూసుకోకుండా వ్యాపారం చేయగల దమ్ముండాలి. ఆ దమ్మున్న వ్యాపారవేత్త జెఫ్‌ బెజోస్‌. సంస్థ ప్రారంభించిన మొదటి రోజు నుంచీ అతడి దృష్టి వినియోగదారుడి మీదే. బెస్ట్‌ కస్టమర్‌ సర్వీస్‌ అంటే- వినియోగదారులు ఏదైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి సమస్య తీర్చడం కాదు, అసలు కస్టమర్‌ సర్వీస్‌కి ఏ ఫిర్యాదూ రాకుండా చూసుకోవడం- అంటాడు జెఫ్‌. అందుకే అమెజాన్‌ అందరికీ చేరువైంది. జెఫ్‌ని అపరకుబేరుడిని చేసింది.

ఆ నవ్వుకే పడిపోయింది!  

మనసారా పకపకా నవ్వే జెఫ్‌ నవ్వును చూసే మెకెంజీ ప్రేమలో పడిందట. డిఇ షా కంపెనీలో ఉద్యోగానికి మెకెంజీని ఇంటర్వ్యూ చేసింది అతడే. బిగ్గరగా హాయిగా నవ్వేసే జెఫ్‌ను మెకెంజీ కళ్లప్పగించి చూస్తుండేది. అతడికి ఆమె తెలివితేటలు నచ్చాయి. అలా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆంగ్ల సాహిత్యం చదివి, సృజనాత్మక రచనలో టోనీ మారిసన్‌ వద్ద శిష్యరికం చేసిన మెకెంజీ రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. రెండు నవలలు రాసింది. తన రాతలకు మొదటి పాఠకుడు భర్తేనంటుంది. ఆమె రచనలు చదవడమే కాదు, ఎక్కడికి వెళ్లినా మెకెంజీ కోసం బహుమతులు తెచ్చి సర్‌ప్రైజ్‌ చేయడం జెఫ్‌కి ఇష్టం. మెకెంజీ అభిరుచులను బాగా అర్థం చేసుకున్న జెఫ్‌ ఆమెకు నచ్చేలాంటి దుస్తుల్నే బహుమతులుగా తెస్తాడు. ‘ఏ మీటింగ్‌కో సెమినార్‌కో ఎక్కడికైనా వెళ్లినప్పుడు- బయల్దేరే ముందు ఫోన్‌ చేసి డ్రస్‌ సైజ్‌ అడిగేవాణ్ణి. తను కంగారుపడిపోయేది కొత్తలో. ఇప్పుడు అలవాటైపోయింది. నేను తెచ్చే బహుమతులంటే తనకి ఇష్టం. అందుకే మగవారికి నేను ఒకేమాట చెబుతాను- శ్రీమతిని ప్రేమిస్తే సరిపోదు, కానుకలూ ఇవ్వాలని...’ అంటాడు జెఫ్‌. ఎలాంటి సమస్యకైనా మెకెంజీ క్షణాల్లో పరిష్కారమార్గం చెబుతుందనీ అంత చురుకైన, అందమైన భార్య దొరకడం తన అదృష్టమనీ మురిపెంగా చెప్పే జెఫ్‌కి ముగ్గురు మగపిల్లలు. చైనాకి చెందిన ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు.

సెల్ఫీలూ... స్టార్‌ట్రెక్‌... హెలికాప్టర్‌

డబ్బూ పేరూ 54 ఏళ్ల జెఫ్‌ని ఏ మాత్రం మార్చలేదు. అతనిలోని చిన్న పిల్లల స్వభావం, నిరాడంబరతా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పని చేస్తూనో, సినిమా పోస్టర్ల ముందు నిలబడో సెల్ఫీలు తీసుకుని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తుంటాడు. స్టార్‌ట్రెక్‌ సిరీస్‌కి వీరాభిమాని. అసలు అమెజాన్‌కి ‘మేక్‌ఇట్‌సో.కామ్‌’ అని పేరు పెడదామనుకున్నాడట. అది ఆ సిరీస్‌లో ఓ పాత్ర తరచూ వాడే డైలాగ్‌. స్టార్‌ట్రెక్‌ బియాండ్‌లోనూ, ద సింప్సన్స్‌లోనూ తెరమీద కన్పించాడు జెఫ్‌. నాసా ప్రయోగించిన అపోలో, మెర్క్యురీ తరహా రాకెట్లంటే పిచ్చి. సముద్రం అడుగున ఉన్న వాటి శిథిలాలను చూడడానికి రూపొందించిన ప్రాజెక్టుకి డబ్బు ఇవ్వడమే కాదు, జలాంతర్గామిలో పిల్లల్ని తీసుకుని తానూ వెళ్లి చూసి వస్తుంటాడు. బ్లూఆరిజిన్‌ తరఫున రాకెట్‌ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు తగిన ప్రదేశం కోసం వెదుకుతుండగా జెఫ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ జెఫ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. అంత పనికిమాలిన చావు అనవసరం అనే జెఫ్‌ అప్పటినుంచీ సాధ్యమైనంతవరకూ హెలికాప్టర్‌ ఎక్కడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.